సంపాదకీయం
శాలివాహన 1944 శ్రీ శుభకృత్ కార్తిక శుద్ధ సస్తమి – 31 అక్టోబర్ 2022, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
దేశాన్ని ‘మళ్లీ ఏకం చేసేందుకు’ భారత్ జోడో యాత్రలో చెమటోడు స్తున్నానని చెప్పుకుంటున్నారు రాహుల్ గాంధీ. నిజమే, ఇంతకు ముందు దేశ ప్రజానీకాన్ని వీలైనప్పుడల్లా విడదీసిన చరిత్ర తన పార్టీదీ, తన ముందు తరం నాయకులదీ అని రాహుల్‌కు అర్ధమైనందుకు సంతోషించాలి. ఆ విధంగా జోడో అంటూ యాత్ర చేపట్టడానికి ఆయనకే అన్నివిధాలా అర్హత దఖలు పడింది. సొంత పార్టీ ముఖ్యమంత్రి బలపడితేనే సహించలేక అతడి మీద అసమ్మతి రెచ్చగొట్టిన ఘనత కాంగ్రెస్ అధిష్టానం సొంతం. భారత సమాజాన్నే కాదు, విభజన విషయంలో సొంత పార్టీని కూడా వదలని సంస్కృతి వారిది. ఇప్పుడూ అదే విద్య చెల్లుబాటు అవుతుందని రాహుల్ గట్టి నమ్మకంతో ఉండడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లే విడగొడతారు. ఇదిగో, ఏకం చేసేవాళ్లం మేమే అంటారు.
కర్ణాటక నుంచి తెలంగాణలోకి యాత్ర ప్రవేశించగానే ఆయన చెప్పిన మాట అదే. భారత్ రెండు వర్గాలుగా చీలిపోయి ఉందట. ఒకరు బాగా డబ్బున్న వర్గం. నిరుద్యోగులు, కర్షకులు, మహిళలు, చిరువ్యాపారులు మొదలైన వారి భారతదేశం రెండో వర్గంలోకి వస్తుందట. ఇలాంటి ఊకదంపుడు విశ్లేషణలు గతంలో విన్నట్టు అనిపిస్తే అది ఎవరి తప్పూ కాదు. ‘మతోన్మాద బీజేపీ’ని అధికారానికి దూరంగా ఉంచాలన్న వ్రతం పట్టని క్రితం, కాంగ్రెస్ చంకలోకి ఇంకా చేరని రోజులలో కమ్యూనిస్టులు ఇదే పాట అదేపనిగా పాడుతూ ఉండేవారు. యాత్రతో అలసి సొలసిన రాహుల్ విశ్రమించడానికి చాలా ఖరీదైన వాహనాలే అక్కడ మోహరించి ఉంచారన్న మాట తొలి అడుగు లోనే వినిపించింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 23న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో పనిచేసే కార్మికుల బాగోగులను తెలుసుకుంటూ మంచు కొండల మధ్య రేకుల పైకప్పు ఉన్న చిన్న గదిలో నిద్రించారు. ఉత్తరాఖండ్ యాత్రలో భాగంగా డెహ్రాడూన్‌కు దగ్గరగా ఉన్న ఆ ప్రాంతానికి ప్రధాని వెళ్లారు. అది సముద్ర మట్టానికి 11,300 అడుగుల ఎత్తున ఉంది. కార్మికులకు వండి పెట్టే కిచిడీనే ఆయన తిన్నారు. ఇదంతా ఎందుకూ అంటే, భారతదేశం రెండు వర్గాలైపోయిందని రాహుల్ సిద్ధాంతీకరించారు. కాబట్టి ఈ దేశాన్ని రెండు రకాల ప్రభుత్వాలు ఏలాయి. ఒకటి పచ్చి అవినీతి ప్రభుత్వాలు. రెండు అవినీతి దరిచేరని ప్రభుత్వాలు. నోట వెండి చెమ్చాతో పుట్టిన వారి ఏలుబడి. బడిపంతులు కుమారుడు, చాయ్‌వాలా ఇంటి నుంచి వచ్చిన సగటు భారతీయుడి ఏలుబడి. సంతుష్టీకరణ మంత్రంతో అధికారం కబళించే వర్గం ఒకటి. సర్వమత సమభావనతో ఏలాలనుకుంటున్నవారు ఇంకొక వర్గం. పార్టీయే అమ్మ, అమ్మే పార్టీ అనుకునే నాయకుడు ఒకవైపు, దేశమాతే అన్నీ అని చెప్పే నాయకుడు ఇంకొక వైపు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ‘వర్గ’ విభజన కనిపిస్తుంది. లేదంటే ద్విజాతి సిద్ధాంతం అనొచ్చు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరమే జీపుల కొనుగోలు అక్రమాలకు పాల్పడిన పార్టీకి వారసుడు రాహుల్. ఆ పార్టీ అధికారంలో ఉండగా జరిగిన ఆర్థిక అవకతవకల జాబితా ఇవ్వాలంటే వేల పేజీల గ్రంథం కూడా చాలదు. ఇది ఢిల్లీ వరకే. మళ్లీ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల అవినీతి గురించి పరిచయం చేయాలంటే ఇంకో అన్ని పేజీలు కావలిసిందే. ఏదీ తక్కువ కాదు, అన్నీ కోట్ల రూపాయల దిగమింగుడు వ్యవహారాలే. ఈ సొమ్మంతా ఎక్కడ ఉంది? నేషనల్ హెరాల్డ్ కేసులో పోగేసిన కోట్లన్నీ దిగమింగినా ఇంకా తను పేదలకు ప్రతినిధిని అని రాహుల్ గాంధీ చెప్పుకోవడం చూస్తే ఒకటే అనిపిస్తుంది. ఆయన గొప్ప గుండె ధైర్యం కలిగినవాడు. లేదా ప్రజలంతా వెర్రివాళ్లన్న కచ్చితమైన నమ్మకంతో ఉన్నవాడు. అలాగే నాలుగున్నర దశాబ్దాలు ఈ దేశాన్ని ఏలింది కాబట్టి నిబంధనలు ఏవీ ఆ పార్టీ దరిదాపులకు రావడానికి లేదన్న గట్టి నమ్మకం కూడా ఉంది. కాబట్టే విదేశీ విరాళాల కోసం తీసుకోవలసిన అనుమతులేవీ తీసుకోకపోయినా రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు ఆ హక్కును తొలగించినందుకు మండిపడుతోంది పార్టీ. పైగా దేశంలో రూపాయి విలువ పడిపోతున్న సంగతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తమ ఫౌండేషన్‌కు అనుమతులు నిరాకరించారని కూడా ఒక వితండవాదాన్ని రుద్దే ప్రయత్నం జరుగుతోంది. రాజీవ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ స్వచ్ఛంద సంస్థ గాంధీ కుటుంబీకులదే. కాబట్టి నిబంధనలు ఎందుకు?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఎందుకు ప్రారంభించారో తెలుసు కదా! కానీ ఆయన కలుస్తున్నవాళ్లు, లేదా ఆయనను వచ్చి కలుసుకుంటున్నవాళ్లు ఎవరు? హిందూ దేవుళ్ల కంటే మా దేవుడు సర్వోన్నతుడు అని విద్వేషం తప్ప మరేమి ఎరుగని పాస్టర్‌నీ, పాకిస్తాన్ జిందాబాద్ అని అరిచిన అమ్మాయినీ తన వెంట నాలుగడుగులు వేయించారాయన. ఇక నిధుల వసూళ్లలో కాంగ్రెస్ కార్యకర్తల లాఘవం తెలియనిదెవరికి? కేరళలో ఒక కూరగాయల దుకాణదారు రెండు వేల రూపాయలు ఇవ్వనందుకు అతడికి దేహశుద్ధి చేశారు. యాత్రలో రాహుల్ ఇంకేం చెబుతున్నారు? రైతుల కష్టాల గురించా? లేదు. విద్యార్థుల సమస్యల గురించా? కాదు. ఇవేమీ కాదు. నోరు విప్పితే చాలు, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల మీద విషం కక్కడమే పని. నిన్నటి దాకా ఈ పని చేయడానికి పీఎఫ్‌ఐ సాయపడేది. ఇప్పుడు చేయూత లేదు. అందుకే వారి నినాదాన్ని కూడా రాహుల్ తన నినాదంగా తీసుకున్నారు. రాహుల్ నిజంగా భారత్‌ను ‘మళ్లీ’ ఏకం చేసే పనికి పూనుకోవడం అంటే, తన పూర్వికులు చేసిన తిక్క చర్యలను సరిదిద్దడమే. ఆ పని మనస్ఫూర్తిగా చేస్తే మంచిదే. ఇదే సందర్భంలో మరొక మాట. నా యాత్రను ఎవ్వరూ ఆపలేరు అని కూడా ఢంకా బజాయించా రాయన. యాత్రను అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో, అంత పనిలేని వాళ్లు ఎవరో చెబితే బావుంటుంది.