సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌భాద్రపద శుద్ధ దశమి – 05 సెప్టెంబర్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌యోగా అంటే మతం కాదు, విజ్ఞానశాస్త్రం. మనిషిని సదా ఆరోగ్యంతో, నవనవోన్మేషంగా ఉంచే శాస్త్రం. శరీరం, ఆత్మ, మేధల నడుమ సామరస్యాన్ని వికసింపచేసే విజ్ఞానశాస్త్రం. ఇది యోగాచార్యులు తరుచు చెప్పే మాట. ఆగస్ట్ 27‌న హైదరాబాద్‌ను సందర్శించిన ప్రఖ్యాత యోగా గురువు స్వామి శివానంద ఈ మాటలకు సజీవ చిత్రమనిపిస్తుంది. ఆయన వయసు 126 సంవత్సరాలు. ఆయన చాలా విషయాలు చెప్పారు. ఒకటి మాత్రం భారతీయులు తప్పక గమనించవలసి ఉంటుంది. యోగ విద్య పుట్టింది భారతదేశంలోనే. కానీ ఆ అద్భుత విద్య అభ్యసన మాత్రం విదేశాలలోనే ఎక్కువట. నిజానికి ఈ మాటతో మనం కళ్లు తెరుచుకోవాలి. వారి వయసును బట్టే కాదు, నాలుగు దశాబ్దాలుగా ఆరు ఖండాలలో పర్యటించిన అనుభవంతో చెబుతున్న మాటలు కాబట్టి వాటిని ఔదలదాల్చడం కర్తవ్యంగా భావించాలి.

ఎవరీ స్వామి శివానంద? ఈ ఏడాది పద్మ పురస్కారాల కార్యక్రమాన్ని టీవీ తెరల మీద వీక్షించిన వారి మనో ఫలకాల మీద అత్యంత నిరాడంబరమైన ఆయన రూపం ఎప్పటికీ చెదిరిపోదు. ప్రధానికీ, రాష్ట్రపతికీ కూడా సాష్టాంగ నమస్కారం చేసి వెళ్లి పురస్కారం అందుకున్న వయో వృద్ధుడు ఆయనే. ఎందుకీ సాష్టాంగ దండ ప్రమాణం? దేశ పాలకులకు ఇచ్చే గౌరవమని ఆయనే వివరించుకున్నారు. ఆ శివానంద భాగ్యనగర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఒక యోగా కార్యక్రమంలో కొన్ని ఆసనాలు వేసి చూపించారు. యోగా ప్రయోజనం ఏమిటో ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పారు.

ఉచ్ఛ్వాస నిశ్వాస సంగీతంతో శరీరంలోని ప్రతి కణం నర్తించడమే యోగ. అదే ఆంతరంగిక ప్రశాంతతనీ, సామరస్యాన్నీ అందిస్తుందని చెబుతారు యోగాచార్యులు. ఇవాళ్టి సంక్లిష్ట జీవితంలో మానవుడు అన్వేషిస్తున్నదే ప్రశాంతత కోసం. పరీక్షల సమయంలో విద్యార్థుల బలవన్మరణాలు, ఉద్యోగ జీవితంలోని ఒడుదుడుకులతో వచ్చే మానసిక వ్యాధులు, పచ్చటి కాపురంలో చెలరేగే చిచ్చు అన్నీ కూడా ప్రశాంతత కోల్పోయిన ఫలితమే. కానీ ప్రశాంతత ఎక్కడో దొరికేది కాదు. ఒత్తిడి, ఆందోళన, సంఘర్షణ మనలోనివే. చిత్రంగా ప్రశాంతత కూడా మన మనసు నుంచే జనిస్తుంది. నగర జీవితం మనిషి ఆత్మను ఛిద్రం చేస్తున్న మాట కాదనలేం. తెలిసో తెలియకో మనం చోటిచ్చిన అలవాట్లే ఇందుకు ఎక్కువ కారణం. ప్రధానంగా ఆహారపు అలవాట్లు. తరువాత నిద్ర. ఈ రెండింటి మధ్య సమన్వయం అన్ని వృత్తుల వారికి సాధ్యం కాకపోవచ్చు. ఎన్ని సంకెళ్లు ఉన్నా అందులోను కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను కూడా ఉపయోగించుకోకుండా ఉండిపోవడమే అసలు సమస్య. ఇంత హడావిడి జీవితంలోను ఆరుగంటలు లేదా ఎనిమిది గంటలు నిద్రకు సమయం లేదనడం మూర్ఖత్వం. అందుకు వేరే కారణాలు ఉంటాయి. అన్ని అవకాశాలు ఉన్నవారు కూడా ఆహారం, నిద్రలకు సంబంధించిన, జీవితానికి అనివార్యమైన నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ఏది తినాలి? ఏది తాగాలి? ఎంత సమయం నిద్ర పోవాలి? ఇవి నేటి సమాజంలో కచ్చితంగా వేసుకోవలసిన ప్రశ్నలు. తర్కించుకోవలసిన అంశాలు కూడా. జీవితం సుఖమయం కావడం, లేదా బాధామయం కావడం- ఆ ప్రశ్నలకు మనం చెప్పుకునే సమాధానాలను బట్టి ఉంటుంది. మితాహారమే తన జీవిత రహస్యమని శివానంద చెబుతున్నారు. నూనె, ఉప్పు పరిహరించానని చెప్పారు. నిజానికి దేశంలో ప్రజల ఉప్పు వినియోగం మోతాదుకు మించే ఉందన్న వాదన లేకపోలేదు. ఆరుగంటల నిద్ర, నడక, యోగాసనాలు తన ఆరో ఏట నుంచి ఆరంభించానని చెప్పారు శివానంద. వీటితో తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాననీ, ఔషధాల జోలికి వెళ్లవలసిన అవసరం కూడా రాలేదనీ చెబుతున్నారు. కాబట్టి ఈ మాట గురించి ఆలోచించవలసిందే కదా!

 యోగాభ్యాసం ఒక అంశాన్ని చూసే దృష్టిని మార్చడమే కాదు, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నవారిలో పరివర్తన కూడా తెస్తుంది అంటారు, ప్రఖ్యాత యోగ బోధకులు బీకేఎస్‌ అయ్యంగార్‌. ‌శివానంద పండ్లు తీసుకోనని చెప్పారు. అది కూడా ఆరోగ్య రహస్యమనీ, లేదా యోగాలో భాగమని ఆయన చెప్పడం లేదు. ఈ దేశంలో చాలామంది పేదలకు ఇప్పటికీ పండ్లు తీసుకునే అవకాశం దక్కలేదు కాబట్టి తాను వాటిని దూరంగా పెట్టానని ఆయనే వివరణ ఇచ్చారు. ఈ దేశంలో ఒంటి నిండా గుడ్డ కప్పుకునే భాగ్యం లేని పేదలే ఎక్కువ కాబట్టి తాను జానెడు వస్త్రాలనే ధరిస్తానని మహాత్ముడు చెప్పడం ఇక్కడ గుర్తుకు వస్తుంది. నిజంగానే శివానంద దృష్టిలోని పరివర్తన స్వాగతించదగినది. అయితే పేదలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నం మాత్రం జరగాలి. పరిస్థితులను మార్చాలి.

యోగాభ్యాసంలో శరీరంలోని ప్రతి కణం ఆత్మగీతాన్ని పాడుతుంది. అంటే శరీరానికీ, ఆత్మకూ మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది. అదే కొత్త దృష్టిని ఇస్తుంది. మానవీయతకు సంబంధించి యోగా ఇచ్చే దృష్టిని కనీసంగా గౌరవించాలి. అంటే మనుషులుగా మన బాధ్యతను అది గుర్తు చేస్తే, దానిని మరచిపోరాదు. వ్యాయామం శరీరాన్ని బలపరిస్తే, యోగా మేధస్సును, ఆత్మను ఆరోగ్యవంతం చేస్తుంది. వ్యాయామం వచనం వంటిది. యోగా కదలికలు చెప్పే కవిత్వం వంటిది అంటారు. శివానంద చెప్పినవన్నీ పాటించి, 126 ఏళ్లు బతకాలని, బతికేయవచ్చని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. శివానంద జీవితకాలంలో సగమే జీవించామని అనుకున్నా, అది పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి యోగ ఉపయోగపడుతుందని నమ్మవచ్చు. వీటన్నిటితో పాటు శివానంద చెప్పిన ‘నేను తక్కువ మాట్లాడతాను’ అన్నమాటను శిరోధార్యంగా భావించాలి. కానీ అది సాధ్యమేనంటారా?

About Author

By editor

Twitter
YOUTUBE