రాష్ట్రపతి, గవర్నర్‌ ‌పదవులకు రాజ్యాంగం అత్యంత కీలకస్థానం కల్పించింది. అనేక అధికారాలు, విధులు, బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునేందుకు కొన్ని విచక్షణ అధికారాలనూ కట్టబెట్టింది. వారిని రాజ్యాంగ పరిరక్షకులుగా గుర్తించింది. దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు. అదేవిధంగా రాష్ట్రానికి గవర్నర్‌ ‌ప్రథమ పౌరుడిగా వ్యవహరి స్తారు. అంతటి కీలక వ్యక్తి అయిన గవర్నర్‌ ‌పట్ల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహ రిస్తున్న తీరు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్య వాదులకు విస్మయం కలిగిస్తున్నాయి. తమిళనాడు, కేరళ గవర్నర్లు రవీంద్ర నారాయణ (ఆర్‌.ఎన్‌) ‌రవి, ఆరిఫ్‌ ‌మహమ్మద్‌ ‌ఖాన్‌ ‌పట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మాజీ ఐపీఎస్‌ అధికారి, నాగాలాండ్‌, ‌మేఘాలయ మాజీ గవర్నరుగా పనిచేసి ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఆర్‌.ఎన్‌. ‌రవిపై అక్కడి డీఎంకే సర్కారు కారాలు మిరియాలు నూరుతోంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో పాటు, మంత్రులు ఆయనపై విమర్శల బాణాలను సంధిస్తున్నారు. ఏకంగా ఆయనను రీకాల్‌ (‌వెనక్కి పిలవడం) చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరేందుకు, ఆ మేరకు ఆమెకు ఒక వినతిపత్రం సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం సంతకాల సేకరణ కార్యక్ర మాన్ని చేపట్టారు. డీఎంకే మిత్రపక్షాలు ఇందుకు వంత పాడుతున్నాయి. గవర్నర్‌ ‌లౌకిక వాదానికి తూట్లు పొడుస్తున్నారని, మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారని అభాండాలు వేస్తున్నారు. లోతుగా అధ్యయనం చేస్తే ఈ ఆరో పణల్లో ఎంతమాత్రం పస లేదన్న నిజం బయటపడు తుంది. అదే సమయంలో అసలు గవర్నర్‌ ‌పదవికి రాజ్యాంగం కల్పించిన అధికారాలు, విధులు, బాధ్య తల గురించి అధికార పార్టీ, దాని మిత్రపక్షాల నాయ కులకు అవగాహన లేదన్న సంగతి అర్థమవుతుంది.

కోయంబత్తూరు పేలుళ్ల ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)‌కు అప్పగించే విషయమై గవర్నర్‌ ‌రవి వ్యాఖ్యలపై అధికార డీఎంకే, దాని మిత్రపక్షాలు తప్పుపట్టడంలో అర్థం లేదు. రాష్ట్ర గవర్నర్‌గా కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఆయనకు లేదా? ఒక పౌరుడిగా ఆయనకు భావ ప్రకటనా హక్కు, స్వేచ్ఛ లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘నీట్‌’ ‌బిల్లుకు ఆమోదంలో జాప్యంపై అధికార డీఎంకే, దాని మిత్ర పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలక అంశాలకు సంబంధించిన బిల్లులను హడావిడిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. దాని ప్రభావాన్ని, ఎదురయ్యే పరిస్థితులను గమనంలోకి తీసుకుని ప్రథమ పౌరుడు వ్యవహరించాలి. అదే విధంగా గవర్నర్‌ ‌వద్ద అనేక బిల్లులు పెండింగులో ఉన్నాయని అధికార పార్టీ ఎత్తి చూపుతోంది. రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషి అయిన ఏజీ పెరారివాలన్‌ ‌శిక్ష తగ్గింపు అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి గవర్నర్‌ ‌తీసుకెళ్లడాన్ని అధికార డీఎంకే నాయకులు తప్పుపట్టడంలో ఎంతమాత్రం సహేతుకత లేదన్నది అందరికీ తెలిసిందే. రాజ్యాంగంలోని 155, 156 అధికరణలు గవర్నర్‌ ‌నియామకం గురించి ప్రస్తావిస్తున్నాయి. అదే సమయంలో 163 అధికరణ కొన్ని విచక్షణాధి కారాలను ప్రథమ పౌరుడికి కట్టబెట్టింది. మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ ‌పని చేయాలని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ, అదే సమయంలో కొన్ని విషయాల్లో మంత్రి మండలి సలహా మేరకు అన్ని వేళలా డూడూ బసవన్నలా వ్యవహరించాల్సిన అవసరం లేదని రాజ్యాంగం పేర్కొంటోంది. మంత్రి మండలి నిర్ణయాలను నిర్దిష్ట గడువులోగా ఆమోదించాల్సిన పని లేదని, కొన్ని నిర్ణయాలను పునఃపరిశీలనకు కూడా పంపవచ్చని సంవిధానం స్పష్టం చేస్తోంది. ఈ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న అధికార డీఎంకే, దాని మిత్రపక్షాలు గవర్నర్‌ ‌వద్ద అనేక బిల్లులు పెండింగులో ఉన్నాయని పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’లో గవర్నరుకు వ్యతిరేకంగా రోజూ వస్తున్న వార్తలు, వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి చెప్పనక్కర్లేదు. గవర్నర్‌ ‌రవి ఆషామాషీ వ్యక్తి కాదు. 1976 ఐపీఎస్‌ ‌బ్యాచ్‌లో నిబద్ధత గల అధికారి. అత్యంత కీలకమైన జాతీయ భద్రతా ఉపసలహా దారుగా పనిచేశారు. నాగాలాండ్‌ ‌గవర్నరుగా ఆ రాష్ట్రంలో వేర్పాటువాదులకు, రాష్ట్ర ప్రభుత్వానికి సయోధ్య కుదర్చడంలో కీలకపాత్ర పోషించారు. మణిపూర్‌ ‌గవర్నరుగా ఆ ఈశాన్య రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. అందరూ భావిస్తున్నట్లు గవర్నర్‌ ‌రవికి సంఘ్‌ ‌పరివార్‌ ‌నేపథ్యంగానీ, బీజేపీతో అనుబంధం గానీ లేదన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గవర్నర్‌ ‌రవిపై డీఎంకే సారథ్యంలోని సెక్యులర్‌ ‌పోగ్రెసివ్‌ ‌కూటమి నాయకులు అహేతుక వ్యాఖ్యలు చేయడం పూర్తిగా ఆక్షేపణీయం. సెక్యులర్‌ ‌కూటమిలో డీఎంకే, కాంగ్రెస్‌, ‌సీపీఐ, సీపీఎం, విడుతలై విరుతెగల్‌ ‌కట్చి వంటి పార్టీలు ఉన్నాయి. ఈ కూటమికి పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తం 50 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 38 మంది లోక్‌సభ సభ్యులు కాగా, 12 మంది రాజ్యసభ సభ్యులు. గవర్నర్‌ను రీకాల్‌ ‌చేయాలని కోరుతూ రాష్ట్రపతికి పంపనున్న వినతిపత్రంపై ఇప్పటికే డీఎంకేకు చెందిన కేంద్ర మాజీ మంత్రులు దయానిధి మారన్‌, ‌టీఆర్‌ ‌బాలు, సీనియర్‌ ‌నాయకులు సెంథిల్‌ ‌కుమార్‌, ‌టీకేఎస్‌ ఇళంగోవన్‌, ‌సీపీఐ ఎంపీ సుబ్బరాయన్‌, ‌పీసీసీ అధ్యక్షుడు కేఎస్‌ ఆళగిరి, కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ ‌చెల్లకుమార్‌, ‌రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో, విడుతలై విరుతెగల్‌ ‌కట్చి అగ్రనేత తిరు మావళన్‌ ‌తదితర నాయకులు సంతకాలు చేశారు. వీరందరికీ రాజ్యాంగంలో గవర్నర్‌ ‌పాత్ర గురించి, ప్రస్తుత గవర్నర్‌ ‌రవి వ్యవహారశైలి గురించి తెలియదని అనుకోలేం. కేవలం రాజకీయ కోణం, కూటమికి సారథ్యం వహిస్తున్న ‘పెద్దన్న’ డీఎంకే ఒత్తిడిని కాదనలేక సంతకాలు చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీఎంకే మద్దతు లేకుండా సొంత బలంతో చట్టసభలకు ఎన్నికయ్యేంత ప్రజాబలం ఈ పార్టీలకు లేదు. అందుకే డీఎంకే ఆడమన్నట్లు ఆడుతున్నారు.

ఇక మరో దక్షిణాది రాష్ట్రం కేరళ కథ ప్రత్యేక మైనది. గవర్నర్‌ ఆరిఫ్‌ ‌మహమ్మద్‌ ‌ఖాన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆయన మంత్రివర్గం అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం స్మగ్లింగ్‌ ‌కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందన్న గవర్నర్‌ ఆరిఫ్‌ ఆరోపణలకు సర్కారు నుంచి సమాధానం లేదు. దీనికి బదులు గవర్నర్‌ ‌సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటు న్నారని సాధారణ విమర్శలు చేసి రాష్ట్ర సర్కారు సరిపెట్టింది. అంతేతప్ప స్మగ్లింగ్‌కు సంబంధించిన ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టలేకపోయింది. ఆధారాలు లేకుండా గవర్నర్‌ ఇం‌తటి కీలకమైన ఆరోపణలను చేస్తారని అనుకోలేం. విశ్వవిద్యా యాల ఉపకులపతుల నియామకంలో గవర్నర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వర్సిటీలను కాషాయి కరణ చేస్తున్నారని సీఎం విజయన్‌ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్న గవర్నర్‌ ఆరిఫ్‌ ‌సవాలును స్వీకరించేందుకు అధికార వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్‌) ‌వెనకాడుతోంది. అదే సమయంలో కన్నూరు వర్సిటీలో తన మనుషులను నియమించేం దుకు ప్రభుత్వం తాపత్రయ పడుతుందని గవర్నర్‌ ‌చేసిన ఆరోపణలపై సర్కారు నుంచి సమాధానం కరవైంది. వర్సిటీ వీసీల నియామకాలకు సంబం దించి గవర్నర్‌ ‌పాత్ర, ఆయన అధికారాలను కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో 9 మంది వర్సిటీల వీసీల రాజీనా మాను ఆదేశిస్తూ గవర్నర్‌ ‌జారీచేసిన ఉత్తర్వులపై వారు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నది వాస్తవం. వీసీల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నది గవర్నర్‌ అనుమానం. వీసీల రాజీనామా నిర్ణయాన్ని గవర్నర్‌ ఆషామాషీగా తీసుకోలేదు. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ ‌కలాం టెక్నలా జికల్‌ ‌యూనివర్సిటీ వీసీగా డాక్టర్‌ ‌రాజాజీ నియామ కాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో గవర్నర్‌ ఆరిఫ్‌ ఈ ‌నిర్ణయాన్ని తీసుకున్నారు. గవర్నర్‌ ‌హోదాలో ఆయన వర్సిటీలకు కులపతిగా వ్యవహ రిస్తారు. అంతేకాక వాటి కార్యకలాపాలను, పని తీరును పర్యవేక్షిస్తారు. కన్నూరు యూనివర్సిటీలో గవర్నర్‌పై దాడి ఘటనకు సంబంధించి కనీసం పోలీసు కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పోలీసులు ఈ విషయంలో మౌనం వహించారన్నది చేదునిజం. స్వయంగా రాష్ట్ర ప్రథమ పౌరుడిపై దాడి జరిగితేనే పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవ్వక మానదు.

అక్టోబరు 4 నుంచి 14 మధ్య ముఖ్యమంత్రి విజయన్‌, ‌మరో నలుగురు మంత్రుల విదేశీ పర్యటనపై కనీసం రాజ్‌భవన్‌కు సమాచారం కూడా కరవైంది. దీనిపై గవర్నర్‌ ఆరిఫ్‌ ‌రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన మాట వాస్తవం. సాధారణంగా విదేశీ పర్యటనకు ముందు, తరవాత గవర్నర్‌ను ముఖ్యమంత్రి కలిసి విషయాలను వివరించడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. దీనిని వామపక్ష సర్కారు తుంగలోకి తొక్కింది. గవర్నర్‌ ‌పట్ల ప్రభుత్వ ఉదాసీనత, నిర్ల్యక్ష్యాన్ని ఏ విధంగా సమర్థించుకోగలదు? ఆర్థికమంత్రి గోపాలన్‌ ‌వ్యవహార శైలిపై గవర్నర్‌ ‌బహిరంగంగానే అసమ్మతిని తెలియజేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు జాతీయ సమైక్యత, సమగ్రతలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని గవర్నర్‌ ‌వ్యాఖ్యానించారు. గవర్నర్‌గా తనకు గల పరిమితులు ఏమిటో తెలియని వ్యక్తి కాదు ఆరిఫ్‌ ‌మహమ్మద్‌ ‌ఖాన్‌. అదే సమయంలో రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను ఆయన వినియోగించుకోకుండా ఉండజాలరు. కళ్లముందు రాజ్యాంగానికి, దాని స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఉంటే కళ్లు మూసుకుని కూడా ఉండజాలరు. ఆయన యూపీకి చెందిన సీనియర్‌ ‌నాయకుడు. రాజకీ యాల్లో అనేక ఢక్కామొక్కీలు తిన్న నాయకుడు. గతంలో బెంగాల్లో నాటి గవర్నర్‌ ‌జగదీప్‌ ‌ధన్‌కఢ్‌తో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గిల్లికజ్జాలు పెట్టుకునే వారు. చీటికీ మాటికీ రాజ్యపాల్‌తో కయ్యానికి దిగేవారు. రాజ్‌భవన్‌ ఉనికినే విస్మరించేవారు. చివ రకు ఆయన అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. పాత చేదు అనుభవాల నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్‌ ‌గణేశన్‌తో మమతా బెనర్జీ సత్సం బంధాలు నెరపుతున్నారు. తమిళనాడుకు చెందిన గణేశన్‌ ‌జన్మదిన వేడుకకు ఆమె ఇటీవల స్వయంగా హాజరయ్యేందుకు చెన్నైకు వచ్చారు. స్టాలిన్‌, ‌పినరాయి విజయన్‌ ఈ ‌విషయాన్ని గమనించే ఉంటారు. తాము వ్యవహరిస్తున్నది రాజకీయ నాయ కులతో కాదని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారితో నన్న వాస్తవాన్ని వారు ఎప్పటికి గ్రహిస్తారు?

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE