– బంకించంద్ర చటర్జీ
‘‘హరే మురారే…మధుకైటభారే!’’ అంటూ పాడుతున్నారు కొందరు.
కొందరు ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపిస్తున్నారు.
ఇలా పదివేలమంది వారివారి వేడుకలలో వారు మునిగి ఉన్నారు.
పదివేలమంది సంతానులు ఏకకంఠంతో ‘వందేమాతరమ్’ గానం చేశారు. సంతానుల మధ్య సత్యానంద బ్రహ్మచారి వచ్చి నిలబడినాడు. ఆ అరణ్యమధ్యంలో పదివేల మంది సంతానులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. సత్యానందుడు ఉచ్ఛస్వరంలో, జలద గంభీరశబ్దంతో రెండు చేతులు పైకెత్తి ‘‘శంఖ చక్ర గదా పద్మధారీ, వనమాలి, వైకుంఠనాథుడు, మధు ముర నరక మర్దనుడు, లోకపాలకుడు అయిన ఆ మహాను భావుడు, మిమ్ము రక్షించుగాక! మీకు భుజబలం ప్రసాదించుగాక! మీరందరూ కలిసి ఆయనను ఒకమారు కీర్తించండి’’ అన్నాడు. పదివేల కంఠాలు కలిసి సంకీర్తనం ప్రారంభించాయి : ‘‘జయ జగదీశ హరే ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదం – విహిత వహిత్ర చరిత్ర మభేదం జయ జగదీశ హరే!’’
సంకీర్తనం అయిపోయిన తరువాత సత్యానంద మహరాజ్ తిరిగి వారినందరినీ ఆశీర్వదించాడు. వారినందరినీ ఉత్తేజితపరిచాడు.
‘‘సంతానులారా! మీకందరికీ ఈ రోజు విశేష మైన మాట ఒకటి చెప్పాలి. థామస్ అనే పేరున్న విధర్మ దురాచారి ఒకడు అనేకమంది సంతానులను చంపివేశాడు. ఈ రాత్రి మనం అతడిని ససైన్యంగా బంధించబోతున్నాం. జగదీశ్వరుని ఆజ్ఞ ఇది! మీరందరూ ఏమంటారు?’’
‘‘ఇప్పుడే చంపేద్దాం. అందరినీ చంపేద్దాం, శత్రువులను నాశనం చేద్దాం!’’ ఇటువంటి ఉద్రేక పూరితమైన కేకలు అందరినుండి వెలువడినాయి.
సత్యానందుడు తిరిగి ఇలా చెప్పాడు : ‘‘మనం మనలో ధైర్యసాహసాలను నింపుకోవాలి. శత్రువుల దగ్గర తుపాకులున్నాయి. మనమూ తుపాకులతో తప్ప వారితో యుద్ధం చేయడం కుదరదు. విశేషించి వారంతా బలవంతులు. మన పదచిహ్న గ్రామం నుండి 17 మరఫిరంగులు వస్తున్నాయి. వాటితో మనం యుద్ధసన్నద్ధులం కావాలి. చూడండి. సూర్యోదయం అవుతున్నది. నాలుగు గంటల బ్రహ్మ ముహూర్తంలో… అదేమిటి?…’’
‘ధన్, ధన్, ధన్’ అకస్మాత్తుగా నాలుగు చెరగుల నుండి వచ్చిన ఫిరంగుల ధ్వనులతో దిక్కులు పిక్కటిల్లి నాయి. ఇవి ఇంగ్లీషువారి ఫిరంగి పేలుళ్లు. వలలో పడిన చేపను పట్టుకున్నట్లుగా ఇక్కడ చేరిన సంతాను లందరినీ చంపడానికి థామస్ పెద్ద ఎత్తున వచ్చాడు.
7
ఆంగ్లేయుల తుపాకులు గర్జనలు చేస్తున్నాయి. ఈ ధ్వనులు అరణ్యంలో ప్రతిధ్వనిస్తున్నాయి. సత్యానందుడు అవి ఎటువంటి ఫిరంగులో చూచి రమ్మని కొంతమందిని ఆదేశించాడు. కొందరు సంతానులు గుర్రాల మీద ఎక్కి ధ్వని వస్తున్నవైపుగా బయలుదేరి వెళ్లారు. కానీ వారు వాటి విషయం పరిశీలించి చూడడానికి ముందుగానే ఫిరంగి గుండ్లు వారిని చీల్చి విగత ప్రాణులను చేసినాయి. గుర్రాలు కూడా మరణించినాయి. సత్యానందుడు ఈ విషయం గమనించ గలిగినాడు. జీవానందునితో ‘‘ఎత్తయిన చెట్టు ఎక్కి చూడు, తెలుస్తుందేమో!’’ అన్నాడు.
జీవానందుడు ఒక నిడివి అయిన వృక్షాన్ని ఎక్కాడు. చూసి వెంటనే చెప్పాడు. ‘ఆంగ్లేయుల సైన్యం’ అని.
‘‘అశ్వదళమా లేక పదాతిదళమా?’’
‘‘రెండూ ఉన్నాయి’’
‘‘సుమారు ఎంత సైన్యం ఉంటుంది?’’
‘‘చెప్పలేను. ఇంకా వెల్లువగా వస్తూనే ఉన్నారు.’’
‘‘తెల్లవారి దేశీయులేనా?’’
‘‘తెల్లవారు!’’
‘‘సరే, చెట్టుదిగి కిందికి రా.’’
జీవానందుడు అలాగే కిందికి దిగివచ్చాడు. ‘‘పదివేల మంది సంతానులం ఇక్కడే ఉన్నాం. మనం ఏం చేయగలమో చూద్దాం. జీవానందా! ఈ రోజు నీవు సేనాపతివి!’’ అన్నాడు సత్యానందుడు.
జీవానందుడు సమరోత్సాహంతో అశ్వారోహణం చేశాడు. ఒకమారు నవీనానందునివైపు దృష్టి మరల్చి కనుసైగతో ఏమో చెప్పాడు. నవీనానందుడు కూడా కనుసైగతోనే బదులు చెప్పాడు. దాని వివరం ఇతరుల కెవరికీ తెలియదు. ఈ జన్మకు ఇదే అంతిమదర్శనం అని బహుశ ఆ ఇద్దరి అభిప్రాయం అయి ఉంటుంది.
నవీనానందుడు దక్షిణహస్తం పైకి ఎత్తి ‘‘సోదరులారా! సమయం ఆసన్నమైంది. ఒకమారు జయ జగదీశహరే అనే అష్టపదిని ఆలపించండి. మనం పదివేల మందిమి ఉన్నాం. అందరమూ ముక్తకంఠంతో పాడుదాం.’’ వారి పాటకు దిక్కులన్నీ పిక్కటిల్లినాయి.
ఈసరికి ఆంగ్లేయుల తుపాకి గుండ్లు అరణ్యాన్ని దాటి వచ్చి సంతానులపై కురుస్తున్నాయి. పాడుతూ పాడుతూ వున్న సంతానులు తలలు తెగిపోయి, చేతులు ఊడిపోయి, గుండెలు బద్దలయిపోయి, ఒక్కొక్కరే నేలకు ఒరుగుతున్నారు. అయినప్పటికీ గీతాలాపన మటుకు ముగియలేదు. ‘జయ జగదీశ హరే’ అనే పాట ఇంకా ఆకాశాన్ని అంటుతూనే ఉంది.
పాట పూర్తి అయేసరికి అంతటా నిస్తబ్దత అలుముకుంది. వాతావరణం అంతటా నది, అరణ్యం, అంతటా నిస్తబ్దత ఆవరించింది. తుపాకుల గర్జన, ఆంగ్లేయుల అస్త్రాల రాపిడిధ్వనులు, పద ధ్వనులు, దూరం నుండి వినవస్తున్నాయి.
ఈ భయంకర నిస్తబ్దతను ముగింపజేస్తూ సత్యానందుడు ‘‘భగవానుడు మనపై దయకలిగి ఉన్నాడు. ఆంగ్ల సైన్యం మనకు ఎంతదూరంలో ఉంది?’’ అన్నాడు.
‘‘ఈ అరణ్యానికి సమీపంలోనే, చిన్న మైదానం పక్కనే ఉంది’’ అని బదులు వచ్చింది.
‘‘ఎవరు నీవు?’’
పైనుంచి వచ్చిన జవాబు, ‘‘నేను నవీనా నందుడను.’’
సత్యానందుడు తిరిగి ‘‘మీరు పదివేలమంది ఉన్నారు. మీకు విజయం చేకూరుతుంది. ఇంకా చూస్తారెందుకు? ఫిరంగులు తీసుకురండి’’ అన్నాడు. గుర్రం మీదున్న జీవానందుడు ‘‘పదండి, సోదరులారా!’’ అన్నాడు.
అశ్వారోహణం చేసి కొందరు, కాలినడకను కొందరు మొత్తం పది వేల మంది సంతానులు ముందుకు నడిచారు. పదాతిదళం భుజాలపై తుపాకి, మొలలో ఖడ్గం, చేతిలో బల్లెం ఉన్నాయి. అరణ్యం దాటి బయటకు రావడంతోటే నిరాఘాటంగా వస్తున్న పిస్తోలు గుళ్లు వారిని తునాతునకలు చేయసాగాయి. ఎందరో సంతానులు యుద్ధానికి ఆయత్తం కాకముందే ప్రాణత్యాగం చేస్తున్నారు. జీవానందుని వెనుక నుండి ఒకరు ఇలా అన్నారు: ‘‘జీవానందా! అనవసరంగా ప్రాణత్యాగం చేసు కున్నందువల్ల ఏమి ప్రయోజనం?’’
జీవానందుడు వెనుదిరిగి చూచాడు. ఈ మాటలు అన్న వ్యక్తి భవానందుడు. ‘‘అయితే ఇప్పుడు ఏం చేయమంటావు?’’ అన్నాడు జీవానందుడు.
‘‘అరణ్యంలోనే వృక్షాల ఆశ్రయంలో ప్రాణరక్షణ చేసుకోవడం మంచిపని. మైదానం దాటి ఆవలకు వెళ్లామంటే మన సైన్యం అంతా నాశనం అయిపోవ టానికి ఎంతో సమయం పట్టదు. అదే అరణ్యంలో ఉంటే చాలసేపటి వరకు యుద్ధం కొనసాగించ టానికి అవకాశం ఉంది.’’
‘‘మీరు చెబుతున్నది బాగుంది. కాని ప్రభువు వారి ఆజ్ఞ మర ఫిరంగులను ఎత్తుకు రమ్మని. అందుచేత మనం ఇప్పుడా పని మీద వెడుతున్నాం.’’
‘‘తుపాకులు ఎత్తుకు రావడానికి ఎవరికి సత్తువ ఉంది? అలా వెళ్లక తప్పనిసరి పరిస్థితి వస్తే నేను వెడతాను. నీవు ఇక్కడే వుండిపో.’’
‘‘అలాకాదు భవానందా! నేడు నా మరణదినం!’’
‘‘కాదు. నేడు నా మరణదినం! నేనివాళ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి!’’
‘‘నీవు ఏ పాపము ఎరుగనివాడివి. నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన అవసరం ఏమీ లేదు. కాని నా చరిత్ర కలుషితమైనది. నేనే చనిపోవాలి. అందుచేత నన్ను వెళ్లనీ!’’
‘‘భవానందా! నీవు ఏం పాపంచేశావో నాకేమీ తెలియకుండా ఉంది. నీవు ఇక్కడ నిలచివుంటే సంతానుల కర్తవ్యం నెరవేరుతుంది. నీవే వుండిపో. నేను వెళుతున్నాను.’’
భవానందుడు నీరవుడై ‘‘చనిపోవలసిన అవసరం వస్తే యిప్పుడే చనిపోదాం. మృత్యువుకు సమయా సమయాలు, సుదిన దుర్దినాలు ఏమున్నాయి?’’ అన్నాడు. ‘‘అయితే పద’’ అన్నాడు జీవానందుడు.
ఈ మాటతో మొత్తం సైన్యం ముందుకు నడిచింది. సంతాన సైన్యం ఒక్కొక్క ఫిరంగి గుండుకు ఒక్కొక్క మనిషిగా నేలకు కూలుతోంది. సంతాన సైన్యం ముక్కలు ముక్కలు అయిపోతోంది. మొదలు నరికిన చెట్ల వలె అందరూ నేల కూలిపోతున్నారు. భవానందుడు బిగ్గరగ ‘‘ఈరోజు సంతానులు సముద్రంలోనికి ఉరకవలసిన సమయం. సముద్ర కెరటాలవలె ముందుకు వచ్చి పడడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో, రండి’’ అన్నాడు.
‘వందేమాతరం’ గీతం సహస్రకంఠాల నుండి వెలువడుతోంది. ఫిరంగి గుండ్లు వచ్చిపడుతున్నాయి. సంతాన సైన్యం స్థిర సంకల్పంతో ముందుకు ఉరికి వస్తోంది.
8
పదివేల సంతాన సైన్యం ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపిస్తూ ఫిరంగుల వరుస మీదికి ఉరుకుతోంది. ఫిరంగి గుండ్ల దెబ్బలకు హత ప్రాణులవుతున్నారు గాని ఎవరూ వెనుదిరిగి పారిపో ప్రయత్నించడం లేదు. ఘనఘోరమైన యుద్ధం ఆరంభమైంది. థామస్ సేన ఒకభాగం చీలి సంతానులకు కుడి పక్కగా వచ్చి చేరి కాల్పులు సాగిస్తోంది. ప్రతిక్షణం వందల సంఖ్యలో సంతానులు ఈ లోకాన్ని వదులు తున్నారు. జీవానందుడు ‘‘భవానందా! నీవు చెప్పినదే సరి! ఇంత మంది సంతానులు ప్రాణత్యాగం చేయవలసిన అవసరం ఏమి? వెనక్కు మళ్లుదాం’’ అన్నాడు.
భవానందుడు ‘‘ఇప్పుడు ఆ మార్గం కూడా లేదు. వెనక్కు తిరిగినవాడల్లా ఫిరంగిగుండుకు నేల కూలుతాడు’’ అన్నాడు.
‘‘ఎదురుగా, కుడిపక్క వారి సైన్యాలు ఆక్రమించు కుని కాల్పులు జరుపున్నాయి. మనం మెల్లి మెల్లిగా ఎడమ వైపుకు తప్పుకుందాం.’’
‘‘ఎడమవైపు నది ఉంది. ఫిరంగి గుండ్లకు భయ పడి సంతానులు నదిలో కలిసిపోవలసి వస్తుంది.’’
‘‘నదిపై వంతెన ఉందికదా!’’ ‘‘వంతెన ఇంత మందిని భరించగలదా? అదీగాక అందరూ వంతెన మీద ఉండగా ఒక్క ఫిరంగి గుండు వచ్చి వంతెనను తాకితే, అందరూ నదీగర్భంలో పడిపోతారు.’’
‘‘అలా అయితే ఒకపని చేద్దాం. నీవు కొంత మంది సైన్యంతో ఇక్కడ యుద్ధం చేస్తూ ఉండు. నేను మిగతా సైన్యాన్ని వంతెన దాటిస్తాను. ఇక్కడి వారంతా మరణించినా, మిగతా సైన్యం బతికి ఉండడానికి అవకాశముంటుంది.’’
‘‘అలాగే చేద్దాం.’’
రెండువేల మంది సైన్యంతో భవానందుడు ముందుకు నడుస్తున్నాడు. అతడిలో ఇప్పుడు అపూర్వమైన ఉత్సాహం ఉత్పన్నమైంది. యుద్ధం ఘోరరూపాన్ని ధరించింది. కాని ఫిరంగుల ముందు సంతానులు ఎంతవరకు నిలువగలుగుతారు? అందరూ పృధ్వీతలంపై ఒరిగిపోతున్నారు.
ఇటువైపు జీవానందుడు అవశిష్ట సైన్యాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే థామస్ సహాయకుడైన లెఫ్టినెంట్ వాట్సన్ కొందరు సంతా నులు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారని గమనిం చాడు. దేశీయ సైన్యాన్ని తీసుకుని వారిని వెంట తరిమాడు. థామస్ ఎదురుగా ఉన్న సేన కంటే, నదివైపు పారిపోతున్న సేన ఎక్కువ కనుక, తాను పదాతిదళాన్ని మాత్రం ఉంచుకుని, అశ్వికులను వాట్సన్‌తో పంపాడు. కాని థామస్ కేవలం రెండు వందల మంది కాలి బంట్లు ఇక్కడ భవానందుని సేనను ఎదుర్కొనడానికి సరిపోతారని అంచనా వేయడంలో తప్పుచేశాడు. అతడి దురహంకారం, ఎదుటి బలాన్ని తక్కువగా భావించడం, భవా నందుడికి సహాయం చేసినాయి.
భవానందుడు థామసు బందీగా పట్టుకోగలి గాడు. అతడిని గుర్రానికి కట్టివేసి, జీవానందునికి సహాయం చేయడానికి ఈ దళం కూడా నదివైపు నడిచింది.
అప్పటికి జీవానందుని వెంటనున్న సైన్యం అన్ని ఆశలు అడుగంటిపోయి ఉంది. సరిగ్గా ఆ సమయా నికి భవానందుని నుండి సహాయం అందింది గనుక సంతానులు పుంజుకోగలిగారు. కాని భవానందుడు ఈ పోరాటంలో కన్నుమూశాడు. మరణ సమయంలో ‘వందేమాతరం’ గీతం ఆలపిస్తున్నాడు. థామస్‌తో సహా తెల్లవారందరూ ప్రాణాలు కోల్పోయారు.
రణంలో విజయం పొందిన మీదట సంతానులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వారు ఈ ఉత్సవా లలో పూర్తిగా నిమగ్నులై ఉన్మత్తులై ఉన్నారు. సత్యానందుడు మటుకు భవానందుని కోసం శోకసాగరంలో మునిగి ఉన్నాడు.
అంతవరకు సంతానుల వద్ద రణవాద్యాలు అంటూ ఏమీ లేవు. కాని ఇప్పుడు మటుకు ఎక్కడి నుంచో నగారాలు, డోళ్లు, భేరీవాద్యాలు, మృదం గాలు, సన్నాయిలు ఇటువంటివెన్నో వచ్చినాయి. వాటి ధ్వనికి నదీనదాలు, భూమి, అరణ్యం వణికి పోతున్నాయి. ఈ విధంగా సంతానులు చాలాసేపటి వరకు తమ విజయోత్సాహాన్ని ప్రకటించుకున్నారు.
ఉత్సవ సమారోహంలో సత్యానందస్వామి ఇలా అన్నాడు : ‘‘నేడు భగవంతుడు మనపట్ల సహృదయుడై ఉన్నాడు. సంతానులకు విజయం చేకూరింది. ధర్మానికి జయం లభించింది. అయినా ఇంకొకమాట చెప్పుకోవలసి ఉంది. ఈ ఉత్సవంలో శరీరంతో పాల్గొనటానికి అవకాశం లేనివారినందరినీ, అంటే యుద్ధంలో మరణించినవారినందరినీ, మనం మరచి పోరాదు. భవానందుని వంటి వీరుని కారణంగానే మనం విజయం సాధించగలిగాం. అలా హతులైన వారికందరికీ మనం అంత్యక్రియలు జరపాలి.’’
ఈ మాటలు వింటూనే అందరూ ‘వందే మాతరం’ అనుకుంటూ జయ జయధ్వానాలు చేసుకుంటూ రణక్షేత్రం వైపు మరలారు. భవానందుని మృతదేహానికి చందనచర్చలు చేసి, దానికి అంత్యక్రియలు జరిపారు.
ఈ పనులన్నీ అయేసరికి, అరణ్యంలో సత్యా నందుడు, జీవానందుడు, మహేంద్రుడు, నవీనా నందుడు, ధీరానందుడు మాత్రం మిగిలారు. తతిమ్మా వారందరూ వెళ్లిపోయారు. వీరు అయిదు గురు మాత్రం సమాలోచన కోసం అక్కడ ఉండి పోయారు.
‘‘ఇన్ని రోజులుగా మనం సర్వకర్మలను, సర్వ సుఖాలను ఎందుకు త్యాగం చేశామో, ఆ కార్యం ఇప్పుడు నెరవేరింది. ఆ వ్రతం ఇప్పటికి పూర్తయింది. ఇప్పుడు ఈ ప్రదేశంలో యవన సైన్యం ఏమాత్రం మిగిలిలేరు. ఏ మూలనైనా కొద్దిమంది మిగిలి ఉన్నాగానీ వారు మనముందుకు వచ్చి నిలువలేరు. ఇంక ఏం చేయాలో మీరు ఆలోచించారా?’’ అన్నాడు సత్యానందుడు.
జీవానందుడు ‘‘వెళ్లి రాజధానిలో మన అధికారాన్ని స్థాపించడానికి ప్రయత్నిద్దాం.’’
‘‘నా ఉద్దేశం కూడా అదే!’’ అన్నాడు సత్యానందుడు. ‘‘సేన ఎక్కడుంది?’’ ధీరానందుడు అడిగాడు. ‘‘ఇదే సేన!’’ సత్యానందుడు. ‘‘ఇక్కడ సేన కనిపి స్తోందా మీకు? ఏదీ?’’ అన్నాడు తిరిగి.
‘‘బహుశ విశ్రాంతి తీసుకుంటున్నారేమో! ఢంకా మోగిస్తే తిరిగివస్తారు.’’ ‘‘ఒక్కరూ రారు. అందరూ గ్రామాలను దోచుకోటానికి వెళ్లారు. ఇప్పుడు గ్రామా లన్నీ భద్రత లేకుండా ఉన్నాయి. యవనుల ఇళ్లన్నీ దోచుకునిగాని మనవాళ్లు తిరిగిరారు.’’
(సశేషం)