– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్
నవంబర్ 25 స్త్రీ హింసా నిరోధక దినం
ఇంటా బయటా, సైగలు, మాటలూ చేతలూ – ఏ రూపంలో ఉన్నా హింస హింసే! బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు – ఏ వయసువారి మీద అయినా నేరం నేరమే! అది విశ్వవ్యాప్త సమస్య. స్థానికం నుంచి అంతర్జాతీయం దాకా నానాటికీ పేట్రేగుతున్న మహ మ్మారి. ప్రాంతం, మతం, వర్గం, వర్ణం, భాష… అదీ ఇదీ అని కాకుండా అన్నింటినీ, అంతటినీ దారుణంగా కబళిస్తున్న రక్కసి. దీన్ని నిలువెల్లా తుత్తునియలు చేయాలంటే నిత్య సమరం చేసి తీరాల్సిందే అంటోంది ఐక్యరాజ్యసమితి. నవంబర్ 25న ‘స్త్రీలపై హింసను నిరోధించే / నివారించే దినోత్సవం’. ఈ ఒక్క రోజునే కాకుండా, వరసగా కొన్ని రోజులపాటు సమరభేరీ మోగిస్తూనే ఉండాలంటుంది. ప్రచారోద్యమాన్ని రెండు వారాలకుపైగా విస్తరించి, డిసెంబర్ 10 వరకూ కొనసాగిస్తా మని ఇప్పటికే ప్రకటించింది. నిజానికిది వనితల సమస్త, సకల, హక్కుల పరిరక్షణ మహోద్యమం అని ఐరాస చెప్తోంది. వ్యక్తిగతంగా, సంస్థాపరంగా వనితల నేతృత్వాన్ని విస్తృతపరచి; హింసోన్మాదం అంతు చూస్తామని మరింత ప్రస్ఫుటం చేస్తోంది. నానావిధాలుగా దాపురిస్తున్న నేరం కోరల్ని ముక్కచెక్కలు చేయడానికి పౌరసమాజంలోని ఇతరులంతా చేతులు కలపాల్సిందే. క్షేత్రస్థాయి వాస్తవాలను పసిగట్టి, రూపుమార్చుకుంటున్న వాటిని ఎండగట్టి, మహిళాలోకానికి సంపూర్ణ భరోసా కలిగించడం ఎలా? మౌనం వీడి ముందుకొచ్చేలా చేయడమే ఏకైక మార్గం. నిగ్గదీసి అడుగు- దండించేలా చూడు!
కాలిబాట అంటూ ఒకటుంది. అది సక్ర మంగా నడవటానికి. చట్టం, న్యాయం, నడక, నడత అన్నీ సరైన మార్గాలు. వాటిలోని ఏ ఒక్కదాన్నీ పట్టించుకో కండా ‘నా ఇష్టం నాదే’ అని విర్రవీగే వాళ్లకి కొదవలేదీ లోకంలో. గాలివాటుగా పోయే వాళ్ల చూపు మొదటపడేది ఆడపిల్లలపైనే! వావీవరసా ఏవీ ఉండవు. మంచిచెడుల తేడాలు తెలియవు.
నెలల పసికందుల నుంచి ముసలమ్మల వరకు ఎవరినీ వదలరు. అలాంటి నేరగాళ్ల కళ్లు అమాయ కులను వెదుకుతూ వెంటాడుతూ ఉంటాయి. అదను చూసి కసితీరా కాటేసే ఆ విషసర్పాల్ని ఎవరు కనిపెట్టగలరు? ఆలోచనలు వక్రం. మాటలు కుటిలం. చేతల్లో నంగనాచితనం. అవన్నీ కూడి ఎప్పుడు ఏ ప్రాణి ఉసురు తీస్తాయో, ఎవరి జీవితాల్ని ఎంతగా హరిస్తాయో చెప్పలేం. అసలు హింస అనేది ఎక్కడ ఏ విధంగా మొదలై కొనసాగుతుందో ఒక పట్టాన ఊహించలేం. అడుగడుగునా సుడిగుండాలే. వీటి నడుమ ఏ ఆడబిడ్డ చిక్కు పడుతుందో తెలుసుకోవడం కష్టతరమే. మునుపు డొమినికన్ రిపబ్లిక్ ప్రాంతాల్లో ముగ్గురు సోదరీమణులు రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లో నిండు ప్రాణాలు కోల్పోయారు. అదే విషాద సూచికగా, అటువంటిది పునరావృతం కాకుండా హింస వ్యతిరేక దిన ప్రకటన వెలువడింది. అధికారిక తీర్మానం, వివిధ దేశాల సంతకాల స్వీకరణం దశాబ్దాల క్రితమే జరిగి పోయింది. ఐరాస ఆశయం ఎలా ఉన్నా, దేశాల్లో స్థితిగతులు వేరు. ఎందరెందరో స్త్రీల మనసుకు ఏ దశలోనూ గుర్తింపు ఉండటం లేదు. పైగా వారి గౌరవానికి భంగం కలిగించేవే తామర తంపరగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబాయి తదితర మహానగరాల్లో బయటపడిన దురాగతాలు మొత్తం మానవతనే ప్రశ్నార్థకం చేస్తూ వచ్చాయి. పల్లెలోనైనా, పట్టణాల్లోనైనా సంఘటనలు ఎన్నటికీ మాయని మచ్చలుగా పరిణమించాయి. అవి హృదయ విదారకాలు, వ్యవస్థ ఘోర వైఫల్యానికి ఉదాహరణలు.
ఈ ప్రశ్నకు బదులేదీ?
ఆడవారి స్వేచ్ఛ, సమానత్వం గురించి అందరూ మాట్లాడతారు. ప్రచార ప్రసార సాధనాల సాక్షిగా రాజకీయులు, అధికారులు ‘ప్రవచనాలు’ గుప్పి స్తుంటారు. నీతిసూత్రాల తీరుతెన్నులు అటుంచి, బాధ్యతారహితులు చెలరేగుతూనే ఉన్నారు ఇళ్లల్లో హింస అనేది మామూలైపోయింది! ఎవరు ఎవరిని ఎన్ని విధాలుగా హింసించి చిత్రవధకు గురి చేస్తుంటారో లెక్క కట్టేదెవరు? వాస్తవం బయట పడినా; అది న్యాయస్థానాలకు చేరి, అవరోధులకు శిక్షలు పడిన సందర్భాలెన్ని? ఒకవేళ పడినా, చట్టాల నుంచి బహు చక్కగా తప్పించుకున్న వాళ్లు ఎంతమంది లేరు? అడపాదడపా దండనలు ఉంటున్నా, చాలా సమయాల్లో హింసలే ఎక్కువ. బాధితులు లేదా వారికి అండనందించిన వారు గొంతెత్తితే, మూయించడానికి ఎన్ని ‘ఏర్పాట్లు’ లేవు? శారీరకంగా, మానసికంగా హింసల తీవ్రతను తట్టుకోలేక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కదా! ఇవన్నీ సమాధానాలు లేని, రాని ప్రశ్నలు. అన్నీ సమస్యలూ సందేహాలే. నిజమా! నీవెక్కడ అని ఆక్రోశించక తప్పని రీతి. నరకయాతనకు ఆనవాళ్లు లెక్కలేనన్ని. ఆప్ఘనిస్థాన్‌లో హింసాత్మక నేరాల సంఖ్య అధికం. కాంగోలో నమోదయ్యే అత్యాచార సంబంధ కేసులు మిక్కుటం. హత్యకు గురయ్యే వనితలు రష్యా, జమైకా ఇతర ప్రాంతాల్లో ఎంతోమంది. పలు విధాల గృహహింసలు పాకిస్థాన్, సోమాలియా పరిసరాల్లో తరచుగా చోటు చేసుకుంటుంటాయి. మన దేశంలోనూ గతంలోనే హింస నిరోధక చట్టం తెచ్చినా, ఫలితాలు అంతంత మాత్రం, అరాచకాల్ని సహించబోమంటూ కేంద్రం ఆ మధ్య చేపట్టిన చర్యలు కొంతవరకు ప్రభావం చూపించాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు కర్తవ్య నిర్వహణలో ముందుంటున్నాయి. ఫ్రాన్స్‌లో ఎన్నెన్నో నిబంధనలు ఉన్నప్పటికీ ఆచరణపరంగా క్రియాశీలత తక్కువ. బొలీవియా వంటి చోట్ల బాధితుల బంధుమిత్రులు, సేవాసంస్థల కార్యకర్తలు కలిసి ఉద్యమిస్తున్నా ఆశించిన సత్వర ఫలితాలు స్వల్పమే. ఒక్క ప్రదేశంలో ఒక్కో విధమైన వాతా‘వరణ’ పరిస్థితి!
పాపం మూట కట్టుకున్నట్లే!
వందల దేశాల్లో పలు రకాల పరిణామాల పరంపర. స్పెయిన్‌లోనైతే అతివలపై హింస రోజుకో రకంగా మారిపోతూ వస్తోంది. కొరియా, సౌదీ అరేబియా ప్రాంతాల్లో అక్రమ రవాణా రివాజుగా మారుతోంది. విదేశాల వైనం అలా ఉంటే; స్వదేశంలో అందునా కొన్ని రాష్ట్రాల్లో అవాంఛనీయం తాండవిస్తూనే ఉంది. నేర గణాంకాల నమోదు సంస్థ జాతీయ స్థాయిలో వెల్లడించిన వివరాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. లైంగిక వేధింపులు, అపహరణలు, అత్యాచారాలు, ఇతరత్రా నేరాలు నిరుడు మరీ ఎక్కువ. దాడులూ, దౌర్జన్యాలూ యాసిడ్ పోసిన సంఘటనలూ హింసాత్మక రీతులను ప్రస్ఫుటం చేస్తూనే ఉన్నాయి. పరువు హత్యల గురించి విడ మరచి చెప్పాల్సిన పనేలేదు. ప్రాణాలు పోయేంతగా చేయడం, ఆ క్రమంలో అన్ని విధాలుగానూ హింసించడం పరిపాటిగా మారుతుండటమే దారుణాతిదారుణం, హేయాతి హేయం. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మరికొన్ని ప్రాంతాల్లో ఇటీవలి ఉదంతాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. షీ టీమ్‌లు, ఫ్రెండ్లీ పోలీస్ పద్ధతులను పదేపదే వల్లె వేస్తున్న తెలంగాణలో మహిళలకు పరిరక్షణ లోపించింది. ఒక దశలో – ‘హత్యా’చారాల రీత్యా మారుమోగాల్సి వచ్చిందా పేరు! అఘాయిత్యాలు, కట్నం వేధింపులు హెచ్చి, అదృశ్యం కేసుల దర్యాప్తు నత్తనడ కనసాగి ‘భద్రతా! నువ్వెక్కడ?’ అన్పించింది. ఆంధప్రదేశ్‌లో సైతం అంతే. భౌతికదాడులు, మూకుమ్మడి దురాగతాలు, సాధింపులు హెచ్చి, అదృశ్యం కేసుల దర్యాప్తు నత్తనడకన సాగి ‘భద్రతా! నువ్వెక్కడ?’ అన్పించింది. ఆంధప్రదేశ్‌లో సైతం అంతే. భౌతికదాడులు, మూకుమ్మడి దురాగతాలు, సాధింపులూ, వేధింపులూ పాపాల్లా పెరిగిపోయాయి. అత్యవసర సహాయం అందిస్తామన్న డయల్ 100 పలుమార్లు ప్రశ్నార్థ కంగా మారిందన్నది క్షేత్రస్థాయి సత్యం. రైల్వేస్టేషన్, ఆస్పత్రి వంటి చోట్లా అత్యాచారాలు సభ్య సమాజాన్ని నిశ్చేష్ట పరిచాయ. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటున్న పోలీసుశాఖ ఆచరణలో కనబరచింది ఏమిటన్నది ప్రశ్న.
ఎవరి కోసమీ ఎదురుచూపు…
ఏ రాష్ట్రంలోనైనా సరే, కేవలం ప్రభుత్వ ప్రకటన లతో రక్షణ ఊడిపడదు. క్రిమినల్ లా సవరణ చట్టాలు చేయడం మాత్రమే కాదు, ఆ నిబంధనల్ని పకడ్బందీగా అమలు జరపాలన్న కృతనిశ్చయమూ పాలకులకు ఉండాలి. నిర్భయ, దిశ, మనీషా సందర్భాలు ఏం చెప్తున్నాయి? లలనలపై నేరాలూ ఘోరాలకూ మూలకారణం మద్యపానం, పబ్‌లు, క్లబ్‌ల దుష్టసంస్కృతి సర్వాన్నీ భ్రష్టు పట్టించింది. శారీరక అవసరాలకీ ప్రాధాన్యమిచ్చే కొన్ని దేశాల తీరతెన్నులు, సామాజిక బాధ్యతను ఏనాడో విస్మరించిన చలనచిత్రాలు, వ్యసనగుణాన్ని వ్యాధిలా వ్యాపింపచేసే సామాజిక మాధ్యమాల వ్యవహారాలు తలా కొంత పాపాన్ని వరసబెట్టి మూటకట్టు కుంటున్నాయి. మద్యం క్రయ విక్రయాలు రెండూ సంఘానికి అరిష్టాలే. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపకపోవటం, ఏ నేరానికి ఏది శిక్ష అనేది బహిరంగంగా ప్రదర్శించకపోవటం రెండూ కూడా ప్రభుత్వాల తప్పిదాలే. సరిదిద్దుకోవాల్సిన పాలక పక్షాలు ఇంకా కళ్లు మూసుకుని నిద్ర నటిస్తూనే ఉంటున్నాయి. ప్రతిఘటించాల్సిన ప్రతిపక్షాలు ప్రచారాలూ హెచ్చరికలకే పరిమితమైపోతున్నాయి. సంస్కరణల పేరిట విద్యారంగాన్ని అన్ని రకాల మార్పు చేర్పులకూ లోనుచేస్తున్న సంస్థలు, సంఘాలు నీతిపాఠాల బోధనను మటుకు విస్మరిస్తూ వస్తు న్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ధోరణులు కొన్ని… బాల్యం నుంచే పిల్లలకు క్రమశిక్షణ నేర్వలేకపోతున్నాయి. వీటన్నింటినీ సవ్యంగా మలుచు కుంటేనే, వనితలపై హింసకు అడ్డుకట్ట పడి నట్లవుతుంది. ఎవరి కర్తవ్యం ఏమిటన్నది ఎవరికి వారికీ తెలుసు. అన్నీ తెలిసినా; ఎవరో వచ్చి ఏదో మంచి చేయాలని ఇంకా ఇంకా చూస్తుండడమే అసలు సమస్య!