‌నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలు

– డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ, 7416252587

సమాజహితమే ధ్యేయంగా, స్వాతంత్య్రమే జీవిత లక్ష్యంగా, పోరాటాలే ఊపిరిగా భావించి, పదవులను, ఆస్తులను తృణప్రాయంగా వదులుకున్న మహనీయుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ దార్శనికుడు, బహుజన నేత ఆచార్య కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ. పద్మశాలీ సామాజిక వర్గంలో పుట్టి మహాత్మా గాంధీ తరువాత ‘బాపూజీ’గా పిలిపించుకుని జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని సొంతం చేసుకున్నారు. దళిత, బహుజన, పీడిత వర్గాల పక్షపాతిగా వారి అభివృద్ది కోసం జీవితాన్ని ధారపోశారు. ఆయన పోరాటాలు, త్యాగాలు అందరికి తెలిసినవే అయినప్పటికీ జాతీయవాదిగా ఆయనలో మరో కోణం దాగివుంది. సంప్రదాయ కులంలో జన్మించిన ఆయన ఉపనయన సంస్కారంతో నిత్య వైదిక కర్మలు నిర్వర్తించేవారు. పూర్తి శాకాహారిగా జీవించారు. నిజాం అరాచకాలపైన పోరాడిన విధానం యావత్‌ ‌హిందూ సమాజానికి ఆదర్శప్రాయం.

పూర్వ ఆదిలాబాద్‌, ‌కొమురంభీం అసిఫాబాద్‌ ‌జిల్లాలోని వాంకిడి గ్రామంలో కొండా అమ్మక్క, పోశెట్టి దంపతులకు 27 సెప్టెంబర్‌ 1915‌న జన్మించారు. నైజాం పాలకుల దాష్టీకాలతో హైదరాబాద్‌ ‌సంస్థానంలోని హిందువులు కోలుకోలేని స్థాయిలో అణచివేతకు, దాడుల బారిన పడడాన్ని చూసి కలత చెందారు. నిజాం నవాబుల దాష్టీకాలు, రజాకార్ల అరాచకాలతో ప్రజల మనసులలో బడబాగ్ని రగులుతున్నప్పటికి ఎదిరించే దైర్యం లేకపోయింది. యావత్‌ ‌హిందూ సమాజాన్ని ఇస్లాం మతమార్పిడి చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగు తున్నాయి. చివరి నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌, ‌భారత స్వాతంత్య్ర ఉద్యమ ప్రభావం హైదరాబాద్‌ ‌సంస్థానంపై పడకుండా ప్రయత్నాలు సాగించారు. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలన్న కాంక్షతో బహద్దూర్‌ ‌యార్‌ ‌జంగ్‌ ‌నాయకత్వంలో ‘అంజుమన్‌ ఇత్తేహాదుల్‌ ‌ముస్లిమీన్‌’ ‌సంస్థను స్థాపించారు. హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లాం రాజ్యంగా ప్రకటిస్తూ ‘అసఫియా జెండ’ ఎగురవేసేవారు. ‘ఆజాద్‌ ‌జిందాబాద్‌ – ‌షాహే ఉస్మాన్‌ ‌జిందాబాద్‌’ అని నినాదాలు చేసేవారు. కాసీం రజ్వీ ఈ సంస్థలో చేరిన తరువాత రజాకార్లను తయారుచేశారు. వారి ఆగడాలు పరాకాష్ఠకు చేరాయి. హిందువుల ఇళ్లు, దుకాణాలు, దేవాలయాలపై దాడులకు పాల్పడేవారు. మహిళలపై అత్యాచారాలు, వస్త్రాలు విప్పించి బతుకమ్మ ఆడించిన దాఖలాలున్నాయి. ఇవన్నీ అప్పటి వివిధ హిందూసంస్థలు, నాయకుల మాదిరిగా లక్ష్మణ్‌ ‌బాపూజీనీ ఆలోచనలో పడేశాయి. వాటిని ఎదుర్కోవాలనే మొండితనం ఆవహించింది.

 ఆ నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అనేక హిందూ సంస్థలు చేస్తున్న కృషిలో పాలు పంచుకున్నారు. ఆర్యసమాజ్‌, ‌పౌరహక్కుల సంఘం, హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ‌విరివిగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టగా కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ ఆయా కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. అటు స్వాతంత్య్ర ఉద్యమంలో, ఇటు ఆర్యసమాజ్‌ ‌కార్య కలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రముఖ జాతీయ వాదిగా గుర్తింపుపొందారు. ‘ఓం కా ఝండా.. హమారా ఓం కా ఝండా..సారా దునియామే లహరాయేంగే ఓంకాఝండా.. హమారా ఓంకా ఝండా’ అని ఆర్యసమాజీయులు ఓం ఝండానీ, కాషాయ వర్ణాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పాడిన పాటలు ఆయనకు స్ఫూర్తినిచ్చాయి.

1931లో మహాత్మా గాంధీ చాందా(చంద్రపూర్‌) ‌పర్యటించిన సందర్భంగా నిజాం ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులను ధిక్కరించి రహస్యంగా అక్కడికి వెళ్లారు. అలా మొదలైన లక్ష్మణ్‌ ‘‌బాపూజీ’ ధిక్కార స్వరం గాంధీ మార్గంలో ఉద్యమాలవైపు నడిపించింది. కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ ఆయా కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు.

1938లో జాతీయ ఉద్యమంలో తొలిసారి అరెస్ట్ అయ్యారు. క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో కూడా అరెస్టయిన ఆయన జైలు మారుమ్రోగేలా ‘వందేమాతర’ గీతాలాపన చేశారు. 1939లో హైదరాబాద్‌ ‌నుండి రాజురాఘడ్‌ ‌వరకు 500 కిలోమీటర్లు సాహసోపేత ప్రయాణం చేశారు. అదే సంవత్సరంలో నిజాం రాష్ట్ర పద్మశాలీ సంఘంలో చేరి అనతి కాలంలోనే జాతీయ స్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆ మరుసటి ఏడాది (1940) ఆంధ్ర హాసభలో చేరి రామానంద తీర్థ, జనార్థన్‌ ‌రాయ్‌ ‌దేశాయ్‌తో కలసి ఉద్యమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేశారు. జాతీయ ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ వస్త్రాల ప్రచారం కోసం స్వయంగా వారే ఖద్దరు వస్త్రాలను అమ్ముతూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎం.ఎన్‌.‌రాయ్‌ ‌డెహ్రాడూన్‌లో నిర్వహించిన రాజకీయ శిబిరానికి హాజరయ్యారు.

జాతీయోద్యమంలో భాగంగా షోలాపూర్‌లో సుభాష్‌ ‌చంద్రబోస్‌ను రహస్యంగా కలసినప్పుడు హైదరాబాద్‌ ‌సంస్థానంలో జరుగుతున్న అన్యాయా లను, అరాచకాలను, నిజాంకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలను వివరించగా, ‘శాంతియుత పద్ధతుల ద్వారా నిజాం తలవంచలేరు’ అని సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో ప్రేరేపితులైన ఆయన, హిందూ ఉద్యమాలకు గాంధీవాదుల మద్దతు, సహకారం లభించడం లేదన్న సత్యాన్ని గ్రహించారు.

ఒకవైపు న్యాయవాది వృత్తి కొనసాగిస్తూనే ‘దంగల్‌’ ‌కార్యక్రమాల్ని నిర్వహించారు. యువకులకు రహస్యంగా కర్రసాము వంటి యుద్ధ విద్యలు నేర్పేవారు. జాతీయవాద భావజాలాన్ని ప్రచారం చేసేందుకు సమావేశాలు, సదస్సులు ఏర్పాటు చేశారు. తాత్యాజీ బాకే, అంబదాస్‌ ‌రావుల సహకారంతో యువజన సంఘాన్ని స్థాపించారు. అతితక్కువ అత్యధిక ఉద్యమ సంఘాలను స్థాపించి, ఉద్యమకారులను ప్రోత్సహించడం, 43 వక్తృత్వ సంస్థల ఏర్పాటు వంటి కార్యక్రమాలు నిజాం పాలకుల వెన్నులో వణుకు పుట్టించేలా చేశాయి.

ఆర్యసమాజ్‌తో కలిసి హవన్‌కుండ్‌ ఆరాధన విధానాన్ని ప్రతీ గడపకు చేరేలా ప్రయత్నం చేశారు. అప్పటికింకా ఆయనకు పెళ్లి కాలేదు. దానికి తోడు ఆయన తండ్రి దగ్గర కూడా లేకపోవడంతో విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొనే అవకాశం లభించింది. నిజాంకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు హవన్‌ ‌కుండ్‌ ‌చేస్తున్న కార్యక్రమాలను గ్రహించిన నవాబు వాటిపై నిషేధం విధించారు.

జాతీయోద్యమం, హైదరాబాద్‌ ‌విమోచనోద్య మాల్లో పాల్గొన్న పార్టీలు సంస్థలు, సంఘాలు, నాయకులు, కార్యకర్తలు అనేక కోర్టు కేసులను ఎదుర్కొన్నప్పుడు వాటిని బాపూజీ సొంత ఖర్చులతో వాదించేవారు. వెనుకబడిన కులాల వారికి ఇచ్చిన ‘ఇనాం భూములను’ దేశ్‌ముఖ్‌, ‌దేశ్‌పాండే, జమిందారు కుటుంబీకులు దౌర్జన్యంగా ఆక్రమించగా బాపూజీ యువజన సంఘాల వారితో కలిసి పోరాడి భూములను తిరిగి అప్పగించారు. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని అమలు పరచడంలో నిజాం ప్రభుత్వం విఫలంకాగా, దీనిపై ఉద్యమం చేపట్టారు. జంట నగరాలలో అనేక బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి, నిరసన కార్యక్రమాలు చేపట్టి, నిజాంపై ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమయ్యారు.

అప్పటికే లక్ష్మణ్‌ ‌బాపూజీపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. 13 అరెస్ట్ ‌వారెంట్‌లు జారీ అయ్యాయి. అయినా పౌరహక్కుల సంరక్షణ కోసం పోరాడుతూ ‘పహాడీ’ అని మారుపేరుతో కరపత్రాలు, ప్రకటనలు విడుదల చేశారు. సెంట్రల్‌ ‌ప్రావిన్స్‌లో రేడియో స్టేషన్‌ ‌నెలకొల్పే ప్రయత్నం చేశారు. అది కుదరకపోవడంతో సిద్ధవనహళ్లి కృష్ణ శర్మ సహ కారంతో మైసూరులో స్వతంత్ర రేడియో కేంద్రాన్ని ఏర్పాటుచేసి నిజాం ప్రభుత్వ అరాచకాలను, కుయుక్తులను ఎండగట్టారు. అప్పట్లో ఇదొక సంచలనంగా నిలిచింది.

బసవరా, జ్ఞానకుమారి హెడా వంటి ఉద్యమ కారుల సహకారంతో సుల్తాన్‌బజార్‌ ‌వద్దగల తపాలా కార్యాలయంపైనా, బ్రిటీష్‌ ‌రెసిడెన్సి పైన జాతీయ పతాకాన్ని ఎగరువేశారు. ఉద్యమాలకు కేంద్రంగా షోలాపూర్‌లో వడ్డేపల్లి విఠోబా అనే పద్మశాలీ నాయకుడి గృహంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉద్యమ సంబంధిత అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేవారు.

 చేనేతోద్యమ నేతగా గుర్తింపుపొందిన బాపూజీ 1945 లో నిజాం రాష్ట్ర పద్మశాలీ మహాసభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయినా ఆ సామాజిక వర్గ ప్రయోజనాలకే పరిమిత కాలేదు. 1947లో మంచిర్యాలలో ‘కిసాన్‌ ‌మహాసభ’ ఏర్పాటుచేసి, దానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, జయ ప్రకాశ్‌ ‌నారాయణ వంటి నాయకులను ఆహ్వానించగా, నిజాం ప్రభుత్వం వారి రాకను అడ్డుకుంది. హైదరాబాదు విమోచనోద్యమాన్ని ఉధృతం చేయాలనే సంకల్పంతో బొంబాయి వెళ్లి నారాయణరావ్‌ ‌పవార్‌ ‌వంటి ఉద్యమకారులతో కలసి నిజాంపై బాంబుదాడికి ప్రణాళిక సిద్ధం చేశారు. షోలాపూర్‌లో వీరికి రహస్య నివాసాన్ని ఏర్పాటు చేశారు. వారికి కావలసిన ఆయుధాలు- తుపాకులు, బాంబులు అందించారు. బాంబులు విసరడం కోసం సాధన చేసేవారు. బాంబుదాడి యత్నాలు విఫలమవడంతో నారాయణరావ్‌ ‌పవార్‌ ‌బృందం రజాకార్ల చేతికి చిక్కింది.

హైదరాబాద్‌ ‌సంస్థానం

హైదరాబాద్‌ ‌సంస్థాన విలీనానంతరం ఏర్పడిన ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో తెలంగాణ ప్రజలపై చూపు తున్న అసమానతలు, అణచివేత, ఆధిపత్య ధోరణి తదితర పరిణామాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పురుడు పోసుకుంది.

తొలి, మలిదశ ఉద్య మాలలో బాపూజీ ప్రధానపాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం కలసాకారం కాకుండానే వారం రోజులలో జన్మదినం జరుపుకోవలసి ఉండగా 2012 సెప్టెంబర్‌ 21‌వ తేదీన కన్నుమూశారు.

About Author

By editor

Twitter
YOUTUBE