పీఎఫ్‌ఐ ‌కార్యాలయాల మీద దాడులకు కాస్త ముందు దేశంలో మరొక కీలక పరిణామం జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌సెప్టెంబర్‌ 22‌న ముస్లిం మత పెద్దలను, మేధావులను స్వయంగా వెళ్లి కలుసుకున్నారు. ఈ పరిణామం చర్చకు దారి తీయకపోతేనే ఆశ్చర్యం. కుహనా సెక్యులరిస్టులు, విద్రోహులు అదే పనిగా ప్రచారం చేస్తున్నట్టు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశంలోని ప్రతి ముస్లింను పనిగట్టుకు ద్వేషించదని మోహన్‌ ‌భాగవత్‌ ‌ప్రతి సందర్భంలోను చెబుతూనే ఉంటారు. ఆయన తాజాగా కొందరు ముస్లిం ప్రముఖులను కలుసుకోవడం కూడా ఇలాంటిదే. సంస్థ మీద ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నాన్ని కూడా ఇందులో చూడవచ్చు. మరొక వాస్తవం ఉంది. భారతీయ ముస్లింలు అరేబియన్‌ ‌పోకడలను ప్రదర్శించడం సరికాదని చెప్పే ప్రయత్నం కూడా ఆ సమావేశంలో ప్రస్ఫుటమవుతుంది.

ముస్లిం మత పెద్దలను, మేధావులను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌, ‌లేదా ఇతర ప్రముఖులు కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదు. సంస్థ రెండో సర్‌ ‌సంఘచాలక్‌ ‌పరమ పూజనీయ ఎంఎస్‌ ‌గోళ్వాల్కర్‌ ‌కూడా 1971లో ఇలాంటి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన ప్రముఖ అరేబియన్‌ ‌పండితుడు సైఫుద్దీన్‌ ‌జిలానీని కలుసు కున్నారు. హిందూ ముస్లిం సమస్యల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయాలు ఆయనకు తెలియ చేయడమే కాదు, భారతీయ ముస్లింలు తమ మత విశ్వాసాలతోనే భారతీయ జీవన స్రవంతిలో కలసి మెలసి ఉండవలసిన అవసరం గురించి కూడా వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ 97 ‌సంవత్సరాల చరిత్రలో సంస్థ ప్రముఖులు క్రైస్తవ, ముస్లిం మత పెద్దలతో పలుసార్లు సమావేశమయ్యారు. ఆగస్ట్‌లో డాక్టర్‌ ‌భాగవత్‌ ఐదుగురు ముస్లిం ప్రముఖులతో సమావేశం కావడం గత సమావేశాలకు కొనసాగింపు మాత్రమే. అయినా అదొక సంచలనమే అయింది.

డాక్టర్‌ ‌భాగవత్‌ ‌ఢిల్లీలో కస్తూర్బా మార్గ్‌లో ఉన్న ఒక మసీదుకు వెళ్లి అఖిల భారత ఇమామ్‌ ‌సంస్థ అధినేత ఉమర్‌ అహ్మద్‌ ఇలియాసీని కలుసుకున్నారు. సర్‌ ‌సంఘచాలక్‌ను ఇలియాసీ ‘జాతిపిత’గా అభివర్ణించడం ఇంకాస్త సంచలనమే అయింది. అందుకు డాక్టర్‌ ‌భాగవత్‌, ‌మనమంతా భారతమాత బిడ్డలమేనని సరైన విధంగా స్పందించారు.

కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్ల తమ అభిప్రాయం మార్చు కోవడానికి భారతదేశంలో ముస్లిం మతోన్మాదులు సిద్ధంగా లేరు. ఎక్కడ ముస్లింలకు, హిందువులకు ఘర్షణ జరిగినా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పేరు తీసుకువచ్చేందుకు ముస్లిం మతోన్మాదులే కాదు, కుహనా సెక్యులరిస్టులు కూడా సిద్ధంగానే ఉంటారు. ఈ సెప్టెంబర్‌ 22‌న సర్‌ ‌సంఘచాలక్‌ ‌స్వయంగా వెళ్లి ఇలియాసీని కలుసుకోవడం మతోన్మాదులకు కన్నెర్ర అయింది. డాక్టర్‌ ‌భాగవత్‌తో సమావేశమైన తరువాత చంపుతామంటూ ఇలియాసీకి బెదిరింపులు మొదలైనాయి. ఇలాంటి బెదిరింపులు విదేశాల నుంచి తనకు ఎక్కువగానే వచ్చాయని ఆయన చెప్పారు. ఒక ముస్లిం మత పెద్ద ఇలాంటి మాటలు మాట్లాడడం ఇస్లాం మతోన్మాదులకు నచ్చడం లేదని అర్ధమవుతోంది. ‘నా ఆహ్వానం మేరకు మోహన్‌ ‌భాగవత్‌ ‌మసీదుకు వచ్చారు. ఆయన జాతిపిత. జాతి రుషి కూడా. ఆయన చేసిన పర్యటనతో ఒక మంచి సందేశం ప్రజలకు వెళుతుంది. భగవంతుడిని ప్రార్ధించడానికి మన పద్ధతులు వేర్వేరు కావచ్చు. కానీ మానవత్వమే అతి పెద్ద మతం. దేశమే ముఖ్యమని మేం నమ్ముతాం’ అని డాక్టర్‌ ‌భాగవత్‌ ‌చెప్పారని ఒక వార్తా సంస్థతో ఇలియాసీ చెప్పారు. ఇదే సమయంలో డాక్టర్‌ ‌భాగవత్‌ ఒక మదర్సాను కూడా సందర్శించారు. విద్యార్థులతో ఆయన ముచ్చటించినప్పుడు వారు మద్రె వతన్‌, ‌జై హింద్‌ అం‌టూ నినాదాలు చేశారని కూడా వార్తా సంస్థలు వెల్లడించాయి. సర్‌ ‌సంఘచాలక్‌ ఎం‌తో సామరస్యంతో వ్యవహరించారని మదర్సా పెద్ద మహ్మద్‌ ‌హసన్‌ ‌కూడా చెప్పారు. మంచి భవిష్యత్తు కోసం కంప్యూటర్‌ ‌విద్యలో నైపుణ్యం సాధించాలని డాక్టర్‌ ‌భాగవత్‌ ‌విద్యార్థులకు సూచించారు. భాగవత్‌ ‌మదర్సాలో గడిపిన గంట సమయంలో కొద్దిసేపు ఖురాన్‌ ‌పఠనం కూడా ఆలకించారు.

మతోన్మాదంతో కొందరు ముస్లింలు పూర్తిగా విచక్షణ కోల్పోతున్నారు. ఇలియాసీకి వచ్చినట్టే మరొక ముస్లిం పండితుడు మౌలానా షహబుద్దీన్‌ ‌రజ్వికి కూడా చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇండియా ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు. ఈయన చేసిన పాపం ఏమిటి? పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా(పీఎఫ్‌ఐ)‌కు ముస్లింలు దూరంగా ఉండాలని సెప్టెంబర్‌ 23‌న పిలుపు నివ్వడమే. అది రాడికల్‌ ‌ముఠా కాబట్టి నిషేధం విధించాలని కేంద్రాన్ని ఆయన కోరారు కూడా. దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ ‌నాయకులను అరెస్టు చేయడాన్ని కూడా రజ్వి స్వాగతించారు. ‘కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థ మీద సరైన చర్య తీసుకుంది. ఈ అంశంలో ఆ చర్యలను నేను సమర్ధిస్తున్నాను. దేశభద్రత, సార్వభౌమాధికారాల రక్షణకు ఆ సంస్థ మీద నిషేధం విధించాల’ని ఆయన కోరారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ముస్లింలకు వ్యతిరేకం కాదు

‘ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ముస్లిం వ్యతిరేకా!’ మనదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు తరచూ ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలతో ఏర్పడ్డ అపోహ ఇది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశంలో నిజమైన మత సామరస్యాన్ని కోరుకుంటోంది. మతాలకు అతీతంగా అందరూ మనదేశాన్ని ప్రేమించాలని, దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తోంది. హిందూ వ్యతిరేక ధోరణిని, ఛాందసవాదాన్ని, తాము ఇతర వర్గాలకు ప్రత్యేకం అనే మనస్తత్వాన్ని వ్యతిరేకిస్తుంది. ఉగ్రవాదం-తీవ్రవాదం, దేశ విద్రోహక చర్యలను కచ్చితంగా ఖండిస్తుంది. ముస్లింలతో పాటు ఇతర మైనారిటీ వర్గాలను జాతీయ జీవన స్రవంతితో కలుపుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ భేటీ అందరినీ ఆకర్శించింది.

ఈ భేటీలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌నజీబ్‌జంగ్‌, ‌చీఫ్‌ ఎలక్షన్‌ ‌మాజీ కమిషనర్‌ ఎస్‌వై ఖురైషీ, అలీగడ్‌ ‌ముస్లిం యూనివర్సిటీ మాజీ ఛాన్సలర్‌ ‌లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌జమీరుద్దీన్‌ ‌షా, మాజీ ఎంపీ షాహిద్‌ ‌సిద్ధిఖీ, వ్యాపారవేత్త సయీద్‌ ‌షెర్వానీలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ అ‌గ్రనాయకులు కృష్ణ గోపాల్‌, ‌రామ్‌లాల్‌, ఇం‌ద్రేశ్‌కుమార్‌ ‌కూడా ఉన్నారు.

ఈ సమావేశంలో గోహత్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విధానాన్ని భాగవత్‌ ‌వారికి వివరించారు. దీంతో పాటు హిందువులకు వ్యతిరేకంగా కాఫిర్‌, ‌జిహాద్‌ ‌లాంటి పదాలను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సమాజానికి మంచి సందేశాన్ని పంపదని, ఇలాంటి పదప్రయోగాలకు ముస్లింలు దూరంగా ఉండాలని సూచించారు. అయితే కాఫిర్‌ ‌పదాన్ని వాడటం వెనుక అసలు ఉద్దేశం వేరని, కొన్ని వర్గాలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ముస్లిం మేధావులు వివరించారు. హిందువులు, ముస్లింలు జాతీయ సమైక్యత కోసం కృషి చేయాలని ఈ సమావేశంలో  ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రాడికల్‌ ఇస్లాం ఫండమెంటలిజానికి దూరంగా ముస్లిం సమాజాన్ని దేశ ప్రధాన స్రవంతితో కలుపుకొని వెళ్లడానికి ఈ సమావేశం ఒక చక్కని ప్రయత్నంగా విశ్లేషకులు అభివర్ణించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ – ఏఐఐఓ

ఆల్‌ ఇం‌డియా ఇమామ్స్ ఆర్గనైజేషన్‌ (ఏఐఐఓ) ‌మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం సంస్థ. భారత్‌లోని 3 లక్షల మసీదులకు ఏఐఐఓ ప్రాతినిథ్యం వహిస్తోంది. మసీదులలో ప్రార్థనలు నిర్వహించే ఇమామ్‌లతో సమన్వయంతో పాటు సామాజిక అంశాలపై కూడా ఈ సంస్థ పని చేస్తోంది. వివాదాస్పద అంశాల్లో తల దూరచ్చకుండా విభిన్న వర్గాల మధ్య సామరస్యం, ప్రేమ కోసం కృషి చేయాలని ఏఐఐఓ చీఫ్‌ ఉమర్‌ ఆహ్మద్‌ ఇలియాసి తరచూ చెబుతుంటారు. ఇలియాసీ ఇలాంటి భేటీలు నిర్వహించడం కొత్తేమీ కాదు. ప్రధాని నరేంద్ర మోదీని అనేక సందర్భాల్లో కలిశారు. అలాగే హోం మంత్రి అమిత్‌ ‌షా, సద్గురు జగ్గీ వాసుదేవ్‌, శ్రీశ్రీశ్రీ ‌పండిట్‌ ‌రవిశంకర్‌ ‌వంటి ఆధ్యాత్మిక నాయకులతో కూడా ఆయన సమావేశాలు జరిపారు.

ఓటుబ్యాంకు రాజకీయాలతో పెరిగిన దూరం

శతాబ్దాలుగా మనదేశంలో ఇరు మతాల ప్రజలు కలిసే జీవిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో మహ్మద్‌ అలీ జిన్నా ద్విజాతి సిద్దాంతం దేశ విభజనకు కారణమైంది. ముస్లిం కోసం ప్రత్యేక దేశం ఏర్పాటైనా భారత్‌ ‌లౌకికవాదానికి కట్టుబడింది. అయితే స్వాతంత్య్రానంతరం కూడా మన నాయకులు బుజ్జగింపు ధోరణులను కొనసాగిస్తూ ముస్లిం నాయకులను, ఓటర్లను ప్రలోభపెట్టి ఓటుబ్యాంకుగా మార్చేశారు. హిందూ సమాజంలో ఐక్యత కోసం పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను, బీజేపీని బూచిగా చూపిస్తున్నారు. ఈ ప్రయత్నాలు తాము ఈ దేశంలో ప్రత్యేకం అనే వేర్పాటువాదాన్ని మరింతగా ప్రోత్సహించాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో జరుగుతున్న ఘర్షణలు ఇస్లాంలో అతివాద ధోరణిని పెంచాయి. దురదృష్టవశాత్తు మన దేశంలోని ముస్లిం సమాజంలో సంస్కరణవాద నాయకత్వం బలంగా లేకపోవడంతో ఇక్కడి యువత ఇస్లాం అరబ్‌ ‌పంథా వైపు ఆకర్షితులవుతున్నారు. ముస్లింలకు మన దేశంలో అన్యాయం జరుగుతోందని కొన్ని సంస్థలు రెచ్చగొడు తున్నాయి. పాకిస్తాన్‌, ఇతర ఇస్లామిక్‌ ‌దేశాల కేంద్రంగా పనిచేస్తున్న జిహాదీ ఉగ్రవాద సంస్థలు వీరిని ఆకర్షిస్తున్నాయి. మైనారిటీ యువతలో విచ్ఛిన్నకర వేర్పాటువాద బీజాలను నూరి పోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలను జాతీయ జీవన స్రవంతిలో కలుపుకొని వెళ్లడానికి సరైన దిశ దశ అవసరం ఏర్పడింది.

ముస్లింలను ఐక్యతే లక్ష్యంగా ఎంఆర్‌ఎం

‌జాతీయభావాలు కలిగిన ముస్లింలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా 2002లో ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ (ఎంఆర్‌ఎం) ఏర్పడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాటి సర్‌ ‌సంఘచాలక్‌ ‌కేఎస్‌ ‌సుదర్శన్‌జీ చొరవతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈద్‌ ‌మిలన్‌ ‌సందర్భంగా డిసెంబర్‌ 24, 2002‌న జాతీయవాద ముస్లింలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవకుల బృందం ఢిల్లీలో సమావేశమైంది. ప్రముఖ పాత్రికేయుడు పద్మశ్రీ ముజఫర్‌ ‌హుస్సేన్‌, ఆయన భార్య జాతీయ మహిళా కమిషన్‌ ‌సభ్యురాలు నఫీసా చొరవతో ఈ కార్యక్రమం జరిగింది. సర్‌సంఘచాలక్‌ ‌కేఎస్‌ ‌సుదర్శన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ అ‌గ్రనాయకులు ఎంజీ వైద్య, ఇంద్రేశ్‌ ‌కుమార్‌, ‌మదన్‌దాస్‌, ఆల్‌ ఇం‌డియా ఇమామ్‌ ‌కౌన్సిల్‌ అధ్యక్షుడు మౌలానా జమీల్‌ ఇలియాసి, మౌలానా వహిదుద్దీన్‌ఖాన్‌, ‌ఫతేపురి మసీదు షాహీ ఇమామ్‌ ‌మౌలానా, సుఫియానా పాల్గొన్నారు. భారతదేశంలోని ముస్లింలు పుట్టుకతో ఈ భూమికి చెందినవారు, హిందువులతో ఒకే సంస్కృతి, జాతి, పూర్వికులను పంచుకున్నప్పుడు మైనారిటీ హోదాను ఎందుకు అంగీకరించారనే చర్చ కూడా జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ముస్లింలకు వ్యతిరేకం అనే అపోహను తొలగించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది.

2009 నవంబర్‌లో జమాయత్‌ ఉలేమా-ఇ-హింద్‌ ‌వందేమాతరాన్ని ఇస్లామికేతర గేయంగా వర్ణిస్తూ చేసిన తీర్మానాన్ని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ ‌వ్యతిరేకించింది. వందేమాతం ఆలపించరాదనే ఫత్వాను తిరస్కరించింది. ప్రతి భారతీయ పౌరుడు వందేమాతర గీతాన్ని గౌరవించి ఆలపించాలని ఎంఆర్‌ఎం ‌బలంగా చాటి చెప్పింది.

–              2008 ఆగస్ట్‌లో అమర్‌నాథ్‌ ‌తీర్థయాత్రకు భూ కేటాయింపుకు మద్దతుగా ఢిల్లీలోని ఎర్రకోట నుండి కశ్మీర్‌ ‌వరకు పైఘం-ఇ-అమన్‌ ‌యాత్ర (శాంతి సందేశ యాత్ర)ను ఎంఆర్‌ఎం ‌నిర్వహించింది.

–              నవంబర్‌ 2009‌లో  ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎంఎం ఆధ్వర్యంలో ముంబైలోని గేట్‌వే ఆఫ్‌ ఇం‌డియా దగ్గర వెయ్యి మంది వాలంటీర్లతో ప్రతిజ్ఞ చేశారు.

–              జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ‌రద్దుకు మద్దతు ప్రకటిస్తూ సెప్టెంబర్‌ 2021‌లో దేశ వ్యాప్తంగా ఆర్‌ఎంఎం ‌ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టికల్‌ 370 ‌రద్దుకు మద్దతుగా 7 లక్షల ముస్లింల సంతకాలు సేకరించింది.

– 2015లో ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ ‘‌యోగా- ఇస్లాం’ అనే పుస్తకాన్ని ప్రచురించింది. ‘యోగా’కి మతంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘నమాజ్‌ అనేది ఒక రకమైన యోగా సనం’ అని పేర్కొంది. ప్రకృతివైద్య మంత్రిత్వ శాఖ, యునానీ, సిద్ధ హోమియోపతి (ఆయుష్‌) ‌వంటి సంస్థలకు మద్దతుగా నిలిచింది.

–              ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌, ‌దేవ్‌బంద్‌ ‌ప్రాంతాల్లోని మదర్సాల్లో విదేశీ సంబంధాలు వెలుగు చూశాయి. అక్కడి  మదర్సాల ఆస్తులపై విచారణ జరిపించాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ ‌కోరింది. ఇస్లామిక్‌ ‌విద్యాసంస్థల ఆస్తులు, వాటి యాజమాన్యం, సిబ్బంది విదేశాల సందర్శనల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించాలని సూచించింది. హవాలా నెట్‌వర్క్ ‌ద్వారా డబ్బు స్వీకరించే  కొందరు మదర్సా ప్రతినిధులు దేశ వ్యతిరేక కార్యకలా పాలతో సంబంధాలు కలిగి ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేసింది.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE