– సుజాత గోపగోని, 6302164068
కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం. నాయకులకు పార్టీలో ‘అవసరమైనంత స్వేచ్ఛ ఉంటుంది’ ఇదీ ఆ పార్టీ నేతలు తరచూ చెప్పే మాట. కానీ, కాంగ్రెస్ పార్టీ అంటే ‘కుమ్ములాటలు, కల్లోలం, అంతర్గత కుట్రలు, కుతంత్రాలు, రాజీనామాల అస్త్రాలు, అధిష్టానానికి ఝలక్‌లు, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు’ ఇవీ బయట నుంచి, విపక్షాల నుంచి వినిపించే అభిప్రాయాలు. ఆ పార్టీ తీరు చూసినా, నేతల వ్యవహారశైలిని గమనించినా ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది. అధిష్టానాన్ని ధిక్కరించిన వైనం సాక్షాత్కరించింది. ఎవరికి వారు అలకల పర్వం చేపట్టడం, కొందరు ఏకంగా రాజీనామాలు చేయడం వంటి పరిస్థితులు అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించాయి.
తెలంగాణలో ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది. ఆయా కమిటీల్లో పలువురు నాయకులకు చోటు కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆ కొత్త కమిటీలే ప్రస్తుతం చిచ్చు రేపుతున్నాయి. నూతన కమిటీలపై పలువురు సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఎప్పటినుంచో ఉన్న తమను కాదని జూనియ ర్లకు పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు అధిష్టానంతోనే తేల్చుకుందామని ఢిల్లీకి పయనమవుతున్నారు. కమిటీల నియామకంపై తమ ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ నేతలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఇతర కమిటీల్లో చోటు కల్పించకపోవడంపై భగ్గుమంటు న్నారు. తమను కాదని జూనియర్ నేతలకు పదవులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. ఇటీవల టీపీసీసీ కొత్త కమిటీలను ప్రకటించింది. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని, 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ప్రకటించింది. అలాగే, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నూతన అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు విభాగాలుగా విభజించి బాధ్యతలు బదలా యించింది. ఇక, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా జగ్గారెడ్డి, అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ గౌడ్‌ను నియమించింది.
సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ అనేది అత్యంత కీలకం. ఈ కమిటీకి టీ-కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావు, ఉత్తమ్ కుమార్, జానా రెడ్డి, జీవన్ రెడ్డి, గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, మధుయాష్కీ, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డికి చోటు కల్పించారు. అలాగే, పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా నియమించారు.
ఈ కొత్త కమిటీల్లో రెడ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న వాదన కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. కీలకమైన ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడి పదవులతో పాటు, జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ సింహ భాగం రెడ్లకే కేటాయించారన్న ఆరోపణలు ఆ పార్టీని చుట్టుముట్టాయి. దీనికి ప్రధాన కారణం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనే చర్చ విస్తృతంగా సాగు తోంది. కమిటీ ఎంపికలో రేవంత్‌రెడ్డి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకున్న తర్వాతనే కమిటీని ప్రకటించామని చెబుతున్నా.. రేవంత్‌రెడ్డి కొందరికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారంటున్నారు. తన సన్నిహితులు, సొంత కులానికి చెందిన నాయకులకు పదవుల్లో పెద్దపీట వేశారని బీసీ నేతలు మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి సంబంధీకుల కోసమే హైదరాబాద్ జిల్లాను మూడుగా విభజించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అధిష్టానం ప్రకటించిన 84 మంది ప్రధాన కార్యదర్శులలో 22 మంది, అలాగే 24 మంది ఉపాధ్యక్షుల్లో 7 గురు రెడ్లు, 17 మంది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 6 గురు రెడ్లు, ఇప్పటివరకూ ప్రకటించిన 26 డీసీసీ కమిటీల్లో 10 మంది రెడ్లు ఉండటం ఇతర సామాజిక వర్గాల నేతల ఆగ్రహానికి గురయింది. 40 మంది ఈసీ మెంబర్లలో 13 మంది రెడ్లు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే, మహిళల కోణంలోనూ కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో మహిళలకు కేవలం ఐదుగురికే స్థానం దక్కగా, 24 మంది ఉపాధ్యక్షుల్లో ముగ్గురికే స్థానం కల్పించారు. అందులో ఒకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ ఉండటం గమనార్హం. 26 మంది జిల్లా అధ్యక్షులను ప్రకటించగా అందులో కేవలం ఒక్కరికే, అది కూడా వెలమ వర్గానికి అవకాశం ఇచ్చారు. 18 మంది ఉన్న పీఏసీలో కేవలం ఇద్దరు మహిళలకే అవకాశం దక్కడంపైనా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఈ పరిణామాలు ఇప్పుడు పార్టీ కొంపముంచ బోతున్నాయన్న చర్చ మొదలైంది. పార్టీ కమిటీల్లో తమకు మొండిచేయి చూపించారని ఆయా సామాజిక వర్గాల నేతలు భగ్గుమంటున్నారు. సీనియర్లను అవమానించడాన్ని సహించలేకపోతున్నారు. జనాభాలో 4 శాతం కూడా లేని రెడ్ల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అని ఆగ్రహిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల ఓట్లు పార్టీకి అవసరం లేదా? అని నిలదీస్తున్నారు.
రాజీనామాలు..
ఈ క్రమంలో రాజీనామాల పర్వం కొనసాగు తోంది. ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ తనకు పార్టీ కమిటీల్లో చోటు దక్కలేదనే కారణంతో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజే సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ టీపీసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురై రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ సామాజిక వర్గమైన ఎస్టీలకు చోటు కల్పించకపోవడం సరికాదన్నారు. ఇక, కొత్త కమిటీల్లో ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వెంకట్‌రెడ్డి స్పందిస్తూ ఎన్నికలకు నెల రోజుల ముందు రాజకీయాలపై మాట్లాడ తానని.. అప్పటిదాకా ఏమీ మాట్లాడబోనన్నారు. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్న తాను.. భవిష్య త్తులో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తా నని.. ఇకపై నల్గొండలో విస్తృతంగా పర్యటించను న్నట్ట్టు తెలిపారు. గతకొద్ది కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే.. రానున్న రోజుల్లో మరికొంత మంది నాయకులు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ కూడా కొత్త కమిటీల కూర్పుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకోవాలని దామోదర రాజనర్సింహ గాంధీ భవన్‌లో విలేకర్లతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ముఖ్య నేతలు నిలువరించారు. పీసీసీ కమిటీల కూర్పులో తన ప్రమేయం లేదని, అసలు తనను సంప్రదించనే లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. పీసీసీ కమిటీల నియామక పక్రియలో పీసీసీ అధ్యక్షుడు ఎంత ముఖ్యమో, సీఎల్పీ నేత కూడా అంతే ముఖ్యమని, ఈ వ్యవహారంలో తనను ఎందుకు సంప్రదించలేదో తెలియదన్నారు. ఉస్మానియా వర్సిటీకి చెందిన నాయకులు కొందరు, వారికి ప్రాధాన్యం దక్కని విషయమై అధిష్టానానికి అసంతృప్తిని తెలియజేయాలని కోరారన్నారు.
బుజ్జగింపులు
ఇక అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నా లను టీపీసీసీ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. నేతలకు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నట్లు సమాచారం. కమిటీలలో చోటు దక్కలేదని బాధపడవద్దని, పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ, కొంతమంది నేతల విషయంలో ఈ బుజ్జగింపులు ఫలించడం లేదంటున్నారు. మొత్తంగా రేవంత్‌రెడ్డి- మాణిక్యం ఠాగూర్ కలసి అధిష్టానాన్ని తప్పుదోవపట్టించి కమిటీని తమ సొంత మనుషులతో నింపేసుకున్నా రన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతోంది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత టీ కాంగ్రెస్ స్తబ్ధుగా మారిపోయింది. ఒకరిద్దరు నేతలు అప్పుడప్పుడు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటం తప్ప ప్రజాక్షేత్రంలోకి దిగి సమస్యలపై పోరాటం చేసింది పెద్దగా కనిపించడం లేదు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక, కొన్ని లీకుల ప్రకారం ముందుగానే ఎన్నికలు జరగొచ్చన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కమిటీలను ఏఐసీసీ నాయకత్వం ప్రకటించింది. ఈ కమిటీలతోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తోంది. అయితే, ఆ పార్టీ అధిష్టానానికి పార్టీ నేతల అసంతృప్తి కొరకరాని కొయ్యలా మారింది. ఎన్నికల్లో పోరాడటం పక్కనబెట్టి.. ముందుగా సొంత పార్టీ నేతలతోనే పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్