– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్
ఊదు కాలదు.. పీరు లేవదని ఓ సామెత. ప్రతిపక్షాల ప్రత్యామ్నాయ ప్రగల్భాలు గమనిస్తుంటే ఇదే గుర్తుకు వస్తుంది. కాంగ్రెస్-బీజేపీయేతర ఫ్రంట్ అని ఒక టెంట్. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌నూ కలుపుకోవాలంటారు మరొకరు. ప్రతిపక్షాలు ఏకమై, బీజేపీ ఓడితే నాయకత్వం సునాయాసంగా తనకే దక్కుతుందని కాంగ్రెస్ దింపుడు కళ్లం ఆశతో చూస్తోంది. కానీ చరిత్ర ఏం చెబుతోంది? 2019 సహా, గతంలో ఇలా జరిగిన విపక్ష ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కాబట్టి 2024లోనూ ఈ కలగూర గంప సాధించేదేమీ లేదు. మరీ హంగామా ఎందుకు? ఇవన్నీ సర్వ భ్రష్టమైన ఈ పార్టీలు అస్థిత్వం కోసం చేస్తున్న విన్యాసాలే.
సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయమే ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత మరోసారి తెరపైకి వచ్చింది. అవి ఏకం కావడం, కూటమి కట్టడం కొత్తేం కాదు. గతంలో ఎన్నో ఏర్పడ్డాయి. ఒకవేళ ప్రజలు అధికారం ఇచ్చినా నిలుపుకోలేక కుప్పకూలాయి. అప్పట్లో ఏదో ఒక జాతీయ పార్టీ అండ ఉండేది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలహీనపడటం విపక్షాల ఐక్యతకు సవాలే. కేంద్రంలో బీజేపీకి ప్రజాదరణ చెక్కుచెదరలేదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సంపూర్ణ మెజారిటీతో మళ్లీ అధికారం చేపట్టడం ఖామయని కొన్ని విశ్వసనీయ సర్వేలు చెప్పేశాయి. ఎన్నికల నాటికి పరిస్థితి మారుతుందని ఎవరైనా భావిస్తే అదొక పగటికల మాత్రమేననీ అర్థమై పోతోంది. సంస్థాగత బలహీనతలతో కాంగ్రెస్‌కు చేవచచ్చింది. పార్టీ అస్థిత్వం ఎలా నిలుపుకోవాలో అర్థం కాకే రాహుల్ భారత్ జోడో అంటూ బయలు దేరారు. కానీ రాహుల్ సహా సందు దొరికితే ప్రధాన మంత్రి పీఠం మీద కూర్చుందామని మమతా బెనర్జీ, శరద్‌పవార్, నితీశ్‌కుమార్, కేజ్రీవాల్ చివరకు కేసీఆర్ కూడా ఆశపడుతున్నారు. ఇంతవరకు తప్పేమీకాదు. కానీ ఆ ప్రయత్నాలు ఎంత వరకూ సఫలీకృతం అవుతాయన్నదే ప్రశ్న. ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపే నాయకుడెవరనే ప్రశ్నకు సమాధానం లేదు. విపక్షాలు ఒక్కటైతే తప్ప బీజేపీని, మోదీని అడ్డుకోలేమని అర్థమైపోయినా, అందుకు తగ్గ ప్రణాళిక మాత్రం ఎవరి దగ్గరా లేదు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత, ఆంధప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగే, తాజాగా నితీశ్ కుమార్ అవే భ్రమల్లో ఉన్నారు.
రాహులే గుదిబండ
భారత్ జోడో యాత్ర ప్రతిపక్షాల ఐక్యతకు తోడ్పడుతుందని రాహుల్ ఆశ. ప్రజలను నేరుగా కలిసి, వారి కష్టాలు తెలుసుకోవడం, తన సందేశాన్ని అందచేయడమే యాత్ర లక్ష్యమని చెబుతున్నారు. విపక్ష ఐక్యత బాధ్యత కాంగ్రెస్ ఒక్కదానిదే కాదని, అన్ని పార్టీలకు ఉందని అంటున్నారు. అసలు రాహుల్ నాయకత్వాన్ని ప్రతిపక్షాలు ఒప్పు కుంటాయా? కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలే వద్దన్న రాహుల్ కూటమి బాధ్యతలు తీసుకుంటారా? అనుమానమే. రాహుల్ పరిపక్వతపై ఆ పార్టీ సీనియర్‌లకే నమ్మకం లేక దూరమైపోతున్నారు. మోదీ, బీజేపీ, ఆరెస్సెస్‌ల మీద అయన చేసే విమర్శల్లో వాస్తవాలు ఉండవు. కోటరీని నమ్ముకొని నిండా మునిగారు. అయినా రాహుల్ తీరులో మార్పేమీ లేదు. భారత్ జోడో యాత్రలో ఆయన ప్రసంగాలు ఇదే చెబుతున్నాయి. ఈ ప్రచారం ఓట్లు తెచ్చే మాటేమో కానీ, బీజేపీకి అస్త్రంగా మారి సెల్ఫ్‌గోల్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు ఆయన మీద ఆశలు పెట్టుకోవడం లేదు.
మమత విఫల యత్నాలు!
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికారం కోసం బీజేపీ గట్టిగా పోరాడుతున్నది పశ్చిమ బెంగాల్‌లోనే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అత్యధిక సీట్లు సాధించి తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నా యంగా నిలిచే సరికి సీఎం మమతా బెనర్జీ బెంబేలెత్తి పోయారు. బీజేపి నాయకులు, కార్యకర్తలపై దాడులు హత్యలు అక్కడ సర్వసాధారణమైపోయాయి. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు ఇతర నాయకుల అవినీతి వెలుగుచూడటంతో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి దాడులు మొదలు పెట్టడంతో దీదీకి భయం పట్టుకుంది. ఈ దశలో బీజేపిని రాష్ట్రంలో ఎదుర్కోవడం కన్నా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను కలుపుకొని పని చేయాలని మమత భావించారు. విపక్ష కూటమిలో అంతో ఇంతో బలమైన పార్టీ తృణమూలే కావడంతో ప్రధాని పదవీ దక్కించుకో వాలని మమత భావిస్తున్నారు. అయితే ఆమె ప్రయత్నాలు ఎండమావులయ్యాయి. ఆమె ఏకపక్ష నిర్ణయాలను విపక్షాలు అనుమానంగా చూస్తున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎవరితోనూ సంప్ర దించకుండా యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా నిర్ణయించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలోను అభిప్రాయ భేదాలు తేటతెల్లమయ్యాయి. మమత వలెనే కాంగ్రెస్ పార్టీ కూడా మార్గరెట్ ఆల్వాను ఏకపక్షంగా ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా నిలిపింది. తృణమూల్ తటస్థంగా ఉండిపోయింది. పైగా ఈ రెండు ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ విపక్ష కూటమికి మింగుడు పడలేదు. తాజాగా నితీశ్‌కుమార్, కేసీఆర్ చేస్తున్న ప్రయత్నా లకు మద్దతు పలుకుతున్నారు.
దేశానికి కేసీఆరే దిక్కా?
కొత్త బిచ్చగాడు పొద్దెరగడంటారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏకపక్ష, నియంతృత్వ ధోరణికి తోడు అవినీతి బయటపడుతోంది. కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం ద్వారా ఇక్కడ బీజేపీ బలపడుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు సాధించిన బీజేపీ, 2024లో ఇంతకు మూడు రెట్ల సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. దుబ్బాక, హూజూరాబాద్ ఉపఎన్నికల్లో, జీహెచ్‌ఎంసీలో విశ్వరూపం చూపించేసరికి కేసీఆర్‌లో ఆందోళన మొదలైంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను డీ కొట్టే పార్టీ బీజేపీ అని తేలిపోయింది. ఈ భయంతో కేసీఆర్ బీజేపీ హఠావ్, బీజేపీ ముక్త భారత్ అంటున్నారు. బీజేపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా జాతీయ పార్టీని పెడతానని ప్రకటించారు కేసీఆర్.రాష్ట్రంలో సమస్యలను వదిలేసి ఇతర రాష్ట్రాల పర్యటనలు చేపట్టారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, కష్టాలను పట్టించుకోకుండా వేరే రాష్ట్రాల రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. తాను ఏర్పాటు చేస్తున్న పార్టీ గుణాత్మక మార్పులు తెస్తుందని ప్రకటించారు. సొంత రాష్ట్రంలో తేలేని మార్పులు దేశవ్యాప్తంగా తెస్తారనే నమ్మకం ఏమిటని విమర్శకుల ప్రశ్న. కేసీఆర్ ఇప్పటి వరకూ పర్యటించిన రాష్ట్రాల్లో ఆయా నాయకుల నుంచి ఆశించినంత స్పందన లేదు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన బిహార్ ముఖ్యమంత్రితో చర్చించేందుకు పాట్న వెళ్లిన కేసీఆర్‌కు ఎదురైన అవమానాన్ని జాతీయ మీడియా చూపించింది. విలేకరుల సమావేశంలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగాలు, ప్రగల్భాలను చూసి నితీష్ విసిగిపోయారు. విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు అని విలేకరులు వేసిన ప్రశ్నను నితీశ్ కుమార్‌ను దాటవేసినా, కేసీఆర్ ఏదేదో చెప్పడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. నితీశ్ ప్రెస్‌మీట్ నుంచి అర్ధాంతరంగా లేచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే, కూర్చోమని కేసీఆర్ ఆయన్ని బ్రతిమి లాడటం దేశ ప్రజలకు చక్కని వినోదాన్ని పంచింది. 2024లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరుపై అభిప్రాయాన్ని చెప్పాలని కేసీఆర్‌ను మీడియా ప్రతినిధులు అడగ్గా.. దీనిపై స్పందించిన ఆయన ‘ఇది చెప్పడానికి నేను ఎవరు? నేను సమాధానం ఇస్తే ఇతర పక్షాలు అభ్యంతరం చెప్పొచ్చు. మీరెందుకు ఇంత హడావుడి చేస్తున్నారు?’ అని బదులు ఇచ్చారు. ఇది నితీశ్‌కుమార్‌ను ఇబ్బంది పెట్టిందని చెబుతున్నారు. కేసీఆర్ దేశానికి తానే దిక్కని చాటుకోవడం జాతీయ స్థాయి విపక్షాలకు నచ్చడం లేదు. నిజానికి కేసీఆర్ తెలంగాణలో తప్ప పొరుగు తెలుగు రాష్ట్రంలో కూడా ప్రభావం చూప లేరు. స్వరాష్ట్రంలో బీజేపీతో కష్టకాలం మొదలైంది.
కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారేమో, నితీశ్ కూడా దేశ పర్యటన మొదలుపెట్టారు. ఢిల్లీలో మకాం వేసి రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత శరద్‌పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఐఎన్‌ఎల్‌డీ అధినేత ఓపీ చౌతాలా, సమాజ్‌వాదీ అగ్రనేత ములాయంసింగ్ యాదవ్, ఆయన తనయుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య తదితరు లతో వరస భేటీలు నిర్వహించారు. బీజేపీకి వ్యతి రేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం అంటున్నారు నితీశ్. అయితే, 2024 ఎన్నికల్లో ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది తర్వాత చూస్తాం అంటున్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే తమది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అని ప్రకటించారు కూడా. ప్రధానమంత్రి పదవి కోసం తాపత్రయపడే ఆలోచన తనకు లేదని మరోసారి తేల్చిచెప్పారు. అంతా బాగానే ఉన్నా నితీశ్‌ను నమ్మడం ఎలా అంటున్నారు ఆయన పూర్వ రాజకీయ సలహాదారు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఇంతకాలం ముఖ్య మంత్రిగా ఉండి నితీష్ బిహార్‌కు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారాయన. అంతేకాదు, ఢిల్లీ వెళ్లి నలుగురినీ కలిస్తే ప్రధాని పదవి రాదని కూడా పీకే తేల్చి చెప్పారు.
శరద్ పవార్ ముందుకొస్తారా?
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే శక్తి అంతో ఇంతో ఉందంటే అది ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌కు మాత్రమే. గతంలో మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల భేటీకి 21 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. తమ కూటమికి అధినేతగా అందరూ సూచించిన ఒకేఒక్క పేరు ఆయనదే. కానీ ప్రస్తుతం పవార్ అనారోగ్య సమస్యలు, వయో భారంతో బాధ పడుతున్నారు. విపక్షాల ఐక్యతలో ఆయన మార్గదర్శకత్వం చేయగలరేమో కానీ నాయకత్వం వహించే స్థితిలో లేరు. మరోవైపు ఆయన పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి పవార్‌ను ఎన్ను కున్నారు. ఈ సమావేశాల వేదిక నుంచి మాజీ సీఎం, పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ నిష్క్రమించడం పలు అనుమానాలకు తావిచ్చింది.
కేజ్రీవాల్‌ది మరోదారి!
ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెది ఇంకోదారి అన్నట్లుంది ఆమ్ ఆద్మీ పార్టీ తీరు. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉచ్చిన ఊపుతో దేశమంతా సొంతంగా విస్తరించాలని భావిస్తున్నా రాయన. త్వరలో గుజరాత్‌లో ఎన్నికలు జరగ నున్నందున అక్కడ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా పునాదులు కోల్పోయినందున, ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేయవచ్చని ఆశపడుతున్నారు. ఢిల్లీ తరహాలోనే అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తున్నారు. ఆయన రాబట్టుకునేది కాంగ్రెస్ ఓటు బ్యాంకునే. గుజరాత్‌లో కేజ్రీవాల్ ప్రయత్నాలు బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తాయంటున్నారు. ఆప్ నిజాయితీకి మారుపేరని కేజ్రీవాల్ గొప్పలకు పోతారు. కానీ ఢిల్లీలో అబ్కారీ అవినీతి, లోఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవినీతి బయట పడేసరికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను దర్యాప్తు సంస్థలు ప్రశ్నించడం జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీలోనే ఉంటూ డబ్బులు తీసుకోవాలని, ఎన్నికల వేళ ఆప్‌కి పని చేయాలని సూరత్‌లో ఏర్పాటుచేసిన ఓ సభలో పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ గుంటనక్క స్వభావంపై ఆయన రాజకీయ గురువు అన్నాహజారే తీవ్ర విమర్శలు చేయడాన్ని గమనించాలి.
కాంగ్రెస్‌తో కుస్తీనా? దోస్తీనా?
జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలా? తృతీయ పక్షంగా పోరాడాలా? అనే విషయంలో విపక్షాల్లో ఏకాభిప్రాయం లేదు. ఈ పార్టీలన్నీ కాంగ్రెస్‌తో సంబంధాల విషయంలో దోబూచులాడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఉబలాట పడుతున్న వామపక్షాలు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌తో దోస్తీ, కేరళ, బెంగాల్, త్రిపురల్లో మాత్రం కుస్తీ అంటాయి. బీజేపీకి ముక్త్ భారత్ పిలుపు ఇచ్చిన కేసీఆర్ కూడా ఇలాంటి ఇరకాట పరిస్థితుల్లో ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే, రాష్ట్రంలో ప్రమాదం పొంచి ఉంది. బీజేపీ తెలంగాణలో బలమైన పక్షంగా ఆవిర్భవించి కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌ను కలుపుకొని పనిచేయడం కాంగ్రెస్‌కూ నష్టమే. టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లు అన్నీ బీజేపీకి పడతాయి. కాంగ్రెస్ వ్యతిరేకులు టీఆర్‌ఎస్ బదులు బీజేపీకే ఓటేస్తారు. ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఇటీవల బీజేపీ పుంజుకోవడం డీఎంకేకి మింగుడు పడటంలేదు. జయలలిత మరణం తర్వాత ఉనికిని కోల్పోతున్న అన్నా డీఎంకే ఓటు బ్యాంకు క్రమంగా బీజేపీకి మరలే అవకాశం ఉంది. సీఎం స్టాలిన్ హిందూ వ్యతిరేక ద్రవిడ రాజకీయాలు మింగుడు పడని వర్గాలన్నీ బీజేపీకి దగ్గరవుతున్నాయి. దీంతో స్టాలిన్ కాంగ్రెస్‌తో పొత్తుకే మొగ్గుతున్నారు. ఒడిశాలో బీజేపీతో నవీన్ పట్నాయక్ సఖ్యతతో ఉన్నందున అక్కడ థర్డ్ ఫ్రంట్ రాజకీయాలు పని చేయవు. కర్ణా టకలో కాస్త బలంగా ఉన్న దేవెగౌడ, కుమారస్వామిల పార్టీ పూర్తిగా సబ్ రీజియన్ పార్టీగా మారింది.
జాతీయ రాజకీయాలను విశ్లేషిస్తే దేశ ప్రజలంతా బీజేపీ పాలనపై సంతృప్తితో ఉన్నారని అన్ని సర్వేలూ చెబుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క అవినీతి సంఘటన వెలుగుచూడలేదు. భారత్‌ను ప్రపంచ శక్తిగా, బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నాలను ప్రజలు స్వాగతిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడ్డ ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజీల్ ధరలతో దేశ ప్రజలు తాత్కాలికంగా ఇబ్బంది పడ్డా, విపక్షాల చేతికి అధికారం వస్తే దేశ భవిష్యత్తుకే ప్రమాదం. ఈ పరిణామాలను గమనిస్తే బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమి నిలబడే అవకాశం కనిపించడంలేదు.