బ్రిటిష్‌ ‌సింహాసనంతో ఆమె అనుబంధం ఏడు దశాబ్దాలు. ఆమె రెండో ఎలిజబెత్‌ (ఏ‌ప్రిల్‌ 21,1926-‌సెప్టెంబర్‌ 8,2022). ‌రవి అస్తమించని అన్న కీర్తి ఉన్న బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం ఒక్కొక్కటిగా వలస రాజ్యాలను వదిలిన తరువాత ఆమె రాణిగా పట్టాభిషిక్తురాలయ్యారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధానంతర ఘట్టాలకు ఆమె ప్రత్యక్ష సాక్షి. రెండవ ప్రపంచ యుద్ధం ఇంగ్లండ్‌ను సాధారణ దేశంగా మార్చివేసింది. అమెరికా, రష్యా అగ్ర రాజ్యాలయ్యాయి. ప్రచ్ఛన్నయుద్ధంలో ప్రపంచం మునిగిపోయింది. బ్రిటన్‌ అమెరికా వెనక నడవవలసి వచ్చింది. 1950 దశకం నుంచి 1990 వరకు సాగిన ఆ ప్రచ్ఛన్నయుద్ధానికి ఎలిజబెత్‌ ‌ప్రత్యక్ష సాక్షి. అదే ఆమె ఘనత.

ఇంగ్లండ్‌ ‌రాజధాని లండన్‌లో పుట్టిన ఎలిజబెత్‌ ‌పూర్తి పేరు ఎలిజబెత్‌ అలెగ్జాండ్రా మేరీ. ఆరో జార్జి, రాణి ఎలిజబెత్‌ల తొలి సంతానం. రెండో ప్రపంచ యుద్ధంలో అంబులెన్స్ ‌డ్రైవర్‌గా పనిచేశారు. రెండు ప్రపంచ యుద్ధాలలో కూడా ఆనాటి రాచ కుటుంబీకులు, కులీనులు కూడా సైనికులకు పరోక్షంగా సేవలు అందించారు. నవంబర్‌ 20,1947‌న గ్రీస్‌-‌డెన్మార్క్ ‌రాకుమారుడు ఫిలిప్‌తో ఆమె వివాహం జరిగింది. 6 ఫిబ్రవరి, 1952న ఆమె బ్రిటిష్‌ ‌రాణిగా పదవిని అలంకరించారు. వారి పెద్ద కుమారుడు చార్లెస్‌ ఇప్పుడు మూడవ జార్జి పేరుతో పట్టాభిషిక్తులయ్యారు. రాజు లేదా రాణి మరణించిన 24 గంటలలోనే ఈ పక్రియ పూర్తి చేయడం అక్కడి సంప్రదాయం. వేసవి విరామం కోసం స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ ‌కోటకు వచ్చిన రాణి అక్కడే తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌ ‌కొత్త ప్రధాని లిజ్‌ ‌ట్రస్‌ను నియమించిన కొద్ది గంటలలోనే ఆమె మరణించారు. రాణి భర్త ఫిలిప్‌ ‌కొద్దికాలం క్రితమే కన్నుమూశారు.

భారత్‌తో ఎలిజబెత్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని చెబుతారు. దాదాపు రెండు వందల సంవత్సరాలు తాము పాలించిన భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాతనే ఎలిజబెత్‌ ‌రాణి అయ్యారు. 1961,1983,1997 సంవత్సరాలలో ఎలిజబెత్‌ ‌భారత్‌లో పర్యటించారు. అయితే భారత 50వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఆమె భర్తతో సహా వచ్చినప్పుడు జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించి, స్మారక స్తూపం ఎదుట మృతులకు నివాళి ఘటించారు. ఆ దుర్ఘటన అత్యంత బాధాకరమని మాత్రం వ్యాఖ్యానించారు.

రాచకుటుంబంపై ఎన్నో వివాదాలను ఆమె ఎదుర్కొన్నారు. ఆ వివాదాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎలిజబెత్‌ ‌చెల్లెలు మొదలు కుమారులు, కోడళ్లు అంతా వివాదాలలో ఉన్నవారే. ఆఖరికి ఎలిజబెత్‌ ‌మూలాల మీద కూడా ప్రశ్నలు వచ్చాయి. అలాగే కొత్త రాజు మూడో జార్జి రహస్యంగా ఇస్లాం స్వీకరించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఎలిజబెత్‌ ‌మరణం తరువాత అయినా భారత్‌ ‌నుంచి దోచుకు వెళ్లిన సొత్తును, అపురూప కళాఖండాలను తిరిగి అప్పగించాలన్న నినాదం ఊపందుకుంటుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. కోహినూర్‌ ‌వజ్రం భారత్‌లో అది కూడా మన కృష్ణాతీరంలో దొరికిన సంగతి తెలిసిందే. దీనినే బ్రిటిష్‌ ‌రాణి కిరీటంలో పొదిగారు. ఇప్పుడు ఈ కిరీటం చార్లెస్‌ ‌భార్య కొమిల్లా శిరస్సుకు చేరుతుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువులలో ఒకటి కోహినూర్‌ను భారత్‌కు తిరిగి అప్పగించడానికి ఎలాంటి చట్టబద్ధమైన నిబంధనలు లేకపోయినా, భారత ప్రభుత్వం దానిని తిరిగి దేశానికి తేవాలన్న తలంపులో ఉంది. మహారాజా దులీప్‌ ‌సింగ్‌ ఈ ‌వజ్రాన్ని ఇంగ్లండ్‌కు ఇచ్చాడు. కాంగ్రెస్‌ ‌లోక్‌సభ సభ్యుడు శశి థరూర్‌ ‌కూడా తన పుస్తకం యాన్‌ ఇరా ఆఫ్‌ ‌డార్క్‌నెస్‌లో బ్రిటన్‌ ‌కొన్ని చర్యలు తీసుకోవాలని, అందులో ఒకటి దోచుకున్న దానిని తిరిగి ఇవ్వడమని అభిప్రాయపడ్డారు. రాణికి ఈ వజ్రాన్ని దులీప్‌ ‌సింగ్‌ ‌బాల్యంలో ఇచ్చిన సంగతిని కూడా గుర్తు చేశారు.

కోహినూర్‌ ‌వజ్రం గుంటూరు దగ్గర ఖనిజ నిక్షేపాలను తవ్వుతుండగా బయటపడింది. ఇది కాకతీయుల కాలంలో జరిగింది. 1310లో కాకతీయులపై దాడి తరువాత అల్లా ఉద్దీన్‌ ‌ఖిల్జీ ఆ వజ్రాన్ని తన సొంతం చేసుకున్నాడని అంటారు. 1526 నాటి తొలి పానిపట్టు యుద్ధం తరువాత ఇది బాబర్‌ ‌వశమైంది. ఆయన జీవిత చరిత్ర బాబర్‌నామాలో ఈ వజ్రం ప్రస్తావన కూడా ఉంది. తరువాత షాజహాన్‌ ఈ ‌వజ్రాన్ని నెమలి సింహాసనంలో పొదిగించాడు. ఇది ఎర్రకోటలోని దివాన్‌ ఇ ‌ఖాస్‌లో ఉండేది. 1732లో నాదిర్షా దండయాత్రకు వచ్చినప్పుడు సంపదతో పాటు ఈ వజ్రాన్ని కూడా పట్టుకెళ్లాడు. నాదిర్షాను అతడి అంగ రక్షకులే హత్య చేసిన తరువాత కోహినూర్‌ అహ్మద్‌ ‌షా అబ్దాలి దురానీ వశమైంది. 1813లో రంజిత్‌ ‌సింగ్‌ ‌చేతికి చిక్కింది. పంజాబ్‌రాజ్యాన్ని ఈస్టిండియా కంపెనీ ఆక్రమించిన తరువాత  ఈ వజ్రం దులీప్‌ ‌సింగ్‌  ‌చేజారింది. ఆఖరికి 1849లో విక్టోరియా మహారాణికి స్వాధీనమైంది. 1851లో ఇంగ్లండ్‌లోని హైడ్‌పార్క్‌లో ఏర్పాటయిన ఒక ప్రదర్శనలో ఈ వజ్రాన్ని పెట్టినప్పుడు జనం వెల్లువెత్తారు.

About Author

By editor

Twitter
YOUTUBE