ఆటవిక జాతికి చెందిన గుహుడు శ్రీరాముడికి అత్యంత ఆప్తమిత్రుడిగా కనిపిస్తాడు. సంసారజలధిని తరింప జేయగల తారకబ్రహ్మ అయిన శ్రీరామచంద్రుడు గంగానది దాటడానికి సహాయపడిన నిషాదరాజుగా…. రామునకు ప్రియస్నేహితునిగా ఆదికవి వాల్మీకి గుహుని పరిచయం చేశారు.
పితృవాక్యపరిపాలకుడై సతీసోదర సమేతంగా అరణ్యవాసానికి బయలుదేరాడు రామచంద్రుడు. ఆయన తన దేశంలోకి వచ్చాడన్న సమాచారం తెలిసిన నిషాదాధిపతి గుహుడు కులవృద్ధులు, మంత్రులతో ఎదురేగి రామచంద్రుని సాదరంగా ఆహ్వానించాడు. కుశలప్రశ్నలు వేశాడు.
భావి సమ్రాట్ నారచీరలతో వనవాసానికి బయలుదేరడం పట్ల మిక్కిలి పరితపించాడు. సతీసమేతంగా నేలపై పరుండిన శ్రీరాముడికి లక్ష్మణుడితో కాపలా కాస్తాడు. లక్ష్మణుడు చెప్పిన రామగాథను విని మిక్కిలిగా దుఃఖించాడు.
ఒడ్డుకు చేర్చలేదు… సహకారమే…
గుహుని పాత్ర ప్రస్తావనకు రాగానే గుర్తొచ్చేవి గుహుడు ‘పడవ నడపడం, రాముని కాళ్లు కడగటం’ అనేవి. రాముడు గుహుని స్నేహితునిగా భావిస్తే, గుహుడు ఆయనను స్వామిగా సేవించాడు. ప్రేమించి, పూజించాడు. నిషాదదేశంలో, శృంగిబేరపురంలో హింసాత్మక జీవనం గడుపుతున్న గుహుడు రామచంద్రుని కౌగిలిని పొందిన భాగ్యశాలి.
‘‘భుజాభ్యాం సాధుపీనాభ్యాం పీడయన్’’ అన్నారు వాల్మీకి.
ఆత్మీయులను దగ్గరకు తీసుకున్నట్లు రాముడు గుహుణ్ణి భుజాలు ఒత్తుతూ దగ్గరకు తీసుకొని గాఢంగా కౌగిలించుకున్నాడట. సీతా మనోనాథుని గాఢ పరిష్వంగాన్ని మించిన కానుక ఏముంటుంది? అంతటి అదృష్టవంతుడు గుహుడు.
అంతేకాదు, వాల్మీకి వాడిన ‘‘ఆత్మసమస్సఖా’’ అన్న పద బంధం ఆధారంగా రామునకు గుహునకు ఇంతకు పూర్వమే పరిచయం ఉన్నట్లు ఇతర రామాయణాలు చెపుతున్నాయి. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో మిథిలా నగరానికి వెళుతూ గంగాతరణం చేసినప్పుడు నదిని దాటించిన గుహుడు ఇతడేనని, ఇతనికి అహల్యా వృత్తాంతాది గాథలు తెలుసునని, అందువలననే ‘‘రామస్యాత్మ సమస్సఖా’’ అని వాల్మీకి పేర్కొన్నాడన్నది వీరి వాదన. ఇక మొల్ల రామాయణంలో అయితే గుహుడు రాముణ్ణి తన పడవలోకి ఆహ్వానిస్తూ.. ‘అంతకన్నా ముందు కాళ్లు కడుక్కో రామా, లేకుంటే నీ పాద ధూళి సోకితే నా పడవలో ఉన్న రాళ్లన్నీ జవరాళ్లుగా మారతాయ’నే అర్థం వచ్చేలా ‘‘క్షాళయామి తవ పాద పంకజం’’ అంటూ ఒక చక్కటి పద్యమే కనిపిస్తుంది.
రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు తన పట్టాభిషేక మహోత్సవానికి హాజరు కావలసిందిగా గుహునికి ఆహ్వానం పంపగా, అతడు బంధుమిత్ర పరివారంతో విచ్చేసినట్లు రామకథ వల్ల తెలుస్తోంది.
– దోర్బల పూర్ణిమాస్వాతి