ఘంటసాల శతజయంతి (1922-2022)

లలిత సంగీత, చలనచిత్ర నేపథ్య గాయక సమ్రాట్‌ ‌ఘంటసాల వేంకటేశ్వరరావు శతజయంతి (డిసెంబర్‌ 4) ‌సంవత్సరమిది. ఈ సందర్భంగా దేశవిదేశాల్లోని తెలుగువారు, వివిధ సాంస్కృతిక సంస్థలు, సంఘాలు అనేకానేక కార్యక్రమాల ద్వారా ఆయన దివ్యస్మృతికి నివాళులు అర్పిస్తున్నాయి. జీవించింది నిండా యాభయ్‌ ‌రెండేళ్లు. ఎన్నాళ్లు బతికామన్న దానికంటే బతుకును ఎంత బాగా ‘పండించుకున్నా’మనే ప్రశ్న ఉదయిస్తే, నిస్సందేహంగా ఆయనే జవాబుగా నిలుస్తారు. నిజమైన కీర్తి‘శేషులు’. అస్తమయం నుంచి వర్తమానం దాకా (నలభయ్‌ ఎనిమిదేళ్లు) లెక్కకు మిక్కిలిగా ఆరాధనోత్సవాలు, సంగీత విభావరులు, గుడులు, ఆరాధనలు. బహుశాః దేశంలో ఏ కళాకారుడికి/గాయకుడికి ఇంతటి అపురూప, అపూర్వ గౌరవం దక్కి ఉండదు. అన్నమయ్యాది వాగ్గేయకారుల తరువాత ‘స్వర నీరాజనం’ అందుకుంటున్న ఏకైక గాయకుడు ఆయనేనని చెప్పవచ్చేమో!! ఆయన గాత్రం, గానం తెలుగుజాతికి తిరుగు, తరుగులేని సంపద. ప్రతి తెలుగులోగిలి ఆయనను కుటుంబ సభ్యుడిగా భావిస్తోంది, ఆరాధిస్తోంది. ఆయన సంగతులను, విశేషాలను మురిపెంగా చెప్పుకుంటోంది. కూనిరాగం తీయని వారు ఉండనట్లే ఘంటసాల వారి గీతాలలో ఒక పంక్తి, పదాన్నయినా ఆలపించని తెలుగు వారు ఉండరనడంలో అతిశయం లేదు. ఆయన అస్తమయం తరువాత ఉదయిస్తున్న తరాలు కూడా ఆయన గానాన్ని ఆస్వాదించడం ఆ గాత్ర మాధుర్యానికి ఉత్తమ నిదర్శనం.

ఆ సుమధుర గాయకుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం, నిరాడంబరత, కృతజ్ఞభావం, వినయ విధేయతలు, నిజాయతీ, వృత్తిపట్ల నిబద్ధత, అంకితభావం, జీవిత, నేపథ్య గాన ప్రస్థానాలలో ఎగుడు దిగుడులు, వాటిని అధిగమించిన తీరు అభిమానులకు, ప్రత్యేకించి వర్ధమాన గాయనీగాయకులకు స్ఫూర్తిదాయకాలు. స్వాతంత్య్ర అమృతోత్సవ్‌ ఈ ‌మహాగాయకుడి శతజయంతి వత్సరం కావడం మరో విశేషం. ఆయన జీవిత•, సంగీత ప్రస్థానం విశేషాలు ‘జాగృతి’ పాఠకుల కోసం..

‘పాడమని నీ ఆజ్ఞ అయినప్పుడు నా గుండె గర్వంతో పగులుతుందేమో అనిపిస్తుంది. సంతోషంతో సాగారాన్ని దాటే పక్షిలా నా భక్తి రెక్కలను చాచుకుంటుంది’ అన్నారు విశ్వకవి రవీంద్రుడు. ఆయన మాటలలోని ప్రత్యక్షర నిదర్శనం ఘంటసాల. అశాశ్వతమైన జీవితంలో అజరామరమైనది లలితకళ అని విశ్వసించి, సంగీతంలో సమున్నతుడైన ఆయన, భగవంతుడు తనకు ప్రసాదించిన కళను పరమాత్మ ప్రతిరూపాలైన రసజ్ఞులకు అర్పించిన గానగంధర్వుడు.

డిసెంబర్‌ 4, 1922 ‌తేదీన కృష్ణాజిల్లా చౌటుపల్లిలో సామాన్య కుటుంబంలో పుట్టి పట్టుదల, కృషితో లలిత, చలనచిత్ర నేపథ్య గాయకుడిగా అసామాన్య స్థాయికి చేరారు. తండ్రి సూర్యనారాయణ స్ఫూర్తితోనే సంగీతాభిలాషకు పడిన బీజం పెరిగి వటవృక్షమైంది. తండ్రిగారు తరంగ గానంలో దిట్ట. అందులో ప్రత్యేక కృషి చేశారు. తమ మృదంగ వాద్యానికి అనుగుణంగా తనయుడితో నృత్యం చేయించేవారు.

ఏకాగ్ర సాధన-అనితర విజయం

 ‘కార్యాతురాణానం న నిద్ర.. న సుఖం’ అని ఆర్యోక్తి ఘంటసాల వారి విషయంలో అక్షరాల నిజమైంది. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని ఆయన రుజువు చేశారు. సంగీతం నేర్చుకోవాలనే తపన. అందుకు అనుకూలించని పరిస్థితులు. తండ్రిగారు చిన్నప్పుడే కాలం చేయడంతో తారుమారైన కుటుంబ ఆర్థిక స్థితి.

‘సంగీతజ్ఞులు,మృదంగ కళాకారులైన మా తండ్రి సూరయ్య గారు ఆ వాయిద్యాన్ని వీపున కట్టుకుని, నన్ను భుజానికెక్కించుకుని భగవత్‌ ‌సంకీర్తనలకు ఎంత దూరమైనా ప్రయాణించే వారు. మృదంగ ధ్వనికి అనుకూలంగా నాతో నృత్యం చేయించేవారు. కళాభిమానులు నన్ను ‘బాలభరతుడు’ అని అభినందిస్తూ పతకాలు, బహుమతులు ఇచ్చేవారు. తండ్రిగారు చివరి రోజుల్లో (ఘంటసాల 11వ ఏట) దగ్గరకు తీసుకొని సంగీత విద్యలో తరించ వలసిందిగా ఆదేశిస్తూ ఉండేవారు. వారి యావజ్జీవ తపఃఫలమే నా అభ్యుదయానికి కారణం అని నా నమ్మకం. మా తండ్రిగారు పోయిన తరువాత నా చదువు సంధ్యలు తిన్నగా సాగలేదు. దృష్టి ఎప్పుడూ ఆటపాటలపైనే ఉండేది. ఒక సంగీత సమావేశంలో నేనూ, నా సంగీతం ఎంతో నవ్వుల పాలవడం జరిగింది. నాటి నుంచి ఒకే వేదన ప్రారంభమైంది. ఏమైనా సరే సంగీత విద్య సాధించాలి అని నాలో నేను శపథం చేసుకుంటూ ఉండేవాణ్ణి. తండ్రిగారి ఆత్మకు శాంతి కలిగించాలి. నన్ను అపహాస్యం చేసిన వారిని సంగీత విద్యలోనే ప్రతీకారం తీర్చుకోవాలి అనేదే నా నిరంతర ధ్యాస.’ అని బాల్యస్మృతులను చెప్పుకున్నారు. ఆయన ప్రతిన ‘స్పర్థయా వర్ధతే విద్య’ అనే సూక్తే తప్ప ప్రతీకారం కిందికి రాదు. ‘సంగీత శిక్షణ కోసం చుట్టుపక్కల విద్వాంసులను చాలా మందిని ఆశ్రయించాను. అయితే గురుకుల వాసదీక్షకు నాటి నా బాల్య ప్రవృత్తి తట్టుకోలేక పోయింది. ఆనాటికి ఆంధ్రదేశంలో ఏకైక సంగీత కళాశాల విజయనగరంలో మాత్రమే ఉంది. అక్కడికి వెళ్లడానికి తగిన ప్రోత్సాహం యింట్లో లభించే ఆశ లేకుండా పోయింది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా చేతికున్న బంగారు ఉంగారం విక్రయించి విజయ నగరం చేరుకున్నాను’ అని పేర్కొన్నారు.

కళాశాలకు సెలవులని తెలియక విజయనగరం చేరిన ఆయనకు భోజన వసతి లోపించింది. మహారాజ వారి సత్రంలో ఆంగ్లం, సంస్కృతం, సంగీత విద్యార్థులకు ఉచిత భోజన వసతి ఉన్నా, కళాశాల పునః ప్రారంభంతోనే అవి అందుబాటులోకి వస్తాయి. అందాక ‘మధూకరం’ అనివార్యం. సెలవుల అనంతరం కళాశాలలో ప్రవేశం లభించింది. కళాశాల ప్రిన్సిపల్‌ ‌ద్వారం వేంకట స్వామి నాయుడు సూచన మేరకు గాత్ర సంగీత విభాగంలో చేరారు. పట్రాయని సీతారామశాస్త్రి శిష్యరికంలో ఆరేళ్లు శాస్త్రీయ సంగీతం అభ్యసించి పట్టా అందుకున్నారు. ప్రభుత్వ సంగీత పరీక్ష హయ్యర్‌ (‌విద్వాన్‌)‌లోనూ ఉత్తీర్ణత సాధించారు. విజయనగరం పాఠశాలలో చేసిన సంగీత కచేరికి పరవశించిన హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు తంబురా బహుకరించారు.

స్వగ్రామం చేరి శ్రీరామనవమి, గణపతి, శారదా నవరాత్రులు, వివాహాల్లో సంగీత కచేరీలు చేశారు. అయితే వీటివల్లనే జీవితం గడపడం భారమని పించింది. బతుకుతెరువుకు సంగీత కచేరీ కన్నా నాటక ప్రదర్శనలు, హరికథలే లాభదాయకమని పించాయి. పైగా చిన్నతనం నుంచి నృత్యం, నాటక కళ పట్ల అభిరుచి, ప్రవేశం ఉండడంతో స్వయంగా నాటక సమాజాన్ని ప్రారంభించారు. నాటి రంగస్థల దిగ్గజాలు అద్దంకి శ్రీరామమూర్తి, పారుపల్లి సుబ్బారావు, పారుపల్లి సత్యనారాయణ, సూరిబాబు, రఘురామయ్య, పులిపాటి వేంకటేశ్వర్లు, పీసపాటి నరసింహ మూర్తి తదితర ప్రముఖులతో పరిచయం కావడంతో పాటు వారిలో కొందరితో నటించే అవకాశం కలిగింది.

నేపథ్యగాయక ప్రస్థానం

చిత్రసీమలో అప్పటికే కవిగా లబ్ధప్రతిష్టు లైన సముద్రాల రాఘవాచార్యులు స్వగ్రామం పెదపులి పర్రు ఘంటసాల అత్తవారిల్లు. అక్కడ పాటలు విన్న సముద్రాల ‘మంచి కంఠం పెట్టుకుని ఇక్కడెందుకు? మద్రాసు వచ్చి నీ అదృష్టం పరీక్షిం చుకో’ అని హితవు చెప్పి, తమ వద్దకు రప్పించు కున్నారు. సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే ఘంటసాల సినిమా ప్రారంభ జీవితం పూలబాట కాదు. ‘నీ గొంతు మైక్‌కు సరిపడదు’ అనే నిరసననూ (తర్వాత్తర్వాత ‘మమ్మల్ని మరచారా?’ అంటూ వారే మరీ పాడించుకున్నారు) ఎదుర్కొ న్నారు. అయినా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే, తెరపై చిన్నచిన్న పాత్రలు వేసి, బృందగానాలలో గొంతు కలుపుతూ, ఆకాశవాణిలో లలితగీతాలు పాడుతూ వచ్చారు. ఆకాశవాణిలో అవకాశం కల్పించిన అప్పటి అక్కడి కార్యనిర్వహ ణాధికారి బాలాంత్రపు రజనీకాంతరావు, తాను సంగీతం సమకూర్చిన ‘స్వర్గసీమ’లో (హారేహా.. లే యెన్నెల చిరునవ్వుల / ఇరజిమ్ము బఠాణి/ నీ రాక కోరి నీదారి గాచియున్నానే) పాడించారు. ఆ చిత్రతో పాటు బాలరాజు, రత్నమాలలో పాడినా, ‘లైలా మజ్ను’ లోనే మొదటిసారిగా పేరు కనిపించింది. ఈ తరువాత నుంచి.. ఆ గాత్రం కంచు కఠంలా మూడు దశాబ్దాల పాటు చిత్రసీమను అద్వితీయంగా ప్రభావితం చేసింది. ఆయనది శాస్త్రీయ కంఠం (గాత్రం). శాస్త్రీయ సంగీత కచేరీలతో మరింత విశేషంగా రాణించ వలసిన స్వరం. చలనచిత్ర నేపథ్య గాయకుడిగా అత్యున్నత శిఖారాన్ని అధిరో హించినా అందుకు తొలి సోపానం శాస్త్రీయ సంగీత కచేరీలు కాగా, లలితగీతాల గానం మలిమెట్టు. చిత్ర పరిశ్రమ ప్రవేశానికి ముందు శాస్త్రీయ సంగీత కచేరీలు చేసి, అనంతర కాలంలో లలిత సంగీతం వైపు మొగ్గు చూపారు. ఉపాధి కోసం లలిత సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చినా తాను అభ్యసించిన శాస్త్రీయ సంగీతాన్ని అమితంగా ఆరాధించారు. సందర్భం వచ్చినప్పుడల్లా తమ అభిరుచి మేరకు ఆ తరహా గీతాలు పాడారు, బాణీలు కట్టారు. జయభేరి, జగదేకవీరునికథ, మహాకవి కాళిదాసు, సప్తస్వరాలు, సంగీతలక్ష్మి వంటి చిత్రాలలో ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ‘శాస్త్రీయ సంగీతమంటే అర్థం కాని ఏదో పదార్థమని కొందరి అభిప్రాయం. అది తప్పు. సంగీతం అంటే భావోద్వేగా లను వ్యక్తపరిచే భాష. స్వరసముదాయాల కలయిక చెవులకు ఇంపుగా ఉన్నప్పటికీ సంగీతం అనిపించు కోదు. అంతకు మించిన భావప్రకటన దీప్తి కావాలి. సంగీతం రసానందం పొందడమంటే రాగతాళాలతో తన్మయత్వం చెందడమే కాకుండా అంతకంటే ఆత్మీయమైన అనుభూతి పొందడం’ అని శాస్త్రీయ సంగీత విశిష్టతను వివరించేవారు. అయినా, ఎవరు ఎంతగా ప్రయత్నించినా త్యాగరాజ కృతులు వంటి రికార్డింగ్‌కు సాహసించ లేదు. శాస్త్రీయ సంగీతం పాడాలంటే నెల, రెండు నెలలు సాధన చేయవలసి ఉంటుందని, గొంతు దానికి అలవాటు పడితే లలితగీతాలు/పాటలు పాడడం కష్టమని, తన ఇష్టం నిర్మాతలకు నష్టకారణం కాకూడద న్నది ఆయన అభిప్రాయం. అలా తన అభిరుచిని త్యాగం చేయడా నికి ఎంత మధనపడి ఉంటారో కానీ, ఆ నిర్ణయం సినీ నేపథ్య సంగీతం చేసుకున్న పుణ్యంగా చెప్పవచ్చు. ‘నా నుంచి ఏమీ ఆశించకుండా ఎంతో అమాయకంగా అభిమానంతో నా పాటలు విని తమ సొంత మనిషిలా ప్రేమించే అసంఖ్యాక శ్రోతలే నాకు నిజంగా మిగిలి పోయే ఆఖరి బంధువులు. రుణపడడం అంటూ ఉంటే వారికే ఆజన్మాంతం రుణపడి ఉంటాను’ అని విదేశాలకు సంగీత విభావరికి వెళ్లే ముందు నెల్లూరులో ఏర్పాటైన సన్మాన సభలో (ఆగస్టు 22,1970) అన్న మాటలూ లలిత సంగీతంవైపునకు మొగ్గడానికి కారణం కావచ్చు.

1940-75 సంవత్సరాల మధ్యకాలం తెలుగు సినిమా పాటకు స్వర్ణయుగం కాగా, తన మధుర గానంతో లలిత, సినీ నేపథ్య సంగీతాన్ని సుసంపన్నం చేసిన అగ్రగామి ఘంటసాల. గాయకుడిగా, సంగీత దర్శకుడుగా ఆయనలా ఎవరూ ప్రయోగాలు చేయ లేదని సమకాలీనులే చెబుతారు. సంగీత విమర్శకులు వీఏకే రంగారావు విశ్లేషించినట్లు ‘దాదాపు మూడు దశాబ్దాలు తిరుగులేని నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా చలామణి కావడానికి కారణం విద్యా? సంగీత సాహిత్యాలలో సమాన ప్రతిభగలవారు నాడు లేకపోలేదు. అయినా ఆయనకు దక్కిన రాణింపులో పదవ వంతు కూడా దక్కలేదు’. వారి కంటే ఘంటసాల ఎందులో అధికుడన్న ప్రశ్నకు జవాబు ‘వినయం, నిబద్దత, అంకితభావం, నిరంతర సాధన’ లాంటి సలక్షణాలు కావచ్చు. ఆ విశేషాలు మరోకసారి.

About Author

By editor

Twitter
YOUTUBE