– క్రాంతి

ఆర్టికల్‌ 370 ‌రద్దు చేస్తే భారతదేశం మండిపోతుందంటూ కాంగ్రెస్‌, ‌ముస్లిం మతోన్మాద సంస్థలు, కుహనా సెక్యులర్‌ ‌పార్టీలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని బెదిరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ భారతదేశం మండిపోవడం మాట అటుంచి, అసలు ఆ ఆర్టికల్‌ ‌ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి పొందిన జమ్ముకశ్మీర్‌లో మంటలు చల్లారి పోవడం మాత్రం మొదలయింది. కశ్మీరీల పోరాటానికి మద్దతు ఇస్తామంటూ పాకిస్తాన్‌ ‌చేస్తున్న ప్రకటనల వెనుక ఉన్న దురుద్దేశాన్ని కశ్మీరీలు బాగానే గుర్తిస్తున్నారు. మువ్వన్నెల జెండా స్వేచ్ఛగా ఎగురుతోంది. ఆఖరికి ఈ సర్వ అరిష్టాలకు మూలమైన హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌కార్యాలయాన్ని స్థానికులు విధ్వంసం చేయడం వరకు పరిణామాలు జరిగాయి. అయితే ఇప్పటికీ పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదులు రాష్ట్రంలో అమాయకులను చంపుతూనే ఉన్నారు. అడపాదడపా జరుగుతున్న ఈ దుర్ఘటనలు కూడా త్వరలో సమసిపోగలవు.  రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా జమ్ము కశ్మీర్‌ ‌పరిస్థితులు క్రమంగా కుదుట పడుతున్నాయి. ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది. గతంతో పోలిస్తే హింసాత్మక ఘటనలు చాలా తగ్గిపోయాయి.


వేర్పాటువాదానికి, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే సంస్థలు, నాయకులపై నిర్భందం పెరగడంతో వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. అక్కడి ప్రాంతీయ పార్టీలు మారిన పరిస్థితులను అర్థం చేసుకొని నడచుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల ప్రజలు వృత్తి వ్యాపారాలు నిర్వహించేందుకు అనువైన వాతా వరణం ఏర్పడింది. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయి. పర్యాటక రంగానికి కొత్త ఊపు వచ్చింది. మైనారిటీల గొంతు వినిపిస్తున్నది. పండిట్‌లు తమకు జరిగిన అన్యాయం గురించి వీధులలో ప్రదర్శనలు నిర్వహించ గలుగుతున్నారు.

జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడి శాసనసభకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దశలో ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకు నేందుకు శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకొని దాడులు చేస్తున్నారు. మన భద్రతాదళాలు కూడా పెద్ద ఎత్తున సోదాలు, దాడులు చేపట్టి వారిని సమూలంగా ఏరివేత చర్యలు చేపట్టాయి. అయితే గతంలో ఉగ్రవాదులు హత్యలకు పాల్పడ్డప్పుడు పౌరులు బహిరంగంగా నిరసనలు చేపట్టేందుకు జంకేవారు. మారిన పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్‌లోని పౌరసమాజం గట్టిగానే తమ నిరసన గళం వినిపి స్తోంది. ఏకంగా హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌కార్యాలయం మీదకే దాడికి దిగారు ప్రజలు. కశ్మీర్‌లో నిజమైన మార్పును సూచిస్తున్నాయీ ఘటనలు.

జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు కుదుట పడటంతో కశ్మీర్‌ ‌పండితులు తిరిగి తమ స్వస్థలాలకు వస్తున్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు ఉనికి కోల్పోతున్న ఉగ్రవాదులు ఉనికిని చాటుకు నేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కశ్మీర్‌ ‌హిందూ పండిట్లు, వలస కూలీలు, స్థానికేతరులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద సంస్థలు ఇలా కొత్తరకం హైబ్రీడ్‌ ‌టెర్రరిజానికి పాల్పడుతున్నాయి.

ఇటీవల షోపియాన్‌ ‌జిల్లాలోని చౌదరి గుండ్‌లో పురాణ్‌ ‌క్రిషన్‌ ‌భట్‌పై ఉగ్రవాదులు దాడి చేసి చంపారు.  ఈ ఏడాది మే మాసంలో బడ్గామ్‌ ‌జిల్లాలో చదూరా గ్రామంలోని తహసీల్దార్‌ ‌కార్యాలయంలోకి చొరబడ్డ ఇద్దరు ఉగ్రవాదులు అక్కడ విధులు నిర్వహిస్తున్న రాహుల్‌ ‌భట్‌ను కాల్చి చంపారు. ఆ తరువాత అమ్రీన్‌ ‌భట్‌ అనే టీవీ నటిని కూడా కాల్చిచంపారు. గోపాల్‌పొరాలోని ఓ హైస్కూల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు సాంబా ప్రాంతానికి చెందిన ఓ మహిళా టీచర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో మరణించారు. స్థానికేతరుడైన బ్యాంకు మేనేజర్‌తో పాటు బిహార్‌ ‌వలస కూలీలపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు టెర్రరిస్టులు.

ఆగస్టు 16న షోపియాన్‌ ‌జిల్లాలో ఓ యాపిల్‌ ‌తోటలో పనిచేస్తున్న సునీల్‌ ‌కుమార్‌ ‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనలో సునీల్‌ ‌కుమార్‌ ‌సోదరుడు పీతాంబర్‌ ‌కుమార్‌ ‌గాయపడ్డాడు. ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సందర్భంగా ‘తిరంగా ర్యాలీ’లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించి నందుకు వీరిద్దరిని లక్ష్యంగా చేసుకున్నట్లు అల్‌ ‌బదర్‌ ఉ‌గ్రవాద సంస్థకు చెందిన ‘కశ్మీర్‌ ‌ఫ్రీడమ్‌ ‌ఫైటర్స్’ ‌ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌ ‌నెలలో ఐదు రోజుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. ఇందులో ఓ కాశ్మీరీ పండిట్‌, ఓ ‌సిక్కు, ఇద్దరు వలస హిందు వులు ఉన్నారు.

పురాణ్‌ ‌క్రిషన్‌ ‌భట్‌ ‌హత్యకు వ్యతిరేకంగా జమ్ములోని వలస కశ్మీరి పండిట్‌ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ హత్యలను ఆపాలని వారు డిమాండ్‌ ‌చేశారు. భట్‌ అం‌త్యక్రియల సందర్భంగా హిందువులు పెద్ద ఎత్తున పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కశ్మీర్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గతంలో ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడు విధిలేని పరిస్థితుల్లో మౌనంగా భరిస్తూ వచ్చిన కశ్మీర్‌ ‌ప్రజలు ఇప్పుడు బలంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పండిట్‌లను లక్ష్యంగా చేసుకుని హతమార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కశ్మీర్‌ ‌లోయ అంతటా వారం రోజుల పాటు నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిం చారు. పండిట్‌ ఉద్యోగులతో పాటు, సాధారణ ప్రజలు కూడా భారీగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. శ్రీనగర్‌తో పాటు పుల్వామా, షోపియాన్‌, ‌కుల్గాం, బుద్గాం, బందిపోరా, గందర్‌బల్‌, ‌బారాముల్లా, కుప్వారా జిల్లాలో ర్యాలీలు, క్యాండిల్‌లైట్‌ ‌మార్చ్‌లు జరిగాయి. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. వారిని బహిరంగంగా నడి రోడ్డు మీద ఉరి తీయాలని కోరారు.

పురాణ్‌ ‌క్రిషన్‌ ‌భట్‌ ‌హత్యకు నిరసనగా శ్రీనగర్‌ ‌రాజ్‌బాగ్‌లో ఉన్న ఆల్‌ ‌పార్టీ హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ఆఫీసును నిరసనకారులు ముట్టడించారు. త్రివర్ణ పతాకాలతో పాటు ‘‘ఆఖర్‌ ‌కబ్‌ ‌తక్‌’’ అనే బ్యానర్లు పట్టుకొని ఉగ్రవాదానికి, వారికి మద్దుతు ఇస్తున్న శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం హురియత్‌ ‌కార్యాలయ సైన్‌ ‌బోర్డును తొలగిం చేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న హురియత్‌కు ఇది బలమైన హెచ్చరిక అని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన తర్వాత హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌పురాణ్‌ ‌భట్‌ ‌హత్యను ఒక ప్రకటనలో ఖండించింది. గతంలో ఆ సంస్థకు ఇది అలవాటు లేని పని. న్యూఢిల్లీలోని పాకిస్తాన్‌ ‌రాయబార కార్యాలయం, ఐక్యరాజ్యసమితి కార్యాలయం ఎదుట కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. జాతీయ పతాకాలను పట్టుకున్న నిరసనకారులు పాకిస్తాన్‌కు, హురియత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్‌, ‌హురియత్‌ల ఆదేశాలతో ఉగ్రవాదులు చేపట్టిన ఇటువంటి హత్యలను కశ్మీర్‌ ‌ప్రజలు వ్యతిరేకిస్తు న్నారని నిరసనకారులలో ఒకరైన జావీద్‌ ‌బేగ్‌ అన్నారు.

జమ్ము కశ్మీర్‌లోని సుమారు 26 పాకిస్తాన్‌ అనుకూల వేర్పాటు వాద పార్టీలు, ఉగ్రవాద సంస్థలతో కలిసి 1993లో ఆల్‌ ‌పార్టీ హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ఏర్పడింది. ప్రస్తుతం చాలామంది హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌నాయకులు జైలులో ఉన్నారు. దాని ఛైర్మన్‌ ‌మోల్వి ఉమర్‌ ‌ఫరూఖ్‌ ‌సహా కొందరు నాయకులు గృహ నిర్బంధంలో ఉన్నారు, జమ్ము కశ్మీర్‌లో 2018 నుండి హురియత్‌ ‌ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు బహిరంగంగా ప్రజలు ఆ సంస్థకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. కశ్మీర్‌ ‌సమాజంలో వచ్చిన పెద్ద మార్పునకు ఇది అద్దం పడుతోంది.

2019లో ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌ ‌రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, భద్రతా చర్యలతో ఉగ్రవాద కార్యకలాపాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.. ప్రత్యేకించి 2014కి ముందు ఉన్న గణాంకాలను పోల్చి చూస్తే, ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు. గత ఏడేళ్లలో జరిగిన భద్రతా సిబ్బంది, పౌరుల హత్యల సంఖ్య మునుపటితో పోలిస్తే చాలా తక్కువ. ప్రధాని మోదీ చేపట్టినే సర్జికల్‌ ‌స్ట్రైక్స్, ఇతర నిర్ణయాత్మక చర్యల తర్వాత పెద్ద సంఘటనేమీ జరగలేదు. ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునేందుకు సాఫ్ట్ ‌టార్గెట్‌లను ఎంచుకుంటున్నారు. దానివల్ల అప్పుడప్పుడు హత్యలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో దాదాపు 168 మంది ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమాని స్తుండగా.. వారిలో 75 మందిని ఈ ఏడాది హత మార్చినట్లు పోలీసులు ఓ నివేదికలో పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఆగడాలను కట్టించేందుకు మోదీ తీసుకున్న పటిష్ట చర్యల కారణంగానే భద్రతా సిబ్బంది మరణాలు తగ్గుతున్నాయి. మరోవైపు ఉగ్రవాద సంస్థలు కొత్తగా దాదాపు 700 మంది యువకులను రిక్రూట్‌ ‌చేసుకున్నాయి. ప్రస్తుతం వారిలో 141 మంది క్రియాశీలంగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విదేశీయులేననీ తెలిపింది. జమ్ము, కశ్మీర్‌లో సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల ఉనికి అధికంగా ఉందనీ, ఉగ్రవాద శిబిరాల నుండి చొరబాట్ల కొనసాగుతున్నాయని తెలిపింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖనివేదిక ప్రకారం జూలై 5, 2022 తేదీ వరకు జమ్ము కశ్మీర్‌లో మొత్తం 82 మంది విదేశీ ఉగ్రవాదులు, 59 మంది స్థానిక ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారు. ఈ ఉగ్రవాదులు ప్రధానంగా లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ‌ఫ్రంట్‌, ‌జైష్‌-ఎ-‌మహ్మద్‌, ‌హిజ్బుల్‌ ‌ముజాహిదీన్‌ ‌వంటి సంస్థలకు చెందినవారని వెల్లడైంది. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా గతంలో ఏడాదికి 1200 మంది ప్రాణాలు కోల్పోగా ఆ సంఖ్య ఇప్పుడు 136కి తగ్గిందని తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.

ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ ‌యువత సాటి భారతీయు లతో జనజీవన స్రవంతిలో కలిసి ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షలు, వారి ప్రతిభకు పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకూ తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో కూడా రాణిస్తున్నారు. గత ఏడాది నీట్‌ ‌టాపర్‌గా జమ్ముకశ్మీర్‌ ‌విద్యార్థి నిలిచాడు. సివిల్‌ ‌సర్వీసెస్‌లో కూడా ఈ రాష్ట్రం నుంచి వరుసగా టాపర్లు వస్తున్నారు.

జమ్ము కశ్మీర్‌ ‌ముస్లింలు ఎక్కువగా ఉండే రాష్ట్రమని తెలిసిందే. ఇందులో ఎక్కువ శాతం సున్నీ ముస్లింలు. షియాలు ముస్లిం జనాభాలో 10% కన్నా తక్కువే. వీరు తమను తాము ‘‘కోషూర్‌’’ అని చెప్పుకుంటారు. ఇందులో ఆవులు, మేకలు, గొర్రెలను కాసేవారే ఎక్కువ. వీరిని గుజ్జర్లు, బకరావాలాలు అని కూడా పిలుస్తారు. వీరంతా సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తారు. బద్గామ్‌ ‌తదితర జిల్లాల్లో షియాలు 30 శాతానికి మించి ఉన్నారు.

జమ్ము కశ్మీర్‌లోని షియా వర్గం మొదటి నుంచి ఉగ్రవాదానికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చింది. పాకిస్తాన్‌ ‌మద్దతుతో నడుస్తున్న వేర్పాటువాద సంస్థలన్నీ సున్నీల మద్దతుతో నడిచేవే. శ్రీనగర్‌, ‌కశ్మీర్‌లోయ కేంద్రంగా నడిచే ప్రాంతీయ రాజకీయ పార్టీలు సున్నీల పెత్తనంలోనే ఉన్నాయి. వీరు షియా వర్గీయుల సంక్షేమంపై మొదటి నుంచీ నిర్లక్ష్యం చూపిస్తూ వచ్చారు. ఎస్టీల కోటాలో అందాల్సిన సంక్షేమ ఫలాలు వీరికి ఏనాడూ అందలేదు.

కశ్మీర్‌లోని షియా వర్గం మొదటి నుంచి భారత్‌ ‌పట్ల విధేయంగా ఉంటున్నారు. భారత్‌ను తమ మాతృభూమిగా అంగీకరిస్తారు. కార్గిల్‌తో సహా ఇప్పటి వరకూ పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల్లో బకరావాలాలు శత్రువుల కదలికలను భారత సైన్యానికి అందించారు. భద్రతా దళాలు కూడా వీరితో స్నేహపూర్వకంగా ఉంటాయి. కానీ ఇక్కడ మొదటి నుంచి సున్నీ, షియాల మధ్య అంతరం ఉంది. గతంలో ఎన్నో ఘర్షణలు జరిగాయి. దీంతో షియాలు పాటించే మొహరం సంతాప ఊరేగింపుపై 1990 నుంచి నిషేధం అమలైంది. ఆర్టికల్‌ 370 ‌రద్ద తర్వాత తమకు కాస్త స్వేచ్ఛ వచ్చిందని జమ్ము కశ్మీర్‌లోని షియా వర్గం చెప్పుకుంటోంది.

 గుజ్జర్లు, బకరావాలాలు, పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర హోంత్రి అమిత్‌షా. ఆర్టికల్‌ 370 ‌రద్దు చేయడంతో జమ్ముకశ్మీర్‌లోని సమాజంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమమైందని తెలిపారు. వీరికి త్వరలో విద్య, ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తా మన్నారు. చట్టపరమైన పక్రియ పూర్తి కాగానే ఆయా వర్గాల ప్రజలు రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలు పొందను న్నారు. కోటా ప్రయోజనాలు పరిశీలించేందుకు లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ఏర్పాటు చేసిన జస్టిస్‌ ‌శర్మ కమిషన్‌ ‌సిఫారసుల మేరకు ఈ కోటా అమలు చేయనున్నట్టు వెల్లడించారు.

‘‘ఎస్టీ కోటాలో గుజ్జర్లు, బకరావాలాలు, పహారీలకు ఎలాంటి తగ్గుదల ఉండదు. ప్రతి ఒక్కరూ తమ వాటాను పొందుతారు. గతంలో రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్ముకశ్మీర్‌ను కేవలం మూడు రాజకీయ కుటుంబాలే పాలించేవి. ఇప్పుడు పంచాయతీలు, కౌన్సిల్‌లకు న్యాయమైన ఎన్నికల ద్వారా ఎన్నికైన 30వేల మంది వ్యక్తుల వద్ద అధికారం ఉంది.’’ అని చెప్పారు అమిత్‌షా. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం లోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని మూడు వారాల క్రితం బారాముల్లా, రాజౌరీల్లో జరిగిన సభల్లో కూడా అమిత్‌షా స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్‌తో ఇక చర్చలు జరిపే సమస్యే లేదన్నారు.

‘‘1990 నుంచి జమ్ముకశ్మీర్‌లో 42వేల మంది ప్రాణాలను ఉగ్రవాదం అనే భూతం బలిగొంది. అలాంటిదానితో ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? అబ్దుల్లాలు, ముఫ్తీలు, నెహ్రూ కుటుంబం.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉంటున్నారు. పైగా కొంతమంది పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని మాకు సూచిస్తున్నారు. అసలు పాక్‌తో ఎందుకు మాట్లాడాలి? ఉగ్రవాదాన్ని ఎందుకు సహించాలి? మేం చర్చలు జరపం.’’ అని స్పష్టం చేశారు అమిత్‌షా. ఇంతటి తీవ్రమైన ప్రకటనకు ఆయన ఎంచుకున్న సందర్భం, వేదిక కూడా ముఖ్యమైనవే. పాకిస్తాన్‌లో చర్చలు జరపాలన్న పాచిపాటనే  కాంగ్రెస్‌తో పాటు జమ్ముకశ్మీర్‌ ‌ప్రాంతీయ పార్టీలు ఇప్పటికీ పాడుతున్నాయి. హోంమంత్రి స్పందన వీళ్ల వ్యాఖ్యల మీదనే. పాకిస్తాన్‌తో మాట్లాడటం కంటే జమ్ముకశ్మీర్‌లోని యువతతో మాట్లాడటమే ఉత్తమమని కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పారు కూడా. దేశంలోనే కశ్మీర్‌ను శాంతివనంగా తీర్చి దిద్దుతామని అమిత్‌షా చేసిన ప్రకటన అక్కడి వాస్తవ రూపానికి ప్రతిబింబమే. ఇంతకాలంగా కశ్మీరీల మనసులు గెలుచుకోవాలంటూ కాంగ్రెస్‌, ‌హురియత్‌ ‌కాన్ఫరెన్స్, ‌స్థానిక కుటుంబ పార్టీలు చెబుతున్న మాటను మోదీ ప్రభుత్వం అమలు చేసింది. అయితే వాళ్ల మనసుల నుంచి పాకిస్తాన్‌ అనుకూలతను తొలగించి, ఆ తరువాతే గెలుచుకుంటున్నది.

About Author

By editor

Twitter
YOUTUBE