– డా।। పి.వి.సుబ్బారావు 9849177594

డిసెంబర్‌ 11 ‌తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి జయంతి

‘బానిసత్వం మీద మన మమకారం ఎప్పుడు చస్తుంది?

ఎప్పుడు మన తల్లికి పడ్డ సంకెళ్లు బద్దలవుతాయి?

ఎప్పుడు మన ఇక్కట్లు మటుమాయమవుతాయి?’

అని ప్రశ్నించిన కలం ఆయనది. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి సుబ్రహ్మణ్యభారతి. ఆయన తమిళ మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశభక్తిని, జాతీయ భావాలను తన రచనల ద్వారా, తీవ్ర జాతీయవాదం ప్రాతిపదికగా ప్రదీప్తం చేశాడు. తమిళుల అభిమాన సినీ కవిగా ప్రసిద్ధుడయ్యాడు. కన్యాకుమారి నుండి కశ్మీరు వరకున్న అఖండ భారతాన్ని తన మాతృదేశమని విశ్వసించాడు. ఆయన దృష్టిలో తాను తొలుత భారతీయుడు, తర్వాత తమిళుడు. భారతీయులు విభజితులై ఉన్నా, వారంతా ఒకే తల్లి పిల్లలనీ, వారి పట్ల విదేశీయులు జోక్యం చేసుకోవలసిన పని ఏముంది? అని నిశితంగా ప్రశ్నించాడు. కులమతరహితమైన స్వేచ్ఛాభారతం కావాలని (1919-20) ‘సంస్కరణ దృక్పథంతో’ కోరుకున్నాడు.

సుబ్రహ్మణ్య భారతి డిసెంబర్‌ 11, 1882‌లో తమిళనాడులో అప్పటి తిరునల్వేలి జిల్లా, ఎట్టయాపురంలో జన్మించాడు. తల్లిదండ్రులు లక్ష్మీ అమ్మాళ్‌, ‌సుబ్రహ్మణ్యం అయ్యర్‌. ‌కుమారుడికి వీరు పెట్టిన పేరు చిన్నస్వామి. ప్రాథమిక విద్యాభ్యాసం తిరునల్వేలిలో సాగింది. పాఠశాల విద్యార్థి దశలోనే సంగీతం నేర్చుకున్నాడు. పదకొండు సంవత్సరాల వయస్సులో కవిత్వ రచనకు పూనుకున్నాడు. ప్రతిభను బట్టి బాల్యంలోనే విద్యలకు అదిదేవత సరస్వతీ పేరిట ‘భారతి’ అనే బిరుదును అందుకున్నాడు. తమిళ సంప్రదాయాన్ని అనుసరించి తండ్రి పేరు ‘సుబ్రహ్మణ్యం’, బిరుదు ‘భారతి’తో కలిపి ‘సుబ్ర హ్మణ్య భారతి’ అయ్యాడు.

ఐదు సంవత్సరాల వయస్సులో తల్లి మరణిం చింది. నాటి సంప్రదాయాన్ని అనుసరించి 14 సంవత్సరాల వయస్సులో, ఏడేళ్ల చెల్లమ్మతో భారతి పెళ్లి జరిగింది. కుమారుడు గణితం చదువుకుని ప్రతిభావంతుడై ఇంజనీర్‌ ‌కావాలని తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్‌  ‌కాంక్షించాడు. భారతి మాత్రం బహుభాషల పట్ల ఆసక్తితో అనితర సాధ్యమైన పట్టుదలతో 32 భాషలు నేర్చుకున్నాడు. వాటిలో 29 భారతీయ భాషలు, 3 విదేశీ భాషలు. 16వ ఏట తండ్రి మరణించాడు. తరువాత భారతి ఉన్నత విద్యాభ్యాసం వారణాసిలో సాగింది. ‘సంస్కృతం’, హిందీ, ఆంగ్లభాషలు అక్కడే నేర్చుకున్నాడు. భారతీయ తాత్త్వికత, జాతీయతలను గూర్చి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వారణాసి సాంగత్యం ఆయనను హిందూ ఆధ్యాత్మిక వాదంతో, జాతీయవాదాన్ని మమేకం చేసే ప్రత్యేకతను సంతరించి పెట్టింది. దాంతో ఆయనకు విశాల దృక్పథం అలవడింది. ఆయన వేషధారణ మార్చుకున్నాడు. గడ్డం పెంచుకొని, కోటు చొక్కా, పంచె ధరించడం ప్రారం భించాడు. ఉద్యోగ ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణుడైనా, ఉద్యోగం చేరలేదు. 1901లో స్వగ్రామం ఎట్టయా పురం చేరుకొని రాజాగారి వద్ద ఆస్థానకవిగా 1904 ఆగస్టు వరకు నాలుగు సంవత్సరాలు ఉన్నాడు. 1904 ఆగస్టు నుండి నవంబరు వరకు మధురై సేతుపతి హైస్కూల్లో ఉద్యోగం చేశాడు. ఆ కొద్ది నెలల్లో బయటి ప్రపంచం గూర్చి తెలుసుకున్నాడు. పశ్చిమాన సాగుతున్న పత్రికా రంగంలో మార్పులను ఆసక్తితో గమనించాడు. 1904లో ‘స్వదేశీ మిత్రన్‌’ అనే దినపత్రికలో సహాయ సంపాదకుడిగా చేరాడు. 1905లో కాశీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ ‌మహాసభలకు హాజరయ్యాడు. అక్కడి నుండి తిరిగి వచ్చే సమయంలో స్వామి వివేకానంద ఆధ్యాత్మిక వారసురాలైన సోదరి నివేదితను కలిశాడు. ఆమె ప్రభావంతో అప్పటి స్త్రీల దుస్థితిని, స్త్రీ విముక్తి అవసరాన్ని గుర్తించాడు. ఆమె ప్రేరణ భవిష్యత్తులో స్త్రీవాద భావాల సంస్కర్తగా పనిచేసేందుకు తోడ్పడింది. ఆమె తనకు భరతమాత స్వరూపాన్ని చూపించారని, ఆమెను తన గురువుగా భావించి ప్రస్తుతిస్తూ కవితలు రాశాడు.

జాతీయోద్యమంలో

భారతి తీవ్ర జాతీయవాదం వైపు మొగ్గారు. తిలక్‌, అరవిందుడు వంటి వారే ఆయనకు ఆదర్శం. ఉద్యమకారునిగా, కలం యోధునిగా ఆయన స్థానం చిరస్మరణీయమైనది. స్వాతంత్య్ర సాధనా దీక్షాదక్షుడై స్వాతంత్య్ర రహితమైన జీవితం వ్యర్థమని చక్కని దృష్టాంతంతో కవిత్వీకరించాడు.

‘‘వాన లేకున్న జీవిత వైభవమ్ము

మాసి పోజాలదే పెక్కుమాటలేల?

మమత గొల్పెడి స్వాతంత్య్రమమర కున్న

దేనికీ జన్మ దీనులమైన మనకు?’’

వానలేకుంటే జీవిత వైభవం నిస్సారంగా సమసిపోతుందని, మమతాను రాగాలు నెలకొల్పే స్వాతంత్య్రం లేని జన్మ వ్యర్థమన్నాడు. జాతీయో ద్యమంలో చురుకైన కార్యకర్తగా పాల్గొన్నాడు. దాదాబాయి నౌరోజీ నేతృత్వంలో జరిగిన కలకత్తా కాంగ్రెస్‌ ‌సమావేశాలకు ఆయన హాజరయ్యారు. బెంగాల్‌ ‌విభజన తరువాత జరిగిన అన్ని కాంగ్రెస్‌ ‌సమావేశాలు చరిత్ర ప్రసిద్ధమైనవే. వాటిలో 1907లో జరిగిన కలకత్తా సమావేశాలు కూడా ముఖ్యమైనవే. వాటికి భారతి హాజరయ్యాడు. ఆ సమావేశంలో స్వరాజ్యాన్ని కాంక్షిస్తూ భారతీయులంతా బ్రిటీషు వస్తువులను బహిష్కరించాలని తీర్మానించారు.

స్వాతంత్య్ర సమరంలో పత్రికల పాత్ర అమోఘ మైనది. అందుకే ఆ రంగం భారతిని ఆకర్షించింది. పాశ్చాత్య దేశాలలో పత్రికల ద్వారా ఉద్యమాలు విస్తరించిన తీరు అప్పటికే బాగా ప్రచారంలో ఉంది. అందుకే మొదట ఆయన ‘స్వదేశీమిత్రన్‌’ ‌తమిళ దినపత్రికలో ఉపసంపాదకునిగా (1904) చేరారు. ఆ అనుభవంతోనే భారతి 1907 ఏప్రిల్‌లో ‘ఇండియా’ పేరుతో ఒక వార పత్రికను స్థాపించారు. ఈ పత్రిక స్థాపనంలో ఆయనకు ఎంపీటీ ఆచార్య చేదోడువాదోడుగా ఉన్నారు. ఆంగ్ల పత్రిక ‘బాలభారతి’ స్థాపన, నిర్వహణలో కూడా ఆయనకు ఆచార సహకరించారు. పాత్రికేయుడిగా పరిణితి సాధించిన భారతి సృజనాత్మకతను వ్యక్తీకరించేందుకు పత్రికలు సాధనాలుగా దోహదం చేశాయి. భారతి జాతీయోద్యమ స్ఫోరకంగా, పారతంత్య్ర ఛేదకంగా కవితలు, వ్యాసాలు రాసి ప్రజల్లో జాతీయోద్యమ భావాలను ప్రచారం చేశాడు. ఆ పత్రికల్లో వైవిధ్య భరితమైన ఆధ్యాత్మిక రచనలతోపాటు రష్యా, ఫ్రెంచి విప్లవాలపై ప్రబోధ గీతాలు రాశాడు.

1907లో జరిగిన చారిత్రాత్మకమైన సూరత్‌ ‌కాంగ్రెస్‌ ‌మహాసభల్లో ఒ. చిదంబరం, శ్రీనివాసా చార్యర్‌ ‌వంటి ప్రముఖులతో కలసి భారతి పాల్గొన్నాడు. ఆ సమావేశాల్లో జాతీయ కాంగ్రెస్‌లో తిలక్‌, అరబిందో వంటి వారికి, మితవాదులుగా పేర్గాంచిన గోఖలే వర్గీయులకీ తీవ్ర విభేదాలు తలెత్తాయి. తిలక్‌ ‌బ్రిటిష్‌ ‌విన్నపాల ఉద్యమాన్ని నిరాకరించాడు.

1908లో చిదంబరం పిళ్లేకు వ్యతిరేకంగా పెట్టిన కేసులో భారతి వ్యతిరేకంగా సాక్ష్యమించాడు. అదే సంవత్సరంలో ‘ఇండియా’ అధినేతను మద్రాసులో అరెస్టు చేశారు. తనను కూడా అరెస్ట్ ‌చేసే అవకాశం ఉందని భారతి ఫ్రెంచి పాలనలో ఉన్న పుదుచ్చేరికి వెళ్లి తప్పించుకున్నాడు. అక్కడ నుండి ఆయన ‘ఇండియా, తమిళ దిన పత్రిక విజయ్‌, ఆం‌గ్ల మాసపత్రిక బాలభారత, స్థానిక పత్రిక సూర్యోదయం పత్రికలు నడిపారు. బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఆ పత్రికలకు చందాలు చెల్లింపులు నిలిపివేయడం ద్వారా 1909లో వాటిని నిషేధించింది.

పుదుచ్చేరిలో ప్రవాసంలో ఉండి, ఆంగ్లేయుల దమననీతిని సవాలు చేస్తున్న అరబిందో, లజపతి రాయ్‌, ‌వి.వి.యస్‌. అయ్యర్‌ ‌వంటి ప్రముఖ విప్లవపక్ష నాయకులను కలుసుకొనే అవకాశం భారతికి లభించింది. అరబిందో నిర్వహిస్తున్న ఆర్య జర్నల్‌, ‌కర్మయోగి పత్రికలకు ఆరంభంలో భారతి సహాయం అందించాడు. ఆ సమయంలో వేద సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. వేద సాహిత్య పరిజ్ఞానంతో రాసిన అత్యంత గొప్ప కృతులు ‘కుయిల్‌ ‌పాట్ట, పంచాలీ శపథం, కణ్ణన్‌పాట్టలనే మూడు బాగా ప్రసిద్ధాలు. వేదమంత్రాలను, పతంజలి యోగసూత్రాలను, భగవద్గీతను తమిళంలోకి అనువదించాడు. అవి ఆయన భక్తి భావ తత్పరతకు శిఖరాయమానాలు. ప్రవాసంలో గొప్ప రచనలు చేసిన తర్వాత 1918లో కడలూరు సమీపంలో బ్రిటిష్‌ ఇం‌డియాలో ప్రవేశించాడు. పోలీసులు వెంటనే ఆయనను అరెస్టు చేసి కడలూరు కేంద్ర కారాగారంలో మూడువారాల పాటు నిర్బధించారు. అనీబిసెంట్‌, ‌సి.పి.రామస్వామి అయ్యర్‌ ‌వంటి ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వం ఆయనను విడుదల చేసింది. ఆ దశలో పేదరికంతో బాధ పడుతూ అనారోగ్యం పాలయ్యాడు. తర్వాత 1919లో గాంధీని కలిశాడు. 1920లో మద్రాసులో ‘స్వదేశీ మిత్రన్‌’ ‌పత్రికకు సంపాదకత్వం నిర్వహించాడు.

భారతి కవితా విశేషాలు

ఆధునిక తమిళ సాహిత్యానికి మార్గదర్శకుడిగా భారతిని తమిళ విమర్శకులు పేర్కొన్నారు. ఆయన తనకన్నా ముందున్న తమిళ సాహిత్య పోకడలకు భిన్నంగా సరళమైన ప్రాసయుక్తమైన పదాలతో రచనలు చేశాడు. ఆయన భక్తి రచనల్లో కొత్త పోకడలు, ఆలోచనలు శైలీ సౌందర్య విశేషాలను ప్రదర్శించాడు. తనకంటే ముందు గోపాలకృష్ణ భారతీయార్‌ ‌ప్రయోగించిన సరళమైన ‘నొంది చిండు’ అనే ఛందస్సును తన రచనల్లో విరివిగా వినియోగించుకున్నాడు. ప్రగతిశీల సంస్కరణాత్మక భావాలను, ఆదర్శాలను ఆయన కవిత్వంలో వ్యక్తీకరించాడు. ఆధునిక తమిళ రచయితల కంటే భిన్నమైన ఆలోచనలు, ఊహలు, పద్యాల్లో ప్రాసబద్ధమైన పటుత్వమైన శైలీ సౌందర్యం కొత్త పుంతలు తొక్కి పాఠకులను విశేషంగా ఆదరించాయి.

ఆయన రచించిన వేలాది కవితల్లో వైవిధ భరితమైన విభిన్న భావాలు ప్రతిబింబించాయి. వాటిని స్థూలంగా 1. భారత జాతీయ గీతాలు, 2. ప్రణయ గీతాలు 3. ప్రకృతి గీతాలు 4. బాలల గీతాలు 5. తమిళభాష ఔన్నత్య గీతాలు, 6. ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుల ప్రశంసా గీతాలుగా వర్గీకరించవచ్చు.

రష్యా, బెల్జియంల విప్లవాలను గూర్చి పాటలు రాశాడు. ఆధ్యాత్మికపరంగా హిందూ దేవతలైన శక్తి, కాళి, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, శివుడు, కృష్ణుడు వంటివారితోపాటు ఇతర మతాలకు సంబంధించిన అల్లా, క్రీస్తు గూర్చి ప్రస్తుతిస్తూ కవితలు రాసి మత సామరస్యాన్ని చాటుకున్నాడు. అనువాదం భారతి సాహిత్య సేవలో భాగమే. అరబిందో, బాలగంగాధర తిలక్‌, ‌స్వామి వివేకానంద వంటి వారి ప్రసంగాలను అనువదించాడు.

భారతి రచించిన పాటలు తమిళ సినిమాల్లోనూ, సంగీత కచేరీల్లోనూ విరివిగా ఉపయోగించేవారు. తమిళ కవుల అభిమాన సినీ రచయితగా నిలిచాడు.

తెలుగు భాషా మాధుర్యానికి పరవశించి మధురమైన ‘సుందర తెలుంగు’గా ప్రశంసిస్తూ గానానుకూలమైన గొప్ప భాషగా పేర్కొన్నాడు.

‘‘విరియగాచిన వెన్నెల రాత్రిలో

చేర దేశపు చెలులు వెంటరాగా

సుందరాంధ్ర పదమ్ము పాడుచున్‌

‌సింధునదిని పడవ నడుపుచునాడుదాం’’

విరియగాంచిన వెన్నెల రాత్రుల్లో చేరదేశపు సుందరాగులతో కలిసి సింధునదిలో పడవ ప్రయాణం చేస్తూ సుందరమైన తెలుగుపదాలను గానం చేస్తే కలిగే గొప్ప అనుభూతినీ, తెలుగుభాషా మాధుర్యాన్ని పారవశ్యంతో ప్రశంసించాడు.

తిరువళ్లువర్‌, ‌కీర్తికంఠుడు వంటి తమిళ మహా కవులతోపాటు పోతన, కందుకూరి వీరేశలింగం వంటి తెలుగు కవులను ప్రశంసించాడు. సంగీత సార్వభౌముడైన త్యాగయ్యను కూడా కీర్తించాడు.

స్త్రీవాద భావుకుడిగా స్త్రీలు రాజకీయాల్లోకి రావాలని కాంక్షించిన తొలి తమిళ కవి భారతి. స్త్రీల హక్కులకు భంగం కలిగించే శాస్త్రాలను, ఆచారా లను ఖండించాడు.కుల వ్యవస్థను వ్యతిరేకించాడు.

ప్రముఖ తమిళ మహాకవిగా, స్వాతంత్య్ర సమర యోధుడిగా, ప్రసిద్ధ పాత్రికేయుడిగా, సంస్కర్తగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న భారతి సెప్టెంబరు 12, 1921న 38 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

ఆయన మరణించిన 72 సంవత్సరాల తర్వాత 1993లో తమిళనాడు ప్రభుత్వం ఆయన ఇంటిని కొనుగోలు చేసి పునరుద్ధరించి ‘భారతి ఇల్లం’ (భారతి ఇల్లు) పేరుతో స్మారక చిహ్నంగా నిలిపింది. జాతీయ మహాకవి భారతి తమిళ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు. తెలుగు భాషా మాధుర్యాన్ని, ఘనతను వినుతించిన ఆయన తెలుగువారికి అభిమాన పాత్రుడు. ఆయన 130వ జయంతి సందర్భంగా ఆయనకిదే నివాళి.

వ్యాకసర్త : రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి, సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

About Author

By editor

Twitter
YOUTUBE