– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్
పౌరరక్షణ అప్పుడప్పుడు మనకు వినిపించే మాట. ఆడపిల్లలు- ముఖ్యంగా విద్యార్థినులు తమను తాము కాపాడుకోవాలంటే ఆయుధం, సాధనం అదే. ఆపద సమయాల్లో ఇతరులను ఎలా రక్షిస్తారో వెల్లడిస్తూ; ఒకవేళ అవే పరిస్థితులు తమకే ఎదురైతే ఆత్మరక్షణ ఏ విధంగా చేసుకోవాలన్నదే సారాంశం. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యాలయాల్లో ఆ విధమైన శిక్షణ కొంతకాలం సాగింది. పలు కారణాల వల్ల అది మందగించింది. నానా విధాల పరిణామాల వల్ల నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అమ్మాయిలకు రక్షణ పూర్తిగా కరవైపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రక్షణ విద్య ప్రాధాన్యం విస్తరించాలనడంలో ఆశ్చర్యం ఏముంది? ఆత్మరక్షణ ఒక హక్కు. వ్యక్తులైనా, వారి ఆస్తులైనా ప్రమాదంలో పడితే ప్రభుత్వ అధికార యంత్రాంగం నుంచి తక్షణ సాయం అందే అవకాశమే లేకుంటే ఏం చేయాలి? బాధితురాలు తన ఆత్మరక్షణ హక్కును వాడుకోవచ్చు. భారత పరమోన్నత న్యాయస్థానం ఈ అంశాన్ని ఏనాడో ప్రస్ఫుటం చేసింది. ఎటువంటి స్థితిగతుల్లో స్వయం రక్షణ హక్కును వినియోగించ వచ్చో శిక్షాస్మృతి తేల్చి చెప్పిందని పేర్కొంది. బాలికలు, విద్యార్థినులు, ఉద్యోగినులు, గృహిణులు తమ భద్రతను తాము చూసుకునే పక్రియను నేర్పిస్తున్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోన్నైతే ప్రత్యేక శిక్షణ విభాగాలను రూపొందించారు. అత్యవసర వేళల్లో తమ పరిరక్షణకు వీలుగా ఫోన్ నంబర్లను దగ్గర పెట్టుకోవాలని పోలీసు ఉన్నతాధి కారులు, ప్రత్యేకించి షీ టీమ్ బాధ్యులు సూచిస్తూ ఉన్నారు. ఇదంతా ఓ ఉద్యమంలా కొంతకాలం సాగింది కానీ, అనంతరం వేగం తగ్గింది. దీనికి కారణాలేమిటి? సమస్యను పరిష్కరించడానికి సమాజంలో ఎవరెవరు ఏ మేర స్పందించాల్సి ఉంటుందన్నదే ప్రస్తుత చర్చనీయం. పూర్వాపరాల్లోకి వెళితే..
——————————————————–
ఏ పత్రిక తిరగేసినా, ఏ ఛానెల్ చూసినా, సమాచార ప్రసార ప్రచార మాధ్యమాల్లో అన్నిటా అంతటా ఎక్కువగా కనిపించేవి వనితలపై అకృత్యాల వార్తలే. వారి పట్ల వేధింపులు, హింస, లైంగిక దాడులు, అఘాయిత్యాలు మరెన్నో. వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడం, వివరాలు వెల్లడిం చడం రోజువారీగా మారిన దారుణ పరిస్థితులే ఎటు చూసినా కనిపిస్తున్నాయి. విద్యా సంస్థల వెలుపల, ఉద్యోగ ప్రదేశాల్లో చోటుచేసుకుంటున్న ఇలాంటి సంఘటనలు దిగజారిన మానవతా విలువలకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. అటువంటి నేరాలకు శిక్షలు లేవా? ఉండవా? అంటే ఎందుకు ఉండవు! స్త్రీని ఏ విధంగా హింసించినా శిక్షార్హమే అని భారత శిక్షాస్మృతిలోని 354వ సెక్షన్ అంటోంది. దురుద్దేశంతో ప్రవర్తించినా, వారిని కించపరిచేలా ఫొటోలు/వీడియోలు తీసినా కఠిన శిక్ష తప్పదం టోంది. అవమానకరంగా మాట్లాడినా, అసభ్య సైగలు చేసినా దండన ఉండి తీరుతుందంటుంది 509వ సెక్షన్. నడుస్తూ వెళ్తున్న అమ్మాయిని వెంబడించినా, బస్టాప్ వంటి చోట్ల అనుచితంగా ప్రవర్తించినా, ఒంటరిగా ఉన్న ఆడపిల్లతో అనాగ రికంగా ప్రవర్తించినా చర్యలు తథ్యమని 294వ సెక్షన్ చాటి చెబుతోంది. ఇబ్బంది పెట్టేవాళ్ళకు కారాగార శిక్ష లేదా జరిమానా తప్పదంటోంది. ఇష్టానుసారం అనుకరించినా, హేళనచేసినా, అవమానపరిచి బాధించినా చట్టం ఊరుకోదు. గరిష్ఠంగా ఐదేళ్ళపాటు జైలు శిక్ష తప్పదంతే! ఫొటోల మార్పిడి వంటి అకృత్యాలకు పాల్పడిన వాళ్లకు, దుష్ప్రచారాలు కొనసాగించే వారికి కటకటాలూ తప్పవు. దౌర్జన్యాలకు, బలప్రయోగాలకు అత్యధి కంగా ఏడు సంవత్సరాల శిక్ష తథ్యం. సెక్షన్ 354 (అనుబంధ) ప్రకారం కఠినంగా విధింపు ఉంటుంది. చట్టం ఇంత వివరంగా ఉన్నా నేరాలు ఎందుకు తగ్గడం లేదంటే..భయమూ, భీతీ లేకపోవడమే! సకాలంలో శిక్షలు పడితే, సంబంధిత అధికారుల స్పందన తక్షణమే లభించి నేరాలకు అడ్డుకట్టంటూ ఉంటే ఇక కావాల్సిందేముంది?
యుద్ధ కళలు నేర్వాల్సిందే
ఆకతాయిలు వెంటపడితే, ప్రయాణిస్తున్న అమ్మాయిలతో వాహనచోదకులు అసభ్యంగా ప్రవర్తించినా, దారి మళ్లించి అత్యాచారాలకు తెగబడినా పని పడతానంటోంది ‘దిశ’. పని స్థలాల్లో వనితలు ఎటువంటి దుండగుల బారిన పడకుండా చూస్తానని చెబుతోందీ యాప్. పరిపూర్ణ అవగాహన కలిగిస్తూ ఆ యాప్‌ను ఆడపిల్లల ఫోన్లకు అనుసంధా నించి పేరు తెచ్చుకున్నారు ఆంధప్రదేశ్ పోలీసులు. మహిళలు ఒకవేళ ఇబ్బందులు ఎదుర్కొంటే, బాధితుల కుటుంబ సభ్యులు, మిత్రులకూ సమాచారం వెంటనే చేరేలా ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ మహిళా రక్షణకు దోహదపడుతున్నాయి.
తెలంగాణ మహిళా భద్రతా విభాగం తనవంతు కృషితో అండదండలందిస్తోంది. జనసందోహం ఉన్న ప్రాంతాల్లో, రద్దీ ప్రదేశాల్లో, పండుగల సందడి వేళల్లో, మార్కెట్ స్థలాల్లో పోకిరీల భరతం పట్టేందుకు షీటీమ్స్ రంగంలోకి దిగిన సందర్భాలెన్నో. సాంకేతి కత వినియోగం, నేరాల నియంత్రణ రీతులు, కట్టడి చర్యలతో ముందడుగు వేస్తూ వస్తున్నాయి. పోలీసు, న్యాయవ్యవస్థలను కలిపి ఉంచే విధానం కూడా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో పైలట్ ప్రాజెక్టులా అమలైంది. నిఘా నేత్రాల (సీసీటీవి కెమెరాలు)పరంగానూ దూసుకెళ్తున్నట్లు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి, డెవలప్‌మెంట్ నివేదిక తెలిపింది. వీటన్నింటికీ తోడు, ఎవరికివారే రక్షించుకునే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు, సేవాసంస్థలు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తు న్నాయి. ఆత్మరక్షణ కోసమే కరాటే వంటి యుద్ధవిద్యలు నేర్చుకోవాలని ఉత్సాహ పరుస్తున్నాయి. మార్షల్ ఆర్టస్ విస్తృతికి ఎంత అవకాశం కలిగిస్తే అంత త్వరగా నేరాలు అదుపులోకి వస్తాయి. ప్రతి ఆడపిల్లకీ ఆత్మరక్షణ శిక్షణ అవసరమని రెండేళ్ల క్రితం ఒక ఉన్నత పాఠశాల ఆవరణలోని సదస్సులో తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. అక్కడి బాలికలు పాల్గొన్న ప్రదర్శనను తిలకించిన ఆమె.. ఆత్మరక్షణ కళలు పాఠ్యాంశంలో భాగంగా మారాలనడం పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనం. ప్రతికూల స్థితులు ఎదురైనప్పుడు ఏ వనిత అయినా మరింత తెలివిగా మెలగాలి. తాను విపత్కర పరిస్థితిలో ఉన్నాననే సమాచారాన్ని బయటికి చేరవేయగలగాలి. ఈ లోగా తన రక్షణ విద్యను వినియోగిస్తే, సంఘవిద్రోహుల ఆటకట్టినట్లవుతుంది. గవర్నర్ ఇచ్చిన సందేశం, చేసిన సూచన ఇదే.
నెరవేరిన ‘అభి’లాష
అభిషేక్ పేరు విన్నారా మీరు? ఆతడిది కర్ణాటక. ఒకరోజు మిత్రులతో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లాడు. అది దసరా పండగ సెలవుల కాలం. ఓ ఉత్సవానికి వెళ్లినప్పుడు, సరిగ్గా అక్కడే కొందరు అమ్మాయిల్ని పోకిరీలు వేధించడం చూశాడు. యుద్ధ విద్యలు నేర్చినవాడు కాబట్టి, వెంటనే అడ్డుపడి వాళ్లను కాపాడి ఇళ్లకు చేర్చాడు. అప్పుడు అనిపించింది అతనికి ‘నా లాగా ఈ ఆడ పిల్లలకీ కరాటే వంటివి తెలిసి ఉంటే, వాళ్లని వాళ్లే రక్షించుకునే వాళ్లు కదా!’ అని. అటు తర్వాత, తన మదిలో మెదిలిన ఆలోచన ఆచరణగా మారింది. వేలమందికి ఆత్మరక్షణ విద్యలు నేర్పేలా చేసింది. అతడు చేపట్టిన ఆ కార్యక్రమం పేరు ‘నా రక్షణ నా చేతుల్లోనే’! ఇది 16 ఏళ్ల నాటి మాట. తన పేరిట ట్రస్టు స్థాపించి, పోలీసుశాఖ వారితో చర్చించి ముందుకు సాగాడు. రక్షకుడిగా లక్షలాది వనితల, వారి కుటుంబ సభ్యుల ప్రశంస లందుకున్నాడు. అతడి సేవా పక్రియ మహారాష్ట్రతో పాటు దేశ రాజధానికీ విస్తరించింది. అనేక శిక్షణ శిబిరాలు నిర్వహించి, ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచాడు. తన నిర్వహణ కేవలం విద్యార్థినులూ యువతులకే పరిమితం కాలేదు, కానివ్వలేదు. నాలుగు పదుల వయసు దాటిన అతివలకీ విస్తరించేలా చేశాడు. ఆ మహిళా బృందానికి తాను పెట్టిన పేరు తెలుసా? ‘పవర్ వింగ్’. అవును..! అంతటి శక్తియుక్తుల వినియోగంతోనే అగ్రదేశం అమెరికా నుంచి ప్రెసిడెన్షియల్ ఛాంపియన్ గోల్డ్ అవార్డు స్వీకరించాడు అభి. చట్టాలుంటాయి, నిబంధనలూ ఉంటాయి. దేశంలో ఎన్ని ఉన్నా ప్రత్యేకంచి ఆడపిల్లలకి ముందు జాగ్రత్తలుండాలి. రక్షణ విద్యలతో ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలను పెంచుకోవాలంటాడతను. మన దేశంలోనూ ప్రభుత్వం స్వీయరక్షణ శిక్షణ కార్యక్రమం అమలు పరుస్తోంది. పాఠశాల స్థాయి నుంచే బాలికలకు పరిసరాల పరిశీలనా శక్తి కలిగిస్తోంది. అనూహ్యంగా ఉపద్రవం ఎదురైతే తమను తాము రక్షించుకోగలిగిన సత్తువ పెంచుతోంది. శిక్షణలో భాగంగా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వశాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. పోలీస్, హోమ్‌గార్డు, ఎన్‌సీసీ విభాగాల ద్వారా సమన్వయం సాధిస్తోంది.
పోకిరీల పనిపట్టాలి
అలనాటి యుద్ధ కళల్లో ‘సిలంచం’ ఒకటి. దీనికి గతంలోనే కేంద్రం నుంచి గుర్తింపు లభించింది. ప్రాచీన విద్య అయినా, ఆధునికంలోనూ ఎంతైనా అవసరం. ఇందులో ఆయుధమూ, సాధనమూ ఒకటే. కొన్నిచోట్ల వెదురు కర్రలను ఉపయోగి స్తుంటారు. పొరుగు రాష్ట్రం తమిళనాట చిరకాలంగా పేరొందిన విద్య అది. కర్రసాముతో దుండగుల ఆట కట్టించవచ్చు. ఇటువంటి అభ్యాసాలు ఆత్మరక్షణకు వినియోగపడతాయి. పాఠశాల స్థాయి నుంచే ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకోవడం విశ్వాస పటిమను తీర్చిదిద్దుతుంది. చట్టాలను గౌరవిస్తూ, ఆయా నిబంధనలను అనుసరిస్తూ కొనసాగడమే పౌరధర్మం. అదే సందర్భంలో అత్యవసర సమయాల్లో తన రక్షణకు తాను యుద్ధ విద్య అభ్యసించడం ఎంతైనా ప్రయోజనకరం. ప్రతీ మహిళ శక్తి స్వరూపిణి. గౌరవించి ఆదరించడం భారతీయ సంప్రదాయం. విరుద్ధ పరిస్థితులు ఎదురైతే, తనను తాను ఎలా కాపాడుకోవాలో మగువకు తెలుసు. అందుకు ఊతమిచ్చేలా ప్రభుత్వాలూ మరింత ముందుకు రావడం, వనితాశక్తిని చాటి చెప్పడం ఎంతైనా ప్రధానం. నారీ శక్తికి మహాభివాదం.