– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు
విద్యార్ధులు రాజకీయాలలో పాల్గొనకూడదన్న నిబంధనను ఉల్లంఘించి, దేశ స్వాతంత్య్రంలో గొంతు కలిపారు. ‘బ్రిటిష్ రాచరికమే భారత దేశ దారిద్య్రానికి ముఖ్య కారణం’ అని కళాశాల విద్యార్థిగానే నినదించారు. ఆయనే ‘అమృతరావు’అనే మద్దూరి అన్నపూర్ణయ్య. వివక్షను, ప్రజావ్యతిరేక చర్యలను వ్యతిరేకించే వాడుగా, అన్నపూర్ణయ్య అంటే ‘ఎదిరించేవాడు’ గా పేరు పడ్డారు. భార్యాబిడ్డల్ని దైవానికి వదిలి 55 ఏళ్ల జీవితంలో ఐదవ వంతు కాలం జైలులో మగ్గి మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్రం రావడానికి కారకుల్లో ఒకరు.
‘ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు వస్తుంది? బజార్లోనూ, బస్సుల్లోనూ, రైళ్లల్లోనూ ఇదే ప్రశ్న. ఆ మధ్య ఢిల్లీ వెళ్లి పటేల్ నుంచి ‘‘కళా’’, నెహ్రూ నుంచి ప్రకాశం ఆంధ్ర రాష్ట్రాన్ని మోసుకువచ్చారు. అయితే గవర్నర్ ఎవరు? ప్రధాని ఎవరు? అని అప్పుడే కాన్వాసింగ్ బయలుదేరింది. ప్రకాశం, రంగాలమధ్య పోటీ ఉంటుందని జమీన్ రైతు జోస్యం చెప్పింది. ఇద్దరూ చెరొకటి పంచుకొని ‘తుని తగవు’ చేసుకుంటారని వ్యాఖ్యానాలు రేగాయి. యుగంధర మంత్రిని నేనుండగానే ఇదంతానా? అని ‘కళా’ కలవరపడుతు న్నారట. ‘స్వరాజ్యం’, ఆంధ్ర రాష్ట్రం అంటే పదవుల పంపకమే కామోసు. ఆగస్టు 15 తరువాత సంభాష ణలు, పదవుల పంపకం మీదకు మళ్లి ఉద్యమంలో చేసిన త్యాగాలు, ఎదురైన కష్టాలు మరుగున పడ్డాయి’ అని వెలుగు పత్రికలో అన్నపూర్ణయ్య రాశారు.
పిఠాపురానికి 8 మైళ్ల దూరంలోని కొమరగిరి గ్రామానికి చెందిన మద్దూరి కోదండరామ దీక్షితులు సంపన్నుడు, నిత్యాన్నదాత. భోజనం పెట్టడంలో ‘లేదు ’అనే మాట వినక••డదని నియమంగా పెట్టుకున్నారు. పిఠాపురం రాజావారు ఒకసారి నూరుమంది పరివారంతో వేళ కాని వేళలో యాత్రికు లుగా దీక్షితులు ఇంటికి చేరారు. తాము వ్యవసాయ పనుల నిమిత్తం పై ఊళ్ల నుంచి వచ్చామని, అన్నం పెట్టాలని కోరగా, వారిని సాదరంగా ఆహ్వానించి, పనివాళ్లకు అప్పటికప్పుడు వేడివేడి భోజనం వడ్డించారట. ఆ ఆతిథ్యానికి ముగ్ధులైన రాజావారు దీక్షితులను అభినందించి ఇనాముగా కొంత భూమిని ఏర్పాటు చేశారట.
ఆ దీక్షితులు మనుమడే అన్నపూర్ణయ్య. 1899 మార్చి 20న జన్మించారు. కొమరగిరి, పెద్దాపురంలో ప్రాథ•మిక విద్య, కాకినాడ ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. అనంతర కాలంలో విప్లవయోధుడు అల్లూరి శ్రీరామరాజు, ఆయనకు అక్కడ సహాధ్యాయి, మిత్రుడు. 1911 డిసెంబర్ 11న ఐదవ జార్జి పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ‘శశిరేఖా పరిణయం’ నాటకంలో మిత్రు లిద్దరూ శశిరేఖకు చెలికత్తెలుగా చక్కగా నటించారు. విద్యార్థులందరికీ జార్జి చిత్రపటంతో పాటు జర్మన్ సిల్వర్ పతకాలు అందచేయగా, అన్నపూర్ణయ్య అయిదారు పతకాలు చేజిక్కించుకుని మిత్రుడు శ్రీరామరాజుకు ఇవ్వబోగా కోపంతో విసిరివేశాడు. ‘పిచ్చివాడా! ఆ పతకం మన బానిసత్వ చిహ్నం’ అని వ్యాఖ్యానించాడు. క్రమంగా రాజు సాహచర్యంతో అన్నపూర్ణయ్యలో దేశభక్తి గాఢంగా నాటుకుంది.
ఇంగ్లీషు చదువు పట్ల ఆసక్తి లేని రాజు దేశసేవకు డిగ్రీలు అవసరం లేదనేవాడు. అన్నపూర్ణయ్య మాత్రం బి.ఎ పాసై న్యాయవాది కావాలనుకునేవారు. తాను త్వరలో సన్యాసిగా మారుతానని, దేశమాతకు అంకితమవుతానని తరచూ చెప్పే రాజు అర్ధాంత రంగా చదువు మానివేసి వెళ్లిపోయాడు. ఒక వేసవిలో (1917) పిఠాపురం నుంచి కాకినాడ వెళ్లేందుకు రైలు టికెట్ తీసుకుంటున్న అన్నపూర్ణయ్యకు సన్యాసి దుస్తులలో రామరాజు ప్రత్యక్షమయ్యారు.
‘ఏమిటీ సన్యాసి వేషం’ అన్న అన్నపూర్ణయ్య ప్రశ్నకు రామరాజు నుంచి ‘నా జీవితం ప్రజాసేవకే అంకితం అని చిన్నప్పుడే చెప్పానుగా’ అని సమాధానం వచ్చింది. విద్యార్థులు రాజకీయాల్లో చేరకూడదనే 559 జి.వో. ప్రకారం ప్రిన్సిపాల్ రఘుపతి వెంకటరత్నం నాయుడు సర్క్యులర్ పంపారు. అయినా అన్న పూర్ణయ్య 1917లో హోమ్ రూల్ లీగ్‌లో చేరి అనిబిసెంట్ శిష్యుడు శ్రీరామ్ ఉపన్యాసాలకు హాజరవడంతో వెంకటరత్నం నాయుడు ఆయనను వదిలేశారు. అనిబిసెంట్ ‘న్యూ ఇండియా’ పత్రికలో రాసే వార్తా కథనాలను అన్నపూర్ణయ్య ఆసక్తితో చదివేవారు.
‘విద్యార్థి దశ నుండి రాజకీయాలంటే చెవి కోసుకునేవాడిని. లోకమాన్య తిలక్ నాకు రాజకీయ గురువు. సెప్టెంబర్ 1, 1920 కలకత్తాలో జరిగిన స్పెషల్ కాంగ్రెస్‌లో గాంధీ మహాత్ముని తీర్మానం ఆమోదం పొందింది. ఆ తీర్మానం ప్రకారం విద్యార్థులు విద్యాలయాలు బహిష్కరించి వెంటనే దేశ సేవారంగంలో దూకాలి. నాకు సంకల్పబలం ఉన్నా ఆచరించే శక్తి కుంటుపడిపోయింది. కుటుంబ పరిస్థితులు బాగా లేవు. ఎప్పుడు బి.ఎ. పాసవుతానా! ఎప్పుడు నాలుగు రాళ్లు సంపాదించి తమను పోషించుతానా? అని తల్లి, భార్య, ఇద్దరు తమ్ముళ్లు తహతహలాడుతున్నారు. నా భార్య అప్పటికి కాపురానికి రాలేదు. ‘తొందరపడి సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరవద్దు. చాలా ఇబ్బంది పడతాం’ అని జాబు కూడా రాసింది. అంటూ తాను స్వాతం త్రోద్యమంలో ప్రవేశించిన తీరును అన్నపూర్ణయ్య ‘జయభారత్’’ పత్రికలో ప్రకటించారు.
సహాయ నిరాకరణ ద్వారా సంవత్సరంలోనే స్వరాజ్యం వస్తుందని గాంధీజీ అన్నారు కానీ దానిని నమ్మడం ఎలా? ఈలోగా పట్టాభి రాజమండ్రి రాగా నాతో పాటు న్యాపతి సుబ్బారావుగారు సలహా అడిగాం. ‘1907ను జ్ఞాపకం తెచ్చుకోండి’ అన్నారా యన. అంటే వందేమాతర ఉద్యమంలో గాడిచర్ల తదితర విద్యార్థులు బాగా నష్టపోయారు. ఆయన చదువుకు స్వస్తి చెప్పి దేశసేవకు అంకితమయ్యారు. నవంబర్ 30 రాత్రి అంతా బాగా ఆలోచించిన అన్నపూర్ణయ్యకు బాల్యసఖుడు శ్రీరామరాజు జ్ఞాపకం రావడంతో చదువుకు స్వస్తిచెప్పి దేశసేవకు అంకితం కావాలని ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నారు. ‘యువకుడే దేశానికి జీవం – యువకు ల్లారా రహస్యం మరవకండి’’ అని అన్నపూర్ణయ్య పిలుపునిచ్చారు.