– గోవిందరాజు చక్రధర్
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన రచన
‘‘క్యాబ్ బుక్ అయింది. వెళ్దాం పదండి. అసలే ఇది ట్రాఫిక్ ఉండే సమయం. అంటూ తల్లినీ, తండ్రినీ బయలుదేరదీశాడు శశాంక్ మోహన్. రాజ్యలక్ష్మి గారు మెడబెల్టు, నడుం బెల్టులతో మంచినీళ్ల సీసాతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కదిలారు. రామారావు గారు ఆవిడను ఒక చేత్తో పట్టుకుని లిఫ్టట్ దాకా నడిపించుకుని వచ్చారు. సొంత కారున్నా, పార్కింగ్ సమస్యను ముందే ఊహించి క్యాబ్‌లో బయలుదేరారు.
ఆ ప్రయాణంలో ముగ్గురి మధ్యా మౌనమే రాజ్యం చేసింది. క్యాబ్ దిగాక తల్లీతండ్రుల చేతులు పుచ్చుకుని రోడ్డు దాటించాడు శశాంక్.
క్రిమినల్ కోర్టుల ప్రాంగణంలోకి ముగ్గురూ భారంగా అడుగుపెట్టారు. అప్పటికే ఆ ప్రాంగణం జడ్జిలు, లాయర్ల కార్లతోనూ, కోర్టు సిబ్బంది వాహనాలతోనూ నిండిపోయింది.
నల్లకోట్లు వేసుకున్న లాయర్లు ఒక చేత దస్త్రాలు పుచ్చుకుని హడావిడిగా వస్తున్నారు. కొంతమంది లాయర్లను వారి క్లయింట్లు అదే వేగంతో అడుగులో అడుగువేస్తూ అనుసరిస్తున్నారు.
చేతులకు బేడీలు వేసి ఆ బేడీలు రెండో కొసను భద్రంగా తన చేత పుచ్చుకుని అప్రమత్తంగా నడు స్తున్నాడు ఒక పోలీసు. సంకెళ్లు వేసి ఉన్న ఆ యువ కుడిని అప్పుడే పోలీసు వ్యాను నుంచి దింపారు. మరికొంత మంది పోలీసులు సాయుధులై, అప్ర మత్తులై ఆ యువకుడితో పాటు నడుస్తున్నారు.
ఆ వాతావరణం, ఆ పరిసరాలలో ఏ మాత్రం ఇమడలేకపోతున్నారు. ఇన్నేళ్ల జీవితంలో ఎన్నడూ పోలీస్‌స్టేషన్ మెట్లుగానీ, కోర్టు మెట్లు గానీ ఎక్కాల్సిన అవసరం రామారావుకు కలగలేదు. రిటైరయి ప్రశాంతంగా రోజులు వెళ్లదీయాల్సిన ఈ వయసులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది. తానొక్కడే కాదు, ఎన్నడూ ఎవరి మీదా గట్టిగా కోప్పడటం కూడా రాని పరమ సాత్వికురాలు రాజ్యలక్ష్మి కూడా కేసులో దోషిగా నిలబడాల్సి రావడం ఆయనకు అసలు భరింపశక్యం కాకుండా ఉంది. కుమారుడు శశాంక్ సరేసరి. చిన్నప్పటి నుండి తన చదువు ఏమిటో, తన స్నేహితులేమిటో- అలాంటి వాడు కూడా ఇప్పుడు ప్రథ•మ ముద్దాయి కావడాన్ని రామారావు జీర్ణించుకోలేకపోతున్నాడు.
మెటల్ డిటెక్టర్లను దాటుకుని ముగ్గురూ లోపలికి అడుగుపెట్టారు.
‘‘మన కోర్టు రెండో అంతస్తులో ఉందట’’ అని శశాంక్ ఎవరినో అడిగి తెలుసుకుని వచ్చాడు.
‘‘లిఫ్ట్ ఉందేమో చూడరా! మీ అమ్మ నడుము నొప్పితో, బీపీ షుగర్లతో అన్ని మెట్లు ఎక్కలేదు. నేనైతే రొప్పుతూ రోజుతూనైనా నెమ్మదిగా రాగలను. ఆవిడకు మాత్రం కష్టం’’ అన్నాడు రామారావు.
‘‘లిఫ్ట్ ఉంది, కానీ అది జడ్జిలకూ, లాయర్లకేనట. మనం మెట్ల మీద నుంచే వెళ్లాలనుకుంటాను’’ అన్నాడు శశాంక్, తల్లి పరిస్థితి తెలిసీ నిస్సహాయంగా.
తండ్రీకుమారుల సంభాషణ వింటున్న రాజ్య లక్ష్మికి పౌరుషం పొంగు కొచ్చింది. లేని శక్తిని కూడా దీసుకుంటూ-
‘‘ఫర్వాలేదు.. నేను మెట్లెక్కగలను’’ అంది పంతంగా. తన అనారోగ్యం వారికి ఇబ్బంది కాకూడ దని పైకి ఇలా బింకంగా అన్నదే గానీ నడుం నొప్పితో మెట్లెక్కే సాహసం చేస్తే ఆ తర్వాత జరగబోయే విపరిణామాలు ఆవిడకు తెలియనివేం కావు.
ఇటు భర్త, అటు కుమారుడు చేతులు పుచ్చుకుని నెమ్మదిగా రాజ్యలక్ష్మిని మెట్లెక్కిం చారు. నొప్పి ఛాయలేమీ పైకి కనపడనీయ కుండా లోలోపలే అణుచుకుంటూ రాజ్యలక్ష్మి మెట్లెక్కింది.
వారు హాజరు కావలసిన కోర్టు హాలు దగ్గర కూడా జనం కిటకిటలాడుతున్నారు. తమ లాంటి వృద్ధదంపతులు అప్పటికే అనేకమంది అక్కడ ఉన్నారు. నడకదారిలో రెండు పక్కలా వేసి ఉన్న బల్లలన్నీ నిండిపోయి ఉన్నాయి.
రాజ్యలక్ష్మికి అప్పటికే ప్రాణం కడగట్టిపోయింది. నీళ్ల సీసా మూత తీసి రెండు గుటకలు తాగింది. ప్రాణం కాస్తంత కుదుట పడ్డట్లనిపించింది. కనీసం తల్లినైనా కూచోబెడితే బావుంటుందని శశాంక్ ఖాళీ ఉందేమో చూశాడు. ఏమీ లాభం లేకపోయింది. రాజ్యలక్ష్మి ఇబ్బందిని గమనిస్తున్న ఒక యువకుడు తాను కూర్చున్న చోటు నుంచి లేచి ఆవిడను కూచోమన్నాడు.
ఒక్క క్షణం పాటు తటపటాయించినా, కూచోక పోతే కష్టమని తెలిసి మొహమాటం పక్కన పెట్టేసిందా విడ. సీటిచ్చిన యువకుడికి శశాంక్ కృతజ్ఞతలు చెప్పి తల్లిని బల్లమీద కూచోబెట్టాడు. రామారావు మాత్రం సీటు దొరక్క నిలబడే ఉన్నాడు. ఈలోపు శశాంక్ లాయర్‌కు ఫోన్ చేసి ‘‘వస్తున్నారా?’’ అని అడిగాడు.
తాను మరో ముఖ్యమైన కేసులో పర్సనల్‌గా హాజరు కావలసి ఉందని, తన జూనియర్‌కు చెప్పానని అన్నాడు. లాయర్ ఫోన్ కట్ చేయగానే జూనియర్ నుంచే శశాంక్‌కు ఫోన్ వచ్చింది. కోర్టు వివరాలు అడిగి తెలుసుకున్న జూనియర్ లాయర్ మరో ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు.
కేసు నంబర్ ఒకసారి శశాంక్ దగ్గర ధ్రువీక రించుకుని, నడకదారిలో కిటికీకి వేలాడదీసి ఉన్న కేసుల జాబితాను తిరగేశాడు జూనియర్. వారి కేసు నంబర్లు, పేర్లతో సహా ఆరోజు లిస్ట్ అయి ఉంది.
‘‘ఈరోజు వాయిదా పడుతుంది. అంతకు మించి ఏమీ ఉండదు. మీ పేర్లు పిలుస్తారు. అప్పుడు వెళ్లి అటెండ్ అవ్వండి. నేనీలోపు మరో కోర్టుకు వెళ్లి వచ్చేస్తాను’’ అని శశాంక్‌కు చెప్పి జూనియర్ లాయర్ అక్కడినుంచి వెను దిరిగాడు.
ఇదంతా చూస్తున్న రామారావుకు మాత్రం చిర్రెత్తుకొచ్చింది.
‘‘బోలడెంత ఫీజు ఇచ్చి లాయర్‌ను పెట్టుకున్నాం. ఆయన రాలేక జూనియర్‌ను పంపాడు సరే, జూనియర్ అయినా మనతో పాటు ఉండకుండా చెక్కేశాడేమిటి’’? అన్నాడు అసహనంగా.
‘‘అతను మాత్రం ఏం చేస్తాడు? ఈ కాంప్లెక్స్ లోనే రెండు, మూడు కేసులు అప్పగించి ఉంటాడు. అయినా మనది వాయిదా వేస్తారంతే. ఈలోగా జూనియర్ లాయర్ వచ్చేస్తాడు. మరీ అంత అవసరం అనుకుంటే ఫోన్ నంబర్ ఉంది. ఫోన్ చేసి పిలిపిద్దాం’’ అని శశాంక్, తండ్రిని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు. రామారావు అసహనం ఇంకా ఆయన కళ్లలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
రాజ్యలక్ష్మి పక్కన కూర్చోని ఉన్న పెద్దావిడ బల్లమీద నుంచి లేచింది. తండ్రిని అక్కడ కూచో మన్నాడు. తాను గోడకు ఒక కాలును ఊతంగా ఆనించి నిలబడే ఉన్నాడు.
‘‘కూచుంటాను సరే, మన పేర్లు పిలుస్తారేమో చూడు. ఈ గందరగోళంలో మిస్ అయితే కష్టం’’ అని శశాంక్‌ను అప్రమత్తం చేశాడు.
రామారావుకు ఈ మధ్య వినికిడి శక్తి తగ్గింది. పైగా ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచించడం, ఆందో ళన పడటం సహజ నైజం. వయసుతో పాటు అది ఈ మధ్య మరీ పెరిగింది.
శశాంక్, కంగారేమీ లేదన్నట్లు చేత్తోనే సైగ చేశాడు.
‘‘నిరంజన్ రెడ్డి… విశ్వనాథ రెడ్డి… మహా లక్ష్మమ్మ…’’ కోర్టు బంట్రోతు గొంతు పెంచి తనదైన శైలిలో పిలుస్తున్నాడు. ఈ పేర్లు చదవగానే కోర్టు హాలులోకి ముగ్గురు ప్రవేశించారు. అయిదు నిమిషాలలోపే వారు బయటకు వచ్చారు. బహుశా కేసు వాయిదా వేసి ఉంటారు.
ఎంత వద్దనుకున్నా రామారావు ధ్యాసంతా కోర్టు గుమ్మం మీదే ఉంది. కోర్టు బంట్రోతు గుమ్మం దగ్గరకొచ్చి మళ్లీ పేర్లు పిలవటానికి సిద్ధమయ్యాడు.
ఈసారి తమ వంతే అయి ఉంటుందనుకుని రామారావు లేచి నిలబడబోయాడు.
‘‘మీకెందుకింత కంగారు. మన పేర్లు పిలిచాక వెళ్దాం’’ అంటూ శశాంక్, తండ్రి మీద చిరాకు పడ్డాడు. ఎంత నింపాదిగా ఉందామని ప్రయత్నిం చినా ఉండలేకపోతున్నాడు. భర్త కంగారును రాజ్యలక్ష్మి గమనిస్తూనే ఉన్నా, అక్కడ ఏమి మాట్లాడితే ఏం గొడవోనన్నట్లుగా ఉండి పోయిందావిడ.
‘‘రజాహుస్సేన్… రహంతుల్లా… అమీనా బీ…’’ పెద్దగా పిలుపు.
చెవులు రిక్కించి వింటున్నాడు రామారావు. తర్వాత మళ్లీ పిలుపు. ఈసారి తమ పేర్లే పిలుస్తారని అనుకున్నాడు మనసులో. ఆసారి కూడా వారి పేర్లు పిలవలేదు.
చివరికి ఎప్పటికో-
‘‘శశాంక్ మోహన్.. రామారావు.. రాజ్యలక్ష్మి..’’ అంటూ బంట్రోతు గొంతు పెద్దది చేసి పిలిచాడు.’’ ఆ పిలుపు రామారావు చెవుల్లో కొద్దిసేపు మార్మో గింది. కోర్టు ఆవరణలోని ప్రతివారూ తమ పేర్లే వింటున్నట్లు, తమ వంకే చూస్తున్నట్లు, వేలెత్తి చూపు తున్నట్లు అనిపించి అవమాన భారంతో రామారావు కుంగిపోతున్నాడు. తలెత్తి ఎవరివైపు చూడలేక పోతున్నాడు.
ముందు శశాంక్ నడుస్తుండంగా, భార్యకు చేయి అందించి నిలిచోబెట్టాడు. చాలాసేపు కదలకుండా కూచోవడం వల్లనేమో రాజ్యలక్ష్మి కాళ్లు తిమ్మిర్లెక్కి స్వాధీనంలో లేవు. భార్య పరిస్థితి చూసి బాధేసింది. ఆవిడ అనారోగ్యం అలాంటిది. ఆలస్యం అవుతోం దన్న ఆందోళన… కానీ దాన్ని అణచిపెట్టుకోవడం మినహా అప్పుడా పరిస్థితిలో చేయగలిగిందేమీ లేదు. చాలా కాలంగా ఏ భావోద్వేగమూ పైకి వ్యక్తం కానివ్వ కుండా లోలోపలే అణచి వేసుకోవడం అలవాటై పోయింది. రాజ్యలక్ష్మి కాళ్లు తడబడుతుండగా భర్తతో పాటు నెమ్మదిగా అడుగులు వేసింది.
ముగ్గురూ కోర్టు హాలులోకి వెళ్లి బోనులో నిలబడ్డారు. రామారావుకు కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్లు అనిపించింది. మొదటిసారి కోర్టు బోనులో ముద్దాయిలుగా చేతులు కట్టుకుని నిలబడ్డారు. గుండె లోతుల్లో నుంచి బాధ తన్ను కొస్తుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.
రామారావును అంటి పెట్టుకుని నీడలా రాజ్య లక్ష్మి నిలబడి ఉంది. శశాంక్ తండ్రి ప్రక్కనే నిలు చుని ఉన్నాడు. ఎత్తయిన వేదికపై మేజిస్ట్రేట్ కూచుని ఉన్నాడు. ముందున ఉన్న సిబ్బందిలో ఒకరు గుట్టల్లా ఉన్న కేసు కాగితాల నుంచి వీరి ఫైలు తీసి ఆయన ముందుంచాడు. మేజిస్ట్రేట్ కేసు కాగితాలను తిరగేసి గుమాస్తా చేతికి అందించాడు. అతను వాయిదా తేదీ రాసి శశాంక్‌కు చెప్పాడు.
బోనులో నుండి బయటకొచ్చి కోర్టు హాలు దాటు తుంటే గొప్ప ఉపశమనం కలిగింది రామారావుకు.
‘‘వాయిదా ఎప్పటికి వేశాడు?’’ కోర్టులో చెప్పిన తేదీ వినిపించక పోవడంతో శశాంక్‌ను అడిగాడు.
‘‘ఆరు నెలలకు వాయిదా వేశారు. ఇప్పుడిప్పుడే రానక్కర్లేదు’’ అన్నాడు శశాంక్.
‘‘ఈ లెక్కన మన కేసు ఎప్పటికి తేలుతుంది? ఎప్పుడు నిరపరాధులుగా బయటపడి, మచ్చ తొలగించుకుంటాం?’’ అనుకున్నాడు రామారావు తనలో తాను.
కోర్టుమెట్లు దిగుతూ జూనియర్ లాయర్‌కు శశాంక్ ఫోన్ చేసి వాయిదా తేదీని చెప్పాడు. కోర్టు బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేయాలని చూస్తే ఒక పట్టాన ఎవరూ రాలేదు. ఇక లాభం లేదనుకుని ఆటో బుక్ చేయగా వెంటనే వచ్చాడు.
బతుకు జీవుడా! అనుకుంటూ అవస్థ పడుతూనే రాజ్యలక్ష్మి ఆటోలో కూచుని సీట్లో చివరివైపు జరిగింది. ముగ్గురినీ తీసుకుని ఆటో బయలుదేరింది. ఇంటిముందు ఆటో దిగాక, రాజ్యలక్ష్మి భర్తతో బాధగా అంది.
‘‘గుడిమెట్లు ఎక్కాల్సిన ఈ వయసులో కోర్టుమెట్లు ఎక్కాల్సి వచ్చిందండి. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఏమో!’’ ఆవిడ మాటలతో రామారావు కళ్లలో సన్నటి కన్నీటి పొర. భార్యకు కనపడకుండా కర్చీఫ్‌తో తుడిచేసుకున్నాడు.
* * * * * *
రామారావు ఒకానొక ప్రభుత్వ శాఖలో గుమాస్తాగా చేరి డిపార్ట్‌మెంట్ పరీక్షలు రాసి అంచెలంచెలుగా ఎదుగుతూ సెక్షన్ హెడ్‌గా రిటైరయ్యాడు. ఎంతో కొంత పైడబ్బులు సంపాదించు కునే వెసులుబాటు ఉద్యోగంలో ఉండేది. కానీ ఆర్థిక ఇబ్బందులు పడ్డాడే గానీ ఎన్నడూ చేయి చాచలేదు.
రామారావు చేతకాని వాడని సహోద్యోగులు ఎగతాళిగా తాటాకులు కట్టినా తాను మాత్రం కట్టు తప్పలేదు. కాసులకోసం కక్కుర్తి పడలేదు. నమ్మిన విలువల విషయంలో రాజీ పడలేదు. నీతికీ, నిజాయి తీకే పట్టం కట్టాడు. ఇద్దరు పిల్లలు పైచదువుల కొస్తూ ఖర్చులు, బాధ్యతలు పెరిగినా పొదుపుగా ఉంటూ సంసార రథాన్ని ఒంటి చేత్తో భారంగా లాక్కొచ్చాడు.
సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు రావడంతో కుమారుడు శశాంక్ మోహన్, కుమార్తె హేమనందిని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఏమైనా సరే అమెరి కాలో ఎమ్మెస్ చేసి తీరతానని హేమనందిని పట్టుబట్టి వెళ్లింది. మోయలేని భారమని తెలిసినా, ఎన్నడో పాతికేళ్ల క్రితం కూతురు పెళ్లికి పనికి వస్తుందని కొనిపెట్టిన స్థలాన్ని అమ్మేసి ఆమెను అమెరికా పంపి చదువు చెప్పించాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన హేమ అక్కడే ఉద్యోగంలో చేరింది. తెలుగబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. కూతురు, అల్లుడు అమెరికాలోనే స్థిరపడ్డారు. వాళ్లు పట్టుబట్టడంతో భార్యతో కలిసి రెండుసార్లు అమెరికాకు వెళ్లి వచ్చాడు.
పైసా పైసా కూడబెట్టి పిల్లలని ఒక దారిలో పెట్టాం. ఇక ‘కృష్ణా! రామా! ’ అనుకుంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేయవచ్చనుకునే తరుణంలో పెను సంక్షోభంలో కూరుకుపోవలసి వచ్చింది.
* * * * * *
కూతురు పెళ్లిని సునాయాసంగా చేసిన వారు కుమారుడి పెళ్లి వచ్చేటప్పటికి చాలా అప్పులు పడ్డారు. కాళ్లకు బలపం కట్టుకుని కట్టుకుని మ్యారేజి బ్యూరోల చుట్టూ తిరిగారు. ఒక్కటీ అనువైన సంబంధం దొరక లేదు. చివరకు మాట్రిమొనీ సైట్‌లో ఒక సంబంధం బావుందనిపించింది. శశాంక్ కూడా ఆ అమ్మాయి ఫోటో చూసి నచ్చిందన్నాడు.
చూస్తుండగానే శశాంక్, వినీతను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లాడు. కంపెనీ వారే తమ ప్రాజెక్ట్ కోసం ఎల్‌వన్ వీసాపై అమెరికా పంపారు.
ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు, అమ్మాయి బాధ్యతలన్నీ తీరాయి అని రాజ్యలక్ష్మి, రామారావు సంబరపడ్డారు. కాకుంటే రాజ్యలక్ష్మికి మాత్రం ఒక వెలితి ఉండేది. కోడలితో కొన్ని నెలలు కలిసి ఉంటే మన సంప్రదా యాలు, పద్ధతులు నేర్పించేదాన్ని కదా? అనుకుంది. ఇప్పటికైనా ముంచుకు పోయిందేమీ లేదు, ప్రాజెక్ట్ కాగానే తిరిగొస్తారు. తామంతా కలిసే ఉంటారు. అప్పుడు కోడలికి మన పద్ధతులు నేర్పితే సరి! అని రాజ్యలక్ష్మి సంతృప్తి పడింది. ఆమె ఆశించినట్లే ఏడాది కల్లా వినీత, శశాంక్ తిరిగి వచ్చేశారు. ఆ దంపతులు ఎంతో ఆనందించారు. ఆ ఆనందం అంత త్వరగా ఆవిరై పోతుందని మాత్రం అనుకోలేదు.
ఆరోజు శ్రావణ శుక్రవారం. కోడలు ఇంట అడుగుపెట్టాక జరుపుకుంటున్న తొలి శ్రావణ శుక్రవారం. రాజ్యలక్ష్మి ముందు రోజే కావలసినవన్నీ రామారావుతో తెప్పించి అన్నీ సిద్ధం చేసుకుంది. ఇంట్లో శుక్రవారం పూజ ఉందని కోడలికి తెలుసు. ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి పట్టుచీర కట్టుకుని వినీత వస్తుందని రాజ్యలక్ష్మి అనుకుంది. తొమ్మిది… పది… గడియారంలో ముళ్లు తిరిగి పోతున్నాయే గానీ వినీత గదిలో చడీ చప్పుడు లేదు.
పొద్దెక్కి పోతోంది. శుక్రవారం సంగతి మరచి పోయిందేమోననుకుంటూ వినీత, శశాంక్‌ల గతి తలుపు తట్టింది రాజ్యలక్ష్మి. పది నిమిషాల తర్వాత తలుపు తీసి నైటీతోనే బయటకొచ్చింది వినీత. పళ్లన్నా తోమకుండానే అత్తగారితో గొడవకు దిగింది.
‘‘ఏంటి ఆంటీ! మాంఛి నిద్రలో ఉంటే దబదబా తలుపులు బాదారు. ఇదేమైనా మేనర్స్‌యేనా?’’
కోడలి మాటలతో రాజ్యలక్ష్మికి నోట మాట పెగలట్లేదు.
‘‘ఇవాళ శ్రావణ శుక్రవారం తల్లీ! త్వరగా తలస్నానం చేసి పట్టుచీర కట్టుకురా! పూజ మొదలు పెడదాం’’ అంది అనునయంగా. వినీత తోక తొక్కిన పాములాగ లేచింది.
‘‘మీ చాదస్తాలన్నీ మీకే లిమిట్ చేసుకోవటం మంచిది. నాపై రుద్దకండి’’ అంటూ విసవిస పడగ్గదిలోకి వెళ్లి ధడేలున తలుపు గడియ పెట్టుకుంది. గదిలో శశాంక్, వినీతల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ తర్వాత ఆ మాటలూ ఆగి పోయాయి. వినీత పెట్టె సర్దుకుని గదినుంచి బయట కొచ్చి ‘‘మా పుట్టింటికి వెళ్తున్నా’’ అంటూ గోడలతో చెప్పి ఇంటి బయటకు నడిచింది.
ఈ హఠాత్ పరిణామం ఇటు రాజ్యలక్ష్మిని, అటు రామారావును నిశ్చేష్టులను చేసింది.
‘అమ్మా! ఆవిడ పెద్దది సంప్రదాయాల మీద భక్తి గౌరవాలతో నిన్ను కూడా పూజకు తయారవ్వమని చెప్పింది. నేనావిడ తరపున క్షమాపణ చెప్తున్నాను. శుక్రవారం పూట ఇలా వదిలివెళ్లటం శుభం కాదమ్మా!’’ రామారావు మాటలు ముగిసేలోపే వినీత గడప దాటేసింది.
శశాంక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా నింపాదిగా హాలులోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
‘‘ఓరేయ్! ఇంత జరుగుతున్నా నువ్వేమిట్రా అలా బెల్లం కొట్టిన రాయిలా కూచున్నావు. మన కుటుంబా నికి పరువు తక్కువ. వెళ్లి అమ్మాయిని వెనక్కి తీసుకురా’’ రాజ్యలక్ష్మి కళ్లనీళ్ల పర్యంతమవుతూ కొడుకుని వేడుకుంది.
‘‘వెళ్తే వెళ్లనివ్వమ్మా! మన కుటుంబాన్ని కాదనుకుని వెళ్లాలనుకున్న మనిషిని ఎవరు మాత్రం ఆపగలరు. అయినా నువ్వేమన్నావని? తలస్నానం చేసి పట్టుచీరతో పూజకు రెడీ కావాలనడం తప్పా? మీరేమీ బాధ పడకండి’’ అంటూ పెళ్లయిన క్షణం నుంచి వినీత వల్ల పడుతున్న క్షోభనూ, ఇబ్బందులనూ తల్లి దండ్రుల కళ్లకు కట్టించాడు.
‘‘ఈ వయసులో మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేకే నాలోనే కుమిలిపోతూ వస్తున్నాను. ఈ పూట తనంతట తానే సంసారం వద్దనుకుని వెళ్లిపోయి మన నెత్తిన పాలు పోసింది’’ శశాంక్ వివరంగా చెప్తుంటే తాము వింటున్నది నిజమా! అనే ఆశ్చర్యంతో ఉండిపోయారు ఆ దంపతులు.
పెళ్లయ్యాక పెద్దగా కలసి ఉండకపోవడంతో వినీత గురించి తెలుసుకోలేకపోయారు. ప్రతి క్షణం అత్తింటి కబుర్లన్నీ తల్లికి ఫోన్‌లో చేరవేసేది. రిమోట్ కంట్రోల్‌ను తన చేతిలో పెట్టుకున్న ఆవిడ, కూతురుకు సలహాలంటూ సర్దుకుపోదగిన చిన్న విషయాలనూ గోరంతలు కొండంతలు చేస్తూ విభే దాల నిప్పు ఎగదోసేది. ఒక్కతే కూతురు కావడంతో గారాబంగా పెరిగింది వినీత. ఆమె తండ్రి ప్రవర్తన కూడా సరిగా ఉండేది కాదు. తాగుబోతు తండ్రి. కన్నకూతురి ఎదుటే తల్లిని కొట్టేవాడు. తల్లి ఓర్పుగా అన్నీ భరిస్తూ వచ్చింది. ఈ కుటుంబ పరిస్థితుల మధ్య వినీత పెరిగింది. భర్తను మొదటి నుంచి అదు పులో పెట్టుకోకుంటే తన తల్లి మాదిరి నిస్సహాయ స్థితిలో పడిపోవలసి వస్తుందని వినీత భయం.
ఈ భయంతోనే క్రమక్రమంగా శశాంక్ బ్యాంక్ ఎకౌంట్లను తనే చూస్తానంటూ అన్ని వ్యవహారాలను తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. శశాంక్ మొదట్లో ప్రతిఘటించినా వినీత మొండిపట్టుతో లొంగిపోక తప్పలేదు. రోజులు గడిచే కొద్దీ కొరకరాని కొయ్యలా తయారైంది వినీత. ఈ బంధం ఎంతోకాలం నిలవక• పోవచ్చని కూడా శశాంక్ అనుకున్నాడు. తన జీవితం గాడి తప్పిపోతోంది. ఏదో ఒకటి చేయాలనుకుం టున్న దశలో ‘కాగల కార్యం గంధర్వులు తీర్చా’రు. శ్రావణ శుక్రవారం రూపేణా అది పరాకాష్టకు చేరింది. వినీతతో పడిన బాధలు, మానసిక క్షోభ అన్నీ పూసగుచ్చినట్లు శశాంక్ చెప్పాక తల్లిదండ్రులకు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. సంసారం కంటే జీవితం ముఖ్యం. విడిపోయి ఎవరికి వారు ప్రశాంతంగా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చాడు శశాంక్.
విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో శశాంక్ పిటిషన్ దాఖలు చేశాడు. దానికి ముందు రాజీయ త్నాలు జరిగినా అవి ఫలించలేదు. విడాకుల కేసు దాఖలయిందని తెలియగానే ప్రతిగా మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త, అత్తమామలపై కట్నం పేరిట తనను వేధిస్తున్నట్లు 49ఏ-ఎ కింద ఫిర్యాదు చేసింది.
ఇలా వినీత తమపై క్రిమినల్ కేసు పెట్టడాన్ని రామారావు మాత్రం భరించలేక పోయాడు. మానసి కంగా బాగా కుంగిపోయాడు. జీవిత పర్యంతం విలువలకు, ఆదర్శాలకు అంకితమై నడుచుకున్న తనను, భార్యాకుమారుడిని ముద్దాయిలుగా ముద్ర వేసి కోర్టుకు లాగడం దుర్భరంగా అనిపించింది. క్రిమినల్ కేసంటున్నారు. ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారేమోననే భీతి కొన్నాళ్లు వెంటా డింది. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తించి సుప్రీంకోర్టు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసింది. కేసు విచారణకు సహకరించినంత వరకూ పోలీసులు మన జోలికి రారని ఒక మిత్రుడు ధైర్యం చెప్పడంతో రామారావు ఊపిరి పీల్చుకున్నాడు.
అయినా రామారావులో మునుపటి ఉత్సాహం తగ్గింది. ఒకప్పుడు జోకులు వేస్తూ అందరితో కలివిడిగా ఉండే ఆయన ఎవరితోనూ మాట్లాడటానికే ఇష్టపడటం లేదు. గడ్డం పెరిగినా పట్టించుకోవడం లేదు. అనుక్షణం బుర్రలో కోర్టు దృశ్యమే మెదులు తోంది. కోర్టు బంట్రోతు పెద్దగా తమ ముగ్గురి పేర్లు పిలుస్తున్నట్లు కలలు. కోవిడ్ కారణంగా కొంతకాలం కోర్టు విచారణలు జరగ లేదు. రామారావు ఆలోచనలకు మాత్రం విరామం చిక్కలేదు.
ఈ ఆలోచనలతోనే బీపీ పెరిగింది. అప్పటివరకు ఏ టాబ్లెట్ అవసరం లేకుండా నెట్టుకొస్తున్న ఆయనకు టెస్టులు చేయించి, నాలుగు రకాల టాబ్లెట్‌లు రాసిచ్చాడు ఫ్యామిలీ డాక్టర్.
‘‘రావు గారూ! మందులిచ్చి వ్యాధిని నయం చేయవచ్చు. కానీ మనోవ్యాధికి మాత్రం మందు లేదు. అన్ని సమస్యలూ చక్కబడతాయి. మీరు వర్రీ అయినంత మాత్రాన అవి పరిష్కారం కావు గదా. మీ ధ్యాసను ఏ దైవచింతన మీదకో మళ్లించండి. ప్రశాంతంగా ఉండండి’’ అన్నాడు చనువుగా ఫ్యామిలీ డాక్టర్.
రాజ్యలక్ష్మిని తోడు తీసుకుని తరచు గుళ్లకు వెళ్తున్నాడు రామారావు. కానీ గుళ్లో ఉన్నంతసేపే, ఆ తర్వాత యథా ప్రకారం అవే ఆలోచనలు.
రామారావు గారేనా? అని ఎవరైనా ఫోనులో పలకరిస్తే వెంటనే కోర్టులో పిలుపు అందుకుని బోనులో నిలబడిన ఆ దృశ్యమే మనోఫలకం పైకి వస్తోంది. ఫోను చేసిన వారితో పొడిపొడిగా మాట్లాడి కట్ చేస్తున్నాడు.
మొన్నా మధ్య రోడ్డు మీద నడిచి వెళ్తుంటే పాత మిత్రుడు వెనక నుంచి రామారావు అని పిలుస్తుంటే మళ్లీ కోర్టు దృశ్యమే కదలాడింది. తన పేరే పెట్టుకున్న వ్యక్తుల ప్రస్తావన ఎవరు చేసినా రంగులు తిరుగుతూ వెంటాడుతున్న దృశ్యం. వేధిస్తున్న దృశ్యం.
తన వ్యక్తిగత సమస్య తల్లిదండ్రులకు చుట్టు కుందని శశాంక్ లోలోపల కుమిలిపోతున్నా పైకి మాత్రం గంభీరంగా ఉంటూ తండ్రికి ధైర్యం నూరి పోస్తున్నాడు.
‘‘అమెరికాలో మాదిరి మనకూ విడాకులు పెరిగి పోతున్నాయి. ప్రతి నాలుగు కుటుంబాల్లో రెండు కుటుంబాలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి. మా కొలిగ్స్‌లో చాలామంది మనలాగే కోర్టులకు తిరుగుతున్నారు’’.
‘‘నిజమేరా! కానీ నీ సమస్య మా సమస్యే. నువ్వు ఈ గొడవలన్నిటి నుండి బయటపడి ప్రశాంతంగా ఉన్నప్పుడే మాకు ప్రశాంతత’’ రామారావు అన్నాడు.
ఆరోజు కోర్టు వాయిదా. ముగ్గురు వెళ్లారు. కోర్టు బల్లలపై ఆ దంపతులకు కూర్చునే చోటు దొరికింది. పేర్లు పిలవడం మొదలుపెట్టాడు కోర్టు బంట్రోతు.
కొన్నాళ్లుగా బుర్రను తొలి చేస్తున్నదా పిలుపు. ఆ గొంతు. మళ్లీ అవే సుడులు. అవే ఆలోచనలు. అవే ఆందోళనలు.
మనపేరెప్పుడు పిలుస్తాడు? పిలిచేశాడా? మనం కోర్టు హాలులో బోనెక్కాలా?
ఏమిటి, ఇంకా పిలుపురాదేం. ఎందుకింత ఆలస్యం అవుతోంది.
ఎవరో పిలుస్తున్నట్లనిపించింది. అవును నిజమే, ఎవరో పిలుస్తున్నారు. ఆ గొంతు మాత్రం కొత్తగా ఉంది. ఇంతకు ముందెన్నడూ విన్నట్టు లేదు. కోర్టు పిలుపులో అధికార దర్పం ఉంది. దోషులను పిలుస్తు న్నామన్న చిన్నచూపు ఉంది. నిర్లక్ష్యం ఉంది. కానీ ఈ పిలుపు పూర్తి భిన్నంగా ఉంది.
‘‘రామారావు! నేనయ్యా!’’ ఆ పిలుపులో అను నయం ఉంది. ఆపేక్ష ఉంది. ప్రేమ పొంగుతోంది. గొంతులో లాలిత్యం బలుకుతోంది.
కళ్లెదురుగా ఏదో రూపం గాలిలో తేలుతోంది.
‘‘ఎవరిది, నన్ను పిలుస్తున్నది.’’ రామారావు గొణుగుతున్నాడు. కానీ తన మాట తన లోపలే కూరుకుపోతోంది. ఎంత యత్నించినా బయటకు రావటం లేదు.
‘‘నేనేనయ్యా! నిన్నే పిలుస్తోంది’’
‘‘ఎవరు? ఎవరు?’’
‘‘నన్నే గుర్తుపట్టలేదా! నీకు చిన్ననాటి మిత్రుడి నయ్యా. ఆప్త బంధువునయ్యా! ఎన్నిసార్లు నీకు తోడుగా ఉన్నానో, అప్పుడే అన్నీ మరిచావా? ఇన్నాళ్లు నన్నే గుండెల్లో నిలుపుకున్నావు. అంతలోనే మరిస్తే ఎలా?’’
‘‘స్వామీ! ఎవరు మీరు. నన్ను ఈ బాధల నుంచి ఈ క్షోభల నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించటానికి వచ్చిన పరమాత్ముడివా! నిజమే కదూ! వస్తున్నా తండ్రీ! వచ్చేస్తున్నా.’’
బల్లమీద నుంచి లేవబోయాడు. రా… రమ్మంటు న్నాడు స్వామి. ఆలస్యం అయితే ఆ స్వామి అదృశ్యమ వుతాడేమో. ఈ సువర్ణావకాశం చేజారిపోతుందేమో.
‘‘వస్తున్నా స్వామి! ఒక్క క్షణం ఆగు…’’ శక్తినంతా కూడ దీసుకుని బల్లపై నుంచి లేవబోయాడు రామారావు. కానీ శక్తి చాలడం లేదు. కాలు కదపలేక పోతున్నాడు. పళ్లు బిగపట్టి శరీరాన్ని కదల్చాలని మళ్లీ యత్నించాడు. కానీ వశం కాలేదు.
గుండెల్లో పట్టేసినట్లుంది. ఛాతిలో నొప్పి నెమ్మదిగా మొదలై చుట్టేస్తోంది.
స్వామి కనుమరుగైపోతాడేమోననే కంగారు ఒక పక్క. ఒళ్లంతా ఆవహిస్తున్న నిస్సత్తువ ఇంకో పక్క. గుండెల్లో సుడిగుండమై తిరుగుతున్న నొప్పి మరో పక్క. తను ఊబిలో కూరుకుపోతున్నాడు. ఎంత గింజుకుంటున్నా పైకి లేవలేక పోతున్నాడు. అయినా ఆశ చావడం లేదు.
వచ్చేస్తున్నా స్వామీ! ఒక్క క్షణం ఆగు, వెళ్లద్దు. మరొక్కసారి నీ పిలుపు నా చెవులను తాకనీ స్వామీ! అదేమిటీ, మాట్లాడవేం! ఒక్కసారి పిలువు తండ్రీ! పిలుపు వినాలని ఉంది… వి.. నా.. ల.. ని.. ఉం.. ది….
గొంతు పూడుకుపోతోంది. తెరలు తెరలుగా నొప్పి చుట్టేస్తోంది.
కళ్లు మూతలు పడుతున్నాయి. ప్రయత్నించినా తెరవలేకపోతున్నాడు. రామారావు పక్కకి ఒరిగి పోయాడు. శరీరం చల్లబడింది.
‘‘సివియర్ హార్ట్ స్ట్రోక్. సారీ… ప్రాణం పోయి కూడా అరగంటయింది’’ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ అంటున్నాడు.
ఇక ఏ పిలుపూ అందని దూరతీరాలకు రామారావు ప్రయాణమై వెళ్లాడు.
(కొందరు కోడళ్ల దాష్టీకానికి అన్యాయంగా క్రిమినల్ కేసుల బారినపడి తీవ్ర మానసిక క్షోభను, ప్రయాసను అనుభవిస్తున్న వృద్ధ దంపతులకు ఈ కథ అంకితం)
రచయిత పరిచయం
రచయితగా, పత్రికా రచయితగా, జర్నలిజం అధ్యాపకుడిగా, ప్రచురణకర్తగా నాలుగు దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి చేస్తున్నారు. జర్నలిజంపై 15 పుస్తకాలు రాశారు. గోరా శాస్త్రిపై సాహిత్య అకాడమి కోసం మోనోగ్రాఫ్ వెలువరించారు.
కాకాని చక్రపాణితో కలిసి ఘోస్ట్ రచయితలపై రాసిన ‘ది ఘోస్‌ట్ నవల ‘జాగృతి’లో, ‘గోరంత దీపం’ నవల వాకాటి పాండురంగరావు గారి సంపాదకత్వంలో వెలువడిన ‘ఆంధప్రభ’ వారపత్రికలో ప్రచురిత•మయ్యాయి. ‘సుఖజీవనం’ పుస్తకానికి జాతీయ అవార్డు పొందారు. తెలుగువారి చరిత్రకు సంబంధించి 25 ప్రామాణిక ఆంగ్ల గ్రంథాలను మిత్రులతో కలిసి అనువదించారు. తెలుగు భాషా పురస్కారం, నారద పురస్కారం అందుకున్నారు. జర్నలిజంలో స్వర్ణపతకం సాధించారు. కొంతకాలం ప్రాంతీయ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యులుగా సేవలందించారు.