నవంబర్ 11, 12 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నంలో, తెలంగాణలోని హైదరాబాద్, రామగుండంలో అధికారిక పర్యటన చేపట్టారు. అయితే, రెండు రాష్ట్రాల్లో ఆయనకు లభించిన స్వాగతం, ఆతిథ్యం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అన్నీ తానై మోదీ పర్యటనను విజయవంతం చేసింది. ఓ రకంగా రాష్ట్ర బీజేపీ నేతలకంటే వైసీపీ నాయకత్వమే మోదీ పర్యటన కోసం తీవ్రంగా శ్రమించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రధాని విశాఖలో దిగినప్పటి నుంచీ తిరిగి వెళ్లేదాకా వెన్నంటే ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో ప్రధాని పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైంది. కానీ, తెలంగాణకు వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది.
ప్రధాని పర్యటనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సలు పట్టించు కోలేదు. మోదీ రామ గుండంలో పర్యటించి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ – (ఆర్‌ఎఫ్‌సీఎల్) యూరియా పరిశ్రమను జాతికి అంకితం చేశారు. ఆ పరిశ్రమలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. అయినా సీఎం అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. కనీసం తన ప్రభుత్వం నుంచి ప్రాతినిథ్యం ఉండేలా కూడా చర్యలు తీసుకో లేదు. ఫలితంగా ప్రధాని పర్యటనలో తెలంగాణ సర్కారు ప్రాతినిథ్యం శూన్యంగా కనిపించింది. ఇక, అధికార యంత్రాంగం కూడా పెద్దగా పట్టించు కోలేదన్న అభిప్రాయాలున్నాయి.
దాదాపు వారం రోజుల పాటు ఈ అంశాలపై తీవ్రంగా చర్చ సాగింది. అయితే, మోదీ కూడా ఈసారి తన సహజశైలికి భిన్నంగా స్పందించారు. ఓ రకంగా గర్జించారనే చెప్పాలి. గతంలో పలుసార్లు కేసీఆర్ ప్రధాని పర్యటనలో పాల్గొనకపోయినా.. మోదీ మాత్రం ఎప్పుడూ నేరుగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. విమర్శలు కురిపించలేదు. కానీ కేసీఆర్ పదే పదే ప్రధానిని, తన పదవిని అవమానపరిచే విధంగా వ్యవహరి స్తుండటంతో ఈసారి మాత్రం మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఈ పరిణామం తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
మోదీ తెలంగాణలో రెండు బహిరంగ సభల్లో మాట్లాడారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో, రామగుండంలో ఆయన మాట్లాడారు. రెండు సభల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ పేరెత్తకుండా, కేసీఆర్ ప్రస్తావన రాకుండా ఆయన సీఎంపై విమర్శలు కురిపించారు. ఒకరకంగా చెమటలు పట్టించారు.
విశాఖలో రాజకీయాలు మాట్లాడని ప్రధాని నరేంద్ర మోదీ.. హైదరాబాద్‌లో విరుచుకుపడ్డారు. అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం ఉండ దన్నారు. తనను రోజూ దూషిస్తున్నారని గుర్తుచేశారు. కానీ దానిని తాను శక్తిగా మార్చుకుంటున్నానని వివరించారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరొక లెక్క అన్నట్లుగా తెలంగాణ గడ్డపై మోదీ గర్జించారు. సూటిగా.. ఘాటుగా.. చెప్పాల్సింది చెప్పేశారు. చేయాల్సిన హెచ్చరికలు చేసేశారు. అసలైన ఆట మొదలైందన్నారు. ఇకపై యుద్ధం రసవత్తరంగా ఉంటుందంటూ సమరానికి సై అన్నారు. నేరుగా ఎవరి పేరు ఎత్తకపోయినా చేరాల్సిన వాళ్లకు చేరిపోయేలా సాగింది మోదీ ప్రసంగం. ఆయన మాటల్లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా కనిపించింది.
రాష్ట్ర ప్రభుత్వానిది తప్పుడు ప్రచారం
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు మోదీ. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదన్న ఆయన మెజార్టీ వాటా రాష్ట్రానిదైతే కేంద్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుందని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి కొందరు సింగరేణిపై తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. నకిలీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్ వంటి సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు దేశవ్యాప్తంగా ఒకేలా ‘భారత్’ బ్రాండ్‌తో యూరియాను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి భరోసా ఇచ్చారని, ఒక అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కారు మొత్తం మునుగోడుకు పోయిందని మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదని, వచ్చేది బీజేపీ సర్కారేనని ధీమా వ్యక్తంచేశారు. గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేవని మోదీ గుర్తుచేశారు. కానీ ఆధార్ లింక్ చేసి అవినీతిని అడ్డుకున్నామన్నారు. రైతుల ఖాతాల్లోనే నేరుగా పీఎం కిసాన్ నిధులు వేస్తున్నామని తెలిపారు. రైతుల కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేశామని, రానున్న రోజుల్లో మరో రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమనే పరిస్థితి ఉంది. తాజాగా మోదీ చేసిన వ్యాఖ్యలతో ఈ యుద్ధం మరింత రసవత్తరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్