అనిసెట్టి శత జయంతి
భారతజాతి మూడు దశాబ్దాల పాటు పారతంత్య్ర కంతంత్రాల్లో అలమటించింది. బ్రిటీష్ వారి కుటిల దాస్య శృంఖలాల్లో మగ్గింది. భారతీయులు ఈ స్వాతంత్య్ర రహిత జీవనాన్ని భరించలేకపోయారు. స్వేచ్ఛారహిత జీవనాన్ని అనుభవిస్తున్న భారతీయులకు వీరసావర్కర్ మాటలు స్ఫురించాయి. ‘పక్షిలా బంగారు పంజరంలో బందీలై జీవించడం కన్నా స్వేచ్ఛగా అరణ్యాల్లో జీవించడం మిన్న’’ అనే అభిప్రాయం భారతీయుల్లో రేకెత్తించింది.
‘‘తాను జన్మించిన భూమి మీద తరతరాలుగా సాగివస్తున్న సత్సంప్రదాయాల మీద అవ్యాజమైన అభిమానం ఒక పాలనావ్యవస్థకు అనుగుణంగా మనం సాగించే మానసికస్థితిని జాతీయతగా ‘హోన్స్‌కోవ్’ రచయిత నిర్వచించాడు. హోన్స్‌కోవ్ అభిప్రాయం సమంజసంగా ఉంది.
స్వేచ్ఛా సమత్వ దృక్పథానికి కట్టుబడ్డ అభ్యుదయ రచయితలంతా సమకాలీన బానిసత్వముక్తికి ఉద్యుక్తులయ్యారు. పారతంత్య్ర కుతంత్రాలను కూకటి వేళ్లతో పెకలించాలనుకున్నారు. జాతీయోద్యమాన్ని తమ రచనల ద్వారా ప్రచారం చేసి ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు తమ కలాలను కరవా లాలుగా ఝుళిపించారు. పారతంత్య్ర భేదకంగా, జాతీయోద్యమ స్ఫోరకంగా, స్వాతంత్య్ర సాధకంగా ప్రజలను ప్రేరేపించే ఉద్దేశ్యంతో ఆనాడు కలం పట్టిన ప్రతి కవీ రచనలు చేశాడు. అభ్యుదయ కవి అనిసెట్టి తాను 1941 నుండి 1947 మధ్య కాలంలో రాసిన కవితలన్నింటినీ ‘అగ్నివీణ’ పేరుతో (1949) ప్రచురించాడు. అనిసెట్టి దేశభక్తి తత్పరతతో ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో (1942 ఆగస్ట్ 8వ తేదీ) చురుగ్గా పాల్గొని ‘గుంటూరు’లో అరెస్టయి జైలుకు వెళ్లాడు.
అనిసెట్టి ఖండికల్లో 1. దేశాభిమాన తత్పరత 2. పారతంత్య్ర అధిక్షేపణ 3. బానిసత్వ నిరసన 4. దోపిడి నిరసన 5. స్వాతంత్య్ర దీక్షా కాంక్ష 6. విప్లవ ప్రబోధన వంటి భావాలను విశ్లేషిద్దాం.
దేశాభక్తి తత్పరత
అనిసెట్టికి మాతృ దేశాభిమానం మెండు. అగ్ని వీణంలో ‘మాతృసంగీతం’ ఖండికలన్నీ దేశభక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనాలు.
భరతమాతను ప్రశంసిస్తూ ‘‘పాల పొరుగు నా తల్లీ! అంటాడు. జాతీయోద్యమం తొలిరోజుల్లో 1907వ సంవత్సరం ఏప్రిల్ నెలలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినపుడు ఆయన ఉపన్యాసాలు మూడురోజుల పాటు రాజమండ్రిలో సాగాయి. వాటిని చిలకమర్తి వారు అనువదించారు. చివరి రోజున అప్పటి భారతదేశ స్థితిని ఆశువుగా కళ్లకు కట్టినట్లు ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అనే పద్యాన్ని చెప్పారు. ఆ పద్యం అప్పట్లో తెలుగు ప్రజల నాలుకలపై నాట్యం చేసింది. ఆ పద్యం ప్రభావంతోనే అనిసెట్టి భరతమాతను పాల పొదుగుగా వర్ణించాడు. పాలపొదుగు సంపదకు సంకేతం. మన దేశ సంపదను పరాయి పాలకుడు దోచుకున్నందునే మనకు దుస్థితి సంభవించింది. భరతమాతను ప్రాణ దాతగావర్ణించడం అనిసెట్టి దేశభక్తికి నిదర్శనం.
పరాయి పాలకుల దోపిడీ వల్ల భారతమాత దైన్యస్థితిని వర్ణిస్తూ ‘తాడిత వదనా తల్లీ! పీడిత హృదయా తల్లీ’’! అంటాడు. మానవులను వర్గాలుగా చీల్చే కులమత సంకుచితత్త్వాలను ఈసడించాడు.
పారతంత్య్ర అధిక్షేపణ
పారతంత్య్రంలో కూరుకుపోయిన భారతీయ సోదరులను అధిక్షేపిస్తూ ‘పరుల ఇంటి అరుగుపైన పవళించిన పాంథ• సఖా! ధర విదల్చి చిర బంధన జరామరణ చింతయేలరా!’’ అంటారు. పరాయి పాలకుల చేతుల్లో బందీ అయిన భరతమాత దుస్థితిని ఆలోచించక బాటసారుల్లా పరుల పంచలో పడివున్న భారతీయులను అధిక్షేపించాడు. భరతమాత బంధాలను ఛేదించాలని ప్రబోధించాడు. మూడు శతాబ్దాలుగా దేశం పారతంత్య్రంలో కుమిలి పోతుంది. ‘‘మూడు శతాబ్దాల నుండి / రాజిన నిప్పుల కుంపటి మా దేశం’’- అంటాడు. ఆ దుస్థితిని భరించలేక తన దేహం నిప్పుల కుంపటిగా మారి పారతంత్య్రాన్ని దహించేందుకు చిచ్చర పిడుగులా దూకుతుందన్నాడు.
పారతంత్య్ర వల్ల దేశం వల్లకాడుగా మారింద న్నాడు. పౌరులు అస్థిపంజ రాలుగా మారారని ఆవేదన చెందాడు. ‘‘పాలకులెవరైతేనేం/ప్రళయాగ్నయి పోరుతాం’’- అంటాడు. ఇక్కడ ‘ఎవరైతేనేం’ అనడం వల్ల దేశీయులను పీడించే పాలకులు విదేశీయులైనా, స్వదేశీయులైనా ప్రళయా గ్నుల్లా పోరాడతాం అనడంలో కవి ఉద్దేశ్యంలో దేశ ప్రజలను పీడించే బ్రిటీషు వారి దురాగతాలతో పాటు తెలంగాణ నవాబు దురాగతాలను కూడా ఎదిరిస్తామన్న భావన వ్యక్తమవుతుంది.
స్వాతంత్య్రోద్యమంలో ప్రజలతో మమేకమై పాలు పంచుకుంటానని చెబుతూ…
‘‘మీతోనే ఉంటాను / మీతోనే వస్తాను
అడుగడుగునా మీకు అండగ నిలుస్తాను’’
అని ప్రతిజ్ఞ చేశాడు. స్వాతంత్య్రోద్యమంలో పోరాడే వారితో కలిసి జయభేరిని మ్రోగిస్తానంటాడు. ఆకాశం దద్దరిల్లేట్లు స్వాతంత్య్ర కాంక్షతో నినదిస్తా నంటాడు. కవి ‘నేను’ అనే పదాన్ని ప్రజల మమేకంతో స్వాతంత్య్రోద్యమానికి సంకేతంగా ప్రయోగించాడు. ఆ విషయాన్ని వివరిస్తూ ‘‘నేనెవరా! స్వాతంత్య్రోద్యమాన్ని ముందుకు నడిపే జెండా/ మా నిర్భయ జీవితాన్ని / మ్రోగే స్వేచ్ఛా గీతం’’ అంటాడు. ‘సమర హృదయం నేను’ అని స్వాతంత్య్ర సమరాభి లాషను వ్యక్త పరచాడు. పై పంక్తుల వల్ల అనిసెట్టిలో బలీయంగా ఉన్న పారతంత్య్ర నిరసన, స్వాతంత్ర కాంక్ష అవగతమవుతుంది.
వీరావేశం- విప్లవ ప్రబోధం
అనిసెట్టి పారతంత్య్ర భేదనకు, స్వాతంత్య్ర సాధనకు వీరావేశంతో విప్లవ ప్రబోధం చేశాడు. శత్రువులైన బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు…
‘‘పుడమి నిండ నీ నెత్తురు / పుష్కలంగా చిమ్మరా!
పురాణాస్య పరాభవము / పూర్తిగ కడిగేయదా’’ అంటాడు. భరతమాత దాస్య విముక్తికి రక్తాన్ని చిందించమంటాడు. పురాణాస్య పరాభవాన్ని రక్తంతో కడిగేయమని వీరావేశంతో ప్రబోధించాడు. ప్రజల హక్కులను హరించి బందీలను చేస్తున్న బందిఖానా లను బద్దలు కొట్టమని వీరావేశంతో ‘‘ఉక్కు బందిఖానాలను ముక్కలు చేయాలిరా! / గడియ సేపు కాలమాపి / గత కాలం మార్చరా’’ అంటాడు. ప్రజల దీక్షతో ఉద్యమాన్ని నిర్వహిస్తే కాలగమనాన్ని సైతం నిలుపగలరు. పారతంత్య్ర బాధలతో కూడిన గతకాలపు గమనాన్ని మార్చగలరు. అనిసెట్టి కవిత్వీకరణ వల్ల బ్రిటీషు వారి దోపిడీ విధానం వల్ల భారతమాత ఎంత హృదయ విదారక వేదనకు గురైందో తెలుస్తుంది.
భరతమాత పరాయి పాలకుల చేతుల్లో బాధలను భరించే దుస్థితికి కారణమెవ్వరని నిలదీసి ప్రశ్నిస్తూ..
‘‘అమ్మా! అమ్మా! నీ యెదకుమ్మిన దెవరే తల్లీ!
అమ్మా! అమ్మా! నీ తనువమ్మిన దెవరే తల్లీ’’ అంటాడు. తల్లిపాలు త్రాగి రొమ్ము గ్రుద్దిన ద్రోహులు ఆనాటి భారతదేశపు రాజులు. వారి అంతః కలహాలు మూలంగానే భారతదేశం బ్రిటీష్ వారి హస్తగతమై అవమానాల పాలైంది. భరతమాత శక్తిని వర్ణిస్తూ..
‘‘ప్రళయ శక్తి నా తల్లీ! / విలయ కాళి నా తల్లీ!’’ అంటూ భరతమాత ప్రళయశక్తిగా, విలయకాళిగా విజృంభించి పరాయి పాలకులను సర్వనాశనం చేస్తుందని హెచ్చరిక చేశాడు.
భరతమాతను ఊరడిస్తూ ‘‘తల్లడిల్లకు తల్లీ! నీ తనయులు పగ బూనారు’’ అంటాడు. భరతమాత బిడ్డలైన భారతీయులంతా పరాయి పాలకుల పట్ల పగ బూనారు. వారిని ఉరి ఉచ్చులుగా ముట్టడిస్తారని భరతమాతను ఓదారుస్తాడు. దేశాభిమానంతో ‘‘నలభై కోట్ల ప్రజా / విప్లవ కంఠం నా గీతం / నేనెదిగిన మట్టి నాది / నాదేయని ఘోషిస్తా’’ అంటాడు. భారతీయులందరి విప్లవ కంఠం నా గీతం అనడం అనిసెట్టి మాతృ దేశాభిమానానికి నిదర్శనం. అనిసెట్టి విశ్వజనీన విశాల దృక్పథంతో ‘‘వద్దు నాకు భూమి కోసం / హద్దులు కొలిచే న్యాయం’’ అంటాడు. వసుధైక కుటుంబాన్ని వాంఛించే విశ్వజనీన దృక్పథం అనిసెట్టిది.
బానిసత్వ నిరసన
బానిసత్వ నిర్మూలన అభ్యుదయ కవుల ఆశయం. భారతదేశంలోనే కాదు, ఎక్కడ బానిస లున్నా సుతరామా అంగీకరించమని చాటారు. పారతంత్య్రం వల్ల సంక్రమించిన బానిసత్వాన్ని నిరసిస్తూ ‘‘ఒక్క బానిసున్నా ఈ లోకానికి ముక్తి లేదు / పిడికిలెత్తి జగత్తును / పిండికొట్ట వేమిరా!’’- అంటాడు. బానిసత్వ నిర్మూలన కోసం వీరావేశంతో ప్రజానీకాన్ని ప్రబోధించాడు. ఈ కవితా పంక్తులపై పురిపండా అప్పల స్వామి ‘‘బానిసలారా! పండితు లారా! గొలుసులు త్రెంచుక లేవండి’’- అనే పంక్తుల ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది.
‘కదలి రండోయ్’ అనే ఖండికలో ‘‘బ్రతుకంతా బానిసత్వం / మోయలేరోయ్ మోయలేరోయ్’’ అంటూ ప్రబోధించాడు. తరతరాల దాస్యాన్ని ‘‘చావు బ్రతుకుల మధ్య చెరసాలగా’’ వర్ణించాడు. దేశాభిమానంతో
‘‘మాతృభూమి పిలుస్తోంది / మారు పలుకవేమిరా!
అడుగడుగునా కంఠమెత్తి / ఆకసమూగించరా!
అణువణువునా ఆయువూది / అగ్నిని రగిలించరా’’– అంటాడు. దేశాభిమాన తత్పరతతో పారతంత్య్రాన్ని దహించాలని, ప్రజల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించాడు. ‘‘నేను గూడ, నేను గూడ నడుస్తాను / శాంతి కోసం / జగతి దాస్యముక్తి కోసం / శత్రు సేనతుత్తి నియలు చేసేందుకు / నేను గూడ నడుస్తాను’’ అంటాడు. శాంతికాముకుడైన అనిసెట్టి శాంతి కాముకతకీ, దాస్య విముక్తికీ శత్రుసేనను చీల్చి చెండాడేందుకు నేను గూడ నడుస్తానంటాడు. స్వాతంత్య్ర సేనతో తాదాత్మ్యం చెంది భుజం భుజం రాచుకుంటూ చేయి చేయి కలుపుకుంటూ ముక్తకంఠ నాదంతో నడుస్తానంటాడు.
బానిసత్వ నిర్మూలన కోసం పోరాడే వారికి అండగా నిలుస్తానని అనిసెట్టి ‘‘పరతంత్రతలో పగ్గు బానిసల విముక్తికై కదన భూములకెత్తి / కదిలివెళ్లే మీకు అడుగడుగునా నేనే అండగా నిలుస్తాను’’ అని తన ప్రజా పక్షపాతాన్ని చాటాడు. తరతరాలుగా సాగుతున్న దాస్యం దగ్ధమవుతుందని, శాంతి సహనా లతో కూడిన మన ఆదర్శం అగ్నిగా దహిస్తుందని ఆయన ఆకాంక్ష.
దోపిడీ నిరసన
బ్రిటీషు వారి కుటిల తంత్రాన్ని, విభజించి పాలించే విధానాన్ని దోపిడీతత్త్వాన్ని నిరసిస్తూ అని సెట్టి ‘‘ఆలుమగలను చీల్చు క్రూరుడతడు / భూమినీ పురుషునీ విభజించి పాలించే’’ బ్రిటీషు వారి విభజించి పాలించే దోపిడీ తత్త్వాన్నీ అధిక్షేపించాడు.
స్వాతంత్య్ర దీక్ష కాంక్ష
అనిసెట్టి దేశీయుల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిం చాలన్న దీక్షతో ‘‘నా యుగాన్ని బంధించే సంకెళ్లని ఛేదిస్తానని’’ ప్రతిజ్ఞ చేశాడు. తన గీతం మృత వీరుల సమాధుల్లో మారుమ్రోగుతుందని, జీవస్మృతుల హృదయాలను చీల్చుతుందని చెప్పాడు.తన కవిత్వంలో ఉత్తమ పురుష ఏకవచన ప్రయోగం ‘నేను’ బహువచనానికి సంకేతం. ‘‘నా సంపద కగ్గి పెట్టు / నీచుల బలి గావిస్తా’’- అని ప్రతిజ్ఞ చేశాడు. ఇక్కడ ‘నా’ అన్నది ‘మన’ అనే అర్థంలో ప్రయోగిం చాడు. మన స్వాతంత్య్రాన్ని హరించిన శత్రువుల కోటలను సముద్రాల్లోని బడబాగ్ని దహిస్తే బావుండు నని కసితో అన్నాడు. ‘‘పామరుల శిరస్సులతో / బంతులాడు పాలకులను / ప్రగతి చక్ర ఘట్టనతో / సంహరించవలెనురా’’ అని విప్లవ ప్రబోధం చేశాడు. తొలుత శత్రువుల కోటలను బడబాగ్ని దహిస్తే బావుండు నన్నాడు. తర్వాత వీరత్వాన్ని రెచ్చగొడుతూ
‘‘కోటశత్రు జెండాతో కోరి పిలుస్తుందిరా!
గుండెనిండ పౌరుషాగ్ని మండేవాడెవురా’’! అని ప్రశ్నించాడు. పై పంక్తులపై త్రిపురనేని స్వామి ప్రభావం ఉంది. ప్రజల్లో పౌరుషాగ్ని ప్రజ్వలింపజేసి వీరులతో వీరావేశంతో ‘‘ఒక తన్నుకు కోటగోడ / వ్రక్కలు చెయ్యాలిరా / శిరస్సునెత్తి కోట బురుజు/ ఛిద్రం చెయ్యాలిరా!’’ అని మరో అడుగు ముందుకు వేశాడు. ధైర్యంతో గుండెనొడ్డి శత్రు సింహాసనాన్ని పెకలించమన్నాడు. తుపాకీ గుండ్లతో దేహం తూట్లు పడినా, ధూళియైనా కోటపై జెండా పెకల్చి తెమ్మని వీరావేశంతో విప్లవ ప్రబోధం చేశాడు. స్వాతం త్య్రోద్యమానికి ప్రజలు చేసే త్యాగాలు వృథా కావని స్వాతంత్య్రకాంక్ష సిద్ధిస్తుందని క్రాంత దర్శనత్వంతో ‘మన త్యాగాలు వృథా కావని / ముందు తరాల… మృదుహాసం చేస్తా’యన్న ఆయన ఆకాంక్ష అక్షర సత్యమైంది. అనిసెట్టి భౌతికంగా లేకపోయినా, ఆయన కవితల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు.
– డా।। పి.వి.సుబ్బారావు, 9849177594, విశ్రాంతాచార్యులు