– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్
ఒకటంటే ఒకే నియోజకవర్గం.. వంది మంది ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి సహా అందరు మంత్రులు, పదుల సంఖ్యలో మున్సిపల్, కార్పొరేషన్‌ల చైర్మన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వందల సంఖ్యలో సర్పంచ్‌లు, వేల సంఖ్యలో గులాబీ పార్టీ క్యాడర్.. ఒకరకంగా వీరంతా మునుగోడుపై దండెత్తారు. నియోజకవర్గం మొత్తాన్నీ ఆవరించేశారు. వాడకో కౌన్సిలర్, సర్పంచ్; వార్డుకో చైర్మన్, ఊరికో ఎమ్మెల్యే, మండలానికో మంత్రి.. ఇలా ఒకరకంగా ఎవరికి వారు రాసేసుకున్నారు. ముఖ్యమంత్రి కూడా ఏమీ తక్కువ తిరగలేదు. ఒక్క ఉపఎన్నిక కోసం పలు దఫాలుగా బహిరంగ సభలు నిర్వహించారు. చివరకు ఆ ఎన్నికలో అధికార పార్టీ పరువు నిలబెట్టుకున్నామని గర్వంగా ప్రకటించుకున్నారు.
అధికారులు మినహా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భూమిక పోషించాల్సిన ప్రజాప్రతినిధులందరూ మునుగోడు బాట పట్టారు. సొంత నియోజక వర్గాలను గాలికి వదిలేసి.. ఆ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసమే ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడే మకాం వేశారు. దాదాపు నెలరోజుల పాటు ఉన్న ఊరినీ, నియోజకవర్గ ప్రజలనీ వదిలేశారు. అన్నిటికన్నా సీఎం కేసీఆర్ ఆదేశాలే తమకు ముఖ్యమని నిరూపించుకున్నారు. కానీ, సాధారణ ఎన్నికల్లో ఇలాంటి అవకాశం ఉండదన్న ఆలోచనను మరిచిపోయారని ఎమ్మెల్యేలు, మంత్రుల తీరును చూస్తే అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు.
వాస్తవానికి గతేడాది జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికనే అత్యంత ఖరీదైనదిగా విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, మునుగోడులో ‘అంతకు మించి’ అన్నట్లుగా సాగింది. ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చయినట్లు లెక్కలు కట్టారు. మరోవైపు కోట్ల రూపాయలు పోలీసులకు పట్టు బడ్డాయి. హైదరాబాద్‌లోనూ కోట్లాది రూపాయల హవాలా డబ్బు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ మునుగోడు ఉపఎన్నిక కోసమే తరలించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు కూడా.
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక అత్యంత ఆసక్తిని రేపింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి తన పదవికి రాజీ నామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్య మైంది. అన్ని పార్టీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ మారినా తన స్థానాన్ని కాపాడు కోవడం పెద్ద కష్టమేమీ కాదనుకున్న రాజగోపాల్ తీరు బెడిసికొట్టింది. అధికార టీఆర్‌ఎస్ అయితే, ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి అవకాశాన్ని చేజార్చుకోకుండా వ్యవహ రించింది. హుజురాబాద్ ఉపఎన్నికలో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు దిమ్మదిరిగిపోయేలా తీర్పు ఇవ్వడంతో దానికి బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో ముందుకెళ్లింది. సామ, దాన, భేద, దండోపాయాల న్నింటినీ ప్రయోగించి మునుగోడు గడ్డపై గులాబీ జెండాను ఎగరవేసింది. అయితే ఇందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పెద్ద కసరత్తే చేశారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. బీజేపీని ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నంచేస్తూ వచ్చారు. సహజంగానే అధికార పార్టీ కావడంతో ఏం చేసినా, ఏ అవసరం వచ్చినా ఎదురే లేకుండా పోయింది. అలా టీఆర్‌ఎస్ తన ‘పరువు’ను నిలబెట్టుకుంది.
రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగానే శాసన సభాపతి క్షణాల్లోనే ఆమోదించే శారు. ఆయన రాజీనామా చేయడానికి ముందే టీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. నేతలందర్నీ అప్రమత్తం చేసింది. మంత్రి జగదీశ్‌రెడ్డిని రంగంలోకి దింపింది. కల్యాణలక్ష్మితో పాటు ఇతర పథకాల చెక్కుల పంపిణీలోనూ వేగం పెంచింది. సంక్షేమ పథకాల అమలు, దళితబంధు, గిరిజనబంధు వంటి పథకా లపై చర్చ జరిగేలా చేసింది. కేసీఆర్.. ఎప్పటికప్పుడూ నేతల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. నల్గొండ జిల్లా నేతలతోనూ భేటీ అయ్యారు. పలు అంశాలపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. ఇక అభ్యర్థి ప్రకటన విషయంలోనూ టీఆర్‌ఎస్ సుదీర్ఘ కసరత్తే చేసింది. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వం పట్ల మొదట్లో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు కనిపించింది. చాలా మండలా ల్లోని నాయకులు ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే పలువురు అభ్యర్థుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ సర్వేల ఆధారంగా కూసుకుంట్లకే టికెట్ ఖరారైంది. తర్వాత అసంతృప్తులను దారిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది అధిష్టానం. ప్రగతి భవన్ వేదికగా బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగింది.
కేవలం ఒక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికే అయినా, కేసీఆర్ పదుల సంఖ్యలో హామీలు గుప్పించి, పథకాల రూపంలో ప్రభుత్వ డబ్బులు పంచి ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారన్న వాదన లున్నాయి. దశాబ్దాలుగా అమలుకాని హామీలను నెరవేర్చడం నుంచి రిజర్వేషన్లు పెంపు, పథకాలకు నిధుల విడుదల లాంటివి ఎన్నో చేశారు. ఒకరకంగా కేసీఆర్ ప్రభుత్వ సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఉపఎన్నిక వస్తుందని తెలిసిన వెంటనే నియోజక వర్గానికి భారీగా నిధులు విడుదలయ్యాయి. రోడ్లకు, అభివృద్ధి పథకాలకు ఎనిమిదేళ్లుగా అందని నిధులు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి. వృద్ధులకు కొత్త పింఛన్ల మంజూరు, చేనేత, గీత కార్మికులకు బీమా ఇవ్వడం వంటివి చేశారు.
సామాజిక వర్గాల వారీగా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పలు పథకాలను ప్రారంభించారు. ఎస్టీలు పెద్దఎత్తున ప్రభావం చూపే స్థితిలో ఉండ టంతో వారికి రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యాదవ ఓటర్ల ప్రసన్నత కోసం ఏడు వేల మందికి గొర్రెల పంపిణీని కూడా చేపట్టారు. దీంతో పాటు పలు కులసంఘాలకు ప్రభుత్వం తరఫున హామీలు గుప్పించడం, కులభవనాలకు నిధులు ఇవ్వడం వంటివి చేశారు. కుల సంఘాలను ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్య మంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ వీలైనచోట్లల్లా ఆయా సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, వంద గజాల స్థలాలను ఉచిత రిజిస్ట్రేషన్ చేయడం వంటివి చేశారు. అంతేకాదు, ఉన్నఫళంగా గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. తమ ఊరును మండలంగా చేయాలని టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గట్టుప్పల్ ప్రజలు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ ప్రజల కోరిక నెరవేర్చారు. దుబ్బాక ఉపఎన్నికలో ప్రచారం చేయని కేసీఆర్ మునుగోడుకు మాత్రం రెండుసార్లు వచ్చి, బహిరంగ సభలో పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి తమతోనే సాధ్యమని, గెలిపిస్తే.. చండూరుకు రెవెన్యూ డివిజన్ హోదా కల్పిస్తామని, శివన్నగూడెం, కిష్టారాయంపల్లి రిజర్వాయర్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు గులాబీ బాస్.
కామ్రేడ్ల మద్దతుతోనే..
మరోవైపు వామపక్షాలతో స్నేహం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రెండు (2014, 2018) ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేసిన టీఆర్‌ఎస్ ఈ ఉపఎన్నికలో మాత్రం వామపక్షాల సాయం కోరింది. ఆయా పార్టీల నాయకులను ప్రగతిభవన్‌కు పిలిచి మాట్లాడారు. ఇరువురి మధ్య ఒప్పందం కుదిరి, కలసి పోరాడారు. సుమారు 10 వేల ఓట్లు తమ వల్లే టీఆర్‌ఎస్‌కు పడ్డాయని వామపక్షాల నాయకులు చెబుతున్నారు. చండూరులో కేసీఆర్ బహిరంగ సభ తర్వాత వామపక్ష నాయకులను స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు పట్టించుకోలేదు. దీంతో ‘కామ్రేడ్స్’ ప్రచారానికి దూరంగా ఉన్నారు. చివరికి కేసీఆర్ జోక్యం చేసుకోవడంతో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. సీపీఐ, సీపీఎంలు సీరియస్‌గా ప్రచారం చేశాయి. ఫలితంగా టీఆర్‌ఎస్ గెలుపులో కామ్రేడ్ల ఓట్లు కూడా అత్యంత కీలకమయ్యాయి. పోల్ మేనేజ్‌మెంట్ విషయంలోనూ టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇందులో భాగంగా ప్రతి ఓటర్‌ను కలిసే ప్రయత్నం చేసింది. ప్రతి గడపకు వెళ్లటం కూడా కలిసివచ్చిందనే చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు స్థానిక నేతలను అప్రమత్తం చేస్తూ వచ్చారు.
ఫలించిన ‘దత్తత’ హామీ
ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే నియోజక వర్గాన్ని దత్తత తీసుకుంటానన్న మంత్రి కేటీఆర్ హామీ బాగా పని చేసింది. వెనుకబడిన తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఓటర్లు ఆలోచించినట్లు కూడా అర్థమవుతోంది. ఈ నినాదాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమైంది. కేవలం ఉపఎన్నిక కోసమే దత్తత తీసుకుంటే రాష్ట్రమంతా అవసరం లేదా? అనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ అభ్యర్థితో పాటు, ఆ పార్టీ నేతలు కూడా విఫల మయ్యారు.
మరోవైపు ఓటర్లకు విందు భోజనాలు, విహార యాత్రలతో టీఆర్‌ఎస్ గాలం వేసింది. కుల సంఘాల సమ్మేళనాలు దానికి బలం చేకూర్చాయి. మును గోడులో అత్యధికంగా ఉండేది బీసీ ఓటర్లు. గౌడ్, ముదిరాజ్, పద్మశాలి, యాదవ సామాజిక వర్గాల వారి ఓట్లు ఎక్కువగా ఉండడంతో సమ్మేళ నాలను నిర్వహించి ఆయా సంఘాలకు హామీలు ఇచ్చింది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ రాజీనామాతో టీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలినా డీలా పడలేదు. అధినాయకత్వం వెంటనే అప్రమత్తమై బీజేపీ నేతలపై గురి పెట్టింది. బీసీ సామాజిక వర్గాలకు చెందిన స్వామిగౌడ్, బిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, రాపోల్ ఆనంద భాస్కర్ వంటి నేతలను రాత్రికి రాత్రే పార్టీలో చేర్చుకుంది.
గత ఎన్నికల్లో కొన్ని గుర్తులు టీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం చేశాయి. ఉదాహరణకు రోటీ మేకర్, రోడ్డు రోలర్ గుర్తులు ఆ పార్టీ ఓట్లను చీల్చాయి. ఈ గుర్తులకు భారీగా ఓట్లు నమోదయ్యాయి. దీంతో, మునుగోడులో ఇలా జరగకూడదని భావించిన టీఆర్‌ఎస్ నేతలు మొదట్నుంచే అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా డమ్మీ ఈవీఎంలతో ప్రచారం కూడా చేశారు. ఏ మీటా నొక్కాలి, పార్టీ గుర్తు ఏంటనే విషయాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఇదంతా పార్టీకి కలిసొచ్చింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన మూడు ఉపఎన్నికల లోనూ అధికార పార్టీనే విజయం సాధించినట్లయింది.