– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఆచితూచి వ్యవహరించాలి. అత్యంత సంయమనంతో మాట్లాడాలి. సభ్యత, సంస్కారం పాటించి తీరాలి. ముఖ్యంగా మహిళల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పొరపాటున నోరుజారారో అది ఎక్కడికో దారితీస్తుంది. వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. మహిళలకు భారతీయత పెద్దపీట వేసింది. వారికి ప్రత్యేక గౌరవాన్ని కట్టబెట్టింది. వారిని తల్లి, చెల్లి పేరుతో ఆదరిస్తూ వచ్చింది. రంగు, రూపం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక మర్యాదను కల్పించింది. ఇదంతా ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఏ ఒక్కరికీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందునా ప్రజాజీవితంలో సుదీర్ఘకాలం ఉన్న నాయకులకు ఈ విషయం తెలియనిది కాదు. అయినప్పటికీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే దానిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అహంకారం అనుకోవాలా? అందునా ఒక మహిళ నాయకత్వంలోని పార్టీలో బాధ్యతాయుతమైన మంత్రి పదవి స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి?

పశ్చిమ బెంగాల్‌ ‌మంత్రి అఖిల్‌ ‌గిరి దేశ ప్రథమ పౌరురాలి  పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను చూసిన తరవాత ఇటువంటి నాయకులు ఇంకా ప్రజాజీవితంలో ఉన్నారా? అన్న అనుమానం కలగక మానదు. ఆదివాసీ వర్గం నుంచి వచ్చిన మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి బెంగాల్‌కు చెందిన మత్య్స శాఖ మంత్రి అఖిల్‌ ‌గిరి మాట్లాడిన మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. నందిగ్రామ్‌లో జరిగిన ఓ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ‘నేను అందంగా లేనని వారు (భారతీయ జనతా పార్టీ) అంటున్నారు. మేం ఎవరినీ వారి రూపం బట్టి అంచనా వేయం. రాష్ట్రపతి పదవిని గౌరవిస్తాం. కానీ మన రాష్ట్రపతి చూడటానికి ఎలా ఉంటారు?’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన 17 సెకన్ల వీడియో క్లిప్‌ ‌సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో అన్ని వైపుల నుంచి, అన్ని వర్గాల నుంచి పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక నాయకుడు, అందునా బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఇలా మాట్లాడవచ్చా అన్న విమర్శలు బలంగా వినిపించాయి. దేశ ప్రథమ పౌరురాలు, అందునా ఒక మహిళను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

ఒకసారి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తరవాత ఆమెను పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ గౌరవించాలి. రాష్ట్రపతి ఆషామాషీ పదవి కాదు. అది దేశ ఔన్నత్యానికి ప్రతీక. ఆమె ఏ ఒక్క పార్టీకో ప్రాతినిథ్యం వహించరు. యావత్తు జాతికి ఆమె ప్రతినిధి. రాజ్యాంగం ఆ పదవికి ప్రత్యేక గౌరవం, మర్యాద కల్పించింది. ప్రొటోకాల్‌ ‌రీత్యా ఆమె తరవాతే ఎవరైనా. ఈ విషయాలు ఎవరికీ తెలియనివి కావు. టీఎంసీ ఇటీవల ప్రారంభమైన కొత్త పార్టీ ఏమీ కాదు. పైగా ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది స్వయంగా ఒక మహిళ. పార్టీకి రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. వరుసగా మూడు దఫాలుగా అధికారంలో కొనసాగుతోంది. ఇక అఖిల్‌ ‌గిరి కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కాదు. రాష్ట్రంలోని రాంనగర్‌ ‌నియోజకవర్గానికి 2011 నుంచి వరుసగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఇంకెంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. కానీ రాష్ట్రపతిపై ఆయన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటే దానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అందుకు ఎవరు బాధ్యత వహించాలి? ఆయన ఇంకా మంత్రి పదవిలో కొనసాగుతున్నారంటే అందుకు బాధ్యత ఎవరిదన్న ప్రశ్న కూడా వినపడుతుంది?

అఖిల్‌ ‌గిరి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన తరవాత కూడా ఆయన వివరణ, పార్టీ ప్రతిస్పందన సంతృప్తికరంగా లేదన్న వాదన వినపడు తోంది. మంత్రి, ఆయన పార్టీకి సారథ్యం వహిస్తున్న మమత క్షమాపణ చెప్పాలని, ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్లు అన్ని వర్గాల నుంచి వచ్చాయి. అయితే మంత్రి గిరి, పార్టీ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం క్షమాపణలు చెప్పి తప్పించుకున్నారు. అంతటితో అది ముగిసిన అధ్యాయమన్న అభిప్రాయం కలిగించారు.  అంతేతప్ప ఆయనను పదవి నుంచి తప్పించేంత కఠిన నిర్ణయాన్ని మమత తీసుకోలేకపోవడం విమర్శలకు గురైంది. ‘రాష్ట్రపతిని అవమానించాలన్నది నా ఉద్దేశం కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులు నాపై చేసిన మాటల దాడికి బదులిచ్చాను. ఆ పార్టీ నాయకులు రోజూ నా రూపంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రపతిని అగౌరవ పరిచినట్లు ఎవరైనా భావిస్తే తప్పు. నాకు రాష్ట్రపతిపై అపారమైన గౌరవం ఉంది’ అని మంత్రి గిరి ఒక వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఆ తరవాత క్షమాపణ చెబుతూ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. గిరి కోణంలో చూసినా ఆయన వ్యాఖ్యలు సమర్థనీయం కావు. తన రూపం గురించి బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిని ఖండించడంలో తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలి. రంగు, రూపం వంటి అంశాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. కేవలం విధానాలు, సిద్ధాంతాల పైనే చర్చ జరగాలి. విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి. అంతేతప్ప వ్యక్తిగత అంశాలను ప్రస్తావించ రాదు. తనపై భాజపా నాయకులు చేసిన విమర్శలు, వ్యాఖ్యలు బాధ కలిగించినప్పుడు ఆ మేరకు వాటిని తిప్పికొట్టడంలో తప్పేమీ లేదు. కానీ ప్రథమ పౌరురాలిపై విమర్శలు చేయడం సమర్థనీయం కాదు.

సర్వత్రా నిరసనలు

గిరి వ్యాఖ్యలను బిహార్‌ ‌ముఖ్యమంత్రి నీతీశ్‌ ‌కుమార్‌ ‌తదితర నాయకులు ఖండించారు. అధికార టీఎంసీకి చెందిన జాతీయ అధికార ప్రతినిధి సాకేత్‌ ‌గోఖలే సైతం ఖండించారు. బెంగాల్లోని హుగ్లీ లోక్‌సభ సభ్యురాలు లాకెట్‌ ‌ఛటర్జీ అఖిల్‌పై ఢిల్లీ నార్త్ అవెన్యూ పోలీస్‌ ‌స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. రాష్ట్రపతి సొంత రాష్ట్రమైన ఒడిశాలో ఆగ్రహావేశాలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. నాలుగు పోలీస్‌ ‌స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మయూర్‌ ‌భంజ్‌ ‌జిల్లా బారిపదలో, బాలాసోర్‌ ‌జిల్లా తలసరిలో, సుందర్‌ ‌ఘర్‌, ‌నయాగడ పోలీస్‌ ‌స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. రాజధాని నగరం భువనేశ్వర్‌లోని పోలీస్‌ ‌స్టేషన్లో కూడా ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదైంది. నయాగఢ్‌ ‌పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు గిరికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒడిశాకు చెందిన కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, శాసనసభ్యుడు సురేశ్‌ ‌రౌత్రే మాట్లాడుతూ గిరిని తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయబోమని హెచ్చ రించారు. గిరి వ్యాఖ్యలపై కోల్‌కతా హైకోర్టులోనూ విచారణ సాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని ప్రధాన న్యాయ మూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం రాష్ట్ర డీజీపీని ఆదే శించింది. విచారణను డిసెంబర్‌ 12‌కు వాయిదా వేసింది.

రాష్ట్రపతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం విపక్షాలకు కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధురి రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అప్రతిష్ట పాలయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈయన ఆషామాషీ నాయకుడు కాదు. పార్లమెంటులో కాంగ్రెస్‌ ‌పక్ష నాయకుడు. అధీర్‌ ‌గతంలో రాష్ట్రపతిని ఉద్దేశించి ‘రాష్ట్రపత్ని’ అని చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎవరూ మరచిపోలేదు. వందేళ్లకు పైగా చరిత్ర గల పార్టీకి, అందునా నిన్న మొన్నటి దాకా స్వయంగా ఒక మహిళ (సోనియాగాంధీ) నాయకత్వం వహించిన పార్టీకి చెందిన నాయకుడైన అధీర్‌ ఎం‌త హుందాగా మాట్లాడాలి? మహిళా రాష్ట్రపతి పట్ల ఎలా వ్యవహరించాలన్న కనీస అవగాహన ఉండదా? సుదీర్ఘ కాలం నుంచి ప్రజాజీవితంలో ఉన్న నాయకుడికి రాష్ట్రపతికి, రాష్ట్రపత్నికి గల తేడా తెలియదా? ఇవేమీ తెలియనంత అమాయకుడేమీ కాదు అధీర్‌ ‌రంజన్‌. ‌కావాలనే ఆయన అనుచితంగా మాట్లాడినట్లు అర్థమవుతుంది. అటు అధీర్‌, ఇటు అఖిల్‌ ‌గిరి ఇద్దరూ బెంగాల్‌ ‌వారే. ఇద్దరు నాయకులు మహిళల నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులే కావడం గమనార్హం. రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌, ‌నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌వంటి దిగ్గజాలు జన్మించిన బెంగాల్‌ ‌గడ్డలో అధీర్‌ ‌రంజన్‌, అఖిల్‌ ‌గిరి వంటి నాయకులు తయారవడం కాలవైచిత్రి కాక మరేమిటి?

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE