– ‌డాక్టర్‌ ఆవవల్లి జగన్నాథస్వామి

దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేకానేక శక్తిక్షేత్రాలలో శ్రీ శుభకృత్‌ ‌నామ సంవత్సర ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి (సెప్టెంబర్‌ 26) ‌నుంచి దేవీ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగు తున్నాయి. లోకకంటకుల పట్ల రౌద్రం ప్రదర్శించిన జగన్మాత నమ్మిన వారికి కొంగు బంగారమై ‘అమ్మలగన్న అమ్మ’గా పూజలందుకుంటున్నారు. అపరాజితాదేవిగా విజయదశమి నాడు భక్తకోటిని అనుగ్రహిస్తుంది. దసరా సంతోషానికి పర్యాయపదం. ఆనందానికి ప్రతీక. చికూ చింత లేకుండా, ఆనందోత్సాహాలు ప్రదర్శించే సరదా బాబులను ‘దసరాబుల్లోళ్లు’గా వ్యవహరించడం తెలుగునాట పరిపాటి.

విజయ దశమి దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ప్రతీక. రాక్షసత్వం మీద దైవత్వం, చెడు మీద మంచి సాధించిన ఫలితమే విజయదశమి. ఆనాడు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయని పురాణాలూ పేర్కొంటున్నాయి. ఈ పండుగ వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధించేం దుకు శక్తి అనుగ్రహం కావాలి. ఆ శక్తే అపరాజిత. ఆ శక్తి ఆశ్వీయజ శుక్ల దశమి తిథిన నక్షత్రోదయ సమయంలో ప్రకృతిలో ఆవహించి ఉండి, సకల సుఖాలు ప్రసాదిస్తుందని శాస్త్రం. ఆ సాయంత్రం విజయకాలమని, ఆ సమయంలో పూజాదికాలు నిర్వహించేవారు సమస్త కార్యాలలో విజయులవు తారని విశ్వాసం. శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ శుక్ల దశమినాడే ‘విజయ’ ముహూర్తం వస్తుందని, ఆ రోజునే క్షీరసాగర మథనం జరిగి అమృతం ఉద్భవించిందని పురాణాలు చెబుతు న్నాయి. తిమిరంతో సమరం చేసేవారు వెలుగుల కోసం తపించినట్లు వియాలను కాంక్షించే వారికి విజయదశమి వేగుచుక్కలా దారి చూపుతుందట.

విజయదశమిని ‘దసరా’ అనీ వ్యవహరిస్తారు. దశవిధ పాపాలను హరించేది కనుక ‘దశహరా’అని, కాలక్రమంలో ‘దసరా’గా వాడుకలోకి వచ్చిందని పెద్దలు చెబుతారు. ‘దశ(కంఠ)హర’ అనే పేరే దసరాగా పరిణమించిందని మరికొందరి వ్యాఖ్యానం.

వినాయక చవితి పండుగ మాదిరిగానే పిన్నలు, పెద్దలు విజయదశమిని ఇష్టంగా జరుపుకుంటారు. పిల్లలు పుస్తకాలను, పెద్దలు తమ వృత్తులకు సంబంధించిన వస్తువులను (ఆయుధ) పూజిస్తారు. రైతులు పలుగు, పార లాంటి వ్యవసాయ సామగ్రిని పసుపు కుంకుమలతో అలంకరించి పూజలో ఉంచుతారు. వ్యాపారులు కొందరు దీపావళితో లెక్కలు ప్రారంభిస్తే, మరికొందరు దసరా నాడే మొదలుపెడతారు. ఆనాడు చేసే ఆయుధ, శమీపూజలు, గ్రామపొలిమేరలను కోలాహలంగా దాటి రావడం (పార్వేట) ఒకప్పుడు రాజులు యుద్ధానికి వెళ్లే ముందు చేసిన సన్నాహాలకు సంకేతాలే.

అపరాజిత అర్చన

దుర్గామాతకు గల అనేక పేర్లలో అపరాజిత ఒకటి. ఆమె రాజరాజేశ్వరీదేవి. అపరాజిత అంటే పరాజయం లేనిది. విజయాలకు అధిదేవత. ‘సర్వకామార్థ సాధనం అపరాజిత పూజనం’ అని చింతామణి గ్రంథకారుడు పేర్కొన్నాడు.

‘యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।’ (అపరాజితాదేవి అన్ని జీవుల్లోనూ శక్తి రూపంలో కొలువై ఉంటుంది) అని అపరాజిత స్తుతి పేర్కొంటోంది. జీవుల కర్మలు గమనిస్తూ, సత్కర్మలను ఆచరించే వారిని కాటాక్షిస్తుంది. అపరాజితాదేవి శమీ వృక్షంలో కొలువై ఉంటుందని విశ్వాసం. శత్రువులపై విజయం సాధించేందుకు శక్తి అనుగ్రహం కావాలి. ఆ శక్తే అపరాజిత. ఆమె ఆశ్వీయుజ శుద్ధ దశమి సాయంకాలం ప్రకృతిలో ఆవహించి ఉంటుందని, ఆమెను అర్చించిన వారికి విజయాలను అనుగ్ర హిస్తుందని నమ్మకం. ముఖ్యంగా రావణవధకు ముందు రామచంద్రుడు ఈ దేవిని అర్చించారని పురాణ కథనం.

పరమ శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ కుడిచేతితో అభయమిస్తూ, ఎడమచేతితో చెరకుగడ ధరించిన రాజరాజేశ్వరీదేవి షోడశ మహామంత్ర స్వరూపిణి. అనంతశక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిదేవత. మహాత్రిపుర సుందరిగా కూడా పూజలందుకుంటోంది. మణిద్వీపంలోని శ్రీపురంలో నివాసం ఉండే ఆమెను ‘చింతామణి’గా పిలుస్తారని ప్రతీతి.

శమీపూజ

చెట్లను దేవతా స్వరూపాలుగా భావించి, అర్చించడం మన సంస్కృతీ సంప్రదాయం. అందునా దేవతా వృక్షాలది మరింత ప్రత్యేకత స్థానం అలాంటిది శమీ (జమ్మి)వృక్షం. క్షీరసాగర మథనంలో పుట్టిన దేవతావృక్ష జాలంలో ఇదీ ఒకటి. దీనిని ‘అగ్నిగర్భ’ అంటారు. అగ్ని స్వరూపంగా పరిగణించే శమీ వృక్షదారువునే యజ్ఞ యాగాదులలో అగ్ని మథనానికి (నిప్పు రాజేయడానికి) ఉపయోగించే వారు.

‘శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ

అర్జునస్య ధనుర్దారీ/రామస్య ప్రియదర్శినీ’ (పాపాలను పోగొట్టి శత్రువులను పరాజయం పాలుచేయగలవు. అర్జునుడు ధనుస్సును నీ దగ్గరే (జమ్మిచెట్టుపైన) రాముడికి ప్రియం చేకూర్చావు..) శ్లోకాన్ని పఠిస్తూ, ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల శనిదోషాలు తొలగిపోతాయని చెబుతారు. ‘శమీ’ అంటే శమింప చేసేది అని అర్థం. రావణ సంహారానికి ముందు శ్రీరాముడు శమీ వృక్షాన్ని ఆరాధించారని, పాండవులు… ప్రధానంగా అర్జునుడు అపరాజితను, శమీవృక్షాన్ని అర్చించడం వల్లనే ఉత్తరగోగ్రహణం, కురుక్షేత్రంలో విజయుడయ్యాడని ఇతిహాసం. దశమినాడు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పార్వేట జరుపుకుంటారు. పూర్వం రఘుమహారాజు కోసం కుబేరుడు జమ్మి చెట్టుపై ‘బంగారు వాన’ కురిపించాడట. అందుకే వృక్షానికి పూజ చేసిన తరువాత ఆకులను బంగారంగా భావించి బంధుమిత్రుల చేతికి ఇవ్వడం, పెద్దల చేతికి ఇచ్చి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ‘ఇతరుల సొత్తును ఆశించకు. నీకున్నదానిలో అవసరమైనంత ఉంచుకుని మిగిలినది అవసరార్థులకు అర్పించు’ అనే సామాజిక నీతి దాగుందని చెబుతారు.

పాలపిట్ట సందర్శనం

దసరా ఉత్సవంలో శమీవృక్షంతో పాటు పాలపిట్ట దర్శనానికి విశేష ప్రాధాన్యం ఉంది. విజయదశమి నాడు శరన్నవరాత్రి దీక్షను ముగించి ఊరికి ఉత్తర దిక్కుగా పొలిమేరలు దాటి (సీమోల్లంఘన) వెళతారు. ఆ సమయంలో పాలపిట్ట దర్శనం శుభసూచకమని, మేలు కలుగుతుందని భావిస్తారు. ఇది అన్ని పక్షుల మాదిరిగా తరచూ కనిపించదట. దానికి నీరంటే బెరుకనీ, అందుకు వానలు వెనుకబడిన తరవాత బయటికి వస్తుందని చెబుతారు.పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకొని వస్తూ పాలపిట్టను చూశారని, అప్పటి నుంచి వారికి అన్నీ జయాలేనని జానపదులు పాడుకుంటుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దానిని భక్తిప్రపత్తులతో చూస్తారు. సమైక్యాంధప్రదేశ్‌ ‌నుంచి విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుతవ్వం పాలపిట్టనే రాష్ట్ర పక్షిగా నిర్ణయించింది. కర్ణాటక, ఒడిశా, బిహార్‌లకూ అదే రాష్ట్ర పక్షి. పాండవులు అరణ్య,అజ్ఞాతవాసాలు ముగించుకొని వస్తూ పాలపిట్టను చూశారని, అప్పటి నుంచి వారికి అన్నీ జయాలేనని జానపదులు పాడుకుంటుంటారు.

 దసరా వేడుకలకు ఘన చరిత్ర ఉంది. విజయ నగరం రాజులు హంపీలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారట. ఆ సామ్రాజ్య పతనం తరువాత మైసూర్‌ ‌మహారాజాలు (వడయార్‌ ‌రాజవంశీయులు) వీటిని అందిపుచ్చుకున్నారు. వారు 17వ శతాబ్ది తొలినాళ్లలో ఈ ఉత్సవాలను శ్రీరంగపట్టణంలో నిర్వహించేవారట. మూడవ కృష్ణరాజ వడయార్‌ ‌హయాంలో (1805 నుంచి) ఇవి మైసూరుకు మారాయి. ఈ నవవరాత్రుల సందర్భంగా రాజవంశీయుల ఇలవేల్పు చాముండేశ్వరీ దేవిని 750 కిలోల బంగారంతో నిర్మించిన మండపంపై ఉంచి అర్చిస్తారు.

అయ్యవారికి…

దసరా అంటే పిల్లలకు సరదాయే కాదు. ఉపాధ్యాయులకూ ఆనందమే. ఇప్పడది అరుదైన సందర్భమనే చెప్పాలి. ‘బతకలేక బడిపంతులు’ అనిపించుకునే వీధిబడుల కాలంలో అయ్యవార్లు శిష్యులతో పూలబాణాలు పట్టించి ఊరిలోని ఇంటింటికి వెళ్లేవారు. విద్యార్థులు భక్తిపూర్వక పద్యాలు చెబుతూనే ‘దసరాకు వస్తిమని విసవిసలు పడక/ బహుమానాలు ఇచ్చి పంపండి వేగం’ అని గడుసుగా అడిగేవారు. తమకు పాఠం చెబుతున్నం దుకు గురుదక్షిణ సమర్పించుకోలేక మిమ్మల్ని అర్థిస్తున్నాం అనే భావంతో ‘గురునకు దక్షిణల్‌ ‌కోరి యీదలచి/వెరపు తోడుత మిమ్ము వేడవచ్చితిమి’  అని పిల్లలు పాట రూపంలో తమ అశక్తను, గురుభక్తిని చాటిచెప్పేవారు. పెద్దలకు కోపం తెప్పించడం ఇష్టంలేక, వినయంగా ‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు.. పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు’ అని తమకు తాము మినహాయింపునిచ్చుకునేవారు. తల్లిదండ్రులు కూడా ఆనందంగా తోచినంత ఇచ్చేవారు. అరవయ్యోపడిలో ఉన్న వారికి ఆ మధురిమల జ్ఞప్తికి రావచ్చు. ఇక్కడ ‘దసరా దక్షిణ’ సమర్పణలేనిదే గురువుకు గడవదని అర్థం కాదు. పిల్లలకు లోకజ్ఞానం, దాతృత్వాన్ని నేర్పడం, పదిమందితో కలివిడిగా ఉండేలా చేయడం దీనికి నేపథ్యం. ‘బతకలేక బడి పంతులు’ అన్న నానుడి ఉన్నప్పుడూ విద్యార్థుల ఉన్నతిని కాంక్షిస్తూ, ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అనే నినాదాన్ని నిజం చేసేందుకు తాపత్రయపడుతూ తృప్తిగా వెళ్లదీసిన కాలం అది.

దేవరగట్టు ఉత్సవం

విజయదశమి పండుగలో భాగంగా వివిధ ప్రాంతాలలో జరుపుకునే ఉత్సవాలలో విలక్షణమైనది ఆంధప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ‘దేవరగట్టు కర్రల సమరం’ (దేవరగట్టు ఉత్సవం)ఆ రోజు రాత్రి కాగడాల కాంతుల్లో జరుపుకునే దీనినే ‘బన్ని ఉత్సవం’ అంటారు. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, ‘త్రేతాయుగంలో మణి, మల్లాసురులనే రాక్షసుల బాధలు భరించలేని మునులు పార్వతీ పరమేశ్వరులను శరణుకోరారు. వారికి అభయ మిచ్చిన ఆదిదంపతులు రాక్షస సంహారానికి మాల, మల్లేశ్వరులగా అవతరించారు. అయితే దేవ మానవుల వల్ల పొంచిఉన్న ముప్పునుంచి తమను కాపాడవలసిందిగా రాక్షసులు అప్పటికే శివుడిని ఆశ్రయించి వరం పొందారు. దీనితో శివపార్వతులు దేవమానవులుగా కాకుండా భైరవరూపంలో తొమ్మిది రోజులు పోరాడి దానవులను సంహరించారు. భైరవమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా గుర్తించిన రాక్షసులు, తమకు ముక్తిని ప్రసాదించాలని, విజయదశమి నాడు పిడికెడు మానవ రక్తమైనా సమర్పించేలా చూడాలని వేడుకున్నారట. అప్పటి నుంచి ఈ ‘సమరం’ సాగుతూ వస్తోందని కథనం. ఆ ప్రాంత చుట్టుపక్కల గ్రామాలు కొత్తపేట, నెరిణికి, నెరిణికి తండా తదితర గ్రామాల వారు ఇనుప వృత్తాలు తొడిగిన కర్రలు చేతబూని ‘స్వామి ఉత్సవం తమదంటే తమదం’టూ పరస్పరం అడ్డుకుంటారు. ఈ క్రమంలో తలలు పగిలినా వెనుకంజ వేయరు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించిన తరువాత ఒక భక్తుడు తొడకోసి పిడికెటు రక్తాన్ని ధారపోసి, అనంతరం ఆలయానికి చేరుకుని భవిష్యవాణి చెబుతారు. ఈ కాలంలో ఇది వింతగా అనిపించినా, ‘ఇది ఆచారంగా వస్తున్న ఆరాధనే కానీ ఆటవికం కాదు’ అని స్థానికులు చెబుతారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE