సంపాదకీయం
శాలివాహన 1944 శ్రీ శుభకృత్ ఆశ్వీయుజ బహుళ పాడ్యమి -10 అక్టోబర్ 2022, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
మన విపక్షాల నేతల నాల్కలను చూస్తే విషనాగులు సైతం విస్తు పోతాయి. వాళ్ల బుద్ధిలో పేరుకుపోయిన విషం, ఆ నాగుల కోరల విషం కంటే ప్రమాదకరంగా మారిపోయింది. బీజేపీ/మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) అనే దేశద్రోహ, మతోన్మాదంతో పెట్రేగిపోతున్న సంస్థను నిషేధించింది. దాని నెత్తిన ఉన్నవి 1400 ఘోర నేరాలు. 2047 నాటికి భారత్‌లో ముస్లిం పాలన దాని నినాదం. ఇలాంటి ప్రమాదకర సంస్థను నిషేధిస్తే, దానితో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నిషేధించాలంటారా? ఇలాంటి కాలకూట విషాన్ని కక్కుతున్న విపక్షాల నాయకులను ఏమనాలి? పరమతా లంటేనే, వాటి విశ్వాసాలంటేనే, అసలు వాటి ఉనికి అంటేనే భగభగ మండి పోయే పీఎఫ్‌ఐ ఎక్కడ! దేశభక్తి, సామాజిక సేవ, సమరసత, జాతీయ స్ఫూర్తి మూర్తీభవించిన ఆర్‌ఎస్‌ఎస్ ఎక్కడ! నక్కకీ నాకలోకానికీ పోలిక పెట్టడం కాదా ఇది! బురదతో నిండి పుచ్చిన బుర్రల నుంచి పొంగి పొరలుతున్న మురికి వాగుడు కాదా ఇదంతా!
హింస ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తాం. మతోన్మాదాన్ని పూర్తిగా ఖండిస్తాం. కానీ నిషేధాలు సమస్యకు పరిష్కారం కాదు… పీఎఫ్‌ఐ నిషేధం తరువాత దాదాపు విపక్షాల నాయకులెల్లరు ఇలాంటి అతి తెలివినే ప్రదర్శించారు. అక్కడితో ఆగి ఉంటే, వాళ్ల విద్రోహ చింతనను చిరకాలంగా గమనిస్తున్న జాతిజనులు వీళ్ల బుద్ధులని కుక్కతోకలుగా పరిగణించి మౌనం దాల్చేవారు. కానీ అలాక్కాదే! పీఎఫ్‌ఐని నిషేధిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నిషేధించాలంటూ ఒక దశాబ్దానికి సరిపోయేటంత అసందర్భ ప్రలాపాలను పోగుచేసి పెట్టారు. వీళ్లందరి కంటే నిస్సిగ్గుగా వదిరినవాడు లాలూ ప్రసాద్. పీఎఫ్‌ఐ వంటి అన్ని సంస్థలను, ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా నిషేధించి తీరాలి అన్నారాయన. శాంతిభద్రతలను ధ్వంసం చేస్తుంది కాబట్టి ఆ సంస్థనూ నిషేధించా లన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కేరళ కాంగ్రెస్ నాయకుడు రమేశ్ చెన్నితల కూడా ఆర్‌ఎస్‌ఎస్, పీఎఫ్‌ఐ రెండు మతోన్మాద సంస్థలని తేల్చిపారేశాడు. కాబట్టి రెండింటిని నిషేధించాలట. మేం మతోన్మాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఖండిస్తాం అంటూ ఈ నిషేధం గురించి ఏమీ మాట్లాడకుండా నీళ్లు నమిలారు ఆ పార్టీ ఎంపీ జైరామ్ రమేశ్. ఎంఐఎం అనే నిఖార్సయిన ముస్లిం మతోన్మాద పార్టీ నాయకుడు ఒవైసీ అయితే, తాము ఎల్లప్పుడూ పీఎఫ్‌ఐని వ్యతిరేకిస్తూనే ఉన్నామనీ, కానీ నిషేధ చట్టాలను చూసి తట్టుకోలేకుండా ఉన్నామని గుండెలు బాదుకున్నాడు. సరే, అఖిల భారత ముస్లిం లీగ్ ఇలాంటి అవకాశాన్ని అసలే వదులుకోదు కాబట్టి, పీఎఫ్‌ఐని నిషేధించడం సరే, ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎందుకు ఉపేక్షించినట్టు అంటూ గొంతు చించుకుంది. సీపీఎం, సీపీఐలు రెండు నాల్కల ధోరణికి చిరునామాలుగా మారాయి. నిషేధం సమస్యకు పరిష్కారం కాదని వాటి ఉవాచ. పీఎఫ్‌ఐ నిషేధం పట్ల విపక్షాలు మింగలేక కక్కలేక కొట్టుమిట్టాడు తున్నాయి. పీఎఫ్‌ఐ అరాచకాలు, రక్తదాహం తిరుగులేని సత్యం. ఆ సంస్థ హింసకు బలైన వారిలో ఈ పార్టీల కార్యకర్తలూ ఉన్నారు. అలా అని ఈ నిషేధాన్ని, అందులోను బీజేపీ తెచ్చిన నిషేధాన్ని నిర్ద్వంద్వంగా ఖండించేస్తే మళ్లీ ముస్లింల అనుగ్రహం ఎక్కడ తప్పిపోతుందోనన్న భీతి వీళ్లలో సుస్పష్టం. ఈ పిల్లిమొగ్గలన్నీ అందుకే. ఇంతకీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎందుకు నిషేధించాలి? ఈ సంస్థ హిందూమతాన్ని విమర్శించారన్న కారణంగా ఎవరి చేతునైనా నడిరోడ్డు మీద నరికిందా? దేశాన్ని హిందూరాజ్యం చేయాలని గొంతు చించుకుందా? విదేశాలకు జేకొడుతోందా?
త్వరలో నూరేళ్ల దినోత్సవాన్ని జరుపుకోబోతున్న అకళంక దేశభక్తి సంస్థ ఆర్‌ఎస్‌ఎస్. హిందూ ధర్మానికి అసలైన వారసత్వం ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతంలో కనిపిస్తుంది. సేవ, సమరసత రెండు కళ్లుగా ఉండాలని; దేశభక్తి, మత సామరస్యం సమపాళ్లలో ఉండాలని మనసావాచా కోరుకునే సంస్థ ఆర్‌ఎస్‌ఎస్. భారత్‌లో హిందువుల ఐక్యత దాని నినాదం. హిందూగడ్డ మీద జన్మించినవారు ఎవరైనా హిందువు లేదా భారతీయుడేనని సంఘం విశ్వసిస్తుంది. ఈ పురాతన భూమి చూసిన అనేక చారిత్రక పరిణామాల కారణంగా కొందరి ఆరాధనా పద్ధతులు మారాయి. అంతమాత్రాన హిందువులు, హిందూయేతరుల మధ్య సహోదరత్వం తెగిపోయినట్టు కాదని నమ్మే సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే. ఆరాధనా పద్ధతులు వేరైనా, మతం వేరైనా మనమంతా ఈ దేశం కన్నబిడ్డలమని, ఏకత్రాటి మీద నడవాలన్నదే సంఘ సదాశయం. వివేకానందుడు మొదలు, అరవిందుడు, గాంధీజీ, అంబేడ్కర్, నేతాజీ వంటి వారంతా ఇదే నమ్మారు. సమాజంలో చిట్టచివర ఉండిపోయిన సోదరుడిని కూడా ఆదరించాలన్న ఆశయం వారిది. ఆ ఆశయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అంది పుచ్చుకుంది. ఈ దేశ ప్రధాని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త. ఆయన మంత్రిమండలి సభ్యులు ఎక్కువ మంది ఆర్‌ఎస్‌ఎస్ లేదా అనుబంధ సంస్థల కార్యకర్తలు. దాదాపు 18 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు సంఘ్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా బంధం ఉన్నవారే. అయినా, సీఏఏ వ్యతిరేక అల్లర్లు, రైతుల పేరిట అరాచక శక్తుల రగడ నుంచి పీఎఫ్‌ఐపై మీద నిషేధం వరకు ప్రత్యేకంగా మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నాయన్న ఆరోపణ ఆర్‌ఎస్‌ఎస్ లేదా బీజేపీ సంస్థల మీద ఉందా? అన్నీ ఆరోపణలే. సత్యాలు ఇంతవరకు ఆవిష్కృతం కాలేదు.
శతాబ్దాల గడచిపోతాయి. సిద్ధాంతాలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాలు మారతాయి. కానీ దేశభక్తి, సామరస్యం అనేవి భారత మౌలిక విలువలు. ఇక్కడి జీవన విధానం దానికి పట్టుగొమ్మ. వాటి అవసరం శాశ్వతమని నమ్మడం భ్రమ కాదు. వాటి ఉనికి నిత్య సత్యం. ఈ సిద్ధాంతంతో ప్రయాణిస్తున్నదే ఆర్‌ఎస్‌ఎస్. అధికార లాలస, బుజ్జగింపు రాజకీయాలు తలకెక్కి కళ్లు మూసుకుపోయిన నేతలకు ఇది అర్ధం కాదు. కానీ సాధారణ ప్రజానీకానికి ఎప్పుడో అర్ధమైంది. దానికి ఎన్నో రుజువులు.