సంపాదకీయం
శాలివాహన 1944 శ్రీ శుభకృత్ ఆశ్వీయుజ బహుళ ద్వాదశి -21 నవంబర్ 2022, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
‘ఒక ఆలోచన నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక సమోసా నీ మతాన్ని మారుస్తుంది’… ఇది మూడేళ్ల క్రితం సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తిన తీక్షణమైన చెణుకు. ఆగ్రాలోని ఒక మురికివాడలో, మీరు క్రైస్తవం తీసుకోండి, మీ పిల్లల విద్యావైద్యాలకీ, ఉద్యోగానికీ ఢోకా ఉండదు అంటూ ప్రచారం చేసిన మిషనరీలు వారికి కానుకలుగా సమోసాలు పంచారట. అయితే అవి తిన్నాక తన కూతురికి తల తిప్పుడు మొదలయిందని ఒక వనిత వాపోయింది. నిజానికి భారతీయతకు ఈ మతాల వికృత చేష్టలు ఎన్నో రుగ్మతలు తెచ్చాయి. అది వేరే విషయమే కానీ, భారతదేశంలో మత మార్పిడి పోకడలు ఎంత హేయమో, అదే సమయంలో ఎంత నీతిబాహ్యంగా, చౌకబారుగా ఉన్నాయో ఈ సమోసా కథ చెబుతుంది. మత మార్పిడిలో ఉండవలసిన మత స్వేచ్ఛ, విశ్వాసం, స్పృహ వంటి విలువలన్నీ ఇప్పుడు సిలువ మీదనో, మసీదు గుమ్మటం మీది నెలవంక కొసనో బిక్కుబిక్కుమంటూ వేలాడుతున్నాయి. అందుకే ఈ నవంబర్ 14న సాక్షాత్తు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మతమార్పిడులు దేశభద్రతకే ముప్పు అని నిష్కర్షగా అభిప్రాయపడవలసి వచ్చింది.
బలవంతపు మత మార్పిళ్లు అత్యంత తీవ్రమైన అంశమేనని సుప్రీం కోర్టు అభివర్ణించింది. మోసగించి, ప్రలోభ పెట్టి, భయపెట్టి మతాంతరీకరణ చేయడాన్నితీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పింది. ‘మత స్వేచ్ఛ ఉండవచ్చు. కానీ బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ ఎవరికీ లేదు. ఈ తరహా మార్పిడులను అడ్డుకోని పక్షంలో చాలా సమస్యాత్మక పరిస్థితులు తలెత్తుతాయి. ఈ పోకడలు నిజమే అయితే అంతిమంగా దేశభద్రతకే పెను సవాలు విసరగలిగేటంత తీవ్రమైన సమస్య. అంతేకాక పౌరులు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కూడా ప్రమాదంలో పడేస్తుంది’ అని మాడు పగిలే మాటలు చెప్పింది. కేంద్రం తక్షణం స్పందించి, బలవంతపు మతమార్పిళ్లను పూర్తిగా అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవలసిందని కూడా ఆదేశించింది. న్యాయవాది అశ్వినికుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ మీద న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సంవత్సరారంభంలో తమిళనాడులో లావణ్య అనే పాఠశాల విద్యార్థినిని మతమార్పిడి క్రైస్తవ సైతానులు పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యమిది.
మత మార్పిడులు ఎంత హీనమో, వాటి వెనుక ఎన్ని దురుద్దేశాలు ఉన్నాయో భారత ప్రభుత్వానికీ, అత్యున్నత న్యాయస్థానానికీ తెలియనిది కాదు. డబ్బు తదితర ప్రలోభాలు చూపించి, భయపెట్టి, మోసగించి సాగే మత మార్పిడులను అడ్డగించేందుకు మధ్యప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు తెచ్చిన రెండు చట్టాలు ధర్మ స్వాతంత్య్ర అధినియం 1968, ఒడిశా మత స్వేచ్ఛ చట్టం 1967లను సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించిన సంగతి కూడా తాజా వ్యాజ్యంలో ప్రస్తావనకు వచ్చాయి. అయినా లక్షలలో మత మార్పిడులు జరిగిపోతున్నాయి. గిరిజన ప్రాంతాలలో అడ్డూఅదుపూ లేకుండా మత మార్పిడులు జరుగుతున్న సంగతిని సొలిసిటర్ జనరల్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఎక్కడో అడవులలో ఎందుకు? దేశ రాజధానిలో పదివేల మందిని సామూహికంగా మతం మార్చి, మేం హిందూ దేవుళ్లను పూజించం అంటూ ప్రతిజ్ఞ చేయించిన ఘనకార్యంలో ఆప్ మంత్రి పాల్గొని ఉపన్యాసాలు దంచాడు. తరువాత పదవి పోగొట్టుకుంటున్నాడు అది వేరే విషయం.
1977లో రెవరెండ్ స్టయినిస్‌లస్ వర్సెస్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు సుస్పష్టంగా మత మార్పిడి ఎంత వికృతమో వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తిని మొదటి మతం నుంచి మార్చడం ప్రాథమిక హక్కు కాదు. ఇది రాజ్యాంగంలోని 25(1) అధికరణానికి విరుద్ధం. ఈ అధికరణం మత స్పృహను గురించి చెబుతోంది. ఆ స్పృహను, అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును ధిక్కరించడ మేనని ఘోషిస్తున్నది. కానీ మత మార్పిడులు కూడా మాఫియా శైలిలోకి మారుతున్నాయి. వాటితో దేశ సమగ్రతకే ప్రమాదమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడవలసి వచ్చింది. 2009లో అస్సామ్ టైమ్స్ పత్రిక నివేదించిన వార్త ఇది: హిమర్ ఉగ్రవాదులలో 15 మంది తమని తాము మన్మాసి నేషనల్ క్రిస్టియన్ ఆర్మీ పేరు పెట్టుకుని అస్సాంలోనే భువన్ పహార్ ప్రాంత హిందువులను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించారు. 1998లో కశ్మీర్ లోయలో ప్రాణ్‌కోట్ ఊచకోత ఉదంతం వెనుక ఉన్నదీ ఇదే. ముస్లిం ఉగ్రవాదులు 26 మంది హిందువుల తలలు నరికి చంపారు. ఇస్లాంలోకి మారడానికి వీరు వ్యతిరేకించడమే వాళ్లు చేసిన తప్పిదం. ఈ మార్పిడి నిరంతర పక్రియలా మార్చేశారు. తాజాగా జార్ఖండ్‌లో ఒక బాలికను అపహరించి పెళ్లి చేసుకుని ఇస్లాంలోకి మార్చారు (నవంబర్ 12,2022), మీరట్‌లో 400 మంది హిందువులను క్రైస్తవంలోకి మార్చి, హిందూ దేవతల విగ్రహాలు తొలగించి, పూజా విధానం మార్చుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు (అక్టోబర్ 29,2022). కర్ణాటకలో నియాజ్ పాషా అనే కార్పొరేటర్, మరొక 11 మంది ఒక హిందువును బలవంతంగా మతం మార్చి గొడ్డుమాంసం తినిపించారు (అక్టోబర్ 14, 2022).
భారతదేశంలో మత మార్పిడి చరిత్రంతా రక్తపాతంతో కూడుకున్నదే. లేదా ప్రలోభాలు, మూఢత్వం ఆధారంగా సాగినదే. విద్యాలయాలలో, వైద్యాలయాలలో, ఒక వర్గం మీడియా, సినిమాతో హిందువులను మతం మార్చడం ఒక నిరంతర పక్రియగా సాగిపోతోంది. డీఎంకే, వైఎస్‌ఆర్‌సీపీ, టీఆర్‌ఎస్, టీఎంసీ వంటి పార్టీల మైనారిటీ ఓట్ల దాహం కొన్ని మతాలు మత మార్పిళ్లను యథేచ్ఛగా సాగించుకునేందుకు ఆసరాగా మారుతోంది. సుప్రీం కోర్టు ఆదేశించినందుకైనా కేంద్రం ఈ వికృత విన్యాసాల పట్ల అత్యంత కఠినంగా, తక్షణమే వ్యవహరించడం న్యాయం.