‘పితాపుత్రహొభ్రాతృంశ్చ భర్తా రమేవ ।
సుమార్గం ప్రతిప్రేరయంతీ మివ ।।’
ఒక మహిళ విద్యావంతురాలైతే తనతో పాటు తన తండ్రిని, అన్నదమ్ముల్ని, భర్తను, ఇంటిల్లిపాదినీ మంచిమార్గంలో ప్రయాణించడానికి, వారిలో మార్పు తీసుకురావడానికి కారణమవుతుందని పై శ్లోకానికి అర్థం. ఆ విధంగా ఆడపిల్లలకు చక్కటి సంస్కారాన్ని అందిస్తూ, విలువలతో కూడిన విద్యను బోధిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం హైదరాబాద్ శివారు కన్హా శాంతి ఆశ్రమంలో నవంబర్ 25, 26, 27 తేదీలలో బాలికా శక్తి సంగమం కార్యక్రమాన్ని న భూతో న భవిష్యతి అన్న రీతిలో నిర్వహించింది.
సమాజంలోని వివిధ రకాల పోకడలను ఎదుర్కొనేందుకు వీలుగా బాలికల్లో ఆత్మ విశ్వాసం, మనోనిబ్బరం, పటిష్టత, నైపుణ్యం, ఏకాగ్రత వంటి అంశాలలో వారికి శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అద్భుతమైన యోగా కేంద్రంగా పేరున్న శాంతివనంలో, పచ్చదనం పరచుకొన్న వాతా వరణంలో వేలాది బాలికలను ఈ నైపుణ్య శిక్షణ ద్వారా జీవితంలో ఉషోదయాల వైపుకి పయనింప చేశారు.
స్వర్ణోత్సవాల సందర్భంగా..
తెలుగు రాష్ట్రాల్లో 50 ఏళ్ల క్రితమే శిశుమందిరాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొనే శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రస్తుతం స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన అనేక అద్భుత కార్యక్రమాల్లో బాలికా శక్తి సంగమం వినూత్నంగా నిలుస్తుంది.
మూడు రోజుల అద్భుత ఘట్టం
బాలికా శక్తి సంగమం అంటే బాలికల్లో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని సమీకరించటం. పేరుకి తగినట్లుగానే వేలాది బాలికలను ఒక చోటకు చేర్చి క్రమశిక్షణతో కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజున దేశం నలుమూలల నుంచి వచ్చిన విశిష్ట అతిథుల మధ్య ఉద్ఘాటన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా విభిన్న అంశాల మీద విద్యార్థినులకు భారతీయం నిర్వాహకులు సత్యవాణి, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షుడు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, క్షేత్రం సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి మార్గదర్శనం చేశారు. విద్యార్థినులు రకరకాల అంశాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు.
రెండో రోజున వివిధ రంగాల నిపుణులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో టైమ్స్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఎడిటర్ అమృత, బాలల హక్కుల కమిషన్ సభ్యులు అపర్ణ, విద్యావేత్త డాక్టర్ అనూరాధ తదితరులు పాల్గొన్నారు. ఆయా రంగాలలో అత్యున్నత స్థితికి చేరిన ఈ మహిళామణులు పిల్లలను ఉత్తేజ పరుస్తూ ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చామని, ఆంగ్లం సరిగా రాదని, ఆధునిక హంగులు అందటం లేదని కుంగిపోవొద్దని సూచించారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకున్న మహిళామణుల జీవితాలను ఉదాహరిస్తూ.. అటువంటి అనంత శక్తి సంపద ఆడపిల్లలందరి లోనూ దాగి ఉందని చెప్పారు. ఆడపిల్లలు తలుచుకుంటూ అద్భుతాలు సాధించ గలరని స్ఫూర్తిని నింపారు. జీవితంలోని ఏ దశలోనూ వెనుకంజ వేయాల్సిన పని లేదని, పురోగతి దిశగా పట్టుదలగా దూసుకుపోవాలని సూచించారు. అతిథుల ప్రసంగాలతో బాలికలు ఎంతో ఉత్తేజితు లయ్యారు.
తర్వాత పథ సంచలన్ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉప్పొంగిపోయే సంగీత సవ్వడులకు అనుగుణంగా వేలాది బాలికలు క్రమశిక్షణతో ముందుకు సాగిపోతూ.. ఆదిశక్తి రూపాన్ని ప్రతిబింబించారు. కాషాయ దుస్తులలో మెరిసిపోతున్న బాలికాశక్తిని చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదనే చెప్పాలి. ఈ కార్యక్రమంలో బాలికలు చేసిన ఘోష్‌నాదం చూపరులను ఆకట్టు కుంది.
మూడో రోజు సమారోప్‌తో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు, మాజీ వైస్ ఛాన్సలర్ తిరుపతిరావు, స్ఫూర్తి పత్రిక సంపాదకులు అన్నదానం వెంకట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
మూడు రోజులపాటు జరిగిన బాలికా శక్తి సంగమం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ శిశుమందిరాల నుంచి వచ్చిన బాలికలకు మన ఆచార వ్యవహారాలు, అందులోని శాస్త్రీయత, కుటుంబ విశిష్టత, ఆరోగ్యం, ఇంటి వైద్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ, లలితకళలు, ఆటలు వంటి అంశాలలో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యాపీఠం ఆచార్యులు, మాతాజీలు, కార్యాలయ సిబ్బంది పాలుపంచుకున్నారు.
విలువలతో కూడిన విద్యావిధానమే లక్ష్యం
భారతీయ విలువలతో కూడిన విద్యావిధానం అందించడమే శిశుమందిరాల లక్ష్యం. దేశంలో తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మొదటి శిశుమందిర్ పాఠశాల ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా దేశమంతటా విస్తరించాయి. వీటి నిర్వహణ కోసం ఆయా ప్రాంతాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యా కమిటీలన్నీ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థకు అనుబంధంగా ఉన్నాయి. విద్యాభారతి సంస్థలో మొత్తం 13,067 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాల్లో 349 పాఠశాలలు ఉన్నాయి.
సాధారణంగా ఏ పాఠశాల చూసినా కేవలం విద్య, అంటే పాఠ్యాంశాలనే ప్రధానంగా బోధిస్తారు. కానీ శిశుమందిరాల్లో కేవలం మార్కుల కోసమో, ర్యాంకుల కోసమో బోధన జరగదు. పాఠ్య ప్రణాళికకు తోడుగా, క్రీడా ప్రణాళిక, దేశభక్తితో కూడిన విద్య వంటివి కూడా ఉంటాయి. ముఖ్యంగా పంచకోశ విద్యను ఇక్కడ బోధిస్తారు. ప్రాచీన, మరుగున పడుతున్న కళలను నేర్పిస్తారు. యోగ, సంగీతం, కోలాటం, కరాటే, ఘోష్ వంటి వాటిల్లో శిక్షణతో పాటు దేవభాష సంస్కృతం బోధిస్తారు. వేదగణితంలో శిక్షణను అందిస్తారు.
ఒక విద్యార్థి తన నిజ జీవితంలో జరిగే ఆటుపోట్లను తట్టుకుని సమాజంలో ధైర్యంగా ఎలా నిలబడాలో కూడా నేర్పిస్తారు. ఇలాంటి వాతా వరణంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు భవిష్యత్తులో ఏ స్థాయిలో, ఏ సంస్థలో పనిచేస్తున్నా దేశం, ధర్మం, జాతి ఐక్యతను ప్రధాన లక్ష్యాలుగా ఏర్పరుచుకుని తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అలాగే మనం ఏ పాఠశాలలోనైనా ఉపాధ్యాయులను సార్/మేడం అంటూ పిలవడం చూస్తుంటాం. కానీ శిశుమందిరాలలో ఆచార్యజీ, మాతాజీ అని సంబోధి స్తారు. దీనివల్ల విద్యార్థులకు చిన్నప్పటి నుంచే పెద్దల పట్ల గౌరవభావం పెరుగుతుంది.
శిశుమందిరాల్లో తొలి నుంచి తెలుగులోనే విద్యాబోధన కొనసాగుతున్నా కాలక్రమంలో వచ్చిన మార్పుల వల్ల ఆంగ్ల మాధ్యమంలోనూ పాఠశాలలను ప్రారంభించారు. అయితే బోధన విషయంలో మాత్రం అవే పద్ధతులను అవలంబిస్తున్నారు, విద్యార్థులను దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని వారికి కూడా విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఏకోపాధ్యాయ పాఠశాలలను, సంస్కార కేంద్రాలను కూడా నిర్వహిస్తోంది శ్రీ సరస్వతీ విద్యాపీఠం. ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా రెండేళ్ల క్రితం శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో సీబీఎస్‌ఈ పాఠశాలను కూడా ఏర్పాటు చేసింది.
– రమ విశ్వనాథన్, ప్రాంత ప్రచార ప్రముఖ్ (శ్రీ సరస్వతీ విద్యాపీఠం)
– సంతోషలక్ష్మి, ప్రాంత ప్రచార సభ్యులు (శ్రీ సరస్వతీ విద్యాపీఠం)
—————-
మన సంస్కృతే, మన సంపద
– లింగం సుధాకర్‌రెడ్డి
భారత్‌పై ఎందరు దాడులు చేసినా.. భారత్ భారత్‌గానే ఉందంటే మన సంస్కృతే అందుకు కారణం. చాలా రకాలుగా భారతీయులను ప్రలోభ పెట్టడానికి యత్నాలు జరిగినా సఫలీకృతం కాలేకపోయారు. అందుకు కారణం మన సంస్కృతి అనే వేళ్లు బలంగా పాతుకుపోవడమే. భూమి మనకు తల్లి అని, ఆ పూజ్య భావనే అనాదిగా ఆచరిస్తున్నాం. ఈ భావనలకు, బలాలకు మూలంగా మహిళలు నిలుస్తున్నారు. అటువంటి మహిళల్ని శక్తిమంతం చేసే దిశగా చేస్తున్న ప్రయత్నమే బాలికా శక్తి సంగమం.
– విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా మంత్రి
———————
ఎన్నో ప్రయోజనాలు
– డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు
బాలికా శక్తికి ఈ సంగమం ఓ సంకేతం. కుటుంబ విషయాల్లో, సమాజ పరంగా తీసుకునే నిర్ణయాల్లో స్త్రీ భాగస్వామ్యం కచ్చితంగా ఉండాలి. కుటుంబాల నిర్ణయాల్లో మహిళలు భాగస్వాము లుగా రాణిస్తున్నారు. అదే రీతిన సమాజాన్ని, కుటుంబాన్ని నడపగలిగితే సాధికారత వచ్చినట్లే. బాలికా శక్తి సంగమం ద్వారా స్పష్టమైన ప్రయోజ నాలు పిల్లలకు దక్కుతాయి.
– విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు, ఐఎఎస్ (రిటైర్డ్)