– సుజాత గోపగోని, 6302164068

‘తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది.’ ఇది స్వయంగా అమిత్‌ ‌షా చెప్పిన మాట. అది కూడా ఓ జాతీయ స్థాయి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయం. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురబోతోందని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. కేంద్ర హోం మంత్రి, బీజేపీలో కీలక నేత అయిన అమిత్‌ ‌షా ఇంత స్పష్టంగా చెప్పడం, దానికి తమ వ్యూహం కూడా ఏంటో బయటపెట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీస్తోంది. అయితే, ఈ పరిణామం అధికార టీఆర్‌ఎస్‌తో పాటు, ఇతర రాజకీయ పార్టీలకూ మింగుడు పడటం లేదు.

తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోంది. సాక్షాత్తూ కేంద్ర బీజేపీ పెద్దలు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్‌ ‌పెంచుతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి ఇటీవల మాట్లాడిన ఆ పార్టీ అగ్రనేత అమిత్‌ ‌షా తెలంగాణ ప్రజల నాడి తనకు బాగా తెలుసని, జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పనిసరిగా గెలుస్తుందని అన్నారు. అంతేకాదు, బీజేపీ దక్షిణాది ప్రవేశానికి తెలంగాణనే ‘గేట్‌ ‌వే’ అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌ ‌పోరు కొనసాగిస్తుండటం, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో బీజేపీ నేతలను చిక్కుల్లో పడేసిన క్రమంలో అమిత్‌ ‌షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు.. బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు విడతల పాదయాత్ర పూర్తవగా.. నవంబర్‌ 28 ‌నుంచి భైంసా నుంచి ఐదో విడత పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్‌ ‌నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్‌ 17‌వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. డిసెంబర్‌ 14, 15, 16 ‌తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగ నుండగా.. డిసెంబర్‌ 16, 17‌న కరీంనగర్‌లో పాదయాత్ర జరుగుతుంది. చివరి రోజు కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ ‌కళాశాల వద్ద పాదయాత్ర ముగియనుంది.

ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పలువురు జాతీయ నేతలు కూడా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. అయితే, అనూ హ్యంగా రాష్ట్ర పోలీసులు సంజయ్‌ ‌పాదయాత్రను అడ్డుకున్నారు. ఒకరోజు ముందుగానే కరీంనగర్‌ ‌నుంచి బయలు దేరిన సంజయ్‌ని భైంసా వెళ్లకుండా మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. తిరిగి కరీంనగర్‌ ‌తీసుకొచ్చి ఆయన ఇంట్లోనే నిర్బంధంలో ఉంచారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

పోలీసుల అత్యుత్సాహం!

కరీంనగర్‌ ‌నుంచి జగిత్యాల మీదుగా నిర్మల్‌కు సంజయ్‌ ‌వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు జగిత్యాల టౌన్‌ ‌పరిధిలోని తాటిపల్లిలో కాపుకాశారు. ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలు, మరో 15 మంది పోలీసులు.. కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వారిని తప్పించుకొని ముందు కెళ్లారు. పోలీసులు కాన్వాయ్‌ని వెంబడిస్తూ ముందు కెళ్లగా.. మేడిపల్లిలోని పార్టీ నేత ఇంటి వద్ద సంజయ్‌ ‌కారు నిలిపి లోనికి వెళ్లారు. ఆయన బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ ‌చేయాలనుకున్నారు. కానీ అక్కడికి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు చేరు కున్నారు. దీంతో మరికొంత మంది పోలీసులు మోహరించారు. రాత్రి 8 గంటల సమయంలో సంజయ్‌ ‌కార్యకర్తల సాయంతో పోలీసులను తప్పించుకొని కోరుట్ల మార్గంలో వెళ్లారు. గమ నించిన పోలీసులు నాలుగు వాహనాల్లో వెంబడించి కోరుట్ల సమీపంలోని వెంకటాపూర్‌ ‌వద్ద చుట్టు ముట్టారు. బలవంతంగా అదుపులోకి తీసుకొని కరీంనగర్‌ ‌వైపు వెళ్లారు.

బీజేపీ శ్రేణుల నిరసనలు

రాత్రివేళ బండి సంజయ్‌ అరెస్టుపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెట్‌పల్లి పట్టణంలో గంటన్నరకు పైగా రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. సంజయ్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలపై మల్యాల చౌరస్తా వద్ద పోలీసులు దాడికి దిగారు. దొరికిన వాళ్లను దొరికినట్లు విచక్షణారహితంగా లాఠీలతో చితకబాదారు. ఈ దాడిలో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మల్‌ ‌జిల్లాలోని భైంసాలో ప్రజా సంగ్రామ యాత్ర, బహిరంగ సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌ప్రకటించారు. భైంసాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించా లని కోరారు. ఆయన ప్రకటనపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరుపై బండి సంజయ్‌ ‌మండిపడ్డారు. పాదయాత్రకు ముందు అనుమతి ఇచ్చి, ఇప్పుడు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. భైంసా సున్నితమైన ప్రాంతం అని పోలీసులకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు.

సంజయ్‌ ‌పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ముందుగా అనుమతి ఇచ్చి, చివరి నిమిషంలో నిరాకరించారు. ఈసారి సంజయ్‌ అరెస్టుతో పాదయాత్రపై కొంత సందిగ్ధం నెలకొంది. అయితే, పోలీసుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్డులో బీజేపీ హౌజ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఆ పార్టీ నాయకులు ఊహించినట్లుగా గతంలో మాదిరిగానే హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే, కొన్ని షరతులు విధించింది. అవాంఛనీయ ఘటనలు ఎదురవు తాయన్న అనుమానం ఉంటే, భైంసా పట్టణంలోకి పాదయాత్ర వెళ్లదని బీజేపీ తరఫున న్యాయవాది రామచందర్‌రావు కోర్టుకు తెలిపారు. పట్టణంలోకి ప్రవేశించకుండా వై జంక్షన్‌ ‌నుంచి మాత్రమే కొనసాగుతుందని వివరించారు. భైంసాలోకి పాదయాత్ర వెళ్లకుంటే పోలీసులకు అభ్యంతర మేంటని హైకోర్టు ప్రశ్నించింది. సభలు, పాద యాత్రలు రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని కూడా హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.

భైంసాలో అల్లర్లు సృష్టించిందెవరు?

ఈ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్‌ ‌మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత యాత్రకు అనుమతిచ్చిన పోలీసులు.. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 4 విడతలుగా ప్రశాంతంగా, ప్రజా స్వామ్యబద్ధంగా ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించా మని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డకునేందుకు యత్నిస్తోందన్నారు. అందుకే హైకోర్టును ఆశ్రయించామని, ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తామని చెప్పారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ ‌కలిసి ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్‌ ‌నుంచి భైంసా ప్రజలను వేరు చేయలేరని, భైంసా వెళ్లాలంటే వీసా కావాలా? అనుమతి తీసుకోవాలా? భైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా? అని ప్రశ్నించారు. అసలు భైంసాలో అల్లర్లు సృష్టించిందె వరు? ఆ అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకున్నది ఎవరు? అమాయకుల ఉసురు తీసిందెవరు? పీడీ యాక్ట్ ‌కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరు? మేం పాదయాత్ర చేస్తే ఇవన్నీ బయటకొస్తాయనే భయంతోనే భైంసాకు వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేసిందని మండిపడ్డారు. గతంలో పాతబస్తీలో భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేస్తే అల్లర్లు జరిగాయా? ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు? కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజలతో మాట్లాడుతామని, వారి కష్టసుఖాల్లో పాలుపంచు కుంటామని, వారికి భరోసా కల్పిస్తామని సంజయ్‌ అన్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE