– బంకించంద్ర చటర్జీ
7
ఆ రాత్రి శాంతికి మఠంలోనే బస చేయడానికి అనుమతి లభించింది. అందుచేత ఆమె తన గదిని అన్వేషించడంలో నిమగ్నురాలయింది. చాల గదులు ఖాళీగానే ఉన్నాయి. గోవర్ధనుడనే పరిచారకుడు ఆమెకు అన్ని గదులు చూపిస్తున్నాడు. కాని ఏ గదీ ఆమెకు వాసయోగ్యంగా కనిపించడం లేదు. శాంతి ‘‘సంతాన సోదరా! అటువైపు గదులు కూడా చూపించు’’ అంది.
‘‘ఆ గదులు ఇంతకంటే బాగుండేమాట నిజమే. వానిలో సంతాన సేనాపతులు ఉంటున్నారు.’’
‘‘ఎవరు వారు?’’
‘‘భవానందుడు, జీవానందుడు, ధీరానందుడు, జ్ఞానానందుడు. ఆనందమఠం ఆనందులమయమే కదా!’’
‘‘పద. ఆ గదులు పరికిద్దాం.’’
గోవర్ధనుడు ముందు శాంతికి ధీరానందుని గది చూపించాడు. ధీరానందుడు ఆ సమయంలో ద్రోణపర్వం చదువుకుంటున్నాడు. అతడు శాంతితో మాట్లాడలేదు. ఆమె కూడా పలకరించలేదు.
తరువాత భవానందుని గదికి తీసుకువెళ్లాడు. భవానందుడు ఊర్ధ్వ దృష్టితో ఎటో పరకాయించి చూస్తున్నాడు. అతడు చూస్తున్న వైపు ఒక ముఖచిత్రం ఉన్నది. ఎవరిదో తెలియదుగాని, చాల సుందరమైన ముఖం. భవానందుడు ఈ శోభామయమైన రూపాన్ని ఉపాసిస్తున్నాడు. ధ్యానిస్తున్నాడు. అతడు శాంతి రాకను గమనించనే లేదు.
శాంతి ఆ తరువాత మూడవగదిలోనికి వెళ్లింది. ‘‘ఇది ఎవరి గది?’’ గోవర్ధనుడు ‘‘జీవానందస్వామిది’’ అన్నాడు. ‘‘ఇంకా ఎవరున్నారు? గదిలో ఎవరూ లేరే!’’
‘‘ఎక్కడికో వెళ్లి ఉంటారు. బహుశా, ఈ క్షణంలోనో, మరుక్షణంలోనో రావచ్చును.’’
‘‘ఈ గది అన్నిటికంటే ఉత్తమంగా ఉంది.’’
‘‘కాని ఈ గదిలో మీకు అవకాశం ఉండదు.’’
‘‘ఎందువల్ల?’’
‘‘జీవానందస్వామి ఉంటున్నారు.’’
‘‘నేను ఈ గదిలోనే ఉంటాను. వారినే మరో గది చూచుకోమని చెప్పు.’’ ‘‘అలా కుదరదను కుంటాను. జీవానందస్వామి ఈ గదికి యజమాని. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగటానికి వీలులేదు.’’
‘‘సరే. నీవు వెళ్లు. నాకు ఎక్కడా చోటు దొరక్క పోతే, ఏ చెట్టునీడనో పడుకుంటానులే’’ అని శాంతి గోవర్ధనుడిని పంపివేసింది.
శాంతి జీవానందుని పులిచర్మం పరుచుకుని పడుకుంది. దీపం పెద్దది చేసి పుస్తకం చదువుకో సాగింది.
కొద్దిసేపు గడిచాక జీవానందుడు గదిలోనికి వచ్చాడు. శాంతి పురుషవేషాన్ని గమనించాడు. గుర్తించగలిగాడు. ‘‘ఇదేమిటి శాంతీ?’’ అని పలక రించాడు.
శాంతి పుస్తకం పక్కన పెట్టి, నింపాదిగా జీవానందుని వంక చూచి ‘‘మహాశయా! శాంతి ఎవరు?’’ అని అడిగింది.
జీవానందుడు అవాక్కు అయినాడు. చివరకు ‘‘శాంతి ఎవరా? నీ పేరు శాంతి కాదా?’’ అన్నాడు.
‘‘నా పేరు నవీనానందస్వామి!’’ ఇలా చెప్పి శాంతి తిరిగి పుస్తక పఠనంలో మునిగిపోయింది.
జీవానందుడు విరగబడి నవ్వాడు. ‘‘ఇది కొత్తరకం వినోదంలా ఉంది. మంచిది. శ్రీశ్రీ నవీనా నందస్వామిజీ! నీవు ఏ ఆలోచనతో ఇక్కడకు వచ్చావు?’’
‘‘ముందు మర్యాద, తరువాత నీవు, ఇది బాగానే ఉంది.’’
‘‘స్వామీ! ఏమి ఆజ్ఞ! తాము భర్కయీపురం నుంచి ఏ మిషతో ఇక్కడకు ఏతెంచారు?’’
శాంతి మరింత గంభీర స్వరంతో ‘‘ఇక్కడ వ్యంగ్యం అవసరం లేదు. భర్కయీపురం ఏమిటో, ఎక్కడో నాకు తెలియదు. నేను సంతాన ధర్మగ్రహణం నిమిత్తం వచ్చాను. దీక్ష పుచ్చుకున్నాను’’ అంది.
‘‘నిజంగానా? అంటే, అంతా సర్వనాశనం అయిందన్నమాట!’’
‘‘సర్వనాశనం ఎలా అవుతుంది? మీరూ దీక్షితులే కదా!’’
‘‘నీవు కేవలం స్త్రీవి!’’
‘‘నేను స్త్రీనా? ఎవరు చెప్పారు మీకు?’’
‘‘నా విశ్వాస్వం, నా భార్య స్త్రీయేనని!’’
‘‘తమకు భార్య ఉన్నదాయేమి?’’
‘‘అవును. ఆ భార్యవు నీవే అనిగూడా స్పష్టంగా చెబుతున్నాను. తెలుస్తోందా?’’
‘‘అయితే ఇప్పుడేం చేస్తారు?’’
‘‘బలవంతంగానైనా నీ అధరామృతం తాగుతాను!’’
‘‘బహుశా మీ దృష్టిలోపం అనుకుంటాను. దీక్ష సమయంలో మీరు చేసిన శపధం ఎట్టిది? నేను మీ స్త్రీని అనుకున్నా, నాతో ఏకశయ్యపై ఎలా శయని స్తారు? మీరు రజుసర్పభ్రాంతిలో ఉన్నారనిపిస్తోంది. మీరు ఇప్పటికైనా తెలివితెచ్చుకుని వేరే శయనం ఏర్పరుచుకోండి.’’
ఈ మాటలు చెప్పి శాంతి తిరిగి తన పుస్తక పఠనంలో మునిగిపోయింది. జీవానందుడు తనకు వేరొక శయ్య ఏర్పాటు చేసుకున్నాడు.
తృతీయ భాగము
1
భగవంతుని దయవలన 76వ సంవత్సరం సమాప్తమయింది. బంగాళదేశంలో రూపాయికి ఆరణాల వంతు జనాభా-ఆ సంవత్సరం కాల గర్భంలో కలిసిపోయింది. డెబ్బెయేడవ సంవత్సరం ఈశ్వరుడు ప్రసన్నుడుగా తయారయినాడని చెప్పుకోవచ్చును. వర్షాలు సకాలంలో కురిసినాయి. పృథ్వి సస్యశ్యామలం అయింది. పోయిన సంవత్సరం వచ్చిన కరవుతో చనిపోగా మిగిలినవారు ఈ సంవత్సరం కడుపు నిండా భోజనం చేయగలిగారు. ఈ యేడు పంటలు బాగా పండినాయి. కాని తినేవాళ్లు ఏరీ?
గ్రామాలన్నీ నిర్మానుష్యమైనాయి. ఇళ్లన్నీ గొడ్ల సావిళ్లయినా, నివసించేవాళ్లు లేకపోవడంవల్ల. ఇలా ఒకటి, రెండు, మూడు సంవత్సరాలు గడిచి పోయినాయి. అరణ్యం పెరిగిపోతూ ఉంది. పూర్వం మనుషులు నివసించిన స్థలంలోనే ఇప్పుడు, పశువులు, క్రూరమృగాలు విచ్చలవిడిగా తిరుగుతు న్నాయి.
ఇక్కడ సంతాన సంప్రదాయంవారు విష్ణు పాదపద్మాలను తులసిమాలతో పూజిస్తున్నారు. పిస్తోళ్లు, తుపాకులు ఇళ్లలో కనిపిస్తే చాలు, వాటిని గుంజుకుని వచ్చి తమ దగ్గర దాచుకుంటున్నారు. భవానందుడు సాటి యోగులతో ఇలా చెప్పాడు: ‘‘సోదరులారా! ఎవరి ఇంట్లోనయినాసరే, మణిమాణి క్యాలు, చెడిపోయిన తుపాకీ కనిపించాయంటే, మీరు మణిమాణిక్యాల జోలికి వెళ్లకుండా వాటిని వదిలివేసి, తుపాకి తీసుకురండి.’’
హిందూమతం మరుగున పడుతున్న సమయం అది. హిందూమతాన్ని పునరుద్ధరించటానికి అనేకులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజురోజుకు సంతానుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి నెల వేల కొద్దీ గ్రామీణులు సంతాన సంప్రదాయంలో ప్రవేశించి ముసల్మానుల శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. జీవా నందుడు, భవానందుడు చేసే కృషి వల్ల సంతానుల సంఖ్య, కార్యదీక్ష అధికం అవుతున్నాయి. స్థానిక ముసల్మాను నవాబు ఈ విషయం విని, సైనిక దళాలను పంపి ఈ ఉద్యమాన్ని లొంగదీయాలని ఆలోచించాడు. కాని ఈ సరికే సంతానులు యుద్ధనైపుణ్యం గడించారు. శస్త్ర అస్త్ర ప్రయోగంలో ఆరితేరారు. ఆ కాలంలో ఆంగ్ల గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ దొర ఉన్నాడు. కలకత్తాలో లోహ శృంఖ లాలు తయారు చేయించి, దానితో భారతదేశాన్ని యావత్తు బంధించగలుగుతానని అతడి అంచనా. ఒకానొక రోజు భగవంతుడు కూడా ‘తథాస్తు! కాని ఆ రోజు చాల దూరంలో సుంది!’ అన్నాడు. సంతానుల బలం గురించి విని హేస్టింగ్స్ వణికి పోతున్నాడు, ప్రస్తుత కథా కాలం నాటికి.
హేస్టింగ్స్ ముందు దేశంలో విద్రోహక చర్యలను, వ్యక్తులను అరికట్టాలని ప్రయత్నం చేశాడు. కాని దేశీయ సైన్యాల ధోరణి ఎలావున్నదంటే, వారు యుద్ధ సమయంలో కూడా హరినామ సంకీర్తనం చెవిని పడినదంటే అస్త్రశస్త్రాలు వదిలి పారిపోతున్నారు. చివరకు ఎటూ దారితోచక హేస్టింగ్స్ ఈ ఉద్యమాన్ని అణచడానికి కెప్టెన్ థామస్ అనే అతడిని కొద్దిపాటి సైన్యంతో నియమించాడు.
కెప్టెన్ థామస్ సరికొత్త పన్నాగం పన్నాడు. ఆంగ్ల సైన్యం, ముసల్మాను సైన్యం, ఇంకా గ్రామీణ సైన్యం అంతటినీ కలిపి అత్యంత బలిష్టమైన సేనను తయారుచేశాడు. ఈ అసంఖ్యాకమైన సేనను ఎన్నో విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క బల వంతుడైన నాయకుని చేతిలో ఉంచాడు. తరువాత ఈ నాయకులకు ప్రాంతాలను కేటాయించాడు. ఒక్కొక్క దళానికి ఒక్కొక్క ప్రాంతం అప్పగించి ఆ ప్రాంతంలో సంతానులందరినీ వారు లొంగదీసు కుందుకు, అంతమొందించేందుకు సర్వవిధాలా ప్రయత్నించాలని అనుజ్ఞ ఇచ్చాడు. థామస్ సైన్యాన్ని పొలంలో వరి కోసినట్లుగా, గ్రామీణ రైతులు నరికి వేశారు. హరిధ్వనితో థామస్ చెవులు పూడుకు పోయాయి. అప్పటికి సంతాన ఉద్యమం బలిష్టంగా తయారయింది. ప్రాపకం సంపాదించింది.
2
కంపెనీ వారికి అనేక కొటారులు వున్నాయి. ఒక కొటారు ‘శివగ్రామం’ అనే ఊరిలో కూడా ఉంది. డానీ వర్త్ అనే మహాశయుడు దీనికి యజమాని. ఇతడు అనేక పర్యాయాలు సంతాన సైన్యం చేత దెబ్బతిన్నాడుగాని, ఎలాగో ప్రాణాన్ని నిలుపుకో గలిగాడు. తన భార్యాపిల్లలను కలకత్తాకు వెంట పెట్టుకుని ఆ గ్రామానికి వచ్చాడు. సంతానులు చేస్తున్న దోపిడులు చూచి ఆ ప్రాంతపు గిరిజన దళాల వారు కూడా ఇదే పనులకు పూనుకున్నారు. వీరందరూ కలిసి కెప్టెన్ థామస్ భోజనాగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. థామస్ భోజనసామగ్రులను బళ్లమీద వేసుకుని పోతున్నాడు. వాటిని దారిలో అడ్డగించారు గిరిజనులు. థామస్ సైనికులు దెబ్బలు తిని పారిపోయారు. థామస్ ఈ విషయాన్ని కలకత్తాకు నివేదించుకున్నాడు. ఆ నివేదిక మాత్రం తప్పులతడక. తాను 157 మంది సిపాయిలతో వెళ్లి 3373 మంది విద్రోహులను పారదోలినట్లు, 2153 మందిని చంపినట్లు, 7 గురిని ఖైదుచేయగలిగినట్లు నివేదించాడు. ఇదంతా సత్యదూరమే, ఏడుగురిని ఖైదు చేయడం తప్ప. డంబాలు పలుకుతూ తిరుగుతున్న థామస్ డాన్వర్‌కు కూడా హితబోధ చేసి ధైర్యం చెప్పటానికి పూనుకున్నాడు. ఇప్పుడిక నీవు నీ భార్యాపిల్లలను తెచ్చుకోవచ్చును. ఇక్కడ నిర్భయంగా ఉండవచ్చును, అని చెప్పాడు. డాన్వర్ మటుకు ‘‘మీరు ఇక్కడ ఒక పదిరోజుల పాటు, దేశంలో శాంతి నెలకొనేవరకు ఉండండి. తరువాత నా కుటుంబాన్ని తెచ్చుకుంటాను’’. అన్నాడు. ఇక్కడ భోజన సదుపాయాలు చక్కగా అమరినాయి గనుక థామస్ అలాగే ఉండిపోతానన్నాడు.
ఆనందమఠంలో, భవానందుడు చాల వ్యాకు లుడై వున్నాడు. అప్పుడప్పుడు థామస్ వేటకోసం అరణ్యంలోనికి వస్తున్నాడు. ఒకమారు అరణ్యంలో చాల లోపలకు వెళ్లిన తరువాత సైనికులు, ఉద్యోగులు పులుల అరుపులు విని బెదిరిపోయి ఇంక వెనుకకు మరలుతామన్నారు. థామస్ మటుకు ధైర్యంగా ఒక్కడే అరణ్యంలోనికి చొచ్చుకుపోయినాడు.
ఈ అరణ్యంలో సహజమైన మార్గం ఏదీ లేదు. గుర్రం సూటిగా నడవటానికి వీలులేకుండా వుంది. అందుచేత థామస్ తన గుర్రాన్ని విడిచిపుచ్చి, భుజానికి తుపాకి తగిలించుకుని కాలినడకను ప్రయాణం కొనసాగించాడు. లోపల ఎక్కడా పెద్ద పులులు కనిపించలేదు. ఎవరో ఒక వ్యక్తి కూర్చుని ఉండడం అగుపించింది. అతని చుట్టూ లతా గుల్మాలు వ్యాపించి ఉన్నాయి. పూలచెట్ల మధ్య ఒక నవీన సన్యాసి కూర్చుని ఉన్నాడు. ముందు థామస్‌కు విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. తరువాత క్రోధం వెల్లువెత్తింది. థామస్‌కు కొద్దిగా హిందీ భాష వచ్చును. ఆ భాషలోనే ‘‘ఎవరు నీవు?’’ అని అడిగాడు.
‘‘నేను సన్యాసిని.’’
‘‘నీవు విద్రోహివి!’’
‘‘అంటే ఏమిటి?’’
‘‘తుపాకి పేల్చి నిన్ను కాల్చివేస్తాను.’’
‘‘కాల్చు!’’
కాల్చటమూ, మానివేయటమా అనే యోచనలో పడిపోయాడు థామస్. ఈ సమయంలో సన్యాసి విద్యుద్వేగంతో ముందుకువచ్చి కెప్టెన్ చేతిలోని తుపాకిని లాగుకున్నాడు. సన్యాసి తన వంటిమీద జంతు చర్మాన్ని తీసి అవతల పారవేశాడు. జడలను లాగి పారవేశాడు. థామస్ తనకెదురుగా అపూర్వ సౌందర్యరాశి అయిన ఒక స్త్రీ నిలువబడి ఉన్నట్లు గమనించాడు. ఆ సుందరి నవ్వుతూ థామస్‌తో ఇలా అంది. ‘‘అయ్యా! నేను స్త్రీని. ఎవరికీ ఎటువంటి హాని చేయలేను. కాని ఒక్క ప్రశ్న మాత్రం అడుగుదామనుకుంటున్నాను. ఇప్పుడు దేశంలో హిందూ ముసల్మానుల కలహాలు జరుగుతున్నాయి. మరి మీరు ఎందుకు ఇందులో జోక్యం కలిగించు కుంటున్నారు? మీ దారిన మీరు మీ ఇంటికి వెళ్లండి.’’
‘‘ఇంతకూ నీవెవరు?’’
‘‘కనిపించడం లేదా? నేను సన్యాసినని. నీవు యుద్ధం చేసి వచ్చిన వారిలో నేనొకతెను.’’
‘‘నీవు వచ్చి నా ఇంటిలో ఉంటావా?’’
‘‘నీకు ఉపపత్నిగా ఉండమంటావా?’’
‘‘కలిసి ఉందాం అంతే! వివాహం చేసుకోనక్కర్లే దులే!’’
‘‘నాకూ ఒకమాట అడగాలని ఉంది. మా ఇంట్లో ఒక అందమైన కోతి ఉంది. ఈ మధ్యనే చనిపో యింది. దాని గూడు ఇప్పుడు ఖాళీ. నీవు వచ్చి ఆ గూడులో కూర్చుంటావా? నీ మెడలో తాడు కడతాను. ఆ గూడులో కూర్చుంటావా?’’
‘‘నీవు భలే తమాషాగా మాట్లాడుతున్నావు. నీ మీద నాకు చాల అభిమానంగా ఉంది. నీవు నా ఇంటికి రా. నీ భర్త యుద్ధంలో చచ్చిపోతాడు. తరువాత మాత్రం నీవు ఏం చేయగలవు?’’
‘‘ఒక షరతు మీదనైతే అంగీకరిస్తాను. రెండు మూడు రోజులలో యుద్ధం ఎలాగూ జరుగుతుంది. ఆ యుద్ధంలో మీరు జయిస్తే, నీవు వచ్చి మా కోతి గూటిలో కూర్చోవాలి. నీకు అరటిపళ్లు పెడతాను. సరేనా?’’
‘‘అరటి పళ్లు బాగుంటాయి. నీదగ్గరున్నాయా ఇప్పుడు?’’
‘‘ఫో, నీ తుపాకి తీసుకుని. ఇటువంటి తెలివి తక్కువ వారితో మాట్లాడడం కూడా అనవసరం’’ అని ఆ స్త్రీ తుపాకి కింద పడవేసి వేగంగా పరుగు తీసింది.
ఆ స్త్రీ ‘శాంతి’ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
3
శాంతి కెప్టెన్ థామస్‌తో మాట్లాడి అరణ్యం లోనికి పారిపోయింది. కొద్ది క్షణాలలోనే కెప్టెన్‌కు ఓ స్త్రీ కంఠం నుండి మధుర గీతం వచ్చి వినిపించ సాగింది. ఈ కంఠానికి తోడుగా మరొక పురుష కంఠం కూడా వినిపించింది. మరొక క్షణానికి మూడవ గొంతు కూడా ఈ పాటలో కలిసింది.
అరణ్యం చాల దట్టమైనది. లోపల ఏమి ఉన్నదో బయటకు కనిపించదు. శాంతి అరణ్యాంతరంలోనికి వెళ్లింది. అక్కడ చెట్ల నడుమ ఆమెకో కుటీరం వున్నది. చెట్ల కొమ్మలతో, ఆకులతో, పూతీగలతో తయారైన కుటీరం అది.
ఈ కుటీరంలో ప్రవేశించింది శాంతి. లోపల జీవానందుడు సితార వాయిస్తున్నాడు.
జీవానందుడు ఆమెను చూచి ఇలా అన్నాడు: ‘‘చూడు శాంతీ! ఒక రోజు నేను వ్రతభంగం చేశాను. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వుంది. కాని నీ అవరోధం చేతనే ఇంతవరకు ప్రాయశ్చిత్తం చేసుకో వడం కుదరలేదు. ఆలస్యం అయినకొద్దీ ఏమవు తుందోనని నాకు భయంగా వుంది. రేపు జరుగబోయే యుద్ధంలోనే నాకు ప్రాయశ్చిత్తం అవుతుందేమో! నా మరణం ఆసన్నమవు తుందేమో…!’’
(సశేషం)