అక్టోబర్ 11 జయప్రకాశ్ నారాయణ్ జయంతి
ఆయన రాష్ట్రపతి వంటి అత్యున్నతమైన రాజ్యాంగ పదవి చేపట్టలేదు. కార్యనిర్వా హక అధికారాలు గల ప్రధానమంత్రి పదవినీ అధి•ష్టించ లేదు. కేంద్ర మంత్రి గానూ పని చేయలేదు. రాష్ట్ర ముఖ్య మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహ రించ లేదు. కనీసం ఒక రాజకీయ పార్టీకి సారథిగానూ దిశా నిర్దేశం చేయలేదు. కానీ సమసమాజ స్థాపనకు తనవంతుగా చిత్తశుద్ధితో అహరహం శ్రమించారు. సామ్యవాద భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాటు పడ్డారు. పాలకుల నిరంకుశ విధానాలను దునుమాడారు. వాటిపై నిరంతరం పోరాడారు. తద్వారా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. ఆయనే జేపీగా సుపరిచితుడైన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్. ‘లోక్ నాయక్’… అంటే ప్రజల మనిషి అని అర్థం. ఇది ఎవరో ఇచ్చింది బిరుదు కాదు. ఆయనకు ప్రజలు అభిమానంతో పెట్టుకున్న పేరు. ఎలాంటి అధికార పదవులు చేపట్టనప్పటికీ ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడు జేపీ.
1902 అక్టోబరు 11న బిహారులోని సితాబ్దియారా లోకాయస్థ కుటుంబంలో జన్మించిన జేపీ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. 17 సంవత్సరాల వయసులో 1919 లో బ్రిజ్ కిషోర్ ప్రసాద్ కుమార్తె ప్రభావతిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ఆమె గాంధీ నాయకత్వంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. 1929లో జేపీ కాంగ్రెస్ పార్టీలో చేరి మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. రామమనోహర్ లోహియా, అశోక్ మెహతా, మినూ మసానీ, అచ్యుత్ పట్వర్థన్ వంటి ఉద్ధండ నాయకు లతో కలసి పని చేశారు. తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుపాలయ్యారు. 1947-53 సమయంలో అఖిల భారత రైల్వే కార్మికుల సమాఖ్యకు సారథ్యం వహించి వారి హక్కుల సాధన కోసం పోరాడారు. ఇది రైల్వేలో అతి పెద్ద కార్మిక సంఘం. కాంగ్రెస్‌తో మొదలైన జేపీ ప్రస్థానం కాలక్రమంలో ఆ పార్టీ అనుసరించిన నిరంకుశ విధానాలను నిరసించారు. ముఖ్యంగా 1970వ దశకంలో నాటి బిహారులోని కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ సందర్భంగా 1974 మార్చి 18న జరిగిన పోలీసు కాలల్పుల్లో 8మంది మరణించారు. తరవాత రోజుల్లో తన ఉద్యమాన్ని జాతీయస్థాయికి విస్తరించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకపక్ష పోకడలపై ఉద్యమించారు. ముఖ్యంగా ప్రజల హక్కులను కాలరాచే ఆమె నియంతృత్వ విధానాలను ఎండగట్టారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు ఆమె ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా తీర్పు ఇచ్చినందున ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేయాలని జేపీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దిల్లీ రాంలీలా మైదానంలో లక్షమందితో ఆయన నిర్వహించిన బహిరంగ సభ ఇందిర సర్కారు గుండెల్లో రైళ్లను పరు గెత్తించింది. 1975 జూన్ 25న అర్థరాత్రి ఇందిరాగాంధీ విధించిన ‘అత్యవసర పరిస్థితికి’ వ్యతిరేకంగా కదన రంగంలోకి దిగారు. ప్రజలను ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను సమీకరించి ఏకతాటిపై నడిపించడం ద్వారా ఇందిరాగాంధీకి గట్టి సవాల్ విసిరారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, యువతలో నైరాశ్యం, పాలకుల పెడపోకడలను ఎదుర్కోవడానికి ‘సంపూర్ణ విప్లవమే’ శరణ్యమని నినదించారు. దీంతో కక్షగట్టిన సర్కారు ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆయన అనుచరులైన మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజపేయి, ఎల్.కె. అద్వాణీ, బాబూ జగ్జీవన్ రామ్, చరణ్ సింగ్, జార్జి ఫెర్నాండెజ్ వంటి సీనియర్ నాయకులను సైతం ఇందిర సర్కారు కటకటాల పాల్జేసింది. అయినప్పటికీ వెరవని ఆయన, ఇందిర నిరంకుశ సర్కారుకు వ్యతిరేకంగా జైలు నుంచే వ్యూహ రచన చేశారు. ప్రజా ఉద్యమా లకు తలొగ్గి అత్యవసర పరిస్థితిని 1977 జనవరి 18న ఎత్తివేసిన ఇందిరాగాంధీ జైళ్ల నుంచి నాయకులను విడుదల చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద భావాలు గల ఎందరో నాయకులను ఒకతాటిపైకి తీసుకువచ్చారు. వారితో ఏర్పాటు చేసిన పార్టీనే ‘జనతా’. ఆ పార్టీ నాయకులు ప్రజల తరఫున పోరాడారు. వారిలో చైతన్యం రగిలించారు. అత్యవసర పరిస్థితిలోని అక్రమాలపై తిరుగుబాటు చేశారు. జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో జనతా పార్టీ 1977 మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగింది. ఈ మొత్తం పక్రియలో జేపీ తెరవెనక వ్యూహరచన, మంత్రాంగం ద్వారా పార్టీని ముందుకు నడిపారు తప్ప ఎలాంటి పదవి చేపట్టలేదు. ఆయన ఊహించినట్లుగానే ఆ ఎన్నికల్లో ప్రజలు జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టారు. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ప్రజా రంజకంగా పాలించింది. విదేశాంగ మంత్రిగా అటల్ బిహారీ వాజపేయి భారత విదేశాంగ విధానా నికి వన్నెలద్దారు. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించి భారత జాతీయ భాష ప్రాశస్య్తాన్ని ప్రపంచానికి చాటారు. సమాచార శాఖ మంత్రిగా ఎల్.కె. అద్వాణీ ఆ శాఖకు కొత్త రూపురేఖలు కల్పించారు.
జేపీని అనేక అవార్డులు వరించాయి. 1965లో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె పురస్కారం, రాష్ట్ర భూషణ్ అవార్డులు పొందారు. మరణాంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో జాతి ఆయనను గౌరవించు కుంది. 1999లో నాటి వాజపేయి నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వం జేపీకి ఈ పురాస్కారాన్ని ప్రకటించింది. దిల్లీ-బిహారులోని ఛాప్రా మధ్య నడిచే రైలుకు లోక్ నాయక్ ఎక్స్‌ప్రెస్‌గా (2015), గంగా నదిపై నిర్మించిన వంతెనకు ‘జేపీ సేతు’ అని పేరు పెట్టారు. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో జేపీ జీవితం ఆధారంగా 112 నిమిషాల చిత్రం నిర్మితమైంది. జేపీ సతీమణి ప్రభావతి 1973 ఏప్రిల్ 15న పరమపదించారు. 1979 అక్టోబరు 8న అనారోగ్య కారణాలతో జేపీ కన్నుమూశారు. ఆ దంపతులకు సంతానం లేదు. జేపీ భౌతికంగా దూరమై నాలుగు దశాబ్దాలు గడిచినప్పటికీ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారు. పార్టీలకు అతీతంగా నేటితరం నాయకులు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.