తెలుగు సినిమా స్వర్ణయుగంలో అనేక మంది కథానాయకులు, నాయికలు, గుణచిత్ర నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఉన్నా ప్రధానంగా మహానటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత వారి అడుగు జాడలలో నడిచిన కృష్ణ, శోభన్ బాబులను కలిపి నాలుగు స్తంభాలుగా భావించే వారు. వారిలో ఒకరైన కృష్ణ మరణంతో ఆ నాలుగో స్తంభమూ కూలిపోయినట్టు అయ్యింది. ఎన్టీయార్ అంత అందగాడు కాదు, నాగేశ్వర రావుకు ఉన్నంత నటనాను భవం లేదు అయినా వారిద్దరితో సమవుజ్జీగా కృష్ణ రాణించడానికి ఆయనలోని కృషి, పట్టుదల, తెగింపు కారణం. అదే కృష్ణను తెలుగులో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా నిలబెట్టాయి.
తండ్రి ఘట్టమనేని రాఘవయ్య చౌదరికి చిత్ర సీమలో ఉన్న కొద్దిపాటి పరిచయంతో యుక్తవయసు లోనే కృష్ణ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిం చారు. చక్రపాణి, ఎన్టీయార్ లాంటి పెద్దలు ‘చిన్న వాడివి… తొందర వద్దు… ముందు చదువు పూర్తి చేయి’ అని హితవు పలకడంతో డిగ్రీ పూర్తి చేసి వచ్చారు కృష్ణ. ఈ మధ్యలో ‘కులగోత్రాలు’, ‘పదండి ముందుకు’ చిత్రాలలో చిన్న పాత్రల్లో కనిపించారు. ఎప్పుడైతే ఆదుర్తి సుబ్బారావు ‘తేనె మనసులు’ చిత్రం కోసం కృష్ణను హీరోగా ఎంపిక చేసి, శిక్షణ ప్రారంభించారో ఆ క్షణం నుండి ఆయన జాతకం మారిపోయింది. తొలి చిత్రమే శతదినోత్సవం చేసుకుంది. నటుడిగా గొప్ప పేరు రాకున్నా ఎర్రగా చలాకీగా బాగున్నాడని గుర్తింపు వచ్చింది. ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోనే వెంటనే ‘కన్నె మనసులు’ సినిమాలో నటించారు కృష్ణ. అదేమంత గొప్పగా ఆడలేదు. అయితే మూడో చిత్రం ‘గూఢచారి 116’తో కృష్ణ రాత్రికి రాత్రి మాస్ హీరో అయిపోయారు. ఎన్టీయార్, ఏయన్నార్ అప్పటి వరకూ స్పృశించని కథను ఎంచుకోవడమే అందుకు కారణం. ఇక అప్పటి నుండి వెనుదిరిగి చూసుకున్నది లేదు.
‘తేనె మనసులు’ చూసి ఆంధ్రా దేవానంద్ అన్న ప్రేక్షకులే, ‘గూఢచారి 116’ చూసి కృష్ణ ఆంధ్రా జేమ్స్‌బాండ్ అంటూ కీర్తించడం మొదలెట్టారు. కృష్ణ నటించిన ‘తేనె మనసులు’ తొలి సాంఘిక వర్ణ చిత్రం కాగా, ‘గూఢచారి 116’ తెలుగులో వచ్చిన తొలి అపరాధ పరిశోధక చిత్రం. ఆ తర్వాత తొలి కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’, తొలి ఓ.ఆర్.డబ్ల్యు రంగుల చిత్రం ‘గూడుపుఠాణీ’, తొలి ఫ్యూజీ రంగుల చిత్రం ‘భలే దొంగలు’, తొలి ఆర్.ఓ. కలర్ మూవీ ‘కొల్లేటి కాపురం’, తొలి సినిమా స్కోప్ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’, తొలి సాంఘిక సినిమా స్కోప్ చిత్రం ‘దేవదాసు’, తొలి సినిమా స్కోప్ టెక్నోవిజన్ చిత్రం ‘దొంగల దోపిడి’, తొలి సినిమా స్కోప్ అపరాధ పరిశోధన చిత్రం ‘ఏజెంట్ గోపి’, తొలి తెలుగు 70 ఎం. ఎం. చిత్రం ‘సింహాసనం’కు ఆయనే ఆధ్యుడ య్యారు. ఆ రకంగా వైవిధ్యమైన కథావస్తువులను ఎంపిక చేసుకోవడంలోనే కాదు సాంకేతికంగానూ తెలుగు సినిమాలను జాతీయ స్థాయిలో నిలబెట్ట డానికి కృష్ణ తన వంతు కృషి చేశారు.
సొంత చిత్రాలతో బలమైన పునాది
నటుడిగా ఎన్టీయార్‌ను అభిమానించిన కృష్ణ, నాగేశ్వరరావుకు ఉన్న అభిమానగణాన్ని చూసి స్ఫూర్తి పొంది సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అందుకే తన సినీ ప్రయాణంలో వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగారు. ఎన్టీయార్ సొంత నిర్మాణ ఎన్‌ఏటీ ద్వారా సినిమాలు నిర్మించడం గమనించి, తానూ పద్మాలయా మూవీస్ ద్వారా ‘అగ్ని పరీక్ష’తో నిర్మాతగా మారారు. ఎన్టీయార్ మాదిరిగానే తన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరి రావులను చెన్నయ్‌కు పిలిపించి, సొంత సినిమాల నిర్మాణ బాధ్యతలను వారికి అప్పగించారు. ఆ రకంగా భారీ ప్రయోగాత్మక చిత్రాలకు తెర తీసి నటుడిగా, నిర్మా తగా ఘన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
తొలి చిత్రం ‘అగ్ని పరీక్ష’ పరాజయం పాలైనా, ఆ తర్వాత వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, కురుక్షేత్రం, ఈనాడు, ప్రజారాజ్యం, సింహాసనం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో శివాజీ గణేశన్, రజనీ కాంత్‌తో, కన్నడలో శ్రీనాథ్‌తో సినిమాలు తీశారు. బెంగాలీలోనూ ‘మనసంతా నువ్వే, సత్యం’ చిత్రాలను రీమేక్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా హిందీలో కృష్ణ నిర్మించిన సినిమాలు మరో ఎత్తు. 1980లో ‘టక్కర్’ (దేవుడు చేసిన మనుషులు) రీమేక్‌తో మొద లైన ఉత్తరాది సినీ ప్రస్థానం 2004 వరకూ అప్రతి హతంగా సాగింది. పాతికేళ్లలో ఆయన 16 హిందీ చిత్రాలను నిర్మించారు. పద్మాలయా సంస్థ నిర్మించిన హిందీ చిత్రాలన్నీ రీమేక్స్ అయినా అక్కడా ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా ‘టక్కర్, మేరీ ఆవాజ్ సునో, హిమ్మత్ వాలా, మవాలి, ఖైదీ, జస్టిస్ చౌదరి, కామ్ యాబ్, హోషియార్, పాతాళ్ భైరవి, సింఘాసన్, ముజ్రీమ్, సూర్యవంశ్’ మంచి పేరు తెచ్చిపెట్టాయి. అత్యధిక చిత్రాలలో జితేంద్ర హీరోగా నటించారు. ఇక ‘సూర్యవంశ్’ను అమితాబ్‌తో నిర్మించి, తెలుగు దర్శకుడు ఇవీవీ సత్యనారాయణను ఉత్తరాదికి పరిచయం చేసింది కృష్ణనే!
మల్టీస్టారర్స్‌కు మారుపేరు!
హిందీలో వచ్చినన్ని మల్టీస్టారర్ చిత్రాలు తెలుగులో రావనే అపప్రథ ఒకటి ఉంది. నిజానికి గతంలో తెలుగులోనూ అలాంటి సినిమాలు వచ్చేవి. పాత్ర నిడివితో సంబంధం లేకుండా తోటి హీరోలు, దర్శకుల మీద గౌరవంతో కృష్ణ ఎన్నో మల్టీస్టారర్స్‌లో నటించారు. ఆయన చిత్రాలలోనూ ఎన్టీయార్, ఏయన్నార్ వంటి వారు నటించారు. కృష్ణ తన కెరీర్‌లో మొత్తం 32 మల్టీస్టారర్ మూవీస్ చేశారు. అందులో ఎన్టీయార్‌తో ఆరు సినిమాలలో నటించారు. అత్యధి కంగా శోభన్ బాబుతో 15 సినిమాలలో నటించారు. వీరిద్దరినీ ముద్దుగా కృష్ణార్జునులని పిలుచుకునేవారు. అదే పేరుతో వీళ్లు ఓ సినిమాలో నటించడం విశేషం. అలానే అక్కినేని – కృష్ణ కాంబోలో వచ్చిన ‘ఊరంతా సంక్రాంతి, హేమాహేమిలు, గురుశిష్యులు’ మంచి విజయం సాధించాయి. రజనీకాంత్, శివాజీ గణేశన్, కృష్ణంరాజుతోనూ కృష్ణ మల్టీస్టారర్ మూవీస్ చేశారు.
రంగంలోకి నటవారసులు
ఒకసారి చిత్రసీమలోకి అడుగుపెట్టిన తర్వాత కృష్ణ మరో రంగం గురించి ఆలోచించలేదు. 19 సంవత్సరాల వయసులో పెళ్లైంది. పెద్ద కొడుకు రమేశ్ బాబు పుట్టాడు. ఆ తర్వాతనే సినిమాల్లోకి వచ్చారు. కొద్ది సంవత్సరాలకే తన ఐదో చిత్రం ‘సాక్షి’ కథానాయిక విజయ నిర్మలను ప్రేమించి, తిరుపతిలో పెళ్లాడారు. ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా మార డానికి చేయూత నిచ్చారు. వీరిద్దరి ఆలోచనలను బలపరిచే హనుమంతరావు, ఆదిశేషగిరిరావు సహా యంతో వ్యక్తి నుండి వ్యవస్థగా మారారు కృష్ణ. సొంత చిత్రాల నిర్మాణంతో పాటు హైదరాబాద్‌లో పద్మా లయా స్టూడియోస్‌ను నెలకొల్పారు. తన కొడుకులు, కూతుళ్లను సైతం బాల నటీనటులుగా చిత్రసీమకు పరిచయం చేశారు. పెద్దమ్మాయి పద్మావతితో పాటు, మంజుల, ప్రియదర్శిని; కుమారులు రమేశ్, మహేశ్ బాలనటులుగా చేశారు. మహేశ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. రమేశ్ హీరోగా పలు చిత్రాలలో నటించినా, పెద్దగా రాణించక, ఆ తర్వాత నిర్మాతగా మారిపోయాడు. మంజుల యుక్త వయసు వచ్చాక సినిమాలలో కథా నాయికగా నటించాలని అనుకున్నా, కృష్ణ అభిమానులు నిరసన వ్యక్తం చేయడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపో యింది. ఇప్పుడు అడపాదడపా పాత్రలు చేస్తూ, నిర్మాతగా, దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించు కుంటోంది. పద్మావతి, గల్లా జయదేవ్ దంపతుల కుమారుడు అశోక్ ‘హీరో’ మూవీతో హీరోగా ఇటీ వలే ఎంట్రీ ఇచ్చాడు. మంజుల భర్త, కృష్ణ అల్లుడు సంజయ్ స్వరూప్ నటుడిగా రాణిస్తుంటే, ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కృష్ణ నట వారసుడిగా మహేశ్ బాబు ఇప్పటికే సూపర్ స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అతని కొడుకు గౌతమ్, కూతురు సితార సైతం సినిమాల్లో మెరుపులా మెరుస్తున్నారు. ఇటీవలే కన్నుమూసిన రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ ‘నిజం’ సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రమ్ చేశాడు. ప్రస్తుతం విదేశాలలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఆ రకంగా నటశేఖర కృష్ణ నట వారసులు చాలామందే రాబోయే రోజుల్లో తెలుగు వారిని అలరించే ప్రయత్నంలో ఉన్నారు.
రాజకీయ వైకుంఠపాళి!
రామారావు అభిమాని అయిన కృష్ణ సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి కాస్తంత ఆలస్యంగా అడుగు పెట్టారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అభిమాని అయిన కృష్ణ, రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరిం చారు. అయితే రాజీవ్ గాంధీతో ఏర్పడిన అనుబం ధంతో, జమున ప్రోత్సాహంతో 1989లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీచేసి, ఎంపీగా గెలుపొందారు. అనంతరం వచ్చిన మధ్యం తర ఎన్నికల్లో అదే నియోజవర్గం నుండి ఓడిపో యారు. ఎన్టీయార్‌కు, తెలుగు దేశం పార్టీకి వ్యతి రేకంగా పలు పట్టణాలలో కృష్ణ ప్రచారం చేసినప్పుడు రాళ్లదాడులూ జరిగాయి. కానీ మడమ తిప్పలేదు. అలానే ఎన్టీ యార్‌కు వ్యతిరేకంగా పలు రాజకీయ విమర్శనాత్మక చిత్రాలను నిర్మించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు. చిత్రం ఏమంటే, కృష్ణ భార్య విజయ నిర్మల ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. విజయ నిర్మల తనయుడు నరేశ్ భారతీయ జనతా పార్టీలో కీలక బాధ్యతలను నిర్వర్తించినా, గత కొంతకాలంగా కృష్ణ, ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు వైఎస్‌ఆర్ సీపీతో చెలిమి చేస్తున్నారు. ఇక కృష్ణ పెద్దల్లుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు.
చిత్రసీమలకు కృష్ణ చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయన మరణవార్త తెలియగానే పార్టీ లకు అతీతంగా అందరూ తీవ్ర సంతాపాన్ని తెలి పారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు నేతలు స్పందించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్య మంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు నటుడిగా కోట్లాది మంది తెలుగు సినీ అభిమానులను అలరించిన కృష్ణ అంత్యక్రియలు నవంబర్ 16వ తేదీ హైదరాబాద్ మహాప్రస్థానంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా రూపంలో నటశేఖర్ కృష్ణ అమరజీవి.
– వడ్డి ఓంప్రకాశ్ నారాయణ, సీనియర్ జర్నలిస్ట్