వివాదాల పరిష్కార పక్రియ- ఆంగ్లంలో Dispute Redressal Mechanism. దీనిని మానవ సమాజ పరిణతికి గీటురాయిగా సామాజిక శాస్త్రజ్ఞులు భావిస్తారు. ఈ వివాద పరిష్కార యంత్రాంగాన్నే న్యాయ వ్యవస్థ లేదా న్యాయస్థానాలని పిలుచుకుంటాం. న్యాయస్థానాలలో కక్షిదారుల తరపున వాదించే వారిని న్యాయవాది, వకీల్‌, ‌ప్లీడర్‌గా వ్యవహరిస్తుంటాం. వివిధ చట్టాలు, నియమ నిబంధనలను ఆయా కక్షిదారుల తరపున విపులీకరించి, విశ్లేషించి వాదించే న్యాయవాదులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి.

భారత స్వాతంత్య్రోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి, జన బాహళ్యంలోనికి తీసుకెళ్లిన గాంధీజీ, మోతీలాల్‌ ‌నెహ్రూ, సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌, ‌తేజ్‌ ‌బహదూర్‌ ‌సప్రూ, ప్రకాశం పంతులు వంటివారి పేర్లు అందరికి పరిచితమే. గాంధీజీ తన పర్యటనలో ఆయా ప్రాంతాల ప్రముఖ న్యాయవాదుల ఇళ్లకు వెళ్లి వారిని స్వాతంత్య్రోద్యమంలో ఎలా భాగస్వాములను చేసేవారో ఆనాటి నేతల ఆత్మకథలు చదివితే తెలుస్తుంది.

వ్యక్తులు తాము ఎదుర్కొంటున్న కొన్ని సామాజిక, న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదుల దగ్గరకు వెళతారు. ఇదంతా కేవలం కేసులు వాదించటం, తీర్పులు తేవడం కాదు. సమస్యల మూలాన్ని గుర్తించి, విశ్లేషించడం. ఆయా వర్గాల, సమూహాల, వ్యక్తుల ఆకాంక్షలను, ఆవేదనలను పరిగణనలోనికి తీసుకుని, వాటికి అక్షరరూపం ఇచ్చి, ఒక క్రమపద్ధతిలో చెప్పడం (Articulate Action) కూడా. సమాజ ఆలోచనా పక్రియను ఒక క్రమపద్ధతిలోకి మళ్లించే పనిలో న్యాయవాది కీలకపాత్ర వహిస్తారు. ఇది నిరంతర పక్రియ.

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ప్రకటించినట్లు, ‘బలహీనులైన పౌరులకూ, దుందుడుకుతనంతో ఉన్న రాజ్యానికీ మధ్య నిలబడడానికి ఏ రోజునైతే న్యాయవాది నిరాకరిస్తాడో ఆ రోజే అరాచకానికి పునాది పడుతుంది.’ అంటే న్యాయవాది ఒక ‘సామాజిక రక్షణ కవచం’ వంటివాడు.

అలాంటి న్యాయవాదులను ఒకే గొడుగు కింద తీసుకువచ్చి సామాజిక సేవలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ప్రారంభమైన సంస్థ ‘అఖిల భారతీయ అధివక్తా పరిషత్‌’. 1992‌లో భారతీయ తత్త్వవేత్త దత్తోపంత్‌ ‌ఠేంగ్డే మార్గదర్శకత్వంలో ఇది ఒక రూపును సంతరించుకుంది. అంతకుముందే, అంటే, 1975 నాటి ఎమర్జెన్సీలోను, తరువాత 1990-92 అయోధ్య రామ జన్మభూమి ఉద్యమ సందర్భంగా సామాన్య ప్రజల కోసం వివిధ రాష్ట్రాలలో ఏర్పడిన న్యాయవాద సంఘాలన్నీ 1992 నుంచి అఖిల భారతీయ అధివక్తా పరిషత్‌ ‌ఛత్రం కిందకు వచ్చాయి.

కేరళలో అభిభాషక పరిషత్‌, ‌తెలుగు రాష్ట్రాలలో న్యాయవాద పరిషత్‌, ‌తమిళనాడులో వరక్కిరగళ సంఘ్‌, ‌పశ్చిమ బెంగాల్‌లో జాతీయ న్యాయవాదుల వేదిక వంటి పేర్లతో ఆయా రాష్ట్రాలలో శాఖలు ఏర్పడ్డాయి.

సమాజంలో పనిచేస్తున్న సజ్జన శక్తికి అండగా నిలబడటమే అధివక్తా పరిషత్‌ ‌ప్రధాన కర్తవ్యం. వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యమకారులకు సరైన రీతిలో న్యాయ సహాయం అందించటం మరొక ముఖ్య కార్యక్రమం. న్యాయ వ్యవస్థలో చట్ట నిబంధనల విశ్లేషణ వాటి అమలు విషయంలో భారతీయ విలువలు భూమిక వహించే వాతావరణాన్ని నిర్మించే పక్రియను న్యాయవాద పరిషత్‌ ‌జాతీయ స్థాయిలో చేపట్టింది. న్యాయ వ్యవస్థను పాశ్చాత్య వలసవాద ప్రభావం నుంచి విముక్తం చేసే ప్రయత్నాలు చేపడుతున్నది.

న్యాయ సిద్ధాంతాలు, వాటి భూమికను ఆంగ్లంలో Juris Prudence (జ్యురిస్‌ ‌ప్రుడెన్స్) అం‌టారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ పాశ్చాత్య వలసవాద ఆంగ్లో సాక్సన్‌ (Anglo Saxon) జ్యురిస్‌ ‌ప్రుడెన్స్ ఉన్నదని, దానిని మార్చి భారతీయ న్యాయసూత్రాలను వివిధ పరిష్కార పక్రియలో తీసుకురావాలని ఠేంగ్డేజీ వంటి పెద్దలు అభిషిం చారు. దీనికై న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాస్త్ర పండితులను ఒకే తాటిపై తీసుకు వచ్చేందుకు పరిషత్‌ ‌కృషి చేస్తున్నది.

వర్తమాన భారతీయ సమాజంలో వివిధ వర్గాల, సమూహాల ఆకాంక్షల సరైన దిశలో నెరవేరాలంటే న్యాయవాద సిద్ధాంత పక్రియ భారతీయ విలువల ఆధారంగా నడవాలి. అదే పక్రియతో న్యాయ స్థానాలూ పనిచేయాలన్నది జాతీయవాదుల ఆకాంక్ష. ప్రతి దేశానికి కొన్ని మౌలిక విలువలు ఉంటాయి. ఆ విలువలే ఆ ‘దేశ ఆత్మ’.

ఒక న్యాయసూత్రాన్ని ప్రతిపాదించి విశ్లేషించి, ఇక్కడి భారతీయ విలువల ఆధారంగా వివిధ అంశాలకు అన్వయించాలని, దీనిని సాధ్యం చేయాలంటే ఆలోచనా పద్ధతిలో మౌలిక మార్పు తీసుకురావాలని పరిషత్‌ ‌ప్రయత్నం. కొత్తగా న్యాయ వాద వృత్తిలోనికి ప్రవేశించే వారికి మెలకువలు నేర్పించి దిట్టమైన న్యాయవాదులుగా రూపొందించి వారిని సమాజ సేవకు మళ్లించే పనిని పరిషత్‌ ‌చేపట్టింది.

దేశవ్యాప్తంగా 600 జిల్లాలలో ఉన్న అధివక్తా పరిషత్‌, ‌జాతీయవాద శక్తులు, సమాజంలో మంచికోసం ఆరాటపడే వ్యక్తులకు అండగా నిలిచే న్యాయవాద బృందాలను ఏర్పరచింది.

సమాజ కార్యం ఈశ్వరీయ కార్యం అన్న పెద్దల ఆలోచనకు అనుగుణంగా గోష్టులు, సృజనాత్మకత, సమావేశాల ద్వారా న్యాయవాదులను తీర్చిదిద్దే దిశగా పరిషత్‌ ‌పని చేస్తున్నది. కార్యోన్ముఖులైన వారికి అండగా నిలవడం ప్రధానమైన పనిగా చేపట్టింది. భారతీయ తాత్త్విక చింతన ఆధారంగా న్యాయవ్యవస్థ పని చేసే వాతావరణాన్ని రూపొందించడం పరిషత్‌ ‌ధ్యేయం.

– సమాచారి

About Author

By editor

Twitter
YOUTUBE