సంపాదకీయం
శాలివాహన 1944 శ్రీ శుభకృత్ మార్గశిర బహుళ చవితి – 12 డిసెంబర్ 2022, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ప్రపంచపటం రూపురేఖలను పరమ వికృతంగా, అసహజంగా మార్చేసిన ఘనత మత మార్పిళ్లకు ఉంది. ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలు మూలవాసుల ఉనికినే తుడిచిపెట్టేశాయి. మతం మారడానికి కొన్ని వందల కారణాలు కనిపిస్తాయి. మత మార్పిళ్ల చరిత్ర అంతా రక్తసిక్తమే కూడా. ఇదంతా ఎందుకు? మతం మారడమంటే ఒక సమూహాన్ని తమదైన జీవనం నుంచి దూరంగా విసిరివేయడమే. ఒక సమాజం వేల ఏళ్లుగా నమ్ముకుంటూ వచ్చిన విశ్వాసాలకు పాతర వేయడమే. వారందరినీ కట్టి ఉంచిన బంధాన్ని తెంపివేయడమే. మత మార్పిడిలో ఈ కోణాన్ని చూడకపోతే అది వాస్తవమనిపించుకోదు. ఈ వాస్తవాన్ని డిసెంబర్ 5న భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన అద్భుతమైన తీర్పులో (బలవంతపు మతమార్పిడి రాజ్యాంగ విరుద్ధం) మరొకసారి గమనిస్తాం. భారతదేశంలో ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా గుర్తు పెట్టుకు తీరవలసిన చరిత్రాత్మకమైన సందేశం కూడా ఆ తీర్పులో ఉంది. అది – ‘భారతదేశంలో నివసిస్తున్న వారంతా ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలి.’
మతస్వేచ్ఛ అంటే ‘ఇతర మతాలు బతకరాదు’ అన్నట్టు వ్యవహరిస్తున్న వారందరికీ కూడా అది కనువిప్పు. వారు కనువిప్పుగా భావిస్తారా? కవ్వింపు చర్యగా భావిస్తారా? అన్నది ఆయా మతాల వారి విజ్ఞత మీద ఆధారపడి ఉండవచ్చుకానీ, మతం మారినంత మాత్రాన వారి శాశ్వత చిరునామా మారదన్న నిత్యసత్యాన్ని గుర్తించకతప్పదు. ఈ నేల మీద పుట్టినవారంతా తాము భారతీయులుగా భావించి, భారతీయులుగా జీవించి తీరాలన్నదే అత్యున్నత న్యాయస్థానం మనోగతం.
చరిత్రలో చాలా అంశాలు మరుగున ఉండిపోతాయి. కొన్నింటిని కొందరు చీకటిమాటున ఉంచుతారు కూడా. అలాంటి వాటిలో 1944లో బొంబాయిలో జిన్నా, మహాత్మా గాంధీ మధ్య జరిగిన చర్చ ఒకటి. ఆ నగరంలోని మలబార్ హిల్స్‌లోని జిన్నా భవంతిలో దాదాపు రెండువారాలు జరిగిన చరిత్మ్రక చర్చలవి. ఆ సందర్భంలో గాంధీజీ చెప్పిన విషయాలు మననం చేసుకోదగినవి. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఆ చర్చ లోతెంతో అంచనా వేసే అవకాశం వచ్చింది. అనేక కారణాలతో మీ పెద్దలు, ఆ తరువాత మీరు ఇస్లాంలోకి వెళ్లి ఉండవచ్చు. కానీ మీరంతా మొదట భారతీయులు అన్న విషయాన్ని జిన్నాకు ఎరుక పరచడానికి గాంధీజీ శతథా యత్నించారు. మతం మారినంతనే వారి మూలాలు మారిపోవు అని గాంధీజీ కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. మతం మారితే మాతృభూమి మీద చిరునామా చెరిగిపోదు. విదేశాల నుంచి వచ్చిన మతాలు ఇక్కడ మతం మారిన వారి మూలాలను స్పృశించలేవు. అందుకు ఇష్టపడవు కూడా. 1947 వరకు దేశంలో ముస్లింలు, క్రైస్తవులు చాలా వరకు ఈ దేశ ఆచారాలను, సంప్రదాయాలను గౌరవించారని చెప్పవచ్చు. 1980 దశకంలో విదేశీ మతాలను ఆశ్రయించినవారిలో, వారి వారసుల వైఖరిలో కచ్చితమైన మార్పు రావడం మొదలయింది. అది భారతదేశాన్ని, ఇక్కడి మెజారిటీ ప్రజల విశ్వాసాలను గౌరవించవలసిన అవసరం తమకు లేదని, అలా గౌరవించడం తమ మత సూత్రాలకు విరుద్ధమన్న వాదన ఒకటి బయలుదేరిన మాట నిజం. భారతజాతిని విదేశీ పాలన నుంచి విముక్తం చేయడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వందేమాతరం గీతాన్ని నిరాకరించడం, ఈ దేశ పతాకానికి వందనం చేయడాన్ని కూడా మత విశ్వాసంతో ముడి పెట్టడం వంటి పరిణామాలు చొచ్చుకు వచ్చాయి. ఆఖరికి బాబర్‌ను వ్యతిరేకించడమంటే అల్లాను వ్యతిరేకించడమనే ధోరణికీ, చరిత్రలో రాబర్ట్ క్లైవ్ అకృత్యాలను చర్చించినా అది క్రీస్తుకు వ్యతిరేక పంథా అన్న దృక్పథానికీ వచ్చినట్టు కనిపిస్తున్నది. కానీ అది వాస్తవిక దృష్టి కాలేదు. బాబర్ ఈ దేశానికి వచ్చిన దురాక్రమణదారుడు. క్లైవ్ ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి పునాదులు వేసిన దోపిడీ దొంగల ముఠా నాయకుడు. ఈ తేడాను గుర్తించాలి. ఈజిప్ట్‌లో ఇప్పుడు అధికార మతం ఇస్లాం. పిరమిడ్లు కట్టినవారితో, ఆ తరాలతో, అసలు ఆ కట్టడాలతో తమకు సంబంధం లేదని వాదించే ధోరణి అక్కడ ప్రబలింది. ఎందుకంటే అవి కట్టినప్పుడు అక్కడ ఇస్లాం లేదు. ఇప్పుడు ఇస్లాం అధికార మతం. అంతమాత్రాన తమ గతాన్ని, అందుకు సంబంధించిన అవశేషాలను నిరాకరించడం సరికాదంటారు నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత వీఎస్ నయీపాల్. ఇది వాస్తవిక దృష్టి అనిపించు కుంటుంది. కాబట్టి తమ గతంతో, తమ పూర్వికులతో తెగతెంపులు చేసుకోవడం కూడా మతమార్పిడిలో భాగం చేయడం సుస్పష్టంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పులోని ఆ ఒక్క వాక్యం వీటికి గొప్ప సమాధానమే అవుతుంది. బాబర్ సమాధి అఫ్ఘానిస్తాన్‌లో ఉండేదనీ, దానిని తరువాతి కాలాలలో పెకలించి వేశారనీ చెబుతారు.
ఆసుపత్రులలో బాధలను అనుభవిస్తున్నవారిని ప్రలోభపెట్టి, పురిటినొప్పులతో సతమతమవుతున్న మహిళలను భయపెట్టి మతం మార్చే ప్రబుద్ధులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు బలవంతపు మతమార్పిడి రాజ్యాంగ విరుద్ధమేనని మరొకసారి తీర్పు చెప్పింది. విశ్వాసాల ప్రాతిపదికగా కాకుండా, విద్రోహబుద్ధితో ఇక్కడ మత మార్పిడులు జరుగుతున్నాయి. వాటిని నిరోధించాలి. సుప్రీం కోర్టు కూడా ఆ వాస్తవాన్ని అంగీరిస్తూనే ఉంది. ఈ దేశంలో పుట్టిన వారు ఏ మతాన్నీ, ఏ పూజా విధానాన్నీ ఎంచుకున్నా, పూర్వం నుంచి ఈ దేశంలో కొనసాగుతున్న కొన్ని సంప్రదాయాలను మాత్రం గౌరవించాలి. అది జరగని నాడు ఇక ఐక్యత ఎక్కడ? అయితే ఇలాంటి తీర్పులను అమలు చేయడంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ తీర్పు మీద తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశించవచ్చు.