తెలుగులో సీక్వెల్‌ ‌చిత్రాలు విజయం సాధించినంతగా ప్రాంచైజ్‌ ‌మూవీస్‌ ‌మెప్పించలేకపోతున్నాయి. అవి డబ్బులు తెచ్చిపెట్టడం లేదని కాదు, కానీ మొదటి చిత్రంతో పోల్చితే రెండో సినిమా ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ఆ మధ్య వచ్చిన ‘ఎఫ్‌ 3’ ‌మాదిరి గానే తాజాగా విడుదలైన ‘హిట్‌ -2’ ‌కూడా కంటెంట్‌ ‌పరంగా తేలి పోయింది. అయితే మొదటి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ రెండు సినిమాలు నిర్మాతలకు సేఫ్‌ ‌ప్రాజెక్టస్ అయ్యాయి.

హీరో నాని నిర్మాతగా మారి తొలుత ‘అ’ అనే సినిమా తీశాడు. అది కమర్షియల్‌గా గ్రాండ్‌ ‌సక్సెస్‌ ‌సాధించకపోయినా, అవార్డులను అందుకుని, నానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే ఊపుతో 2020లో ‘హిట్‌’ ‌మూవీని విశ్వక్‌సేన్‌ ‌హీరోగా నిర్మించాడు. ఆ సినిమా హిట్‌ ‌టాక్‌ ‌తెచ్చు కుని థియేటర్లలో సందడి చేస్తున్న సమయంలోనే కరోనా ఫస్ట్ ‌వేవ్‌ ‌కారణంగా సినిమా హాల్స్ ‌మూతపడ్డాయి. దానికి సీక్వెల్‌ ఉం‌టుందని చెప్పిన నాని, ఆ తర్వాత మనసు మార్చుకుని ఫ్రాంచైజ్‌ ‌మూవీ చేశాడు. అదే ‘హిట్‌ -2’. ఈ ‌తాజా చిత్రంలో అడివి శేష్‌ ‌హీరోగా నటించాడు. ‘మేజర్‌’ ‌తర్వాత ఈ యేడాది విడుదలైన అడివి శేష్‌ ‌రెండో సినిమా ఇది. ‘హిట్‌’‌ను తెరకెక్కించిన డాక్టర్‌ ‌శైలేష్‌ ‌కొలను ఈ సినిమానూ డైరెక్ట్ ‌చేశాడు.

కృష్ణదేవ్‌ (అడివి శేష్‌) ‌తనను తాను కేడీ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటాడు. విశాఖపట్నంలో పోలీస్‌ ‌సూపరింటెండెంట్‌గా పనిచేస్తుంటాడు. పోలీసుల తెలివితేటలతో పోల్చితే నేరస్తులది కోడి బుర్ర అని అతని భావన. అలాంటి కేడీకి ఓ టిపికల్‌ ‌కేసు తగులుతుంది. పబ్‌లో పనిచేసే ఓ అమ్మాయిని ఒకడు అతి దారుణంగా హత్య చేస్తాడు. తల మాత్రం ఆమెది ఉంచి, మిగిలిన శరీర భాగాలను వేరే అమ్మాయిలవి పెడతాడు. అతి దారుణంగా ఈ హత్యలు చేసిన వ్యక్తిని కృష్ణదేవ్‌ ఉరఫ్‌ ‌కేడీ ఎలా ఛేజ్‌ ‌చేసి పట్టుకున్నాడన్నదే ఈ చిత్రం. తనను తక్కువగా అంచనా వేశాడనే కసితో ఒకానొక సమయంలో ఆ హంతకుడు కేడీ భార్యనూ కిడ్నాప్‌ ‌చేస్తాడు. దాంతో డ్యూటీ కాస్త, పర్సనల్‌ ‌రైవలరీగానూ మారిపోతోంది. సీరియల్‌ ‌కిల్లర్‌ను కనిపెట్టడం ఒక ఎత్తు అయితే, వాడి నుండి తనను, తన భార్యను రక్షించుకోవడం కేడీకి మరో ఎత్తుగా మారుతుంది. ఈలోగా అతని ప్రవర్తన సరిగా లేదని డిపార్ట్‌మెంట్‌ ‌నుండి సస్పెన్షన్‌కు గురవుతాడు. కాబట్టి సోలోగా ఈ కేసును కేడీ ఎలా సాల్వ్ ‌చేశాడనేదే ముగింపు.

నిజం చెప్పాలంటే… సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ చాలా ఆసక్తికరంగా సాగింది. కిల్లర్‌ ఎవరనే విషయంలో ప్రేక్షకుల ఊహకు సైతం అందకుండా దర్శకుడు చాలా రకాలుగా కథను మలుపు తిప్పాడు. అయితే కిల్లర్‌ను రివీల్‌ ‌చేసిన తర్వాత మూవీ గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోయింది. పైగా అతను సైకోగా మారడానికి చూపిన కారణం మరీ పేలవంగా ఉంది. తన తండ్రికి మహిళా సంఘాల వల్ల జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా కొడుకు కిల్లర్‌గా మారడం అనేది ఏ రకంగానూ సబబుగా అనిపించదు. పైగా దానిని ఎస్టాబ్లిష్‌ ‌చేసే సీన్స్ ‌కూడా ఏవీ లేవు. దీనికి తోడు పోలీస్‌ ‌సూపరిం టెండెంట్‌ ‌తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసు కోకుండా సహజీవనం చేయడం, ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కడం అనేది దారుణంగా ఉంది. బాధ్యత లేని కుర్రవాళ్లు అలా చేశారంటే ఓకే కానీ సమాజానికి ఆదర్శంగా నిల వాల్సిన పోలీస్‌ అధికారిని అలా చూపడం సరికాదు. ఇలాంటి లోటుపాట్లు చాలానే ఉన్నాయి. అయితే కథనంతో దర్శకుడు మెప్పించడంతో వీటిని ఎవరూ పెద్దంత పట్టించుకోని పరిస్థితి ఉంది. నటీనటుల విషయానికి వస్తే, గత కొంత కాలంగా యాక్షన్‌ ‌సినిమాలు చేస్తున్న అడివి శేష్‌… ‌తన శరీర దారు ఢ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. అందువల్ల ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ ‌పాత్రలో చక్కగా ఉన్నాడు. ఇప్పటికే రెండు సినిమాలతో తెలుగువారికి చేరువైన మీనాక్షి చౌదరి ఆర్య పాత్రలో ఒదిగిపోయింది. కేడీకి కుడిభుజంగా ఉండే వర్ష పాత్రను కోమలి ప్రసాద్‌ ‌సమర్థవంతంగా పోషించింది. అలానే ఇతర ప్రధాన పాత్రలను శ్రీనాథ్‌ ‌మాగంటి, భరణి, రావు రమేశ్‌, ‌పోసాని, హర్షవర్దన్‌, ‌శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ‌కేదార్‌ ‌శంకర్‌, ‌బ్రహ్మాజీ, గీత భాస్కర్‌ ‌తదితరులు చేశారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సుహాస్‌ ‌గురించి. ‘కలర్‌ ‌ఫోటో’లో హీరోగా నటించిన సుహాస్‌ ఆ ‌తర్వాత ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తున్నాడు. ఆ మధ్య ఓటీటీలో వచ్చిన ‘ఫ్యామిలీ డ్రామా’లో షాకింగ్‌ ‌పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బహుశా అది చూసే అతన్ని ఈ సినిమాలోని ఈ పాత్రకు ఎంచుకుని ఉండొచ్చు. అలానే మూవీ చివరిలో నాని గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ‘హిట్‌ 3’ ‌హీరో అతనే అనే విషయాన్ని దర్శకుడు ముగింపులో ఆ రకంగా రివీల్‌ ‌చేసేశాడు. ఇందులో ఉన్న రెండు పాటల్లో ఒకదానికి శ్రీలేఖ, మరోదానికి సురేశ్‌ ‌బొబ్బిలి స్వరాలు సమకూర్చారు. జాన్‌ ‌స్టేవర్ట్ ఈడూరి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సంభాషణలూ ఆసక్తి కరంగానే ఉన్నాయి. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా నిర్మించిన ‘హిట్‌ -2’ ‌వారికి లాభాలు తెచ్చిపెట్టవచ్చు కానీ కంటెంట్‌ ‌పరంగా వీక్షకులకు మొదటి సినిమాతో పోల్చితే నిరాశనే కలిగించింది. విశేషం ఏమంటే.. ఇదే వారం నాని తన సోదరి దీప్తి గంటాతో నిర్మించిన ఆంథాలజీ ‘మీట్‌ ‌క్యూట్‌’ ‌సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్‌ అయ్యింది. కాబట్టి, ఈ యేడాది నాని నటుడిగా కంటే నిర్మాతగా బిజీ అని చెప్పుకోవచ్చు.

– అరుణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE