కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధప్రదేశ్ అభివృద్ధికి ఎనలేని ప్రాజెక్టులను కానుకలుగా అందించగా, నవంబర్ 11, 12 తేదీల్లో విశాఖ పర్యటనలో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులతో విశాఖ ఎగుమతుల హబ్‌గా మారి ఆదాయం పెంచుకుంటూ విశ్వనగరంగా రూపుదిద్దుకోనుంది. ఇది తెలుగువారికి మోదీ ఇస్తున్న గౌరవంగా మనం భావించాలి.
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన ఎనిమి దేళ్లలో ఏపీకి 8 లక్షల కోట్ల ప్రాజెక్టులను కేటాయిం చిన మోదీ వాటి ఆచరణలో కూడా తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ, సీఎం జగన్‌తో కలిసి రూ.10,742 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో రూ. 7,614 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్య క్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇక రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తూ దేశ అభివృద్ధిలో ఆంధప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదే వేదికపై విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకై అవసరమైన కార్యాలయం నిర్మాణానికి రూ.106 కోట్లను కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి నిధులు
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, అప్‌గ్రేడేషన్‌కు పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు 150 కోట్ల రూపాయలు. దీంతో ఫిషింగ్ హార్బర్ సామర్థ్యం రోజుకు 150 టన్నుల నుండి 300 టన్నులకు పెరుగుతుంది. సురక్షితమైన ల్యాండింగ్, బెర్తింగ్, ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు జెట్టీలో వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తాయి, వృథాను తగ్గించి ధరలు మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఉత్తరాంధ్రకు తలమానికమైన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ (వి.ఎఫ్.హెచ్)కు మహర్దశ పట్టింది. సరికొత్త హంగులతో వీఎఫ్‌హెచ్ రూపురేఖలు మారనున్నాయి. రూ. 525 లక్షల పెట్టుబడితో విశాఖపట్నం పోర్ట్ ద్వారా 1976లో ప్రారంభమైన వీఎఫ్‌హెచ్ మత్స్యశాఖ నిర్వహణలో ఉంది. ఇది 24 ఎకరాల భూమిలో 1300 మీటర్ల వార్స్ పొడవుతో ఉంది. 5 ఫిషింగ్ జెట్టీలు, 6 వేలం హాల్స్, 1 నెట్ మెండింగ్ హాల్, 24 మంది అధికారులతో కూడిన ఎగుమతి సేకరణ కేంద్రం, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి 1300 ఫిషింగ్ వెసెల్స్, రోజుకు 150 టన్నుల చేపలు, 700 మెకనైజ్డ్ బోట్లు, 450 మోటరైజ్డ్ బోట్లు, 15 బీచ్ ల్యాండింగ్ క్రాస్టు, 150 మోటారు లేని సాంప్రదాయ క్రాస్టు వీఎఫ్‌హెచ్‌లో పని చేస్తున్నాయ. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైనప్పటి నుండి సాధారణ మరమ్మతులు, నిర్వహణ మినహా పెద్దగా పెట్టుబడి లేదు. తాజా కేటాయింపులతో చేపలు పట్టడం, నిల్వ చేయడం, ఎగుమతులు మెరుగుపరచడానికి, అదనంగా 15,000 కుటుంబాలకు ఉపాధి కల్పించడానికి దోహదపడతాయి.
ప్రాజెక్ట్ కీలక టేక్ అవేలు కింది విధంగా ఉన్నాయి:
- ప్రస్తుతం బోట్లను అప్‌లోడ్ చేయడానికి 2 గంటలు పడుతుంది. మొత్తం పక్రియ మాన్యువల్‌గా ఉంది. ఇది 40 టైపాలతో ఆటోమేట్ చేస్తారు. ఇది చేపలను అప్‌లోడ్ చేయడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది.
- చేపలను నేరుగా వేలం హాల్‌కు తరలించ డానికి కన్వేయర్ సిస్టమ్‌ను ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారు.
- పడవ నుండి వేలం హాలు వరకు యాంత్రిక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.
- ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ వద్ద బహిరంగ ప్రదేశంలో చేపలు ఎండబెడుతున్నారు. చేపలు ఎండటానికి 23 రోజులు పడుతుంది. ఇప్పుడు చేపలు వేగంగా ఎండేందుకు 20 మెకనైజ్డ్ డ్రైయర్లు అమరుస్తారు.
- 450 కేఎల్‌డీ సామర్థ్యంతో రెండు ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు అమరుస్తారు.
- అమ్ముడుపోని చేపలను నిల్వ చేయడానికి చిల్ రూమ్ సౌకర్యం అందుబాటులో ఉంచుతారు.
- ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థ అభివృద్ధి చేస్తారు.
- 50 టన్నుల నిల్వ సామర్థ్యంతో 900 చ.మీ. గల కోల్డ్ ఛాంబర్లను అభివృద్ధి చేస్తారు.
- చేపల అమ్మకం కోసం ఇ-వేలం ప్లాట్ ఫామ్స్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
రైల్వేస్టేషన్‌కు కొత్త హంగులు
దాదాపు 450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సదుపాయాలు లభిస్తాయి. పునరాభివృద్ధి చేసిన స్టేషన్ రోజుకు 75,000 మంది ప్రయాణికుల అవసరాలు తీరుస్తుంది. ఈ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు నడిచేందుకు అత్యాధునిక స్కైవాక్‌లు ఉంటాయి. ప్లాట్‌ఫామ్స్ పైన డిపార్చర్ హాల్స్, కామన్ వెయిటింగ్ ఏరియాను నిర్మిస్తారు. ఈ రెండింటినీ కలుపుతూ రూఫ్ ప్లాజాను నిర్మిస్తారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో పనిచేసే స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్, రీటైల్, ఆఫీస్ స్పేసెస్, రిటైరింగ్ రూమ్స్, మెడికల్ ఎమర్జెన్సీ రూమ్ ఉంటాయి.
రహదారులకు నిధులు
ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌లో ఆంధప్రదేశ్ విభాగానికి కూడా మోదీ శంకుస్థాపన చేశారు. రూ. 3,750 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఇది ఛత్తీస్‌గఢ్-ఒడిశా పారిశ్రామిక ప్రాంతాలకు, విశాఖపట్నం పోర్ట్, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది. ఆంధప్రదేశ్, ఒడిశాలోని గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు రాయ్‌పూర్-విశాఖపట్నం రోడ్డు రహదారి సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. విశాఖపట్నంలో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ జంక్షన్ వరకు నిర్మించనున్న ప్రత్యేక పోర్టు రోడ్డుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది స్థానిక, పోర్టుకు వెళ్లే సరకు రవాణా వాహనాలను వేరు చేస్తుంది. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. శ్రీకాకుళం-గజపతి కారిడార్‌లో భాగంగా జాతీయ రహదారి-326 ఏలో భాగంగా నరసన్నపేట నుంచి పాతపట్నం వరకు రూ.200 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన సెక్షన్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు.
గ్యాస్ ఉత్పత్తి ప్రాజెక్టు ప్రారంభం
ఆంధప్రదేశ్‌లోని ఓఎన్జీసీ 2,900 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన యూ-ఫీల్డ్ ఆన్‌షోర్ డీప్‌వాటర్ బ్లాక్ ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. రోజుకు దాదాపు 3 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్ ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇది అతి ఎక్కువ లోతు నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6.65 ఎంఎంఎస్‌సీఎండీ సామర్థ్యంతో గెయిల్ చేపట్టనున్న శ్రీకాకుళం అంగుల్ సహజ వాయువు పైప్‌లైన్ ప్రాజెక్ట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 2,650 కోట్లకు పైగా వ్యయంతో 745 కి.మీ. పొడవు గల పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. సహజవాయువు గ్రిడ్ (ఎన్‌జీజీ)లో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పైప్‌లైన్ ఆంధప్రదేశ్, ఒడిశాలోని వివిధ జిల్లాల్లో గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య యూనిట్లు, ఆటోమొబైల్ రంగాలకు అవసరమైన సహజ వాయువును సరఫరా చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది.
ఆంధప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ సెక్షన్ 93 ప్రకారం విభజిత ఆంధప్రదేశ్‌లో సమాన విద్యావకాశాలు కల్పించేందుకు వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటుచేయాలి. 10 ఏళ్ల కాలంలో వాటిని పూర్తిచేయాలి. నిర్ణయించిన గడువుకి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 11 విద్యాసంస్థలను ప్రారంభిం చింది. దాదాపుగా అన్నింటిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తాడేపల్లిగూడెంలోని ఎన్‌ఐటీ, మంగళగిరిలోని ఎయిమ్స్ రూపుదిద్దుకున్నాయి. గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపు దిద్దుకుంటోంది. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీడీఎం కర్నూలు, ఐఐఎస్‌సీఆర్ తిరుపతి వంటివి సొంత భవనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఐఐఎం విశాఖపట్నం తాత్కాలిక భవనాల్లో సాగుతూ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ పనులు సాగుతున్నాయి. విశాఖలోని పెట్రో యూనివర్సిటీ, విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ వర్సిటీ నిర్మాణాలకు ఇటీవలే భూములు కేటాయించారు. పనులు ప్రారంభం కావాలి. ఎన్‌డీఎం కూడా నిర్మాణ దశలో ఉంది.
ఇవి కాక విభజన చట్టంలో లేని మరో పది సంస్థలను కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అర్బన్ కింద ఏపీకి 20, 71,776 ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో 17,43,613 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా, వీటిలో 4,92,247 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. పలు రకాల పథకాల కింద జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టు ఎంపిక కూడా పూర్తయింది. 2014 తర్వాత రాష్ట్రంలో 3,720 కి.మీ. జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయి. విభజన చట్టంలో లేకున్నా పెట్రోలియం, సహజ వాయువుల రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 1.40 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్