– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు/జాగృతి డెస్క్

ఒకప్పుడు ప్రపంచ రాజకీయాలనూ, భూగోళాన్నీ తన చిటికెన వేలు మీద తిప్పిన దేశం ఇంగ్లండ్‌. ‌దేశం చాలా చిన్నది. కానీ ప్రపంచ చరిత్రలో పెద్ద స్థానం సంపాదించింది. సముద్ర మహారాజ్ఞి పేరుతో ప్రపంచాన్ని ఏలిన దేశం ఇంగ్లండ్‌. ఇం‌గ్లండ్‌ ‌పార్లమెంట్‌కు ‘మదర్‌ ‌పార్లమెంట్‌’ అన్న బిరుదు ఉంది. భారతదేశాన్ని రెండు శతాబ్దాలు పాలించిన దేశం ఇంగ్లండ్‌. ‌కానీ చారిత్రక వైచిత్రి ఎంత అనూహ్యంగా ఉంటుందో ఇప్పుడు రుజువైంది. రెండో ప్రపంచయుద్ధం తరువాత ఆ దేశ ప్రధాని పదవి చేపట్టినవారు విన్‌స్టన్‌ ‌చర్చిల్‌. ‌భారతీయులు స్వాతంత్య్రం పొందడానికి అర్హులు కారని 1945 నాటికి కూడా విన్‌స్టన్‌ ‌చర్చిల్‌కు ఉన్న ప్రగాఢ అభిప్రాయం. చర్చిల్‌ ఇం‌త అవమానకరమైన వ్యాఖ్య చేయడం వెనుక ఉన్నది కేవలం జాతి వివక్ష. భారతీయులు స్వాతంత్య్రానికీ, పాలనకీ ఎప్పటికీ అర్హులు కారని ప్రకటించిన బ్రిటన్‌ ‌పాలన భారత సంతతికి చెందిన రుషి సూనక్‌ ‌చేతికి వచ్చింది. రుషి బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి పదవికి ఎంపికయ్యారు. ఇది చారిత్రక వైచిత్రి కాదనడం ఎలా? ఈ పరిణామం చరిత్ర గమనాన్ని మాత్రమే కాకుండా, మానవాళి చింతనను కూడా మలుపు తిప్పగలుగుతుంది. తమ మీద తమకున్న ఆత్మ న్యూనతాభావం నుంచి భారతీయులను ఈ పరిణామం కొంచెమైనా బయటపడవేస్తుంది. ప్రపంచం మీద, శ్వేతజాతిలోను నల్లజాతీయుల మీద ఉన్న అభిప్రాయం మారే పక్రియకు ఇది శ్రీకారం చుడుతుంది కూడా.


1930 దశకంలో రుషి సూనక్‌ ‌పూర్వికులు అఖండ భారత్‌లోని ఉమ్మడి పంజాబ్‌ ‌నుంచి వలస వెళ్లారు. నాలుగు పదులు నిండిన రుషి ఇప్పుడు ఇంగ్లండ్‌, ‌భారత్‌, అమెరికాలలో వ్యాపార వ్యవస్థలు నడుపుతున్నారు. రుషి 2014లోనే ఇంగ్లండ్‌ ‌రాజకీయాలలో ప్రవేశించారు. ఆయన కన్జర్వేటివ్‌ ‌పార్టీకి చెందినవారు. చిత్రంగా, విన్‌స్టన్‌ ‌చర్చిల్‌ ‌కూడా ఆ పార్టీ నాయకుడే. ఆర్థిక వ్యవహారాల నిపుణునిగా రుషి చూపించిన ప్రతిభ ఆయనను ఇంగ్లండ్‌ ‌ప్రధాని పదవి వరకు తీసుకు వెళ్లింది. ఆయన వయసు 42 సంవత్సరాలు. ఆ పదవిని అధిరోహించిన వారిలో పిన్నవయస్కుడు కూడా. కన్జర్వేటివ్‌ ‌పార్టీ అభ్యర్థిగా రిచ్‌మండ్‌, ‌యార్క్‌షైర్‌ ‌నుంచి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు రుషి భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. బ్రిటిష్‌ ‌పార్లమెంటులో గీత మీద ప్రమాణం చేసిన తొలి సభ్యుడు రుషి. ఆయనకు గీత అంటే అపారమైన గౌరవం. తన విలాసవంత జీవితం గురించి విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఆ గడ్డు స్థితి నుంచి బయటపడడానికి గీతాసారంతోనే తనకు సాధ్య మైందని, ఎన్నో పరిష్కారాలు గీత నుంచే లభించాయని ఆయన చెప్పుకున్నారు. ఆయన బ్రిటన్‌ 57‌వ ప్రధాని. ఆ పదవిని అధిరోహించిన తొలి శ్వేతేతర జాతీయుడు. నేటి అగ్రదేశం అమెరికాకు భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్‌, ‌రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచ ఆధిపత్యం నెరపిన బ్రిటన్‌లో తాజాగా భారతీయ సంతతి రుషి అత్యున్నత పదవులకు ఎంపిక కావడం చరిత్రాత్మకమే. ఇంగ్లండ్‌ ‌ప్రధాని కార్యాలయం టెన్త్ ‌డౌనింగ్‌ ‌స్ట్రీట్‌ ఇక ‘రుషి’పీఠం కానున్నది.

వెనకడుగు వేయలేదు

నలభయ్‌ ఐదు రోజులకే పదవి నుంచి వైదొలగిన లిజ్‌ ‌ట్రస్‌ ‌మీద రుషి పోటీ చేశారు. ఆయన గెలుపు తథ్యమని అనుకుంటూ ఉండగానే హఠాత్తుగా రాజకీయాలు మలుపు తిరిగాయి. కానీ అంతే అనూహ్యంగా ట్రస్‌ ‌రాజీనామా చేసి, మళ్లీ ప్రధాని పదవికి ఎన్నిక తెచ్చారు. ఈసారి బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి పదవికి జరిగే పోటీలో తాను ఉన్నానని రుషి సూనక్‌ ‌కేవలం అక్టోబర్‌ 23‌వ తేదీనే ప్రకటించారు. ట్రస్‌ ‌రాజీనామా తరువాత తాను మళ్లీ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికలో పోటీ పడుతు న్నట్టు మాజీ ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌ ‌ప్రకటించారు. ఆయనతో పాటు మాజీ రక్షణమంత్రి పెన్నీ మోర్డాంట్‌ ‌కూడా బరిలో ఉన్నట్టు ప్రకటించారు. అయితే మొదట బోరిస్‌ ‌జాన్సన్‌ ‌పోటీ నుంచి తప్పుకున్నారు. మోర్డాంట్‌ ఎం‌పీల మద్దతు కూడగట్టలేక అక్టోబర్‌ 24‌న పోటీ నుంచి తప్పుకున్నారు. అక్టోబర్‌ 22 ‌నాటికి మోర్డాంట్‌కు మద్దతుగా ఉన్న ఎంపీల సంఖ్య 23 అని బీబీసీ వెల్లడించింది. దాదాపు రెండువందల మంది ఎంపీల మద్దతుతో రుషి ఎన్నికయ్యారు. వేగంగా మారిన ఈ పరిస్థితుల నేపథ్యంలో రుషిని ఆ పదవి వరించింది. ఇప్పుడు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా (1812 తరువాత) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2014లో రాజకీయ ప్రవేశం

రిచ్‌మండ్‌ ‌నియోజవర్గానికి కన్జర్వేటివ్‌ ‌పార్టీ అభ్యర్థిగా 2014లో ఆయన ఎన్నికయ్యారు. దానితోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. 2015లో అక్కడ నుంచి ఎంపీగా గెలిచి కామన్స్ ‌సభలో ప్రవేశించారు. 2017లో మరొకసారి గెలిచారు. 2019లో బోరిస్‌ ‌జాన్సన్‌ ‌ఖజానా ప్రధాన కార్యదర్శిగా రుషిని నియమించారు. తరువాత సాజిద్‌ ‌జావెద్‌ ‌ఖజానా చాన్సలర్‌ ‌పదవికి రాజీనామా చేయడంతో రుషి ఆ పదవిని చేపట్టారు. కానీ ప్రధాని జాన్సన్‌ ‌హయాం అపఖ్యాతి పాలైంది. పార్టీగేట్‌ అనే అవకతవకల వ్యవహారం మొదలుకొని కొన్ని లైంగిక అత్యాచారాల ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.

ఆర్థిక, రాజకీయ సంక్షోభం

పన్నెండేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కన్జర్వేటివ్‌ ‌పార్టీ, 2016లో బ్రెగ్జిట్‌ ‌నుంచి మొదలై, ట్రస్‌ ‌రాజీనామా వరకూ వరుస సంక్షోభాలతో బాగా దెబ్బతింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం బోరిస్‌ ‌జాన్సన్‌, ‌లిజ్‌ ‌ట్రస్‌ల తర్వాత ఇప్పుడు మూడో వ్యక్తి ప్రధానిగా ఎన్నికయ్యారు. 657 మంది సభ్యులున్న బ్రిటిష్‌ ‌పార్లమెంట్‌లో కన్జర్వేటివ్‌ ‌పార్టీ తరఫున 357 మంది సభ్యులున్నారు. కనీసం వంద మంది ఎంపీల మద్దతు ఉన్న వ్యక్తులే పోటీకి అర్హులన్న నిబంధన విధించారు. ఈ సంవత్సరం జూలై నుంచి బ్రిటన్‌ ‌రాజకీయ సంక్షోభం ముదురు పాకాన పడింది. ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌ ఆ ‌నెల ఏడో తేదీన కన్జర్వేటివ్‌ ‌పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ పదవికి తరువాత చాలామందే పోటీ పడ్డారు. అందులో రుషి పేరు ప్రధానంగా వినిపించింది. జూలై 5 వరకు రుషి ఆర్థిక వ్యవహారాల విభాగం అధిపతి. అదే రోజున ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఖజానా చాన్సలర్‌గా పిలిచే ఈ పదవి ఆర్థికమంత్రి పదవే. ఈ పదవిని రుషి ఎంతో సమర్ధంగా నిర్వహించారని పేరు తెచ్చుకున్నారు. ప్రపంచమంతా కరోనా కల్లోలంలో మునిగి ఉన్నప్పుడు బ్రిటన్‌ ఆర్థిక వ్యవహారాలను రుషి ఎంతో చాకచక్యంగా నిర్వహించారన్న ఖ్యాతి ఉంది. 2020లో ఆయన ఆ పదవిని చేపట్టారు. అయితే ప్రధానితో రుషికి విభేదాలు వచ్చాయి. ఇవన్నీ మున్నెన్నడూ ఎరగనంత తీవ్రస్థాయిలో బ్రిటన్‌ ‌సంక్షోభంలో చిక్కుకుపోయిన ఫలితమే. రాజకీయ అస్థిరత, ఆర్థిక పతనం దేశాన్ని కుంగదీస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం భయపెడుతోంది. ఒకదాని వెంట మరొకటిగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రధాని లిజ్‌ ‌ట్రస్‌ ‌రాజీనామాకు దారితీశాయి.

అవినీతి ఆరోపణలతో బోరిస్‌ ‌జాన్సన్‌ ‌ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో అధికార కన్జర్వేటివ్‌ ‌పార్టీలో నాయకత్వ స్థానానికి పోటీ ఏర్పడింది. విదేశాంగ మంత్రిగా పనిచేసిన లిజ్‌ ‌ట్రస్‌, ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన భారత సంతతికి చెందిన రుషి సూనక్‌ల మధ్య పోటీలో చివరకు ట్రస్‌ ‌విజయం సాధించారు. బ్రిటన్‌లో జీవన వ్యయం తగ్గిస్తానని, సంస్కరణల ద్వారా ఆర్థిక రంగానికి స్థిరత్వం తెస్తానని, ఇంధన ధరలపై కట్టుదిట్టమైన చర్యలు చేపడతానన్న హామీలతో, అభివృద్ధి మంత్రంతో ఆమె అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ ఆచరణ సాధ్యం కావని ఆర్థికమంత్రిగా అనుభవం ఉన్న రుషి అప్పుడే కొట్టిపారేశారు. ఒకవైపు కరోనా, ఇంకోవైపు రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం వీటన్నింటి మధ్య దేశ ఆర్థికం అగచాట్లు పడుతోందని, ఇప్పుడు పన్నులు తగ్గించాలనేది సహేతుకమైన నిర్ణయం కాదని అన్నారు. అలా చేయటం ‘విధ్వంసక చర్య’ అవుతుందని కూడా వాదించారు. కార్పొరేషన్‌ ‌పన్నును 19 నుంచి 25 శాతానికి పెంచుతానని రుషి చెబితే, 19 శాతానికి కట్టుబడతానని హామీ ఇచ్చారు ట్రస్‌. ‌పెంచిన పన్నును క్రమంగా తగ్గిస్తూ ఈ దశాబ్దం చివరికి 20 శాతం చేస్తానని రుషి ఇచ్చిన హామీ ప్రభావం చూపలేదు.

ట్రస్‌ ఎం‌పిక, రాజీనామా

ట్రస్‌ ‌విజయం సాధించి సెప్టెంబర్‌ 5‌న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవి చేపట్టిన మూడు రోజులకే రాణి ఎలిజబెత్‌ ‌కన్నుమూశారు. సెప్టెంబర్‌ 23‌న ట్రస్‌ ‌ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ ‌తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. లక్షలాది సామాన్య కుటుంబాలను దెబ్బకొట్టింది. జీవన వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె 4,300 కోట్ల పౌండ్ల మేర పన్నుల్లో కోతలను ప్రతిపాదించారు. ఆ మేరకు ఆదాయ లోటును మార్కెట్లో బాండ్ల ద్వారా పూడ్చుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల బ్రిటన్‌ ‌రుణభారం పెరిగే ప్రమాదం ఉండటంతో పౌండు విలువ పతనం కాసాగింది. మార్కెట్లు కుదేలయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇంధన బిల్లులు ఆకాశాన్ని తాకాయి. కేంద్ర బ్యాంకు రంగంలోకి దిగవలసి వచ్చింది.

సొంత పార్టీ ఎంపీలు బహిరంగంగానే ట్రస్‌ ‌నాయకత్వాన్ని విమర్శించారు. దాంతో ఐఎంఎఫ్‌ (ఇం‌టర్నేషనల్‌ ‌మానిటరీ ఫండ్‌) ‌సమావేశంలో ఉన్న ఆర్థికమంత్రి క్వాసీ కార్టెంగ్‌ని వెనక్కి పిలిపించి, పదవి నుంచి తొలగించారు. తనతో నాయకత్వ స్థానానికి పోటీ పడి ఎనిమిదో స్థానంలో ఉన్న జెరిమీ హంట్‌కు ఆ పదవి కట్టబెట్టారు. హంట్‌ అం‌తకు ముందు ప్రకటించిన ప్యాకేజీలో మార్పుల, చేర్పులు చేశారు. దాని వల్ల మార్కెట్లు నిలదొక్కుకున్నాయి. ట్రస్‌ అం‌తకు ముందు ప్రకటించిన పథకాల నుంచి పూర్తిగా ‘యూటర్న్’ ‌తీసుకోవలసి రావటంతో విమర్శలు తప్పలేదు. అనంతరం కొద్ది రోజులకే హోం మంత్రి సువెల్లా బ్రావెర్మన్‌ ‌రాజీనామా చేయవలసిన పరిస్థితి ఎదురైంది. వలస విధానాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటం, అలాగే ఆమె రూపొందించిన డ్రాఫ్ట్‌ను వ్యక్తిగత మెయిల్‌ ‌నుంచి పంపించటం వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ‘నేను యోధురాలిని. ఆరునూరైనా వైదొలిగేది లేదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటా. వాగ్దానాలు నెరవేరుస్తా’ అని ఆ సందర్భంగా గంభీర వచనాలు పలికిన లిజ్‌ ‌ట్రస్‌ ‌కొన్ని గంటలు గడవక ముందే మనసు మార్చుకున్నారు. ఒక వైపు తాము సరైన అభ్యర్థిని ఎంచుకోలేదని 62 శాతం మంది కన్జర్వేటివ్‌ ‌పార్టీలు అభిప్రాయపడుతున్నట్టు వార్తలు రావటం, మరోవైపు పార్లమెంట్‌ ‌సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు చులకనగా మాట్లాడటం ఆమెను కలత పరిచాయి. ‘మా ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన మీ నాయకురాలు బల్లకింద దాక్కున్నారా?’ అని ప్రతిపక్ష సభ్యులు విమర్శిస్తే, ప్రధానమంత్రి స్థానంలో ప్రశ్నోత్తరాలను ఎదుర్కోవటానికి సిద్ధపడ్డ మంత్రి నీళ్లు నమిలారు. చివరకు ప్రధాని పదవి చేపట్టిన కేవలం 45 రోజులకే ఆమె రాజీనామా చేయవలసి వచ్చింది. బ్రిటన్‌ ‌చరిత్రలోనే అతి తక్కువ కాలం పదవిలో ఉన్న వ్యక్తిగా లిజ్‌ ‌ట్రస్‌ ‌మిగిలిపోయారు. తన అధికారిక నివాసం 10 డౌనింగ్‌ ‌స్ట్రీట్‌ ‌వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో.. తాను దేనికోసం ఈ పదవిలోకి వచ్చానో దానిని అందించలేకపోయానని నిజాయితీగా చెప్పుకున్నారు. ‘దేశంలో తీవ్ర ఆర్థిక అస్థిరత, అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధానిగా ఎన్నికయ్యా. ఉక్రెయిన్‌, ‌రష్యా యుద్ధం వల్ల పరిస్థితులు మరింతగా దిగజారాయి. పరిస్థితిని మెరుగుపరచటానికి నా వంతు ప్రయత్నించాను’ అని వివరించారు. తక్కువ పన్నులు, నేషనల్‌ ఇన్సూరెన్సులో కోత వంటి తన అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. ఆమె రాజీనామా చేయగానే మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. ఆ రోజు ట్విటర్‌ ‌ట్రెండింగ్‌లో ఆమె అగ్రభాగాన నిలిచారు.

రుషి పూర్వికులు పంజాబీలు

రుషి పూర్వికులు పంజాబ్‌లోని గుజ్రన్‌వాలాకు చెందినవారు. వారు మొదట తూర్పు ఆఫ్రికాకు తరువాత 1960లో ఇంగ్లండ్‌కు తరలి వెళ్లారు. రుషి తల్లిదండ్రులు యశ్వీర్‌, ఉష. యశ్వీర్‌ ‌కెన్యాలో, ఉష టాంజానియాలో పుట్టారు. యశ్వీర్‌ ‌వైద్యుడు. ఉష ఔషధ రంగానికి చెందినవారు. రుషి మాత్రం ఇంగ్లండ్‌లోనే సౌతాంప్టన్‌లో 1980లో పుట్టారు. ఆక్స్‌ఫర్డ్‌లోని లింకన్‌ ‌కాలేజీలో బీఏ, స్టాన్‌ఫర్డ్ ‌విశ్వ విద్యాలయం నుంచి ఎంబీఏ పట్టాలు తీసుకున్నారు. రుషి ఫ్యాషన్‌ ‌డిజైనర్‌ అక్షతను వివాహం చేసుకున్నారు. ఆమె ఇన్ఫోసిస్‌ అధిపతి, భారత వ్యాపార దిగ్గజం ఎన్‌ఆర్‌ ‌నారాయణమూర్తి కుమార్తె. ప్రస్తుతం ఈ జంట 730 మిలియన్‌ ‌పౌండ్ల ఆదాయంతో బ్రిటన్‌లో సంపన్నుల జాబితాలో 222వ స్థానంలో ఉంది. అమెరికాలో స్టాన్‌ఫర్డ్ ‌బే ఏరియాలో ఉంది. ఫుల్న్‌బ్రైట్‌ ‌విద్యార్థివేతనంతో ఆయన అక్కడ ఎంబీఏ చేయడానికి 2006లో వెళ్లారు. అక్షతను కలుసుకున్నది అక్కడే. స్టాన్‌ఫర్డ్‌తోనే తన జీవితం ఎంతో మారిందని, వ్యాపారం ప్రాముఖ్యం ఏమిటో ఆ విద్యా సంస్థే తెలియ చేసిందంటారు రుషి. 2009లో ఆ ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు -అనౌష్క, కృష్ణ. తాను హిందూ జీవన విధానంలోనే ఉన్నానని రుషి తరుచు చెప్పుకుంటారు.

రుషికీ, భారత్‌కీ ఉన్న బంధం గురించి కొన్ని విషయాలు

ముందే చెప్పుకున్నట్టు రుషి తాతగారు రామదాస్‌ ‌సూనక్‌ ‌పంజాబ్‌ ‌నుంచి మంచి జీవనం కోసం 1935లో తూర్పు ఆఫ్రికాకు వెళ్లారు. నైరోబీలోని ఒక సంస్థలో గుమాస్తా ఉద్యగం కోసం ఆయన వెళ్లారు. కానీ అక్కడ భారతీయులకు ఇబ్బందులు ప్రారంభం కావడంతో గ్రేట్‌ ‌బ్రిటన్‌కు వలస వచ్చారు. పంజాబ్‌లోని గుజ్రన్‌వాలా ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నది కాబట్టి, రుషి పాకిస్తాన్‌కు చెందినవాడేనని ఆ దేశం ఇప్పుడు చెప్పుకోవడం మొదలుపెట్టింది. రుషి ఎంపిక పట్ల పంజాబ్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పాకిస్తాన్‌లో కూడా సంతోషం కనిపించింది. తమ ఊరి అల్లుడు బ్రిటన్‌ ‌ప్రధాని అయినాడని బెంగళూరు కూడా సంబరపడుతోంది. ‘ఇదొక చరిత్రాత్మక ఘటన. వలస వెళ్లినవారు కూడా ప్రధాని పదవిని అధిరోహించవచ్చునని ఈ సంఘటన రుజువు చేసింది. ఇది ఇంగ్లండ్‌ ‌పరిణత ప్రజాస్వామ్యానికి ప్రబల సాక్ష్యమని ఇన్ఫోసిస్‌ ‌మాజీ ఫైనాన్స్ ఆఫీసర్‌ ‌వి. బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

 ఆ ఇద్దరు ఎందుకు తప్పుకున్నారు?

ఇంత సంక్షోభం, ఆ తరువాత వేగంగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే కొన్ని ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. బోరిస్‌ ‌జాన్సన్‌, ‌పెన్నీ మోర్డాంట్‌ ఎం‌దుకు ఒకరి తరువాత ఒకరు పోటీ నుంచి విరమించు కున్నారు? ట్రస్‌కు ఎదురైన అనుభవం, 45 రోజులకే పదవీచ్యుతి వంటివి తమకు కాకుండా, రుషికి బదలీ చేయాలనా? ఇంతటి ఆర్థిక సంక్షోభం కొన్ని నెలలలోనే సమసిసోతుందా? రుషిపై ఉన్న నమ్మకం ఏమిటి? ఈ ప్రశ్నలైతే ఉన్నాయి. ఇంతకీ శ్వేతజాతీయుడు, అలాగే పౌరసత్వం చేతనే కాని, జాతి చేత బ్రిటిషర్‌ ‌కాని రుషిని సామాన్య దేశవాసి ఎలా చూస్తాడు? ఎల్‌బీసీ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ఒక కాలర్‌ ‌మాటలకు అర్ధం ఏమిటి? ఆ కాలర్‌ ‌పేరు జెర్రీ. ప్రధాని పదవికి రుషి పోటీ పడుతున్నట్టు ప్రకటించగానే ఆ కాలర్‌ ‌తన అభిప్రాయాన్ని అత్యంత అనాగరికంగా వెల్లడించాడు. అతడి మొదటి మాట, రుషి నికార్సయిన బ్రిటిషర్‌ ‌కాదు. రెండో మాట రుషిని అతడు అల్‌ ‌కాయిదా వంటి ఒక సంస్థతో పోల్చి చెప్పాడు. మేం బోరిస్‌కు ఓటేసి గెలిపించాం. ప్రధానిగా ఆయనే సరైన అభ్యర్థి. రుషి ఇంగ్లండ్‌ను ప్రేమించలేడు. ఆ పని బోరిస్‌ ‌చేయగలడు అని కూడా ఆ కాలర్‌ ‌కటువుగా వ్యాఖ్యానించాడు. అక్కడి సాధారణ పౌరులలో కూడా ఇంత జాత్యహంకారం తాండవిస్తున్నది. ఈ కాలర్‌ ‌కన్జర్వేటివ్‌ ‌పార్టీ సభ్యుడు కూడా. బోరిస్‌ ‌వీరాభిమాని అని అర్ధమవుతోంది. కానీ ఎల్‌బీసీ రేడియో కార్యక్రమ నిర్వాహకులు చెప్పిన మాట అందరినీ విస్తుపోయేటట్టు చేస్తుంది. అది- ఆ కాలర్‌ అం‌తగా ద్వేషిస్తున్న రుషి నిజానికి ఇంగ్లండ్‌లో పుట్టారు. వీరాభిమానం చూపుతున్న బోరిస్‌ ‌జాన్సన్‌ అమెరికా (న్యూయార్క్)‌లో పుట్టాడు. ఇంతకీ రుషి పూర్తి బ్రిటషర్‌ ‌కాదు అని ఆ కాలర్‌ ఎం‌దుకు నిర్ధారణకు వచ్చాడో కూడా బయటపడింది. రుషికి అటు అమెరికాలోను, ఇటు భారత్‌లోను కూడా వ్యాపారాలు ఉన్నాయి. ‘పాకిస్తాన్‌కో, సౌదీ అరేబియాకో నేను ప్రధానిని కాగలనని మీరు ఊహించగలరా? బ్రిటన్‌లో 85 శాతం శ్వేత జాతీయులైన ఆంగ్లేయులు ఉన్నారు. వారిని ప్రతిబింబించే వారే ప్రధాని కావడం సరైనది. నేను భారత్‌కు కూడా వెళ్లలేను. ఇక ఆ దేశ ప్రధాని కావడం గురించి అసలే ఆలోచించలేను’ అన్నాడతడు. అంటే ఇప్పుడు ఆ కాలర్‌ ‌వంటి వారందరి బాధ ఒక్కటే. అదే తెల్లతోలు కాకపోవడం, నల్లజాతీయుడు కావడం.

ఇంగ్లండ్‌-‌భారత్‌ ‌సంబంధాలను తాను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని రుషి ఈ ఆగస్ట్‌లో జరిగిన ఒక సమావేశంలో వెల్లడించారు. భారత విద్యార్థులు ఇంగ్లండ్‌లో చదువుకోవడానికీ, బ్రిటిష్‌ ‌జాతీయులు భారత్‌లో కంపెనీలు ప్రారంభించడానికి మార్గం మరింత సుగమం చేస్తానని తన పార్టీకి చెందిన బ్రిటిష్‌ ఇం‌డియన్‌ ‌సభ్యుల సమావేశంలో రుషి చెప్పారు. ఆర్థిక వ్యవస్థపై రుషి ఏ హెచ్చరికలయితే చేశారో, అవన్నీ ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడటం, ఆ రంగంలో అపారమైన అనుభవం, వీటికి తోడు ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నా నోరు జారకుండా హుందాగా ప్రవర్తించటం వంటి అంశాలు రుషి సూనక్‌కు సానుకూలం అవుతాయని పరిశీలకులు భావించినట్టే జరిగింది. ట్రస్‌ ‌రాజీనామాతో బ్రిటన్‌, ‌భారత్‌ ‌దేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్‌ అ‌గ్రిమెంట్‌- ఎఫ్‌టీఏ)కు సంబంధించిన సంప్రదింపుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. యూరోపియన్‌ ‌యూనియన్‌ (ఈయూ) నుంచి వైదొలగటం వల్ల వలసలను నిరోధించటం, అదే సమయంలో విదేశీ వృత్తి నిపుణులను, విద్యార్థులను దేశంలోకి రప్పించటానికి మధ్య సమతులాన్ని సాధించాలని బ్రిటన్‌లోని కన్జర్వేటివ్‌ ‌పార్టీ భావిస్తోంది. ఈ విషయంలో రాజీ పడకూడదని భారత్‌ ‌గట్టి పట్టుదలతో ఉంది. వచ్చే ఏడాది దాకా ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ తాత్కాలిక సమస్యలే కావచ్చు. ఏమైనా దాదాపు పుష్కర కాలం నుంచి సంక్షోభాలతో నెట్టుకువస్తున్న ఇంగ్లండ్‌ను గట్టెక్కించడం రుషి ముందు ఉన్న పెద్ద సవాలేనని చెప్పాలి. అయితే అందులో ఆయన విజయం సాధించాలని కోరుకుందాం.

About Author

By editor

Twitter
YOUTUBE