– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్
ఘన విజయదశమి. దసరా మహోత్సవం. అక్టోబర్ ఐదున ఊరూవాడా నవోత్సాహ సంరంభం. సరిగ్గా ఇదే రోజున నాగపూర్‌లోని రేషింబాగ్ మైదానంలో వేడుకే వేడుక. సందడే సందడి. అదే ఈ ఏడాది పండుగ ప్రత్యేకత. ఏది? రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్ఠాత్మక సభకు ప్రధాన అతిథి సంతోష్ యాదవ్ కావడం! మహిళామణి దీపంగా వెలుగుతున్న ఒకరిని ప్రత్యేకించి ఆహ్వానించి సత్కరిస్తుండటం గడచిన 97 సంవత్సరాల్లో ఇదే పప్రథమం. నిర్వాహకులకు, సన్మాన స్వీకర్తకు సగర్వకారణం. పేరులోని సంతోషాన్ని తీరులోనూ కనబరిచే ఆమె ఒక వ్యక్తి కాదు, ఐక్య శక్తి. మన భారత త్రివిధ దళాల రీతిని ఇప్పుడు సందర్భోచితంగా తలచుకుందాం. నౌకాదళానిధి గర్జన. పదాతి బలానిది విృంభణ. విమాన బలగానిది ప్రజ్వలన. ఈ మూడింటి వెనక ఉన్న ఏకసూత్రం సాహసం. అన్నింటినీ కలగలిపిన సాహసికురాలు ఆమె, ఎంతో ఎత్తుగా ఉన్న ఎవరెస్టు శిఖరాన్ని ఇప్పటికీ రెండుమార్లు అధిరోహించిన మహా ధీమంతురాలు. ఇంతేకాదు.. అదే ఎవరెస్టును చైనా ముఖ ప్రాంతం నుంచి అధిరోహించిన తొలి వనితా తానే. ‘నా జాతి జయము పండిచుకొనియె, నా సీమ వెలుగునింపించుకొనియె! విశ్వవిశ్రుతమీనాటి విజయదశమి, భువన పానమీ మహోత్సవ మహస్సు’ అన్నట్లు 54 ఏళ్ల ప్రాయానా నిరంతరోత్సాహి సంతోష్.
సంతోష్‌ది హరియాణా. స్వస్థల్ జోనియా వాస్. జీవితంలో మరువలేని సంవత్సరాలు 1992, 1993. అంటే దరిదాపు మూడు దశాబ్దాల కిందటి సంగతి. రెండు పదుల వయసులోనే ఎవరెస్టు శిఖర అధిరోహణ. అటు తర్వాత-జాతీయ స్థాయిలో సాహసిగా పురస్కార స్వీకరణ. మరికొంత కాలానికే భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’గా సంభావనం. స్వరాష్ట్ర ప్రభుత్వం గుర్గావ్ ప్రాంతంలోని ఒక రోడ్డుకు ఆమె పేరు పెట్టి గౌరవాభిమానాల్ని చాటు కుంది. సాధించిన విజయాలతో ఊరుకోలే దామె- నిత్య నూతనశక్తిని సొంతం చేసుకున్నారు. వర్తమానం వైపు చూపు సారించి, భవిష్యత్తును సందర్శించగల పరిణతి సంపాదించుకున్నారు. ‘అన్నట్లు మీ పుట్టినరోజు పదో తేదీ కదా. ఆర్.ఎస్.ఎస్. ఆతిథ్యం అందుకున్న నాలుగురోజులకే జన్మదినోత్సవం చేసుకుంటున్నారు కదూ’ అని పత్రికలవారు ప్రస్తావిస్తే, చిరునవ్వుతో బదులిచ్చారిలా ‘ప్రతీ పుట్టుకకీ పరమార్థం ఉండాలంటాను. నాది చిన్నపాటి గ్రామం. రేవారి ప్రాంతంలో ఉంది. నాకు ఐదుగురు అన్నయ్యలు. కుటుంబంలో అమ్మాయిని నేనొక్క దాన్నే. తదుపరి చదువంతా ఢిల్లీలో సాగింది. కళాశాల విద్య జైపూర్‌లో అయింది. అక్కడ మా మహారాణి కాజీ పేరు తగినట్లే ఉండేది. అక్కడే పర్వతారోహణ అంటే ఏమిటో తెలిసింది. నా గదిలోని మిత్రులు, ఆ అమ్మాయిలు అదొక అలవాటుగా ఉండేవారు. నాకూ అదే అలవడింది. పనిలో పనిగా ఒక శిక్షణ సంస్థలో చేరి బాగా రాటుదేలాను. రెండు పదుల వయసులోనే ఎవరెస్టు అధిరోహిస్తానని నేనైతే అనుకోలేదు. అయినా అదే సాధ్యమైంది. అంతే ఉత్సాహశక్తితో మరోమారు వెళ్లి ఆ శిఖరాగ్రన మన పతాక ఎగురేశాను. ఇండో -టిబెటన్ సరిద్దు దళంలోనూ పోలీసునయ్యాను. హిమాలయ పర్వతాలమీద, చుట్టుపక్కల ప్రదేశాల్లో వ్యర్థపదార్థాల ఏరివేతకీ శ్రమించాను. పర్యావరణ పరిరక్షణకి నా వంతు కృషి చేశానన్న సంతృప్తి పొందగలిగాను. నా దృష్టిలో శిఖరారోహణ అనేది కేవలం క్రీడాంశమో సాహస కార్యక్రమమో కాదు. అందులోనే స్వచ్ఛంద సామాజిక సేవ ఇమిడి ఉండాలని బలంగా కోరుకుంటున్నా. పాటవం వ్యక్తపరచడం ఒకటే కాకుండా, సేవాను రక్తినీ మిళితం చేయాలని ఆచరణలో చూపించాను. అందుకే పుట్టుకకు పరమార్థమనేది ఉండి తీరాలని’ చిరునవ్వుతో బదులిచ్చారామె.
నిరంతర సేవా నిరతి
ప్రాణాలకు తెగించి సాహసాలు చేయడమే కాదు, ఇతరుల ప్రాణాలు కాపాడటంలోనూ ముందే ఉంటారు సంతోష్. ఒకసారి శిఖరారోహణ యాత్రలో ఉండగా, సమీపంలోని మోహన్‌సింగ్ అనే వ్యక్తికి విపత్కర స్థితి ఎదురైంది. తెచ్చుకున్న ప్రాణవాయువు పూర్తయి, నిస్సహాయంగా మిగలడాన్ని చూసి మెరుపు వేగంతో స్పందించారామె. తన సిలిండర్ ద్వారా ప్రాణవాయువునిచ్చి ప్రాణదానం చేసినప్పుడు, ఆ వ్యక్తి కృతజ్ఞతగా చూసిన చూపు ఎప్పటికీ మరవ లేనంటారు. ప్రతివారు ప్రాణరక్షణ చేసుకోగలిగి ఉండాలని, పక్కనున్నవారినీ కాపాడగలగాలని చెప్తుంటారు. దీనికి జాతీయ కాడెట్ శిక్షణ కళాశాల స్థాయి నుంచీ సహకరిస్తుందంటారు. ఆమె ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ చేసినా, క్రీడలంటే మక్కువ చూపి స్తుంటారు. ఎన్‌సీసీని నిర్బంధం చేస్తే యువతరం అన్ని విధాలా ముందడుగు చేస్తుందని బలంగా నమ్ముతుంటారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీ పలు రికార్డులు సృష్టించడమంటే మాటలు కాదు. ఇందుకు ఉత్తర కాశి కేంద్రంగా ఉన్న నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాంటెనీరింగ్ ఎంతో దోహద పడిందంటారు. కఠిన శిక్షణ పొంది, అభ్యాసాలు సాగించి, రకరకాల పరీక్షల్లో నెగ్గి ‘ఎ’ గ్రేడ్ కైవసం చేసుకున్నారు. పరిక్షల్లోనైనా శిక్షణపరంగానైనా ఎప్పుడూ ప్రథమురాలే. సాహస కార్యక్రమాల్లో సదా ముందువరసనే ఉండేవారు. అంతర్జాతీయ స్థాయిలో పర్వతారోహణ శిబిరం – నిర్వహణ పక్రియను అప్పట్లో ఆరంభించినప్పుడు వనితల నుంచి మొదటి అడుగు సంతోష్‌దే. అప్పుడామెకు ఇరవై రెండేళ్లు. బృందంలో 31 మంది సభ్యులలో ఆమె ఏకైకమహిళ కావడం విశేషంజ పట్టు వీడకుండా, ఎక్కడా సడలకుండా పర్వతాన్ని అధిరోహించి శభాష్ అనిపించుకున్నారు. మరుసటి సంత్సరంలోనే ఇండియా – తైవాన్ బృందానికి ఎంపికయ్యారు. మొత్తం 18మంది జట్టులో తనదైన ప్రత్యేకత చూపి నిర్వాహకుల – శిక్షక ప్రముఖుల అభినందన లందుకున్నారు. అనేక రకాల కష్టనష్టాలను దాటుకుంటూ, అడ్డుగోడలను తొలగించుకుంటూ, లక్ష్యం చేరి ప్రపంచ ప్రసిద్ధుల కితాబులకు పాత్రురా లయ్యారు. సంతోష్ యాదవ్‌కు వెనుదిరగకుంటే నచ్చదు. అనుకున్న ధ్యేయం నెరవేరే దాకా విశ్రాంతీ విరామాలన్న మాటే ఉండదు.
సదా ఆచరణ వాదం
కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆమె ప్రతిభాపాట వాలను గుర్తించింది. విలక్షణతను సత్కరించింది. పర్యవసానంగానే సరిహద్దు భద్రతాదళంలో సంతోష్‌కు చోటు లభించింది. అప్పుడామె ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్‌లో ఒక అధికారి. ఇండో – జపనీస్ సంయుక్త నిర్వహణలోని కాంచనగంగ ఆరోహక బృందంలో కూడా సభ్యురాలయ్యారు. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డస్‌లో ఆమె పేరు చోటు చేసుకోవడం మరో ప్రత్యేక అంశం.1994… అంటే 27 ఏళ్ల వయసులో ఈ విశిష్టతను సొంత చేసుకున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దృష్టిని ఆకర్షించారు. ఫలితంగా పాఠ్య పుస్తకాల్లో జీవితచరిత్ర -అద్భుత ఘట్టాలను పొందుపరచగలిగారు. వివిధ తరగతుల విద్యార్థినీ విద్యార్థులు సంతోష్ యాదవ్ గురించి చదువుతున్నారు ఇప్పటికీ. రచనలు చేయడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. పర్యటక రంగంలో పర్యావరణ పాత్ర, ప్రాధాన్యతలపైన అనేకం రాశారు. ప్రస్తుత సమస్యలు, స్థితిగతులు, పరిష్కార మార్గాలకు సంబంధించి వ్యాసాలెన్నో వెలయించారు. దేశీయం గానే కాకుండా విదేశీ భాషల్లోనూ ఎన్నో రచనలు ప్రచురితమయ్యాయి. సాహసక్రీడల పుట్టు పూర్వోత్తరాల మీద రాసినవన్నీ ప్రశంసలను కైవసం చేసుకున్నాయి. సేవలు, సాహస కార్యకలాపాలు ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యోగా జీవన విధానంగా మారాలంటూ ఏకంగా ఉద్యమమే చేస్తున్నారామె. వ్యక్తిగతంగా, వ్యవస్థాపరంగా రావాల్సిన మార్పు చేర్పులపై రచనలు చేయడంతో పాటే ప్రసంగాలిస్తున్నారు. స్వామి సత్యానంద సంప్రదాయ విధానంలో శిక్షణలనూ కొనసాగిస్తు న్నారు. బిహార్ స్కూల్ ఆఫ్ యోగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో కూడా కీలకభూమిక ఆమెదే. వ్యక్తిత్వం, మూర్తిమత్వ పరంగానూ తాను ఉపన్యాసాలిస్తూ వస్తున్నారు. నాయకత్వ శిక్షణ, బృంద నిర్మాణ వైనం, విపత్తులను ఎదుర్కొనే పద్ధతులపైన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. భారతీయ సమాజంలో స్త్రీ నిర్వర్తించాల్సిన బాధ్యతలు వివరణలో వీడియోలు రూపొందిస్తున్నారు సాహస సంతోష్. ఇన్ని కారణాల వల్లనే దసరా మహోత్సవాల ముఖ్య అతిథి అయ్యారిప్పుడు. తన భావాలు, అనుభవాలను వనితాలోకానికి వివరించనున్నారు.
అంతా ఉచితం, స్వచ్ఛందమే
ఆమె సృజనశీలి, క్రియాశీలి. ఆలోచనలతో ఆగరు, ఆచరణతో సాగిపోతుంటారు. మాటలతో సరిపెట్టుకోరు, అవి చేతలయ్యేవరకు ఊరుకోరు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యారంగంలో క్రీడలకు ఉండాల్సిన ప్రత్యేక స్థానాన్ని చాటిచెప్తున్నారు. మన దేశంలోనే కాకుండా, విదేశాల్లోని భారత సంతతివారికీ ఆ స్ఫూర్తిదాయని సేవా సహాయ సహకారాదులు అందుతున్నాయి. అత్యంత ముఖ్య విషయం: తన ఏ కార్యక్రమానికీ ఆమె ఒక్క రూపాయి అయినా సరే తీసుకోరు! ఉచితంగా, స్వచ్ఛందంగా చేసేది మాత్రమే సేవ అవుతుందని త్రికరణశుద్ధిగా విశ్వసిస్తారు. భారతీయ సమాజ వ్యవస్థకు ఆదర్శప్రాయులు కావాలన్నది ఆమె మనసులోని మాట. భర్త ఉత్సాహ ప్రోత్సాహాలు, ఇద్దరు బిడ్డల (ప్రతాప్, నందిని) ముద్దుముచ్చట్ల జీవితాన్ని సుఖవంతం చేస్తుంటే… మహదానందమే. సంతోషాన్ని, సంతృప్తిని అందుకుని, తిరిగి సమాజా నికి అందించాలన్న ఆమె కృతనిశ్చయం ఎంతైనా దీప్తిమంతం. దేశరాజధాని నగరంలోని హరియాణా ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటున్నప్పుడు బోధనలతోను రోజంతా గడిచిపోతుంది. విశ్రాంతి తెలియని, విరామం ఎరుగని సంతోష్ యాదవ్‌కు ఈ దసరా శుభ సందర్భంలో సత్కారం, ‘సంఘ్’ అందిస్తున్న ఆతిథ్యం ఎంతైనా చరిత్రాత్మకం. మేటి మహిళకు లభించే ఈ పురస్కృతి అందరికీ ఆనందదాయకం. సంతోష్ యాదవ్‌గారూ! మీకిదే అక్షరాభివాదం.