– దోర్బల పూర్ణిమాస్వాతి

బలిచక్రవర్తి పాలనలో అణిగిమణిగి ఉండిన రాజులు క్రమంగా తలలెత్తి విజృంభించసాగారు. బలంగల వాడిదే భూమి అయిపోయింది. రాజుల నిరంకుశ పాలనలో జనులు తల్లడిల్లిపోతున్నారు. అప్పుడు విష్ణువు దశావతారాల్లో ఆరవది పరశు రామావతారం దాల్చి ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రి యులను అడవులను నరికినట్టుగా గండ్రగొడ్డలితో నిర్మూలించాడు. ఎప్పుడు ఏది అవసరమో అది సాధించడానికి అవతరిస్తూంటాడని నిరూపించాడు.

నాటి ధరాతలాన్నేలే రాజులందరిలో మేటి నాయకుడు, సమ్రాట్‌ ‌హైహయ చక్రవర్తి కార్త వీర్యార్జునుడు సుదర్శచక్రం అంశతో పుట్టాడు. ఒకానొక సమయంలో విష్ణువు పాలకడలిలో శేష పానుపుపై శయనించి ఉండగా, శంఖచక్రాలు తమ తమ గొప్పలు చెప్పుకుంటూ గర్వంతో వాదులాడుకున్నాయి. ‘సహస్రకిరణుడైన సూర్యుడి. తరిణ బట్టిన రజనుతో విశ్వకర్మ నన్ను రూపొందించాడు. వెయ్యి కోణాలతో గిర్రున తిరుగుతూ బలవంతులైన అనేకమంది రాక్షసుల్ని నేనే కదా ఖండిం చింది! నన్ను ధరించి విష్ణువు ‘చక్రి’గా ఖ్యాతి పొందాడు! నీకు ధ్వని తప్పితే మరేదీ చేతకాదు!’ అని చక్రం పలికింది.

ఆ మాటలకు పాంచజన్యం (శంఖం) ‘ఔరా! చక్ర పురుషా! ఎంత పొగరుగా మాట్లాడావు! భూమ్మీద పొగరు బోతైన రాజుగా పుట్టు! విష్ణువు ముని కుమారుడై కట్టెలు కొట్టే గొడ్డలితో, నీ పొగరు అంత మొందిస్తాడు!’ అని శపిం చింది. దాంతో చక్రపురుషుడు కార్త వీర్యార్జునుడై పుట్టి హైహయ సామ్రా జ్యాన్ని నాలుగు చెరగులా విస్తరింప జేశాడు. అతడు భగవంతుని అవతార మైన దత్తాత్రేయుడి భక్తుడు, శిష్యుడు. దత్తాత్రేయుడిని అర్చించి మహాబల సంపన్నుడై, విజయయాత్రకు బయలు దేరాడు. అతని అనుగ్రహంతో అణిమాది సిద్ధుల్నీ, అనేక శక్తుల్నీ పొందాడు.

అవసరమైనప్పుడు అనేక ఆయుధాలతో వెయ్యి చేతులు వస్తూండేవి. జమదగ్ని మహర్షి కుమారులలో పరశురాముడు చివరి వాడు. ఎప్పుడూ గొడ్డలి పట్టి తిరుగుతూ ఆశ్రమాలూ, జనపదాలూ నిర్మించడానికీ, భూమిని సాగుచేయడానికీ అనుకూలంగా అరణ్యాలు నరుకు తూండడమే అతని పని. హిమాలయాలలో తపస్సు చేసి శివుడిని మెప్పించాడు. శివుడు అతనికి గొప్ప ప్రభావంగల పరశువు (గొడ్డలి) ప్రసాదించాడు. దానిని ధరించడం వల్ల ‘పరశురాముడు’ అని పేరుపొందాడు.

భృగుసంతతి వాడవడం వల్ల భార్గవరాముడు అనీ ప్రసిద్ధుడు. ఒకనాడు నదికి వెళ్లిన భార్య రేణుకాదేవి ఎంతసేపటికీ రాకపోవడాన్ని భర్త జమదగ్ని దివ్యదృష్టితో చూశాడు. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో జలక్రీడలు ఆడడాన్ని రేణుకాదేవి మైమరచి చూస్తూ ఉండిపోయింది. ఆమె తీరుకు ఆగ్రహించిన జమదగ్ని కుమారులను పిలిచి, ఇంటికి చేరిన భార్య తలను నరకాలని ఆదేశించాడు. అయితే పరశురాముని అన్నలు ఆ పని చేయలేకపోయారు. అడవి నుంచి వచ్చిన అతనితో జమదగ్ని, ‘నీ అన్నల తలలనూ, మీ అమ్మ తలనూ నరుకు!’ అని ఆజ్ఞాపించగా, అతను తండ్రి ఆదేశాన్ని శిరసావహించాడు. ప•రశురాముడి పితృ భక్తికి మెచ్చి, ‘ఏం కావాలో కోరుకో?’ అన్నాడు జమదగ్ని. ‘అన్నల్నీ, అమ్మనూ బతికించు!’ అన్నాడు పరశురాముడు.

జమదగ్ని కుమారుడి కోరికను తీర్చాడు. కుమారుడి విశ్వాసానికీ, సూక్ష్మబుద్ధికీ ఎంతో సంతసించి, ‘పరశురామా! నీవు కారణ జన్ముడివి. చిరంజీవిగా ఉంటావు!’ అని ఆశీర్వదించాడు.

కార్తవీర్యార్జునుడు విజయ యాత్ర ముగించి తన రాజధాని మాహిష్మతీ నగరానికి వెళుతుండగా, దారిలో జమదగ్ని ఆశ్రమం కనిపించింది.

ఆకలితో ఉన్న మహారాజు, పరివారం, సైన్యా నికి జమదగ్ని తన వద్ద కామధేనువు అంశతో గల హేరీమధేనువు సహకారంతో గొప్ప విందుచేశాడు. కావలసినవన్నీ సమకూర్చే ఆ ధేనువు తనతో ఉంటే పరివారానికి తిండి సమస్య లేకుండా అన్ని విధాలా ఉపకరించుకోవచ్చనే ఆశతో దానిని రాజనగరుకు తోలుకు రావాలని సైనికులను ఆజ్ఞాపించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని ముష్కరు లైన సైనికులు నేలకు తోసి ఆవును ఈడ్చుకెళ్ళారు. పడిపోయిన జమదగ్ని మరణించినట్లే ఉండి పోయాడు. రేణుకాదేవి భర్తమీద పడి ఏడుస్తుండగా, అడవి నుంచి నుంచి ఆశ్రమానికి చేరిన భార్గవ రాముడు పరశువును ఝుళిపిస్తూ, మాహిష్మతీ నగరానికి పరుగెత్తాడు. అంతలో ఎక్కడి నుంచో వస్తున్న భృగుమహర్షి దారిలోని జమదగ్ని ఆశ్రమం చేరాడు. రేణుకను ఓదార్చి, కొడిగడుతున్న జమదగ్ని ప్రాణాన్ని తన యోగశక్తితో నిలబెట్టి బతికించాడు.

మాహిష్మతీ నగరానికి చేరిన ధేనువు ఆశ్ర మంలో మాదిరిగా అడిగినవి సమకూర్చడం లేదని సైనికులు దానిని హింసిస్తుండగా, అదే సమయానికి ప్రళయరుద్రుడులా వచ్చిన పరశురాముడిని చూసి సైనికులు పారిపోయారు. ఆవు ఆశ్రమానికి ఉరకలేస్తూ వెళ్ళింది.

‘ఓ రాజాధమా! సంరక్షకుడై ఉండవలసిన రాజు దుర్మార్గుడైనప్పుడు శిక్షంచక తప్పదు. మేడదిగి రా!’ అని పరశురాముడు రాజప్రాసాదం ముందు కేకవేశాడు. ఆయనను సాధారణ మునికుమారు డిగా భావించిన కార్తవీర్యుడు, ఆత•ని ధాటి తెలిశాక వెయ్యి చేతులతో ఎదుర్కొన్నాడు. తను ప్రయో గించిన శస్తస్త్రాలను, పరశురాముడు గొడ్డలితో తుత్తునియలు చేశాడు. కార్యవీర్యుని వెయ్యి చేతులను చెట్టుకొమ్మల మాదిరిగా తెగనరకడంతో కూలిపోయాడు. ఆ వెంటనే తాను శాపవశంతో పుట్టిన చక్రపురుషుడనని గుర్తుకొచ్చింది.

పరశురాముడు విష్ణువేనని తెలిసి మనస్సులోనే దండం పెట్టి దేహం చాలించి సుదర్శన చక్రంలో లీనమయ్యాడు. ఇంటికి చేరిన పరశురాముడు, తండ్రికి జరిగినదంతా చెప్పగా, ‘నాయనా! నువ్వు చేసినది మునులమైన మనకు తగని పని. అందుకు పరిహారంగా నువ్వు తపస్సు చేయాలి!’ అని జమదగ్ని సూచించాడు.

‘తండ్రీ! రాజు అధర్మ పరుడైనప్పుడు శిక్షంచ వలసిన అర్హత అందరికీ ఉంది! అయితే నీ ఆనతి గనుక తపస్సు చేస్తాను. కానీ ప్రాయశ్చిత్తంగా

కాదు’ అని అరణ్యానికి పోయి తపస్సులో నిమగ్నుడయ్యాడు.

అదే సమయంలో కార్తవీర్యుడి వెయ్యి మంది కుమారులు హైహయ క్షత్రియులందర్నీ కూడ గట్టుకొని జమదగ్ని ఆశ్రమం మీదకు విరుచుకు పడి నిశ్చల తపస్సులో ఉన్న జమదగ్ని తలను నరికేశారు. ఆ తల దొర్లుకుంటూ దూరంగా పోయి రాళ్ల మధ్య చిక్కుకుంది. రేణుకాదేవి, ‘రామా! రా!’ అంటూ ఇరవైఒక్కసార్లు ఎలుగెత్తి పిలిచింది. గుండెలు బాదుకొంటూ భర్త మొండెంపై పడి సొమ్మ సిల్లింది. రాజపుత్రులు ఆశ్రమాన్ని తగలబెట్టారు. ఆ మంటల్లో రేణుక, భర్త పార్థివదేహంతో కలిసి కాలిపోయింది.

పరశురాముడికి తపోభంగమైంది. తల్లి పిలుపు ఇరవైఒక్క సార్లు చెవుల్లో మారు మోగింది. మనస్సు కీడు శంకించి, ఒక్క అంగలో ఆశ్రమం చేరు కున్నాడు. తల్లిదండ్రులు అగ్నికి ఆహుతయ్యారు. హైహయ సైనికులు ఆశ్రమవాసుల్నీ, వారించ వచ్చిన పరిసర జానపదులను చిత్రవధ చేస్తున్నారు.

పరశువును ప్రసాదించిన శివుడిని స్మరించి, పరశురాముడు దానిని తీసి జ్వాలలాగ లేచాడు. ముళ్ళపొదల్ని నరికినట్లుగా అందిన వారినందర్నీ హతమార్చాడు. ‘తండ్రీ! కన్నీరు కూడా రాకుండా నా గుండె జ్వలించి పోతున్నది. ఇంత పాతకానికి దిగిన క్షత్రియుల రక్తంతో నీకు తర్పణం చేస్తాను.నీ తలను ఆ రక్తపు మడుగుల్లో ముంచి అంత్యక్రియలు చేస్తాను!’ అంటూ ఉన్నత శిలాగ్రం మీదకు ఎక్కి పరశువును ఎత్తి, ‘ఈ గొడ్డలితో భూమ్మీద రాజన్న వాడు లేకుండా నరుకుతాను!’ అని భీకర ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞను నెరవేర్చుకొనేందుకు హిమాల యానికి వెళ్ళి శివుడి గూర్చి తపస్సు చేసి మెప్పిం చాడు. శివుడు ప్రసన్నుడై అన్ని అస్త్రాలతో పాటు ప్రత్యేకమైన దివ్యాస్త్రాన్ని ప్రసాదిస్తూ, ‘ఇది భార్గ వాస్త్రంగా నీ పేరున నిలుస్తుంది! నీవు కారణ జన్ముడివైన అవతార మూర్తివి! నీకు అడ్డులేదు!’ అని ఆశీర్వదించాడు.

పరశురాముడు క్షత్రియులపై విజృంభించాడు. రాజుల దుష్పరిపాలనలో అగచాట్లు పడుతున్న జనానీకం అతని అండ చేరింది. కార్తవీర్యుడి కుమారులు సహా హైహయులందరూ రాజ్యం వీడి నగరం విడిచి పారిపోయారు. పరశురాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించడంతో మాహిష్మతీ రాజధాని ఇరవై ఒక్క రోజులపాటు జ్వాలల్లో నామరూపాల్లేకుండా దహించుకుపోయింది. తిరిగి వచ్చిన కార్తవీర్యుడి కుమారులు, హైహయవంశ క్షత్రియులూ, దేశ దేశాల రాజులు ఏకమై పరశురాముడిని ఎదుర్కొగా, వారిని నామరూపాలు లేకుండా చేశాడు. వారి రక్తాన్ని ఐదు మడుగుల నిండా నింపి, తండ్రి జమదగ్ని తలను ముంచి పితృతర్పణం చేసి, అగ్ని సంస్కారం జరిపాడు. (శమంత పంచకం అనే అయిదు రక్తపు మడుగుల ప్రదేశమే తరువాతి కాలంలో కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది). తరవాత క్షత్రియ సంహారానికి బయలు దేరాడు. వెతికివెతికి క్షత్రియుల్ని గండ్ర గొడ్డలికి ఆహుతి చేశాడు. అలా ఇరవై ఒక్కసార్లు దండ యాత్రలు చేసి క్షత్రియులనిపించుకునేవారు కనిపించకుండా చేశాడు.. క్షత్రియ సంహారం అనంతరం తన అధీనమైన భూమినంతటినీ కశ్యపుడికి దానంచేసి, దక్షిణ సముద్రంలో ఉన్న మహేంద్ర పర్వతంపై తపస్సులో నిమగ్నుడయ్యాడు. బ్రాహ్మణుల ఇళ్లల్లో, మునుల ఆశ్రమాల్లో పెరిగి పెద్దవారైన క్షత్రియ కుమారులందరికీ కశ్యప ప్రజాపతి తనకు పరశురాముడి ద్వారా సంక్రమిం చిన రాజ్యాన్ని, భూములను ఇచ్చాడు. తండ్రి వరం వల్ల పరశురాముడు సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నాడని ఐతిహ్యం.

About Author

By editor

Twitter
YOUTUBE