– మీనాక్షీ శ్రీనివాస్‌

‌తన పితృదేవతలైన సాగరులకు కపిల మహాపాతకం నుంచి విముక్తి కలిగించి తరింప చేయడానికి వేల సంవత్సరాలు ఘోరతపస్సు చేసి గంగను మెప్పించిన భగీరథుని కోరిక మేరకు అతని వెంట భూమికి రావడానికి అంగీకరించింది .అయితే తన ప్రచండవేగాన్ని తట్టుకోలేక భూమ్మీద ఉన్న అనంత ప్రాణికోటి తల్లడిల్లిపోతుం•ని, తనవేగాన్ని నిలువరించగల శక్తి కేవలం గరళకంఠుడైన ఒక్క ఆ మహాశివునికి మాత్రమే ఉన్నదని, ఆయన జటా జూటంలో తనను బంధిస్తే, ఒక పాయగా వెంట రాగలనన్న గంగాభవాని మాటలకు భగీరథుడు మళ్లీ తపస్సు చేసి శివుని మెప్పించి, ఒప్పించి గంగను ఆయన శిరస్సుపై అవతరింపజేశాడు. ఆపై ఆయన కరుణతో గంగను తనవెంట భువికి వచ్చేలా చేశాడన్నది పురాణోక్తి.

ఏ కారణంగా, ఎవరివల్ల వచ్చినా, తనను ప్రాథేయపడిన భగీరథుని వెంట కదిలివచ్చింది గంగ. తనవాసం వదిలి, అయినవారిని కాదని తన కరుణా కటాక్షాల కోసం పిచ్చివాడిలా ఒంటికాలి మీద చేసిన తపసు నచ్చి ఉత్తుంగతరగంలా ఉరుకుల పరుగులతో అతనివెంట నడిచింది.

అరువదివేల సాగరులు తరించేరు, పుణ్యలోకాలు చేరారు. భగీరథుడు తన సంకల్పం సిద్ధించిందన్న ఆనందంతో నిట్టూర్చాడు. ఎటూ భూమికి వచ్చిన గంగను, జనాలను కూడా కరుణించి తరింపజేయమని కోరాడు.

 స్వేచ్ఛగా పరవళ్లు తొక్కే అమాయకురాలిని నమ్మించి తెచ్చి జనారణ్యంలో పడేసాడు. ‘అక్కడితో నాపనైపోయింది నీదారి నువ్వు చూసుకో..’ అన్నట్లు తన అక్కర తీరిందన్న ఆనందంతో తప్పుకున్నాడు. కల్లాకపటం తెలియని గంగకు భగీరథ ఉద్దేశం తెలియదు. నమ్మి వెంట వచ్చింది. ఎక్కడో కొండల్లో, అడవుల్లో స్వేచ్చగా ఉండే తనను వెలుగులోకి తెచ్చాడు అనుకుంది. ధరణితో చెలిమి చేసి, సిరులనిచ్చింది. తన చుట్టూ ఉండేవారికో బ్రతుకునిచ్చింది. తను జీవధారగా మారి ఎందరివో బతుకులను సస్యశ్యామలం చేసింది. చెరువుల్లో, దొరువుల్లో, సెలయేటిపాయల్లో.. బావుల్లో.. అంతటా తానై ఆనందలాస్యం చేసింది.

‘‘గంగా! నిన్ను తేవడంలో నా వ్యక్తిగత ప్రయోజనమే ఉన్నా, నీ వలన జనావళికి జరిగే మేలు అనంతం. కాబట్టి మంచి దానివిగా, మానవజాతిని కన్నతల్లిలా ప్రేమగా సేదదీర్చమ్మా’’ అన్న భగీరథ మాటలకి తలొగ్గింది.

‘‘చూడర్రా పిల్లలూ, గంగ చాలా మంచిది, మనందరి కోసం ఎంతో చేస్తోంది.. జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ అంపకం పెట్టి వెళ్లిపోయాడు.

గంగ ఏడ్చింది.. అయినా మనసు సముదాయించుకుని కలివిడిగా తిరిగింది. తన శక్తియుక్తులన్నీ ధారపోసింది.

ఒకప్పుడు దేవతలా చూసుకున్న తరం వెళ్లిపోయింది, గంగను, ఆమె ఔనత్యాన్ని గుర్తించని తరం, ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసింది. అక్కడక్కడ చెరువుగా, దొరువుగా, సెలయేరుగా, బావిగా తనున్ననాళ్ళూ తనను అంతా ముద్దుగా, మురిపెంగా చూసుకున్నారు. బిందెలతో, కావిళ్లతో యోజనాల దూరం నెత్తిన పెట్టితెచ్చుకున్నారు.

కాలంతో బాటు వచ్చిన మార్పులతో తను అందరికీ అందుబాటులోకి రాగానే అలుసయ్యింది. తనను రాచి రంపానపెట్టడం మొదలైంది. ఏనాడూ తనని గుర్తించకపోయినా, తన సేవలను లక్ష్యపెట్టకపోయినా పట్టించుకోని గంగ జనం తనను ‘నమ్ముకోడం మానేసి అమ్ముకోవడం’ మొదలు పెట్టాకా మొదటిసారి కన్నీరు కార్చింది.

‘రూపాయి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చెప్పే పెద్దలు తమ పిల్లలకు తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్పరెందుకు! అందుబాటులో ఉందని, అందకుండా పోదనీ ధీమానా! లేక అలుసా!’

‘తోడుకున్నప్పుడు ఇంటిల్లిపాదికీ గాబు నీళ్లు సరిపోతే, ఇప్పుడు రోజంతా కుళాయిలు తిప్పి,విప్పి ఉంచడమేగా, నిజమే! కష్టపడకుండా వచ్చే దేనికీ విలువ ఉండదు.’

‘తనంటే ప్రాణమిచ్చే, తను ప్రాణంగా చూసుకునే ధరణిని తనకు దూరం చేస్తున్నారు. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలక పోసుకున్న చందంగా తయారవుతున్న ఈ జనాల మధ్య, తనంటే కనీస విలువ, గౌరవం లేని వాళ్ల మధ్య తనింక మనలేదు.’

గంగ క్రమేపీ క్షీణించడం మొదలైంది. అయ్యో! అన్నవారూ లేరు, పట్టించుకున్న వారూ లేరు. చిక్కిశల్యమైపోయింది. తనను ఆప్యాయంగా పలకరించే ధరణీ, చెట్లూ, చేమలూ, మేఘాలూ, మబ్బులూ కూడా ముఖం చాటేసాయి. తన ఉనికి క్రమంగా కోల్పోతోంది.

అప్పుడు ఒక్కసారిగా తనను ఈ స్థితికి తెచ్చిన భగీరధుని మీద కోపం ఉప్పెనలా వచ్చింది.

యోజనాల దూరం తనను కావిళ్లతో, కడవలతో మోసుకొచ్చినన్నాళ్లు తనని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకున్నారు. చుక్కనీరు చిందితే విలవిలలాడిన వాళ్లే ఇప్పుడు ఆకాశ గంగను అంతం చేసేసారు, పాతాళగంగను పీల్చి పిప్పి చేసేసారు. క్రమేపీ నీళ్లను ప్రియం చేసే శారు. ఏంచేస్తే వీళ్లకు తన విలువ తెలిస్తొస్తుంది! బాధ్యతారాహిత్యంతో భావితరాలకు చేజేతులా కష్టాలు కొనితెస్తున్నారే!

గంగ తన దివ్యదృష్టితో భవిష్యత్తుని చూస్తోంది. అది రెండువేల నలభయ్యోవ సంవత్సరం. ప్రజల దగ్గర ఇబ్బడి ముబ్బడిగా సిరి సంపదలున్నాయి. కానీ గొంతు తడుపుకోడానికి చుక్క నీరు దొరకడం దుర్లభమైపోతోంది. ప్రభుత్వాలు ఒకప్పుడు నిత్యావసర వస్తువులు రేషన్‌ ఇచ్చినట్లు ఇప్పుడు ఇంటికి నెలకు పది లీటర్ల నీరు ఇస్తున్నాయి. స్నానపానాలు మర్చిపోయి అప్పుడే కొన్ని ఏళ్లయింది. కట్టుకునే బట్టలూ, వస్తువులూ అన్నీ వాడేసి పడేసేవే.. కడుక్కోవడం, ఉతుక్కోవడం ‘చరిత్రగా’ మిగిలిపోయాయి.

రెండువేల యాభై, ఒకప్పుడు డబ్బూ, బంగారం దొంగతనాలు జరిగేవని విన్నాం. ఇప్పుడు తిండీ, నీరూ.. వీటి కోసమే దొంగతనాలు, దోపిడీలు. ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు అతిముఖ్యమైన వాణిజ్య సంబంధం ప్రాణాధారమైన నీరే. అప్పుడప్పుడు దేశాల మధ్య యుద్ధాలు కూడా. మూడో ప్రపంచ యుద్ధానికి కారణభూతం, దోషి నిస్సందేహంగా తనే కాబోతోంది.

‘తనను ఏంచేద్దామని తెచ్చి ఈ జనారణ్యంలో వదిలేసి కనికరం లేకుండా వెళ్లిపోయాడు? అయినా తను అందుకు చింతించలేదు, అతనిని నిందించలేదు. కానీ ‘నానాటికి తీసికట్టు నాగంభొట్టూ‘ అన్నట్టు తయారైన తన చుట్టూ ఉన్నవాళ్లని చూసి జాలిపడాలో, బాధపడాలో! రేపటి వారి దుస్థితికి కారణం తనా? లేక వారి స్వయంకృతమా?అన్నది అర్థంకాక కుమిలిపోతోంది. భోరున ఏడవాలని ఉంది కానీ ఏదీ! కనీసం కంటచుక్క నీరు కూడా రానంత పాషాణమైపోయింది గంగ.

సకల చరాచర జగత్తునూ సృష్టించిన దేవుడు, మనిషికి కావలసిన వనరులన్నీ ప్రకృతి రూపంలో ప్రసాదించాడు. కానీ మితిమీరిన స్వార్థం, నిర్లక్ష్యం, ముందుచూపు లేనితనంతో మనిషి తన వేలితో తన కన్నే పొడుచుకుంటున్న విషయం కనీసం ఆలోచించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు అన్నది నిర్వివాదాంశం.

‘ఎంతసేపూ ఉన్న వనరుల్ని వాడుకోవడం, వృథా చెయ్యడమే కానీ .. వాటిని పునరుజ్జీవింప చేయడం, ఆదా చేయడం మరచాడు. ఇప్పటికే ప్రకృతి తన సహజసిద్ధతకు దూరం అవుతోంది, ‘గ్లోబల్‌ ‌వార్మింగ్‌’ ‌రుతువులనూ, కాలాలనూ వాటివాటి స్వభావాలనూ మార్చేస్తోంది.

ఈ అనంత విశ్వంలో మూడొంతుల భాగం జలమే, అయినా రాబోయే కాలంలో జల సంక్షోభమే. కారణం ఎవరు? మహా మహాసముద్రాలనూ, నదులనూ రసాయన వ్యర్థాలతో, ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలతో కలుషితం చేసి వాటి అల్లకల్లోలాలకు కారణం అవుతున్నాడు మనిషి. ఎన్నో జలచరాలకు మనుగడ లేకుండా చేస్తున్నాడు.

‘కొన్ని కొన్ని దేశాల్లో సముద్ర జలాలను శుద్ధిచేసి వాడుకుంటుంటే, ప్రకృతి వరంగా పొందిన మనదేశంలో మాత్రం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాము. కేవలం మనీకి మాత్రమే విలువనిచ్చి మనుగడ భారం చేసుకుంటున్నాం’ అన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటాడో కదా ఈ మనిషి.

‘కనీసం అప్పుడప్పుడు కురిసే వానల్ని సైతం నిర్లక్ష్యంగా డ్రైనేజ్‌ ‌పాలు, సముద్రం పాలు కాకుండా నిలవ చేసుకునే ఆలోచన ఈ మతిమాలిన మనిషికి కలిగేలా లేదే’ గంగ ఘోషిస్తోంది… చిక్కి శల్యమైపోతూ తన ‘అస్తిత్వాన్ని’ కాపాడమంటూ గగ్గోలు పెడుతోంది. తనలో తానే కుమిలిపోతోంది.

********

గత కొన్ని దశాబ్దాలుగా తమలో ఒకరైన ‘నీరు ‘ పెట్టే కన్నీరూ, ఆక్రందనా, ఘోషా భూమాతను విచలితను చేస్తోంది.

ఒకప్పుడు ‘పంచభూతాలుగా’ అభివర్ణిస్తూ తమను ఆరాధిస్తూ, కొలిచే మనిషి విజ్ఞత, కాలక్రమేణా బుద్ధి మాంద్యత వలన అణగారిపోతోంది. మనిషి ఆలోచన, అవగాహనా రాహిత్యాలు తమ వినాశనానికి కారణం అవుతున్నా, ఓరిమితో సహిస్తూ వచ్చాం ఇన్నాళ్లూ. కానీ సహనానికీ, ఓరిమికీ కూడా ఓ హద్దు ఉంటుంది కదా!

ఇప్పుడు ‘ఆ క్షణం’ సమీపిస్తోంది. భూమిని సారవంతంగా, శక్తిమంతంగా ఉంచే అన్ని దారులనూ మూసేస్తున్న మనిషి స్వార్థానికి ఏమనుకోవాలో? ఎలా ఆనకట్టవేయాలో కూడా అర్థం కావడం లేదు.

సమతుల్యతను పాటించి, పర్యావరణాన్ని రక్షించే అడవులను కొట్టేసి, మనిషి తాము కూర్చున్న కొమ్మను తనే నరుక్కుంటున్న అవివేకి అవుతున్నాడు. వర్షాభావానికీ, ప్రచండ వేడిమికీ, నీటికొరతకూ, ఒకటేమిటి అన్ని కష్టాలకూ, ప్రకృతి ప్రసాదించే సకల వనరుల కొరతకూ కారణం అవుతున్నాడు.

విలువైన ఖనిజాల కోసం భూమిని గుల్లగుల్ల చేస్తున్నాడు.

ఒకటా, రెండా, శిశుపాలుని లావంద తప్పులకు చేరువలో ఉండి, రాబోయే ప్రళయానికి నాంది పలుకుతున్నాడు.

శీఘ్రలాభాల కోసం పంట పొలాలను ప్లాట్లుగానూ, చేపల రొయ్యల చెరువులుగా మార్చి భూసారానికి గొడ్డలిపెట్టు పెట్టి, వాటిని శాశ్వతంగా కొరగాకుండా చేస్తున్న నైచ్యం ఇంతా, అంతా కాదు. ఇప్పటికైనా మేలుకోకపోతే భావితరాలు తిండీ, నీరు కోసం అల్లాడిపోవడం తథ్యం. వాటి కోసమే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యం లేదు.

మనిషి స్వార్థం ఎంతకు దిగజారిందంటే తొంభై శాతం అన్నిటా కల్తీ. గాలి, నీరు, తినే తిండి అన్నీ కలుషితమే. అసలు ‘మనిషే’ కలుషితానికి పర్యాయ పదంగా మారిపోయాడు అనడంలో అతిశయోక్తి లేదేమో!

అయినా మా పిచ్చి గానీ ఆ గంగో, ఈ నేనో (భూమి) ఎంతవగచి ఏమి లాభం? అసలు మేలుకోవలసినదీ, తమ పంథా మార్చుకోవలసినదీ మనిషే కదా!

‘అతనికి ‘ఆ విజ్ఞత ప్రసాదించమని, మమ్ములను పరిరక్షించమనీ సకల చరాచర జగత్తునీ ఓ కంటకాచి రక్షించే ఆ పరాత్పరుని వేడుకోవడం తప్ప ఏం చెయ్యగలం!’

భూమి ఆత్మఘోష ‘నీటి‘ని కదిలించిందేమో గంగ మరో మారు ‘కన్నీటిగంగ’ అయింది. కానీ ఏం లాభం మనసు తడిసిందే కానీ, కళ్లవెంట చుక్క ‘కన్నీరు ‘ లేని పాషాణమే అయింది.

అటు భూమీ శిలగా మారిపోతోంది, రక్షించమని ఆక్రోశిస్తూ.

తన సహజ పరిమళమైన మట్టిని మిగలనీయమనీ, పెళ్లగించి, కుళ్లబొడిచి కాంక్రీట్‌మయం చేయొద్దని మనిషిని వేడుకుంటూ….

About Author

By editor

Twitter
YOUTUBE