– డా. రామహరిత
అక్టోబర్ 28, 29 తేదీల్లో ఢిల్లీలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సమావేశానికి భారత్ నేతృత్వం వహించింది. భారత్‌లో ఈ సమావేశం జరగడం ఇదే ప్రథమం. సీమాంతర ఉగ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన మన దేశం ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమంలో ఎప్పుడూ ముందే ఉంటుంది.
అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థపై జరిగిన 9/11 దాడుల నేపథ్యంలో 2001లో యూఎన్‌ఎస్‌సీ 1373 తీర్మానాన్ని ఆమోదించింది. 2001, సెప్టెంబర్ 28న ఆమోదించిన ఈ తీర్మానం ప్రకారం ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిరోధక కమిటీ (యూఎన్‌సీటీసీ)కి భారత్ 2011లో నేతృత్వం వహించగా, దశాబ్ద కాలం తర్వాత, అంటే 2022లో ఈ కమిటీకి మళ్లీ నేతృత్వం వహించే అవకాశం దక్కింది. 2011కి ముందు ఉగ్రవాదం వల్ల కలుగుతున్న అనర్థాలపై భారత్ ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోని పశ్చిమ దేశాలకు.. 9/11 దాడుల తర్వాత మాత్రమే తీవ్రవాదం వల్ల నష్టం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిసొచ్చింది. ఈ సమావేశానికి భారత్ ముంబయిని వేదికగా ఎంచుకోవడం అంటే, ఆ నగరంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలకు గుర్తు చేయడం కోసమే. ముంబయి దాడుల్లో మొత్తం 166 మంది మరణించగా వీరిలో 26 మంది విదేశీయులు (23 దేశాలకు చెందినవారు) కావడం గమనార్హం.
మసకబారిన పోరు
న్యూయార్క్‌లోని జంట భవనాలపై అల్‌ఖైదా దాడులు జరిపిన తర్వాత మేలుకున్న ప్రపంచం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి శ్రీకారం చుట్టింది. కానీ అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వంతో అమెరికా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల దానికి రాజకీయ గుర్తింపు లభించడంతో, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం మసకబారింది. రెండు దశాబ్దాలుగా అఫ్ఘానిస్తాన్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా అక్కడి నుంచి ఉన్నఫళంగా తప్పుకోవడంతో తాలిబన్‌కు ఊపిరిపోసి వారు మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు మార్గం సుగమం చేసింది. ఫలితంగా ఆ దేశం తీవ్రవాదుల పాలనలో మళ్లీ అస్థిరతను ఎదుర్కొంటోంది.
పాక్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదుల నిషేధంపై ఐక్యరాజ్య సమితిలో భారత్, అమెరికాలు ప్రవేశపెట్టిన తీర్మానాలకు నాలుగు నెలలుగా చైనా మోకాలడ్డుతూ వచ్చిన నేపథ్యంలో ముంబయిలో తాజాగా యూఎన్‌సీటీసీ సమావేశం జరగడం విశేషం. ఈ ఐదుగురు మనదేశంలో ఉగ్రదాడులకు ప్రధాన కారకులు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని దేశాలు తమ రాజకీయ ప్రయోజ నాలకు అనుగుణంగా ఉగ్రవాద నిషేధానికి అడ్డుతగులుతుండటంతో.. ఆ పోరాటానికి అర్థంలే కుండా పోతోంది. ఈ విధంగా ఉగ్రవాద వ్యతిరేక పోరులో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం కొరవడటం, మానవాళికి పెనుశాపంగా మారింది. ఇదే సమయంలో ఉగ్రవాదానికి ఇచ్చే నిర్వచనం విషయంలో వివిధ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం మరో దౌర్భాగ్యం. టెర్రరిస్టులను ‘మంచి ఉగ్రవాదులు వర్సెస్ చెడ్డ ఉగ్రవాదులు’, ‘నా వర్సెస్ నీ ఉగ్రవాదులు’ అనే ముద్రలు వేస్తూ, మానవ హక్కుల ముసుగులో వారిని నిషేధం నుంచి తప్పించ డానికి ఆయా దేశాలు ప్రయత్నిస్తుండటం ఈ పోరాటానికి తీవ్ర ఆటంకంగా మారింది.
మానవహక్కుల పేరుతో..
తీవ్రవాద వ్యతిరేక అంతర్జాతీయ పోరాటాన్ని ‘మానవహక్కుల’ కోణం అత్యంత దుర్మార్గంగా నిర్వీర్యం చేసింది. జాతులు/వేర్వేరు తెగల ప్రేరణతో పెచ్చరిల్లుతున్న తీవ్రవాదం వల్ల చెలరేగుతున్న హింసాకాండను అమెరికా, యూరప్ దేశాలు స్థానిక సమస్యగానే పరిగణిస్తుండటం.. ఉగ్రవాదంపై పోరాటాన్ని నీరు గార్చేసింది. అంటే కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యే జాతిపరంగా ఉగ్రవాద ముష్కరులు జరిపే హింసాకాండను అంతర్జాతీయ ఉగ్రవాదంగా ఈ దేశాలు పరిగణించడం లేదు. ‘ప్రపంచ ఉగ్రవాద సూచీ-2022’ కూడా ‘అంతర్జా తీయంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుండగా, రాజకీయ ప్రేరేపిత హింస వేగంగా పెరుగుతోంద’ని పేర్కొనడం గమనార్హం. రైట్-వింగ్ నేషనలిజం వల్ల పెరుగుతున్న దాడులను, కేవలం ‘ప్రేరేపిత దాడులు’గా పేర్కొంటున్న ఆయా దేశాల కంటి తుడుపు వైఖరి ప్రమాదకరం. కొంతమంది ఉగ్రవాద అగ్రనేతలను మినహాయించి, తీవ్రవాదంపై పెద్దగా దృష్టిపెట్టడం మానేసిన అమెరికా అంతర్గత సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదం జడలు విప్పుతోందంటూ ఐక్యరాజ్య సమితి నివేదిక హెచ్చరికను కూడా అమెరికా ఖాతరు చేయడం లేదు.
ఈ నేపథ్యంలో సభ్యదేశాలు స్థానిక సమస్యలుగా పరిగణిస్తున్న హింసాత్మక జాతీయవాదం, ‘రైట్‌వింగ్ తీవ్రవాదం, జాతులు/వేర్వేరు తెగల ప్రేరేపిత హింసాత్మక ఉగ్రవాదం వంటి అంశాలను కూడా ఉగ్రవాద వ్యతిరేక అంతర్జాతీయ పోరులో (జీసీటీఎస్) భాగం చేశాయి. జీసీటీఎస్‌ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యూఎన్‌జీఏ) ఆమోదిం చింది కూడా. జీసీటీఎస్ ఏడవ సమీక్షకు సంబంధించి గతంలో 28వ పేరాలో పేర్కొన్న ‘ఉగ్రవాదానికి మతం లేదు’ అన్న వాక్యాన్ని తొలగించి ‘మొత్తంమీద పెరుగుతున్న వివక్ష, అసహనం, హింసాకాండ, ఆందోళన కలిగించే అంశం. ఇస్లామోఫోబియా, క్రిస్టియానో ఫోబియా, యూదులపై తప్పుడు అభిప్రాయాలతో (యాంటీ సెమిటిజ) ప్రేరేపితమై జరిపే దాడులతో సహా ఇతర మతాల విశ్వాసాలకు వ్యతిరేకంగా, ప్రపంచంలోని ఇతర సమాజాలపై జరిపే దాడులు కూడా ఇందులో భాగమే’. అని చేర్చింది. అంతేకాదు, ‘అబ్రహమో ఫోబియాను’ కూడా చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరును ఐరాస బలహీన పరచిందనే చెప్పాలి. ఉగ్రవాద లక్షణానికి మత పరంగా ఇచ్చిన ఈ వివరణ.. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అన్న భావనకు అర్థమే లేకుండా చేసింది.
2021లో భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రెండేళ్ల కాలానికి ఎన్నికైంది. ఇలా మనదేశం ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. కాగా ఈసారి భారత్ ఉగ్రవాదం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య నౌకల భద్రత, ఐక్యరాజ్య సమితి శాంతి ప•రిరక్షక దళాల భద్రత అనే మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ‘ఉగ్రవాద చర్యల వల్ల ప్రపంచ శాంతికి, భద్రతకు వాటిల్లుతున్న ప్రమాదం’ అనే అంశంపై 2021 డిసెంబర్‌లో పెద్ద ఎత్తున చర్చలు నిర్వహించింది.
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఉగ్రవాద నిరోధానికి మనదేశం 8 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రతి పాదించింది. ఉగ్రవాద వ్యతిరేక కమిటీ (సీటీసీ) పాత్రను మరింత విస్తృతం చేసేందుకు, ఈ పోరాటానికి బహుపాక్షిక స్పందనను కూడ గట్టేందుకు వీలుగా ఉగ్రవాద వ్యతిరేక కమిటీ కార్యనిర్వాహక డైరెక్టరేట్ (సీటీఈడీ)ని 2025 వరకు పొడిగించడానికి అనుకూలంగా ఓటు వేసింది. సీటీసీ తరఫున సీటీఈడీ సభ్య దేశాల్లో పర్యటించి ఉగ్రవాద వ్యతిరేక పోరులో ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాల్లో లోపాలను అంచనా వేసి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. ఎల్లప్పుడూ అంతర్జాతీయంగా ఉగ్రవాద వ్యతిరేక యత్నాలకు భారత్ తన మద్దతును కొనసాగిస్తూ వస్తోంది. ఐక్యరాజ్య సమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాన్ని’ (జీసీటీఎస్) మరింత బలోపేతం చేయాలని కోరారు. ఉగ్రవాదులు వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రపంచ ఉగ్రవాద సూచీ-2022 ఒక సందర్భంలో స్పందిస్తూ ‘సాంకేతికాభివృద్ధిని ఉగ్ర వాదులు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. వారు వాడుతున్న డ్రోన్‌లు, క్షిపణులు వారి దాడి సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా, ఎన్‌క్రిప్షన్ వంటివీ వారి నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేశాయి. ఇవి వారి రిక్రూట్ మెంట్లను కూడా మరింత సులభతరం చేశాయి’ అని పేర్కొంది.
ఉగ్రవాదభూతంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న భారత్ నెలల తరబడి చర్చలు జరిపి ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను ముందుకు తెచ్చింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని భారత్ నిర్ద్వంద్వంగా చెప్పింది. చివరకు ఉగ్రవాదంపై పోరుకు సభ్య దేశాలు అంగీకరించాయి. అయితే ఇందుకు ‘కట్టుబడి ఉండటం’ వాటి ఇష్టాయిష్టాలకే వదిలివేసింది. ముంబయిలో జరిగిన యూఎన్‌ఎస్‌సీ – సీటీసీ సమావేశంలో భారత్.. పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా 26/11-ముంబయి దాడులకు ప్రధాన కారకుడైన సాజిత్ మీర్ ఫోటోను ప్రదర్శించింది. అంతకుముందు యూఎన్‌ఎస్‌సీ- 1267 కమిటీ ప్రకారం ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా, సాంకేతిక కారణాలు చూపుతూ చైనా అడ్డుకోవడం గమనార్హం.
ఉగ్రవాద భూతం నుంచి పౌర సమాజాన్ని కాపాడుకోవాలని భారత్ ‘ఢిల్లీ డిక్లరేషన్’లో నొక్కి చెప్పింది. ‘మానవహక్కుల చట్టం, శరణార్థుల చట్టం, అంతర్జాతీయ హ్యుమానిటేరియట్’ చట్టం వంటి అంతర్జాతీయ చట్టాలకు బద్ధులై ఉంటూనే ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించని విధానాన్ని కొనసాగించాల’ని సభ్య దేశాలను కోరింది. మత్తుమందులు, ఆయుధాల సరఫరాకు మధ్య కొనసాగుతున్న సన్నిహిత సంబంధాన్ని కూడా ఇది బయటపెట్టింది. ముఖ్యంగా మానవ రహిత ఏరియల్ వ్యవస్థలు (యూఏఎస్), డ్రోన్‌లు, క్వాడ్ కాప్టర్లు మత్తుమందులు, ఆయుధ రవాణాను అతిసులభంగా, తక్కువ ఖర్చుతో కొనసాగించడానికి దోహదపడుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూనే, ఉగ్రవాద నిరోధానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చు కోవాలని కోరింది. వర్చువల్ ఆస్తులు, సర్వీసు ప్రొవైడర్ల చెల్లింపు సేవల పర్యవేక్షణ, మనీ లాండ రింగ్‌ను అరికట్టడంలో ఎఫ్‌ఏటీఎఫ్ అనుసరిస్తున్న విధానాన్ని ప్రశంసిస్తూనే.. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను అడ్డుకునేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్నీ భారత్ నొక్కి చెప్పింది.
ఇదే సమయంలో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉండేలా సభ్యదేశాలు తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం సోషల్ మీడియా, ఆర్థిక సేవలు అందించే సంస్థల సహకారంతో ఆర్థిక పరమైన నిఘాను మరింత అభివృద్ధి పరచాలని కోరింది. తద్వారా ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను గుర్తించడానికి వీలవుతుందని పేర్కొంది. అంతేకాదు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయాన్ని నిరోధించడంలో ఎఫ్‌ఏటీఎఫ్ పాత్రను ఈ సందర్భంగా భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రశంసించాయి. 2018లో పాకిస్తాన్ గ్రే లిస్ట్‌లో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉగ్రవాద మూలాలు 75 శాతం వరకు తొలగిపోయాయని పేర్కొన్నాయి. నాలుగేళ్ల తర్వాత పాక్‌ను గ్రే లిస్ట్ నుంచి తొలగించడంతో మళ్లీ ఒక్కసారిగా 50 శాతం పెరిగాయన్న సంగతినీ మన ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తు చేశాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధక సదస్సుల్లో నిర్దేశించిన అంశాలను సభ్యదేశాలు అమలుచేయాలని ఈ డిక్లరేషన్ కోరింది. ఇదే సమయంలో ‘ఉగ్రవాదాన్ని దేశ విధానంగా మార్చుకున్న దేశాల’ పట్ల కఠినంగా వ్యవహరించా లని కోరింది. ‘ఉగ్రవాదానికి స్వర్గధామాలుగా ఉంటూ, వారికి ఆర్థిక, సాంకేతిక, ఇతరత్రా సహాయ సహకారాలు అందిస్తున్న వారిని దేశీయ, అంతర్జాతీయ చట్టాల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నద’ని పేర్కొంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్‌కు భారత్ ఆర్థిక సహాయం అందజేసింది.
స్వేచ్ఛా సమాజాలు ఉగ్రవాదం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్‌లోని షియా మసీదులో బాంబుపేలుడు, సోమాలియా కారు బాంబు పేలుడు, కోయంబత్తూలో బాంబుదాడి విఫలం కావడం వంటి ఉగ్రవాద సంఘటనలను పరిశీలిస్తే.. తీవ్రవాద నిరోధానికి అంతర్జాతీయ సహకారం ఎంత అవసరమో అర్థమవుతుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటమే భారత విదేశాంగ విధానంలోని ప్రధానాంశంగా చెప్పవచ్చు.
అను: జమలాపురపు విఠల్‌రావు