తెలంగాణలో రాజకీయ పరిస్థితి దిగజారిపోయింది. విమర్శలు, ప్రతి విమర్శలు ఒకప్పటి మాటగా మారిపోయాయి. సద్విమర్శలను స్వీకరించే తరం కూడా కనుమరుగైనట్లే కనిపిస్తోంది. ఇప్పుడంతా బూతులు, బెదిరింపుల కాలం. నాయకులు నోరు తెరిస్తే సామాన్యులు నోరెళ్ల బెట్టే కాలం. అవును ఇదే నిజం. ఇప్పుడంతా బూతులు, బండబూతుల తరం నడుస్తోంది. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి భౌతిక దాడుల దాకా వెళ్లింది పరిస్థితి. నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే అను చరగణం ఇంగిత జ్ఞానం కోల్పోతోంది. కింది స్థాయి పార్టీ శ్రేణులు బరితెగించి భౌతిక దాడులకూ పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు సాగించిన బీభత్సకాండ ఒక్కసారిగా కలకలం సృష్టించింది. అందరినీ ఆలోచనల్లో పడేసింది.
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రధానంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ రగడ ముదురుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడుతున్నాయి. దీంతో, రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ యుద్ధం మళ్లీ మొదలైందంటున్నారు విశ్లేషకులు. మొన్నటికి మొన్న మునుగోడులో ముఖాముఖీ తలపడిన నేతలు.. ఇప్పుడు దూషణలు, దాడుల బాట పట్టారని చెప్పుకుంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ అర్వింద్ చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. బీఆర్‌ఎస్ స్థాపన సమయంలో ఎమ్మెల్సీ కవితకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదనీ, దీంతో ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారనీ, ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని అర్వింద్ ఆరోపించారు. ఈ మాటలను ఎమ్మెల్సీ కవిత తిప్పికొట్టారు. అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదనీ.. మళ్లీ అలా మాట్లాడితే.. కొట్టి సంపుతం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతే కాదు, కవిత వ్యాఖ్యల నేపథ్యంలో గులాబీ మూకలు ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడికి తెగబడ్డాయి.
బంజారాహిల్స్‌లోని ఎంపీ ఇంటిని ఒక్కసారిగా టీఆర్‌ఎస్ గూండాలు చుట్టుముట్టడంతో ఇంట్లో ఉన్న సెక్యూరిటీ కూడా ఏమీ చేయలేకపోయారు. కవిత ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించుకున్న కొద్ది సమయానికే పక్కా వ్యూహంతో నినాదాలు చేసు కుంటూ పెద్దఎత్తున టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎంపీ ఇంటికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో తేరుకునే లోపే పదుల సంఖ్యలో ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో దొరికిన ఏ వస్తువునూ వదల్లేదు. తలుపులు, కిటికీలు పగులగొట్టారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పూజగదిలోకి కూడా చొచ్చుకువెళ్లి దేవుడి ప్రతిమలను, పూజా సామాగ్రిని కూడా వదల్లేదు. ఈ సమయంలో ఇంట్లో ఎంపీ తల్లి, ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. అర్వింద్ నిజామాబాద్‌లో ఉండగా ఈ దాడి జరిగింది. దాడి విషయం తెలుసు కున్న ఆయన.. కవితపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది కుల అహంకారంతో జరిగిన దాడిగా వర్ణించారు.
ఎంపీ ఇంటిపై టీఆర్‌ఎస్ జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్న విషయం తెలుసుకున్న పోలీ సులు.. అక్కడికి చేరుకునే సరికే విధ్వంసం జరిగి పోయింది. కొంతమంది టీఆర్‌ఎస్ గూండాలు అక్కడే కొద్దిసేపు ఉన్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవ హరించారని బయటికొచ్చిన కొన్ని వీడియోలు చూస్తే అర్థమవుతోంది. ఒక సిట్టింగ్ ఎంపీ, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ ఇంటిని ఈ స్థాయిలో ధ్వంసం చేయడం వెనక గులాబీ పార్టీ లోని కొందరు పెద్ద నేతల ప్రమేయం ఉందన్న చర్చ మొదలైంది. పోలీసులు మామూలుగానే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకోగా.. మరికొందరు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. వారిలో పీహెచ్‌డీ విద్యార్థులూ ఉన్నట్లు గుర్తించారు.
నివేదిక కోరిన గవర్నర్
ఈ పరిణామంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఒక ఎంపీ ఇంటిపై ఇలా దాడి చేయడం సమర్థ నీయం కాదన్నారు. అసలు సంఘటన ఎలా జరి గిందో, దీని వెనక ఏయే శక్తులున్నాయో, దర్యాప్తులో ఏం తేలిందో సమగ్ర నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. ఈ పరిణామం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కుల అహంకారంతోనే దాడి..
తన ఇంటిపై దాడి జరిగిందన్న విషయం తెలియ గానే.. అర్వింద్ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లా డారు. కవిత గురించి తాను ఏమీ అభ్యంత రకరంగా మాట్లాడలేదని, ఆమె ఖర్గేకు ఫోన్ చేసినట్లు తనకు సమాచారం ఉందని, అదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు. అందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్న కేసీఆర్.. కవిత ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. తమకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉంటారని చెప్పారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యన్నారు. ‘నా తల్లిని భయపెట్టించే హక్కు మీకు ఎవరిచ్చారు? విపరీతమైన కుల అహంకారంతో కేసీఆర్, కేటీఆర్, కవిత రెచ్చిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులకు భయపడేది లేదు’ అని అర్వింద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ ఘటన నేపథ్యంలో అర్వింద్‌కు మద్దతుగా బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారు. దాడిని తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. దాడి ఘటనపై కోర్టుకు వెళతామని ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. దాడి విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడంతో అర్వింద్‌కు ఫోన్ చేసిన ఆయన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బండి సంజయ్ మాట్లాడుతూ తమపై దాడి చేసినా పెద్దగా పట్టించుకోమని, హిందువులు పవిత్రంగా కొలిచే తులసీమాత, లక్ష్మీ దేవీ, దుర్గా మాత ప్రతిమలు ధ్వంసం చేయడం ఎంతవరకు సబబు? అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడు తున్న కొద్దీ కేసీఆర్‌కు భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శిం చారు. కేసీఆర్ కుటుంబ అహంకారాన్ని తెలంగాణ ప్రజలంతా చూశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. అంతే కాదు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసుల సహకారం తోనే ఈ దాడికి పాల్పడ్డారని సంజయ్ ఆరోపించారు.
నిందితులపై కేసు నమోదు
ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే దాడి జరిగిందని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. దాడి చేసిన వారిలో 9 మందిపై కేసులు నమోదు చేయగా.. వారిలో ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐపీసీ 452, 148, 427, 323, 354, ఆర్/డబ్ల్యూ 149 సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
దాడి కేసులో తెలంగాణ జాగృతి నేత నవీనాచారి, జాగృతి కన్వినర్ రాజీవ్ సాగర్ నిందితులుగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ ఇంటిపై దాడి జరిగిన సమయంలో బందోబస్తు లేదని.. దీంతో నిందితులు దాడికి తెగబడ్డారని అన్నారు. ఈ ఘటనలో సిమెంట్ రాళ్లు, కర్రలు, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జెండాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మునుగోడు ఉపఎన్నిక ముగియడంతో రాష్ట్రంలో కొన్నాళ్లు ప్రశాంత వాతావరణం నెలకొంటుందని అంతా భావించారు. కానీ మాటల తూటాల దశ దాటి దాడుల వరకు వెళ్లడం, మళ్లీ రాజకీయ యుద్ధం మొదలవడంతో.. మున్ముందు ఏం జరుగుతుందోనన్న చర్చ వినిపిస్తోంది.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్