సంపాదకీయం
శాలివాహన 1944 శ్రీ శుభకృత్ మార్గశిర బహుళ ఏకాదశి – 19 డిసెంబర్ 2022, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
భారత రాజ్యాంగాన్ని రక్షించే మార్గం ఏమిటి? పెద్దగా ఆలోచించనక్కర లేదు. భారత ప్రధానిని ‘హత్య’ చేయడమే. ఇదీ, ఇవాళ కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం. దశాబ్దాల పాటు పాలన పేరుతో దేశం మీద దుష్ట సంప్రదాయాలను రుద్దడమే కాదు, విద్రోహ, వినాశకర పోకడలతో స్వతంత్ర భారత రాజకీయ వ్యవస్థను విషపూరితం చేసిన ఘనత శతాధిక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీదే. ఇది చాలదన్నట్టు ఇప్పుడు భాషను కూడా అదే శైలిలో, అదే మూసలో తీర్చిదిద్దే మహాకార్యానికి కూడా వయసు మళ్లిన, బుద్ధి కుళ్లిన ఈ దిక్కుమాలిన పార్టీ పూనుకున్నట్టు కనిపిస్తున్నది. ‘హత్య’ అంటే చిరకాలంగా ఈ దేశానికి తెలిసిన అర్ధం ఒక్కటే. మనిషిని భౌతికంగా నిర్మూలించడం. కానీ మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజా పటేరియా భాషా పండితులు ఎల్లరూ బిక్కచచ్చే తీరులో చెబుతున్న భాష్యం, ఎన్నికలలో ఓడించడాన్ని ‘హత్య’ అంటారని. ఈ తలకుమాసిన నాయకుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కూడా. ఇతడు ఏ శిబిరం వాడో తెలుసా? కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, నెహ్రూ కుటుంబానికి కుక్కమూతి పిందె రాహుల్‌కు గురువుగా ప్రసిద్ధుడైన వాడి శిబిరమది. పేరు దిగ్విజయ్ సింగ్. బీజేపీ అంటే, హిందూత్వ అంటే కళ్లలో నిప్పులు పోసుకునే ఈ దిగ్గిరాజా శిష్య పరమాణువు కాబట్టే రాజా పటేరియా నోరు ఇంత మురుగును దేశం మీద కక్కగలిగింది. డిసెంబర్ 11వ తేదీన, ‘మోదీని చంపడానికి సిద్ధంగా ఉండండి!’ అంటూ దేశాన్ని ఉద్ధరించే అవకాశాన్ని చెరబట్టడానికి కాచుకుని కూర్చున్న, దింపుడు కళ్లం ఆశతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు రాజా పిలుపునిచ్చాడు. సామాజిక మాధ్యమాలలో వచ్చిన వీడియోతోనే ఈ వాచాలత్వం వెల్లడైంది.
ప్రధాని మోదీని ఎందుకు ‘హత్య’ చేయాలో కూడా ఈ వాచాలుడు వివరంగా చెప్పాడు. ‘ఇంక మోదీ ఎన్నికలకు మంగళం పాడతారేమో! భాష, కులం, మతం ప్రాతిపదికన జనాలను విడగొడతారు. రాజ్యాంగ నియమాలను కాలరాస్తూ దళితుల, గిరిజనుల, మైనారిటీల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇకనైనా రాజ్యాంగ పరిరక్షణ జరగాలంటే మోదీని చంపేందుకు సిద్ధంకండి. చంపడమంటే ఓడించడమే.’ కాబట్టి ఈ దేశ ప్రధానిని చంపి, ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించాలని ఆ కాంగ్రెస్ ప్రముఖుడు తిరుగులేకుండా సిద్ధాంతీకరించాడు. అది నోరా, మరొకటా అని మీడియా అడిగితే అతడు చెప్పిన సమాధానం కూడా పరమ వికృతంగానే ఉంది. తన ఉద్దేశం గాంధీ సిద్ధాంతానికి బదులు, (నాథూరాం) గాడ్సేను సమర్ధించే ప్రభుత్వాన్ని కూల్చమనే అంటూ మరింత బుద్ధిమాలిన వివరణ ఇచ్చాడు పటేరియా. పైగా ఆయన మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్‌ల ఆరాధకుడట. ఆ మహనీయుల పేరు చెప్పుకుంటే ఏం వాగడానికైనా లైసెన్సు వస్తుంది కాబోలు! ఇప్పుడు దేశానికి ఇదొక ప్రారబ్ధం. రాజ్యాంగ స్ఫూర్తిని నిట్టనిలువునా పాతరేస్తూ చేస్తున్న నినాదాలూ, ఊరేగింపులూ, నడిపిస్తున్న ప్రదర్శనలలో; ఆఖరికి గణతంత్ర దినోత్సవ వేళ ఎర్రకోట మీద దండెత్తిన విధ్వంసకుల చేతులలో త్రివర్ణ పతాకాలు ఎగురుతున్నాయి. రాజ్యాంగం చెప్పిన అంశాలను అమలు చేయడానికి ప్రభుత్వం యత్నిస్తే అడ్డుకుంటున్నవారు అంబేడ్కర్ పేరును నిస్సిగ్గుగా వాడుకుంటున్నారు. దేశాధినేతలను చంపడమే దేశ రాజ్యాంగానికి రక్ష అంటూ గాండ్రిస్తున్న గార్దభాలు కూడా గాంధీజీ పేరును వాడుకుంటున్నాయి. ఈ రాజా పటేరియా నోరంతా కంపేనని చెప్పే గతానుభవాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారు అని ఒక చానెల్‌లో రాజాని అడిగితే, ‘ఈ రోజుల్లో సొంత పెళ్లాన్నే ఎవరూ నమ్మడం లేదు. ఇంక ఎమ్మెల్యేల మాట ఏం చెబుతాం?’ అన్నాడట. కానీ ఇతడు దళిత, ఆదివాసి పేరుతో సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం తెగ శ్రమపడతాడట. ఎన్ని నేరాలు చేయడానికైనా, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడానికైనా, హిందూత్వ మీద ఎంత బురద చల్లడానికైనా ఇలాంటి ఒక్క ముసుగు చాలు. ఈ బాపతు మురికికి కాంగ్రెస్ శాశ్వత చిరునామాగా మారి చాలా కాలమే అయింది.
రాజా పటేరియాని డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. అది ఎలాగూ జరిగేదే. కానీ ఇతడి వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు సరైన రీతిలో ఖండించకపోవడం గమనార్హం. అంటే పటేరియా మాటలనీ, అందులోని భావాన్నీ కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తున్నట్టే. అలా అన్నాడా, నేను ఆ ప్రకటనని ఇంకా చూడలేదు అనేవాడొకడు. మాది గాంధీ సిద్ధాంతాల పార్టీ. హింసను సమర్ధించదని సుద్దులు వల్లించి, తన పేరు చెప్పడానికి ఇష్టపడని వాడు ఇంకొకడు. ఇది దురదృష్టకరం, ఆ మాటలని పటేరియా సొంత అభిప్రాయాలుగానే పార్టీ భావిస్తోందంటూ పొడి పొడి మాటలు మరొకడివి. ఇదా మర్యాద? ప్రధానిని చంపండి అంటూ అన్ని మర్యాదలనీ గంగలో కలిపిన సొంత పార్టీ నేత నుంచి వచ్చిన అపృచ్ఛపు మాటను ఖండించే తీరు ఇదా? పటేరియా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. మాజీ మంత్రి. ఇతడు దేశ ప్రధాని గురించి ఇంత నీచమైన రీతిలో మాట్లాడితే ఖండించడానికి ఆ పార్టీ పెద్దలకి తీరికే లేదా? ఇది ముమ్మాటికి హత్యా రాజకీయాలకి సమర్ధన అని జాతి భావించక తప్పదు.
పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధాని రక్షణ విషయంలో అంత అశ్రద్ధ చూపినప్పుడే దాని అంతరంగం అర్ధమయింది. అందులో మార్పు లేదని చెబుతోంది రాజా పటేరియా తాజా ప్రకటన. మీకు దమ్ముంటే మోదీని నరకండి అని ఒకడు, నేనే ముక్కలు ముక్కలుగా నరుకుతానని మరొకడు, కుక్క చావు చస్తాడని మరొకడు గతంలోనూ మొరిగారు. కాంగ్రెస్ సహా ఏ ప్రతిపక్షం ఈ ధోరణిని ఖండించడం లేదు. వీళ్లని చూసి గాంధీజీ, నెహ్రూ, అంబేడ్కర్ ఆత్మలు ఎంత ఘోషిస్తున్నాయో!