భారతదేశానికి ఆధ్యాత్మిక సంపదగానే కాదు, గొప్ప ఆర్థిక వనరుగా ప్రాధాన్యం ఉన్న నది గంగ. భగీరథుడు చేసిన మహా తపస్సుతో దివి నుంచి భువికి దిగిన ఆ పవిత్ర నదీమతల్లికి గడ్డురోజులు వచ్చినట్టు గుర్తించిన ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీ, నరేంద్రమోదీ ప్రభుత్వం నమామి గంగ పేరుతో క్షాళన కార్యక్రమం చేపట్టింది. ఒక జీవనదిని సజీవంగా కాపాడుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రత్యేకంగా గుర్తించింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఇలాంటి పథకాలలో పదింటిని అత్యున్నతమైనవిగా సమితి గుర్తించింది. అందులో మొదటి పదింటిలో నమామి గంగకు స్థానం ఇచ్చింది.

నదులను కలుషితం చేసుకునే ఒక ఘోర అజ్ఞానం ప్రస్తుతం రాజ్యమేలుతోంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. ప్రకృతిని ధ్వంసం చేసుకునే ఒక దుష్ట సంస్కృతి కూడా ఇవాళ తాండవం చేస్తోంది. కాబట్టే ప్రస్తుతం భూగోళం మీద 70 దేశాలలో ఇలాంటివే పర్యావరణ పరిరక్షణ పథకాలు 150 వరకు చేపట్టారు. ఐరాస దశాబ్దకాలపు పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమం పేరుతో అవి జరుగుతున్నాయి. ఐరాస పర్యావరణ పథకం, ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ వీటికి తోడ్పాటును అందిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక జాతులు నశించిపోకుండా కాపాడడం, ప్రకృతి, పర్యావరణాల ప్రత్యేకతలను పరిరక్షించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నడుస్తున్నది. అందులో ఇప్పుడు నమామి గంగ పథకం కూడా ఒకటయింది. కాబట్టి ఇకపై ఈ పథకానికి ఐరాస తోడ్పాటు, నిధులు, శాస్త్ర సాంకేతిక సహాయం కూడా అందుతాయి. భారతీయులంతా పరమ పవిత్ర నదిగా పూజించే గంగను కాలుష్యం నుంచి రక్షించడం ఇందులో ప్రధానం. అలాగే ఈ నదీ పరీవాహక ప్రాంతంలో అటవీ ప్రాంతాన్ని వృద్ధి చేయడం, ఈ నది మీద ఆధారపడిన దాదాపు 50 కోట్ల మందికి లబ్ధి చేకూర్చడం కూడా ఇందులో ఉన్నాయి. నదులలో మాత్రమే నివశించే డాల్ఫిన్‌ ‌జాతిని, మెత్తటి వెనుకభాగం ఉన్న తాబేళ్ల జాతిని, హిల్సాషాద్‌ ‌చేప జాతిని రక్షించడం కూడా ఈ పథకం కిందకు వస్తుంది. నేషనల్‌ ‌మిషన్‌ ‌ఫర్‌ ‌క్లీన్‌ ‌గంగ పేరుతో భారత ప్రభుత్వం ఈ పధకం చేపట్టింది.

ట్రైనేషనల్‌ అట్లాంటిక్‌ ‌ఫారెస్ట్ ‌పాక్ట్, అబుదాబి మెరైన్‌ ‌రెస్టోరేషన్‌, ‌గ్రేట్‌ ‌గ్రీన్‌ ‌వాల్‌ ‌ఫర్‌ ‌రెస్టోరేషన్‌ అం‌డ్‌ ‌పీస్‌, ‌స్మాల్‌ ఐలండ్‌ ‌డెవలపింగ్‌ ‌స్టేట్స్ ‌రెస్టోరేషన్‌ ‌వంటి పది పథకాలకు కూడా ఐరాస గుర్తింపు ఇచ్చింది. నమామి గంగకు వచ్చిన పురస్కారాన్ని డిసెంబర్‌ 14‌న కెనడాలో జరిగిన జీవవైవిధ్య సదస్సులో ఆ పథకం డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌జి. అశోక్‌కుమార్‌ అం‌దుకున్నారు. వరల్డ్ ‌రెస్టోరేషన్‌ ‌దినం కూడా ఆరోజే జరిగింది. తమ పథకంలో యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నదని ఆయన చెప్పారు. గంగా ప్రహారీస్‌, ‌గంగాదూతలు, గంగా క్వెస్ట్ ‌వంటి పేర్లతో తర్ఫీదు పొందిన యువతరం ఈ పనిలో భాగస్వాములవుతున్నారు. మంచినీటిలో నివశించే డాల్ఫిన్స్ ‌రక్షణ కోసం ఈ యువతరం చూపించిన శ్రద్ధ వల్ల ఇప్పుడు అవి ఎక్కువగా కనిస్తున్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE