– బంకించంద్ర చటర్జీ
అతని వాక్యం పూర్తి కాకుండానే ఇలా బదులు చెప్పింది, శాంతి. ‘‘అయ్యా! నేను మీ ధర్మపత్నిని. సహధర్మచారిణిని. ధర్మంలో మీకు సహాయం చేస్తు న్నాను. మీరు పటిష్టమైన గురుధర్మాన్ని స్వీకరించారు. ఆ ధర్మాన్ని నిర్వర్తించడంలో మీకు సహాయం చేయడానికి నేనూ ఇక్కడికి వచ్చాను. మనమిద్దరం ఒకచోట ఉండడంవల్ల ధర్మానికి బలం చేకూరు తుంది. అందుచేతనే నేను ఇంటిని విడిచిపెట్టి ఇక్కడ వనవాసం చేస్తున్నాను. నేను ధర్మవృద్ధినే చేస్తున్నాను తప్ప ఇతరం ఏమీ లేదు. వివాహం అనేది కేవలం ఈ లోకానికి సంబంధించినది కాదు. పరలోకానికి కూడా సంబంధించినది. ముందు ముందు ఇంకేదైనా జరుగవచ్చును. ఇప్పుడే ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన అవసరం ఏముంది? మీరు మాత్రం ఏం తప్పు చేశారు? భార్యతో ఏకశయ్యను పడుకోనని ప్రతిజ్ఞ చేశారు, అంతేకదా? మీరు ఇన్నాళ్లూ భార్యతో ఏకశయ్యపై పవళించారని ఎవరైనా చెప్పగలరా? మరి ప్రాయశ్చిత్తం ప్రసక్తి ఎందుకు వస్తుంది? ప్రభూ! మీరు నాకు గురువులు. నేను మీకు ధర్మం బోధించగలనా? మీరు వీరులు. మీకు నేను వీరధర్మం బోధించగలనా?’’
జీవానందుడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయినాడు. ‘‘ప్రియా! బోధించు’’ అన్నాడు.
ప్రసన్నచిత్తురాలై శాంతి, ‘‘ఇంకా చూడండి, గో స్వామిజీ! మన వివాహం ఇప్పటిదశలో కూడా నిష్పలమైందని అనుకుంటున్నారా? మీరు నన్ను ప్రేమిస్తున్నారు. నేను మిమ్ము ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమను దృఢతరం చేసుకున్నందువల్ల ఇప్పుడు ఒనగూడే మేలు ఏమున్నది? వందేమాతరం అనండి చాలు!’’ తరువాత ఇద్దరూ ఒకే స్వరంలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు. జీవానందుడు కుటీరం నుండి బయటకు వెళ్లిపోయినాడు.
4
భవానందుడు ఒకమారు నగరానికి వెళ్లవలసి వచ్చింది. ప్రశస్తమైన రాజమార్గం వొదిలి ఒక సందు గుండా నడవసాగాడు. సందులో రెండు పక్కలా ఎత్తయిన మేడలున్నాయి. కేవలం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మటుకే సూర్య భగవానుడు ఆ దారిలో తన ప్రభావాన్ని చూపగలడు. సందు చీకటిమయం. భవానందుడు రెండు అంతస్తుల మేడలో ప్రవేశించాడు. కింది గదులలో ఒక స్త్రీ వంట చేస్తున్నది. ఆమె నడి వయసులో ఉంది. భవానందుడు ఇంటిలో ప్రవేశించి ‘‘వదినా! రామ్ రామ్!’’ అన్నాడు.
వదిన భవానందుడిని చూచి, కొద్దిగా సిగ్గుపడి చీర సవరించుకుంది. కొంగు సరిగా వేసుకుని ‘‘ఎవరు? గోస్వామి ఠాకూర్! రా, రా, కాని ఏం నాయనా! ఇవాళ రామ్ రామ్ అని ప్రణామం చేస్తున్నావు?’’ అంది.
‘‘నీవు నాకంటే పెద్దదానివి కదా!’’
‘‘మంచిది. అంత ఆదరం ఉంటే అదే చాలు. నాకూ నీవు గోస్వామివి, కనుక నీకు ప్రణామం చేయాలనే ఉంది. కాని వయసులో నీకంటె నేను పెద్దదానిని గదా! నిజంగా గోస్వాములంటే దేవుళ్లతో సమానం!’’
భవానందుడు చాల కష్టంమీద నవ్వును ఆపు కుంటూ ‘‘ఆమె ఎలా ఉంది?’’ అని అడిగాడు.
‘‘ఎలా ఉండాలో అలాగే ఉంది’’ అని సమాధానం చెప్పింది. ఆమె, గౌరీదేవి.
‘‘ఒకమారు వెళ్లి చూచిరావమ్మా! ఆమెతో కొద్దిగా మాట్లాడవలెనని వచ్చానని చెప్పు.’’
గౌరీదేవి చేతులు తుడుచుకుంటూ పైకి వెళ్లింది. ఒక గదిలో నేల మీద చాప పరుచుకుని ఒక అపూర్వ సౌందర్యవతి కూర్చుని ఉన్నది. సౌందర్యంపైన నిర్లక్ష్యం ఛాయలు అలుముకుని ఉన్నాయి.
భవానందుడు ఆ గదిలో ప్రవేశిస్తూనే ‘‘కల్యాణీ! కులాసాగా ఉన్నావా?’’ అన్నాడు.
‘‘నా కులాసాతో నీకేంపని? ఈ ప్రశ్న మీరు వదలనే వదలరా ఏమి?’’ అన్నది ఆమె కల్యాణి.
‘‘నేను ప్రాణం పోసిన చెట్టువు నీవు. నీ క్షేమం నాకు కాక ఇంకెవరికి కావాలి?’’
‘‘నా పతిదేవులను గురించి ఏమైనా సమాచారం అందిందా?’’
‘‘మాటిమాటికి ఇదే ప్రశ్న! నీ వరకు అతడు దాదాపు మృతుడే కదా!’’
‘‘నాపట్ల మృతులు అయినంత మాత్రాన మా సంబంధం విడిపోతుందా? వారు ఎలా ఉన్నారో చెప్పండి.’’
‘‘బాగానే ఉన్నారు.’’
‘‘ఎక్కడున్నారు? పదచిహ్నంలోనేనా?’’
‘‘అవును. అక్కడే ఉన్నారు.’’
‘‘ఏం చేస్తున్నారు?’’
‘‘చాలా పనులు చేస్తున్నారు. దుర్గ నిర్మాణం, అస్త్ర నిర్మాణం. ఆయన తయారు చేసిన అస్త్రశస్త్రాల సహాయంతోనే సంతానులు యుద్ధం చేయగలుగు తున్నారు. సంతానగణంలో ఆయన శ్రేష్టుడు. వారు మాకందరికీ మహోపకారం చేస్తున్నారు. వారే మాకందరికీ దక్షిణహస్తం.’’
‘‘నేను ప్రాణత్యాగం చేయకపోయినట్లయితే ఇంతటి మహత్కార్యం ఎలా జరిగేది? కాలికి సంకెళ్లు వేసుకున్న మనిషి ఎట్లా పరుగెత్తగలడు? ఏమయ్యా, సన్యాసీ! నా క్షుద్ర జీవితాన్ని ఎందుకు నిలిపావు?’’
‘‘స్త్రీ సహధర్మచారిణి. ధర్మంలో సహాయకరంగా ఉంటుంది!’’
‘‘చిన్న చిన్న ధర్మాలలో సహాయం చేయగలుగు తుంది. కాని పెద్ద ధర్మాలలో కంటకప్రాయమే అవుతుంది. నేను విషకంటకం ద్వారా అధర్మం చేస్తున్నాను. ఛీ! దురాచారీ! పామర బ్రహ్మచారి! నీవు నా ప్రాణాలను ఎందుకు రక్షించావు?’’
‘‘మంచిదే. అయితే నేను దేనిని ఇచ్చానో దానిని తిరిగి తీసుకుంటాను. నేను చేసిన ప్రాణదానాన్ని నాకు తిరిగి ఇచ్చి వేయి.’’
‘‘నా కుమార్తె సుకుమారి ఎలా ఉందో ఏమైనా తెలుసునా?’’
‘‘చాలా రోజులయి ఆ పిల్ల సమాచారం తెలియరాలేదు. జీవానందుడు చాల రోజులుగా అటు వెళ్లలేదు.’’
‘‘దానికబురు నాకు తెచ్చిపెట్టలేరా? నా భర్త ఎలాగూ ఇప్పుడు నన్ను కలియలేరు. కనీసం నా కుమార్తె అయినా ఇక్కడ ఉంటే నాకు కొంత ఊరటగా తృప్తిగా ఉంటుంది. నాకోసం నీవు ఈ కాస్త పని ఎందుకు చేయలేవు? నా కుమార్తెను తెచ్చి నాకు ఇవ్వలేవా?’’
‘‘చేయగలను కల్యాణీ! నీకు కుమార్తెను తీసుకు వస్తాను. కాని దాని తరువాత?’’
‘‘ముందు అమ్మాయిని తీసుకురా!’’
‘‘తీసుకువస్తాను. తరువాత వివాహం చేసుకుంటావా?’’
‘‘నీతోనేనా?’’
‘‘వివాహం చేసుకుంటావా?’’
‘‘నీ సంతానధర్మం ఏమవుతుంది?’’
‘‘పాతాళంలో పాతివేస్తాను.’’
‘‘దేనికి అలా?’’
‘‘నీకోసం. చూడు, ప్రతిమనిషికి- సిద్ధుడయినా దేవతయినా- మనసు ప్రధానం. సంతానధర్మం నాకు ప్రాణం వంటిది. కాని నీ మీది ఇష్టం నాకు ప్రాణం కంటె మిన్న అయినది! ఏరోజున నేను నీకు ప్రాణదానం చేశానో ఆ రోజు నేను నీకు నన్ను నేను అర్పణం చేసుకున్నాను. ప్రపంచంలో ఇంత సౌందర్యం ఉన్నదని నాకు ఇంతవరకూ తెలియదు. ఇంత దిగ్భ్రమ కలిగించే రూపం ఉన్నదని తెలిస్తే నేను ముందుగా సంతానధర్మం స్వీకరించేవాడినే కాదు. ఈ ధర్మాన్ని ఇప్పుడు అగ్నిపరంచేసి మామూలు గృహస్థుగా తయారవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ధర్మం అంతరించింది. ఇప్పుడిక ప్రాణం ఉంది. ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుండి ప్రాణం ఉడికిపోతోంది. అగ్నిజ్వాల దహించుకుపోతోంది. ఈ దేహం ఇంక ఎంతో కాలం మిగలదు. దహించు కుపోతోంది. నాలుగు సంవత్సరాలుగా ఎలాగో సహించగలుగుతున్నాను. ఇప్పుడిక సహించలేను. చెప్పు కల్యాణీ. నీవు నన్ను వివాహం చేసుకుని నాతోపాటు ఉండిపోతావా?’’
‘‘ఇదివరకు నీవొక మాట చెప్పావు. సంతాన ధర్మాన్ని ఆశ్రయించినవారు మధ్యలో ఇంద్రియాలకు వశులు అయినట్లయితే దానికి ప్రాయశ్చిత్తం మృత్యువేనని నీవు చెప్పినట్లున్నావు. నిజమేకదూ?’’
‘‘నిజమే!’’
‘‘అయితే నీకు కూడా ప్రాయశ్చిత్తం మృత్యువే కదా! ముందు నీవు నా కుమార్తెను తీసుకురా!’’
‘‘నేను వెళ్లిన తరువాత నా విషయం మరచి పోకు.’’ ‘‘గుర్తుంచుకుంటానులే! వ్రతచ్యుత విధర్మం కూడా నీవు గుర్తుంచుకో!’’ భవానందుడు వెళ్లిపోయి నాడు. కల్యాణి తిరిగి తన పుస్తక పఠనంలో మునిగి పోయింది.
భవానందుడు మఠానికి వెళ్లి, తిరిగి బయటకు వచ్చి, అరణ్యంలో ప్రయాణం సాగించాడు. ఆ అరణ్యంలో ప్రాచీనమైన భవనం ఒకటుంది. భవా నందుడు ఈ భవనంలో కూర్చుని చింతానిమగ్ను డైనాడు. తను ధర్మ పరిత్యాగం చేయడం ఎంతవరకు సబబో అతడికి ఆలోచనకు వచ్చింది. తనకు మృత్యువే ప్రాయశ్చిత్తం అనిపించింది.
ఇంతలో భీషణారణ్యం నుండి మధురమైన కంఠస్వరం వినిపించింది ‘‘ఆశీర్వదిస్తున్నాను. ధర్మంలో నీవు సుస్థాపితుడివి అయినావు.’’
భవానందుడు దేహం పులకించగా లేచి నిలువ బడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదం? ఎవరిదా కంఠధ్వని తప్పకుండా తన గురుదేవులదే!
‘‘మహారాజ్! గురుదేవా! తాము ఎక్కడున్నారు? ఈ సమయంలో తమ ‘సేవకునకు ఒక పర్యాయం దర్శనం ఇవ్వండి’’ అన్నాడు భవానందుడు.
కాని ఎవరూ దర్శనం ఇవ్వలేదు. ఎవరూ బదులు కూడా పలుకలేదు. భవానందుడు ఆగి ఆగి పిలుస్తు న్నాడు. జవాబు మటుకు రావడం లేదు. అక్కడా ఇక్కడా వెదికాడు. ఎవరూ అగుపించలేదు. రాత్రి గడిచింది.
పూర్తిగా తెల్లవారిన తరువాత భవానందుడు మఠానికి తిరిగి వచ్చాడు. చెవులలో వినిపిస్తూ వుంది: ‘హరే! మురారే! హరే! మురారే!’
కంఠధ్వని సత్యానంద బ్రహ్మచారిదే! అయితే వారు ఆశ్రమానికి తిరిగి వచ్చారన్న మాట!
5
జీవానందుడు కుటీరంనుండి వెళ్లిపోయిన తరువాత, శాంతి సితారు చేతబూని మృదుస్వరంలో ఈ గీతం వాయించసాగింది.
‘‘ప్రళయ పయోధిజలే చరిత్రమఖేదం,
కేశవ ధృత మీనశరీర
జయ జగదీశ హరే!’’
జయదేవుని అష్టపది వాయిస్తూ పాడుకుంటూ ఆమె కొంత శాంత చిత్త కాగలిగింది.
నిందపి యజ్ఞ విదోరహ హశృతిజాతం
సదయ హృదయ దర్శిత పశుఘాతమ్
కేశవ ధృత వృద్ధశరీర
జయజగదీశ హరే!’’
ఇంతలో ఎవరో బయటనుంచి మేఘగర్జన సదృ శమైన కంఠస్వరంలో ఇలా పాడడం వినిపించింది:
‘‘మ్లేచ్చ నివహ నిధనే కలయసి కెరవాలమ్
ధూమకేతు మితి కిమపి కరాలమ్
కేశవ ధృతి కల్కిశరీర
జయ జగదీశ హరే!’’
శాంతి భక్తిభావంతో నిండిపోయి, సత్యానందుని పాదధూళి స్వీకరించింది. ‘‘ప్రభూ! నేను చాల అదృష్టవంతురాలను. శ్రీవారి పాదపద్మముల సేవ, దర్శనము లభించినాయి. నాకు సెలవు ఇవ్వండి. నావల్ల ఏమి జరుగవలసి ఉన్నది?’’
‘‘తవ చరణ ప్రణతా వయమితి భావయ కురు కుశలం ప్రణతేషు’’
సత్యానందుడు ‘‘నీవు కులాసాగా ఉన్నావా అమ్మా!’’ అని అడిగాడు.
‘‘నాకు కుశలం ఎక్కడిది? తమ ఆజ్ఞ!’’
‘‘అమ్మాయీ! నీశక్తి నేను గుర్తించలేక పోయినాను. నీవు నాకంటే ప్రజ్ఞావంతురాలవు. దీనికి ఉపాయాంతరం ఏమో నాకు తెలియడం లేదు. నీవే ఆలోచించాలమ్మా! నాకు అన్ని విషయాలూ తెలుసునని జీవానందునకు చెప్పకు. నీ ప్రలోభంలో పడిపోయి అతడు ఆత్మరక్షణ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇన్నాళ్లుగా అతడీపనే చేస్తున్నాడు. ఇలా అయితే నాపని జరుగుతుంది!’’
శాంతి తన కన్నులలో రోషం ప్రకటించింది. ‘‘ఏమి అంటున్నారు మహారాజా! నేనూ, నా భర్తా ఒకే ఆత్మకు సంబంధించిన వాళ్లం. చావవలసి వస్తే ఇద్దరం నిరభ్యంతరంగా చనిపోతాం. ఇందులో నేను అడ్డగించేది, ఆపగలిగేది ఏమీ లేదు. నేనూ వారితోనే గతిస్తాను. వారికి స్వర్గం లభిస్తే నాకు మాత్రం లభించదా ఏమిటి?’’
బ్రహ్మచారి ఇంకా ఇలా అన్నాడు : ‘‘దేవీ! నేను ఇంతవరకూ ఎక్కడా ఓడిపోలేదు. కాని ఈ రోజు నీ వలన ఓడిపోతున్నాను. అమ్మా! నేను నీకు పుత్రుడను. సంతానుల పట్ల స్నేహభావం కలిగి వుండు. జీవానందుని ప్రాణం రక్షించు. ఈ రకంగా నేను తలపెట్టిన కార్యం పూర్తి అవుతుంది. సఫలం అవుతుంది!’’
ఒక మెరుపు మెరిసింది. శాంతి ‘‘నా స్వామివారి ధర్మం వారి చేతిలోనే ఉన్నది. వారి ధర్మాన్ని కాదని చెప్పగల సాహసం నాకులేదు. ఈ లోకంలో స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవం. పరలోకంలో అందరికీ మాననీయమైన ధర్మం ఉండనే ఉన్నది. నాముందు నా భర్త గొప్పవాడు. నాకు భర్త కంటె ధర్మం గొప్పది. నాకు పతిధర్మం మరింత గొప్పది. మహారాజా! మీ ఆజ్ఞ ప్రకారం మేం చావడానికైనా సంసిద్ధులమయి ఉన్నాము. నేను ఏ దశలోను, మన ధర్మానికి వ్యతిరేకంగా వర్తించను’’ అంది.
బ్రహ్మచారి గాఢమైన నిట్టూర్పు విడిచి ‘‘అమ్మా! ఈ ఘోర వ్రతానికి బలిదానం అవసరం. అందరూ బలి అయిపోతారు. నేనూ చనిపోతాను. జీవానంద, భవానందులుకూడా బలి అవుతారు. బహుశ నీవు కూడా చనిపోతావు. నేను జన్మభూమిని మటుకే తల్లి అంటాను. ఎందుకంటే, సుజల అయిన మాతకంటే అధికులు ఇంకెవరూ ఉండరు. ఇప్పుడు నిన్ను కూడా మాత అని సంబోధిస్తున్నాను. నీవు మాతవై ఈ సంతానుల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చు. మా కార్యోద్ధరణ నీవే చేయి. జీవానందుని ప్రాణం రక్షించు. నీ రక్షకూడా చేసుకో!’’
అని, ‘‘హరే మురారే! మధుకైటభారే!’’ అని పాడుకుంటూ వెళ్లిపోయాడు.
సత్యానందులు తిరిగి వచ్చినారని సంతానులం దరికీ క్రమక్రమంగా తెలియవచ్చింది. సంతానులు దళాలు దళాలుగా ముందుకు వచ్చి వారిని చూచి వెడుతున్నారు. చంద్రుని వెన్నెల రాత్రి, నదీతటంలో దేవదారు వృక్షాల చేత ఆవృతమైన ఆ మహారణ్యంలో మామిడి, పనస, వేప, చింత, మర్రి, రావి ఇత్యాది వృక్షాల కింద సంతాన దళాలు ఉపస్థితులై ఉన్నాయి. సత్యానందులు వచ్చారని విని వారు వేడుకలు చేసుకుంటున్నారు. వారు ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో అనేది సాధారణ సంతానులకు ఎవరికీ తెలి యదు. అయితే వారు దేశ క్షేమం కోరి తపశ్చర్యలకు వెళ్లినారని అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తిరిగి వచ్చినారు గనుక వారి తపస్సు నెరవేరి ఉంటుందనీ, ఇంక సంతాన రాజ్యం స్థాపించడమే తరువాయి అని సంతానులు ఒకరితో ఒకరు కూడబలుక్కుంటున్నారు.
ఇంతలో ఉన్నట్లుండి కోలాహలం బయలు దేరింది. ‘‘కొట్టండి, చంపండి. పాపాత్ములను చంపి వేయండి’’ అనే కేకలు వినవచ్చాయి.
ఇంతలో ఎవరో ‘‘జయజయ, మహారాజుకు జయ జయ’’ అని కేకలు వేస్తున్నారు.
(సశేషం)