ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
మహమ్మదలీ జిన్నా, లియాకత్ అలీఖాన్‌ల పూర్వికులు హిందువులే. జాతీయ కాంగ్రెస్ స్వరాజ్యం కోసం పోరాడుతూ ఉంటే, వీరు ముస్లిం లీగ్ తరఫున విభజన కోసం పాటుపడ్డారు. కానీ కొందరు విదేశీయులు అనీబిసెంట్, సోదరి నివేదిత, బీజీ హార్నిమన్ వంటివారు వలస పాలన పీడ వదిలి భారత్ అఖండంగా ఉండాలని కోరుకున్నారు. అలాంటి విదేశీయులలో శామ్యూల్ ఎవాన్స్ స్టోక్స్ ఒకరు. అమెరికాలో పుట్టి భారతభూమిని సేవించారు.
ఆగస్ట్ 16, 1882న ఫిలడెల్ఫియాలోని సంపన్న క్వేకర్ కుటుంబంలో స్టోక్స్ జన్మించారు. 22 సంవత్సరాల వయసులో (1904) సిమ్లా కొండలలోని ఒక కుష్టురోగుల ఆశ్రమంలో సేవలందించడానికి భారతదేశానికి వచ్చారు. ఆయన గురువు డాక్టర్ కార్లెటన్ అతని సేవలకు సంతృప్తి చెంది కొన్ని ప్రాథమిక శస్త్రచికిత్సలో కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలోనే స్టోక్స్ రోగులకు మానసికంగా చేరువయ్యి, స్థానిక భాషపైన పట్టు సాధించాడు. కుష్టురోగులకు సేవచేస్తూనే అక్కడి కార్మికులతో సత్సంబంధాలు కొనసాగించాడు.
డాక్టర్ కార్లెటన్ ఒక వేసవిలో స్టోక్స్‌ను హిందుస్తాన్-టిబెట్ రోడ్డులో సిమ్లాకు 50 మైళ్ల దూరంలోని కోట్‌ఘర్‌కు పంపారు. స్టోక్స్ కోట్‌ఘర్‌కు నడిచివెళ్లారు. అదో ఆకర్షణీయమైన గ్రామ సముదాయం. దీనినే రుడ్‌యార్డ్ కిప్లింగ్ ‘మిస్ట్రెస్ ఆఫ్ ది నార్తర్న్ హిల్స్’ అన్నాడు. కానీ స్టోక్స్ దానినే కర్మభూమిగా మార్చుకున్నారు. సుభతు కోటఘర్ ప్రాంతాలలోని పిల్లలకు, అంటరాని వారికి చదువు చెప్పాడు. దట్టమైన చలితో ఉండే ఆ ప్రాంతం ఆపిల్ సాగుకు అనుకూలమైనదని గ్రహించి అమెరికాలో దొరికే రెడ్ డెలిషియస్ ఆపిల్‌ను పండించేందుకు ఎన్నో పథకాలు రూపొందించి, ‘సిమ్లా ఆపిల్’ ని అందించారు. ఈ రోజు ఆ యాపిల్‌కు ప్రపంచ ఖ్యాతి ఉంది. ఆపిల్ సాగుతో పాటు స్వాతంత్య్రోద్య మానికి కూడా బీజాలు వేశాడు. 1920లో స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయంలో హిమాలయ ప్రాంత ప్రజలు పాల్గొనేలా చైతన్య పరచాడు. భారతీయులు ప్రభుత్వ సేవలను వదులుకుని ఉద్యమంలో చేరాలని పిలుపునిచ్చారు.
1920 డిసెంబర్ నాటి నాగ్‌పూర్ కాంగ్రెస్ సమావేశానికి స్టోక్స్ కోట్‌ఘర్ ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ ప్రత్యేక గుర్తింపు పొందిన ఏకైక అమెరికన్. 1921లో కాంగ్రెస్ మేనిఫెస్టోపై సంతకం చేసిన ఏకైక విదేశీయుడు, 1921లో ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్’ భారత్ సందర్శించాల్సి ఉండగా, బ్రిటిష్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, కాంగ్రెస్ పార్టీ సహజంగానే వ్యతిరేకించాయి. పంజాబ్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) సమావేశం డిసెంబర్ 3 మధ్యాహ్నం జరగాల్సి ఉంది. స్టోక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు లాహోరు వెళుతుండగా వాఘా వద్ద అరెస్ట్ చేశారు. ఆయనపై గల అభియోగం రాజద్రోహం, హిజ్ మెజెస్టి సబ్జెక్ట్‌లలోని వివిధ తరగతుల మధ్య ద్వేషాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలపై బెయిల్‌ను ఇస్తామన్నప్పటికీ స్టోక్స్ దానిని తిరస్కరించాడు. ఆ మధ్యాహ్నానికి, లజపత్ రాయ్, గోపీచంద్ సహా పీపీసీసీలోని చాలా మంది కీలక సభ్యులు అరెస్టయ్యారు. ‘యంగ్ ఇండియా’ పత్రికలో మొదటి పేజీ కథనంలో గాంధీ స్టోక్స్ అరెస్టును ‘ప్రభుత్వం ప్రత్యేక చర్య’ అని వ్యంగ్యంగా రాశారు. విచారణ జరిపి, స్టోక్స్ ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు. యునైటెడ్ స్టేట్స్ ఫిలడెల్ఫియా లెడ్జర్, ది న్యూ యార్క్ టైమ్స్ అనేక ఇతర వార్తాపత్రికలలో స్టోక్స్ అరెస్ట్ వార్త వెలువడింది.
నిజానికి స్టోక్స్ భారతదేశానికి వచ్చినది ఒక క్రైస్తవ మిషనరీగానే. ఆ సంస్థ ద్వారా సేవచేస్తూ, భారత్‌లో మత కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చాడు. కానీ ఆయన దృష్టి మారిపోయింది. ఇక్కడి గొప్ప సంస్కృతికి అనుభూతి చెందాడు. 1932లో స్టోక్స్ ‘సత్యానంద్’గా మారాడు, తన జీవితాన్ని భారతదేశానికి అంకితం చేయాలనుకున్నాడు. ఆయన భార్య ప్రియదేవి స్టోక్స్ (అసలు పేరు ఆగ్నెస్ బెంజిమన్) కూడా అందుకు ఒప్పుకుంది. హిందూ తత్వశాస్త్రంపై ఆసక్తిని పెంచి, సనాతన హిందుత్వాన్ని సాధన చేశాడు. తన కుటుంబం మొత్తం హిందు త్వాన్ని ఆమోదించింది. క్రైస్తవంలోకి వెళ్లకుండా ఎంతోమందిని స్టోక్స్ అడ్డుకున్నాడు.ఈ విషయంలో ఒక్కోసారి బ్రిటిష్ వారితో తగాదాలు జరిగేవి.
గొప్ప నాయకుడు, సంఘ సంస్కర్త స్టోక్స్ అనారోగ్యంతో మే 14, 1946న సిమ్లాలో కన్నుమూయగా, మన దేశ అగ్రనేతలు అందరూ ఆయన అంతిమ సంస్కారానికి హాజరయ్యారు. ఈ దేశంతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన విదేశీయుడిని స్వతంత్ర భారతదేశం మరచిపోవడం బాధించే అంశం.
స్టోక్స్ మనుమరాలు ఆశా శర్మ 1999లో ఒక పుస్తకం (An American in Gandhiµs India) రాయడం ద్వారా స్టోక్స్ జీవితం వెలుగులోకి వచ్చింది. ఈ పుస్తకానికి దలైలామా ముందుమాట రాశారు. కొంచెం ఆలస్యంగానే అయినా, తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఇప్పుడైన మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని స్మరించు కోవడం మన బాధ్యత.
– రాజశేఖర్ నన్నపనేని