సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌మార్గశిర శుద్ధ పంచమి – 28 నవంబర్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచి ఉండవచ్చు. అయినా సాధించిన దాని కంటే, సాధించవలసినదే ఎక్కువని చాలా రంగాల గురించి అనుకోక తప్పదు. ఇందుకు కారణం- ఒక వలసదేశంగా భారత్‌ ఎదుర్కొన్న దారుణ పరిస్థితులు. జరిగిన అంతులేని దోపిడి. జ్ఞానం విషయంలో జరిగిన కుట్ర. వీటి ఫలితంగా దాపురించిన వెనుకబాటు. అవన్నీ ఎలా ఉన్నా కొన్ని రంగాలను ఉపేక్షించలేం. అలాంటి జాబితాలో అగ్రస్థానంలో కనిపించేది వైద్యరంగం. ఈ వాస్తవాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా గుర్తించింది. ఆ రంగంలో గడచిన ఎనిమిదేళ్లలో సాధించిన పురోగతిని మననం చేసుకుంటే ఈ సంగతి అర్ధమవుతుంది. నవంబర్‌ 21‌న కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వాస్తవాలు ఇందుకు సాక్ష్యం పలుకుతున్నాయి.

 ప్రస్తుతం దేశంలో వైద్యుడు, జనాభా నిష్పత్తి 1:854కు చేరింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రతి వేయి మంది జనాభాకు ఒక వైద్యుడు (1:1000) అన్న సూత్రాన్ని అధిగమించి, బాగా మెరుగైన స్థితిలో నిలిచింది. నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 1:1000 నిష్పత్తిని 2024 కల్లా సాధించాలని సంకల్పించినట్టు నీతి ఆయోగ్‌ ‌సభ్యుడు డాక్టర్‌ ‌వినోద్‌ ‌కె పాల్‌ 2021 అక్టోబర్‌ ‌మాసాంతంలో చెప్పారు. అంటే దాదాపు రెండేళ్ల ముందే ఆ లక్ష్యాన్ని చేరుకున్నాం. వాస్తవిక, నిర్మాణాత్మక దృష్టితో చూస్తే ఇది భారత్‌ ‌వంటి దేశం సాధించిన గొప్ప విజయం. ఎందుకంటే చాలా దేశాలు ఇప్పటికీ ఈ నిష్పత్తికి దరి చేరలేదు. మన దేశంలో వైద్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎనిమిదేళ్లతో పోలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య బాగా పెరిగిందని కూడా కేంద్రం వెల్లడించింది. వైద్య కళాశాలలు, వాటిలో ప్రవేశాల గురించి విడుదల చేసిన ప్రకటనలో ఈ గణాంకాలన్నీ ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 13.01లక్షల మంది అధికారికంగా నమోదు చేసుకున్న అల్లోపతి వైద్యులు ఉన్నారు. 5.05 లక్షల ఆయుష్‌ (‌సంప్రదాయక విధానం) వైద్యులు ఉన్నారు. ఇది జూన్‌, 2022 ‌నాటి సమాచారం. వీరిలో సేవలు అందిస్తున్నవారు 15.80 లక్షలు. 2014 నాటికి 387 వైద్య కళాశాలలు ఉన్నాయి. వాటి సంఖ్య ప్రస్తుతం 648. వీటిలో 355 ప్రభుత్వ వైద్య కళాశాలలే. 293 ప్రైవేటు యాజమాన్యం లోనివి. అంటే ఈ ఎనిమిదేళ్లలోనే 261 కళాశాలలు అదనంగా వచ్చాయి. లభ్యమవుతున్న ఎంబీబీస్‌ ‌సీట్లు 96,077 (ఇవే 2014కు ముందు 51,348. అంటే 79 శాతం పెరిగాయి). పీజీ మెడికల్‌ ‌సీట్లు 2014లో 31,185. ఇప్పుడు 63,842. అంటే 93 శాతం పెంపు. ఇందులో చాలా వివరాలు జూలై 22న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ ‌పవార్‌ ‌లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో చెప్పినవే. అయితే వైద్యం రాష్ట్ర జాబితాలోనిది. అందువల్ల కొన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీలు అధికారంలో ఉన్నచోట వైద్యసేవల విషయంలోనూ రాజకీయం చేయడం వల్ల కొన్ని ఆటంకాలు తప్పడం లేదు.

కరోనా, తదనంతర పరిణామాలు వైద్య ప్రాధాన్యాన్ని ప్రతి దేశానికి నషాళానికి అంటే రీతిలోనే అర్ధమయ్యేటట్టు చేశాయి. కానీ భారతదేశంలో వైద్యవిద్య, ఆ రంగంలోను అంత క్రితమే జాతీయ మెడికల్‌ ‌కమిషన్‌ ‌సంస్కరణలు చేపట్టింది. కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుకు నిబంధనలను సులభతరం చేసింది. నీట్‌తో ఒకే దేశం, ఒకే పరీక్ష, ఒకే ప్రతిభ వ్యవస్థను తెచ్చింది. పేద కుటుంబాల నుంచి వచ్చిన వారికి కూడా వైద్యవిద్యను అందుబాటులోకి తేవడమూ సంస్కరణలలో భాగం కావడం ముమ్మాటికీ సంతోషించగదగిన అంశం. ఒక పెద్ద సామాజిక, ఆర్థిక రుగ్మతకు ఇది సరైన ఔషధమే కూడా. ఈ సంస్కరణలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దూరదృష్టి ప్రశంసనీయమైనది. ఆ సంస్కరణలన్నీ వైద్యుడు, జనాభా నిష్పత్తిని దృష్టిలో ఉంచుకునే రూపొందినవే. కొత్త కళాశాలలు, సీట్ల పెంపు, జిల్లా స్థాయి నుంచి పై వరకు ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యం పెంపు ఇవన్నీ కూడా ఆ నిష్పత్తి ఆధారంగానే జరుగుతున్నాయి. కళాశాలల ఏర్పాటులో, పదవీ విరమణ చేసిన వైద్యుల పదవీకాలం కొనసాగింపు సంస్కరణలలో భాగమే. నర్సులు, రోగుల నిష్పత్తిని పెంచడానికి కూడా ఈ సంస్కరణల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. ఇది మొత్తం సంస్కరణలను అర్ధవంతం చేస్తుంది.

 కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్య పథకం 22 ఎయిమ్స్ ‌వ్యవస్థల ఏర్పాటు. ప్రతిపాదించిన ఎయిమ్స్ ‌వ్యవస్థలు 22 అయితే అందులో 19 ఎంబీబీఎస్‌ ‌విద్యతో ఇప్పటికే పని ప్రారభించాయి. ప్రైవేటు, డీమ్డ్ ‌వైద్య విద్యావ్యవస్థలలో కూడా 50 శాతం సీట్ల విషయంలో రుసుములు నియంత్రించడానికి కూడా నిబంధనలు తయారుచేశారు. నీతి ఆయోగ్‌ ‌సభ్యుడు డాక్టర్‌ ‌వినోద్‌ ‌చెప్పిన ప్రకారం ప్రస్తుతం దేశంలోని ఆసుపత్రులలో 12 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయి. అందులో సగం ప్రైవేటు ఆసుపత్రులలోనివి. నిజానికి మోదీ ప్రభుత్వం రూపొందించుకున్న జాతీయ వైద్య విధానంలో 2.:1000 నిష్పత్తిని సాధించాలని నిర్దేశించుకున్నారు. ఇది 3:1000 చేర్చాలని కూడా ఆ విధానం ఆశయంగా ప్రకటించింది. సమీప భవిష్యత్తులో దేశంలో పెరగబోతున్న వృద్ధుల జనాభా, వారి వైద్య అవసరాలకు ఇది అనివార్యం.

మూఢ నమ్మకాలను దరిచేరనీయకుండానే మనదైన వైద్య విధానాన్నీ సముచిత రీతిన ప్రోత్సహించాలి. మధ్య పేద తరగతి వారికి వైద్యం, దాని ఖర్చులు గుండెపోటు తెప్పించకూడదు. ఆ పరిస్థితికి అనుమతిస్తే వైద్యశాస్త్ర ప్రతిజ్ఞను భగ్నం చేయడమే. ప్రాథమిక వైద్య కేంద్రాల వృద్ధి గ్రామీణ ప్రాంతానికి అత్యవసరం. గ్రామాలు, గిరిజన ప్రాంతాలు వైద్యానికి ఇప్పటికి దూరంగా ఉండిపోతున్నాయన్న నిష్టురం నుంచి కూడా ప్రభుత్వం తొందరగా బయటపడాలి.

About Author

By editor

Twitter
YOUTUBE