సెప్టెంబర్ 26 దేవీ శరన్నవరాత్రారంభం
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేకానేక శక్తిక్షేత్రాలలో, శ్రీలక్ష్మీదేవి ఆలయాలలో శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి (ఈ నెల-సెప్టెంబర్ 26)నుంచి దేవీ నవరాత్స్రోవాలు ప్రారంభమవుతున్నాయి. కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రెండేళ్లుగా నిబంధనల మేరకు, అంతరాయాలకే పరిమితం చేసిన ఉత్సవాలను పరిస్థితులు చక్కబడుతుండడంతో అశేష భక్తజన సమక్షంలో నిర్వహణకు సన్నాహాలు పూర్తవుతున్నాయి. ఇటీవలి వినాయక నవరాత్రుల తరహాలోనే దేవీ నవరాత్రుల నిర్వహణకు ఉత్సాహంగా పూనుకుంటున్నారు.
సర్వశకుల సమాహార స్వరూపిణి, సర్వవ్యాపిని ఆదిపరాశక్తి. సర్వమంగళకారిణి, సర్వైశ్వర ప్రదా యిని. దుష్టులకు చాముండి. శిష్టులకు చల్లని తల్లి. అనేక మంది రక్కసులను దునుమాడి సర్వలోకాలకు విముక్తిని ప్రసాదించిన జగన్మాతను ఆశ్వీయుజంలో దేవీ నవరాత్రుల పేరిట పలు అవతారాలలో ఆరాధిం చడం అనాదిగా వస్తోంది. అసుర సంహారంలో అమ్మవారు ధరించిన శక్తులను ‘సప్తమాతృకలు’ అని వ్యవహరిస్తారు. బ్రాహ్మీ (బ్రహ్మలోని శక్తి), వైష్ణవి (విష్ణువులోని శక్తి), మహేశ్వరి (మహేశ్వరునిలోని శక్తి), కౌమారి (స్కంధునిలోని శక్తి), వారాహి (యజ్ఞ వరహాస్వామిలోని శక్తి) ఇంద్రి(ఇంద్రుడిలోని శక్తి), చాముండి (భ్రూమధ్యం నుంచి ఆవిర్భవించిన కాల శక్తి) అనే రూపాలతో, లోక•కంటకులైన మహిషాసుర, శుంభనిశుంభాది అసురులను అంతమొందించారు. జగన్మాత త్రిగుణరాశి. దసరా ఉత్సవాల తొమ్మిది రోజులలో మొదటి మూడు రోజులు కాళికాదేవిగా, నాలుగురోజులు లక్ష్మీదేవిగా, మూడు రోజులు సరస్వతిగా పూజిస్తారు. దీని వల్ల త్రిమూర్తుల శక్తి రూపాలను అర్చించిన ఫలితం దక్కుతుందంటారు.
నవరాత్రుల విశిష్టత
నవరాత్రులు లేదా దసరా ఉత్సవాలను దేశ విదేశాలలో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు నిర్వహిస్తారు. నవరాత్రులు ప్రారంభానికి ముందు తిథి (భాద్రపద అమావాస్య) మహాలయ పక్షానికి యుద్ధపక్షం అని పేరు. సురాసుర సంగ్రా మంలో పరాజితులైన దేవతలు శరన్నవరాత్రులలో తమ ఇష్టదైవాలను అర్చించగా పదవనాడు (దశమి) విజయం వరించిందని, అలా దేవీ నవరాత్రులలో ఆదిశక్తిని అర్చించడం అనవాయితీగా వస్తోందని పురణాలు చెబుతున్నాయి.
శరన్నవరాత్రోత్సవాలలో జగన్మాతను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, అతిభైరవి, సర్వసిద్ధి అనే రూపాలతో కొలుస్తారు. ఈ నవనామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పినట్లు ప్రతీతి. ‘చండీసప్తశతి’ అమ్మ వారిని మహాలక్ష్మి, మహాకాళి, మహా స•రస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరి అనే పేర్లనూ పేర్కొంది. మహిషాసురుడితో తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి విజయం సాధించి నందున నవరాత్రుల పేరిట అమ్మవారిని వివిధ రూపాలతో అలంకరించి అర్చిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అమ్మవారు వివిధ పేర్లతో ఎందరో రాక్షసులను వధించినా మహిషార వధతోనే నవరాత్రుల పేరుతో దేవీపూజలు రూపుదిద్దుకున్నాయి. మహిళను అబలగా పరిగణించిన మహిషాసురుడు ఆమె చేతిలో తప్ప మరణం లేకుండా వరం పొందడంతో ఆమె సమరభూమికి కదలి, సబలగా నిరూపించుకున్నారు.
రంభుడనే రాక్షస కుమారుడైన మహిషుడు వరబల గర్వంతో స్వర్గంపైకి దండెత్తి ఇంద్రపీఠాన్ని ఆక్రమించాడు. అతనిని నిలువరించాలంటే శక్తి మంతురాలు ఆవిర్భవించాలి. ఆమెకు దివ్యాయుధ సంపత్తి సమకూరాలి. ఆ దానవుడి బెడద గురించి తనకు మొరపెట్టుకున్న దేవతలకు నారాయణుడు అదే మాట చెప్పాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖాల నుంచి వరుసగా, రజో, సత్త్వ, తమో గుణ సంపన్నులైన స్త్రీమూర్తులు ఆవిర్భవించారు. ఇంద్ర, వరుణ, కుబేరాది అష్టదిక్పాలకుల నుంచీ తేజస్సులు వెలువడ్డాయి. వాటన్నిటి సమాహారంతో సహస్ర బాహువులతో స్త్రీమూర్తి (శ్రీదేవి) ఆవిర్భవించగా, విష్ణు, మహేశ్వరులు సహా దేవతలు త•మ ఆయధాల నుంచి ప్రతిరూపాలు సృష్టించి సమర్పించారు. భక్తి, జ్ఞానం, యోగమనే త్రిశక్తుల కలయిక శివుడి త్రిశూలం, విష్ణుమూర్తి సుదర్శనంతో పాటు దేవతల నుంచి గ్రహించిన ఆయుధాలతో ఆమె అసురుడిని అంతమొందించారు.
నవరాత్రులలో అమ్మవారికి చేసే ఒక్కొక్క అలం కారం వెనుక ఒక్కొక్క విశిష్టత దాగి ఉందంటారు. ఉదాహరణకు, మహిషాసుర సంహార సమయంలో జగన్మాత ఎర్రటి అలంకారంతో రౌద్రమూర్తిగా కనిపిస్తారు. ఆమె ధరించిన వస్త్రాలు, చేపట్టిన ఆయు ధాలు ఆమె బుద్ధికుశలతకు తార్కాణంగా చెబుతారు. తనను మోహించిన మహిషుడి దురాలోచనను, అతని బలం, బలహీనతలు ఎరిగిన దుర్గమ్మ దూరాలోచనతో సర్వాలంకారభూషితంగా యుద్ధానికి బయలుదేరారు. ఆమె అలా వెళ్లడంలో దానవుడిని సమ్మోహితుడిని చేసి కడతేర్చడమనే యుద్ధతంత్రం దాగుందని చెబుతారు. పశురూపుడైన అతనిని మట్టు పెట్టేందుకు అందుకు తగినట్లుగానే ఎరుపు వర్ణ వస్త్రాభరణాలు ధరించారట. ఎరువురంగు పశువులను చీకాకు పరుస్తుంది. అవి నిప్పును చూస్తే వెనుకంజ వేస్తాయి. ఆ కోణంలోనే మహిషాసురుడిని సంహరించేందుకు అమ్మవారు అగ్నిధారణతో, ఎరువు వస్త్రాలు ధరించి దండెత్తారట.
దుర్గాష్టమి
ఆదిపరాశక్తి దాల్చిన సగుణ సాకార రూపాలలో దుర్గావతారం ఉత్కృష్టమైంది. ‘దుర్గ’ అంటే కష్ట సాధ్యం, దుర్లభమైనది, అప్రతిహతశక్తి అని అర్థం. అందుకే అమ్మవారు కదనానికి సన్నద్ధమైతే ‘దుర్గాదేవి’గా మారతారట. దుర్గ నామంలోని ‘ద’ కారం అసురిక భావాలను, ‘ఉ’ కారం విఘ్నాలను,‘ర’ కారం వ్యాధులను, ‘గ’ కారం పాపాలను, ‘ఆ’ కారం భయాలను నాశనం చేస్తుందని యామలతంత్ర శాస్త్రం పేర్కొంటోంది. ‘దుం దుర్గే దురితం హరా’… అని జపించడం వల్ల సమస్త అశుభాలను తొలగిస్తుం దని భక్తుల విశ్వాసం. అత్యంత శక్తిమంతుడైన దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు ఆశ్వీయుజ శుక్ల అష్టమి నాడు సంహరించారు. రాక్షస సంహారం చేయాలంటూ దేవతలు అమ్మకు మొరపెట్టుకుని, అసురాంతకానికి మహాయ్ఞం నిర్వహించి తమ ఆయుధాలను యజ్ఞగుండంలో సమర్పించారని దేవీభాగవతం బట్టి తెలుస్తోంది. ‘దానవ సంహారానికి కోటి సూర్యుల తేజస్సుతో సమస్త దేవతల తేజో పుంజం నుంచి అష్టాదశ భుజాలతో దుర్గామాత అవతరించింది. ఆమె త్రిమూర్తులకు, త్రిశక్తులకు, త్రిగుణాలకు మూలబిందువు. భక్తులకు దయారస తరంగిణి. మహాభయ వినాశిని. ఉపాసకులక• మహాకారుణ్య రూపిణి, సౌందర్య లావణ్య వరేణ్య’ అని మార్కండేయ పురాణం ప్రస్తుతించింది. మధు కైటభులు, శుంభనిశుంభులు లాంటి రాక్షసులను వధించి శాంతిస్థాపన కోసం దుర్గమ్మ అవతరించిం దనే పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి.
ఆధ్యాత్మిక గురువులు నవరాత్రులను మానవాళి లోని త్రిగుణాలతో అన్వయించి చెబుతారు. ‘నవరాత్రులను మూడు విధాలుగా విభజించుకుంటే, మానవ చైతన్యం. మొదటి మూడు రోజులు తమో గుణంతో ప్రయాణిస్తుంది. కుంగుబాటుకు, భయాం దోళలనకు, అస్థిర భావాలకు తమోగుణం దారిదీ స్తుంది. తరువాతి మూడు రోజులు ఉద్వేగం, వ్యామో హాలకు కారణమైన రజోగుణం చోటుచేసుకుం టుంది. చివరి మూడు రోజులూ సత్వగుణంతో ప్రకాశిస్తాయి. మనసు తేలికపడి తేరుకుని సదా లోచనలు చేస్తుంది. దుర్గామాతను అర్చించడం వల్ల ఈ మూడు గుణాల మధ్య సమతుల్యత ఏర్పడి సత్ఫలితాల సాధనకు అవకాశం కలుగుతుంది. అన్ని దశలు దాటిన తరువాత దక్కేదే గెలుపు అదే ‘విజయ’దశమి’ అని వారు విశ్లేషించారు.
మూలానక్షత్రం
శరన్నవరాత్రులలో మరో ముఖ్యమైన తిథి మూలానక్షత్రంతో కూడిన సప్తమి.. ఆ రోజున జగన్మాతను చదువుల తల్లి ‘సరస్వతీదేవి’గా అలం కరిస్తారు. ఆ నాటి నుంచి దసరా వేడుకలు ఊపందు కుంటాయి. దుష్టశిష్టణ కోసం అవతరించిన శక్తి స్వరూపిణి ఆదిశక్తి మానవాళి దోషాలను హరించి జ్ఞానజ్యోతిని వెలిగించ సంకల్పించి శారదామూర్తి అవతారంతో అనుగ్రహించారు. ‘దైవం మంత్రా ధీనం’ అంటారు సద్గురువులు. ఆ మంత్రాలకు అధి దేవత సరస్వతీమాత. మాఘ మాసంలో వసంత పంచమినాడు ఆచరించే సరస్వతీపూజ శరన్నవరాత్రు లలోనూ చోటు చేసుకోవడం విశేషం. వ్యాస భగవా నుడు ప్రతిష్ఠించినట్లు చెప్పే బాసరలోని జ్ఞానసరస్వతి క్షేత్రంలో ఈ రాత్రులు మూలానక్షత్రం సందర్భంగా పిల్లలతో పాఠశాలల్లో సరస్వతీ పూజ నిర్వహిస్తారు. బడిఈడు పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేపడతారు..
మహర్నవమి/కుమారీపూజ
అమ్మవారు తొమ్మిది రేయింబవళ్లు దానవుడిపై మహాసంగ్రామం చేసి విజయం సాధించారు. అందుకే ఉపాసకులు, భక్తులు తొమ్మిది రోజులు శ్రద్ధాసక్తులతో ఆరాధిస్తారు. ఈ సమయంలో 2-10 సంవత్సరాల మధ్యవయస్సు గల బాలికలను ‘అమ్మ’కు ప్రతిరూపంగా పూజించి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. దీనినే ‘కుమారీపూజ’ అంటారు. రెండేళ్ల వయసు గల శిశువును కుమారి, మూడేళ్ల చిన్నారిని త్రిమూర్తి, నాలుగేళ్ల పాపను కల్యాణి, అయిదేళ్ల బాలికను రోహిణి, అరేళ్ల బాలికను కాళిక, ఏడేళ్ల బాలికను చండిక, ఎనిమిదేళ్ల బాలికను శాంభవి, తొమ్మిదేళ్ల బాలికను దుర్గ, పదేళ్ల బాలికను సుభద్ర అని వ్యవహరిస్తారు. ఈ పూజ వల్ల కష్టాలు తొలగిపోయి, అనుకున్నవి నెరవేరతాయని, రోగ, శత్రు బాధలు పరిహారమవుతాయిని విశ్వాసం.
‘బతుకు’ను పండించే బతుకమ్మ
‘అమ్మ’ ఆరాధన ప్రాంతాలను బట్టి మారు తుంటుంది. తెలంగాణలో జగన్మాతను ‘బతుకమ్మ’ పేరుతో పూజిస్తారు. ఆ గ••డ్డపై పుట్టిన ఈ పండుగ విశ్వవ్యాప్తమైంది. భాద్రపద అమావాస్య (మహాలయ అమావాస్య) నాడు ప్రారంభమై తొమ్మిదిరోజుల పాటు సాగి దుర్గాష్టమి నాడు ‘చద్దుల బతుకమ్మ’గా జలప్రవేశం చేస్తుంది. ప్రకృతిలోని అందాలకు, ఆనందాలకు, ఆరాధనాలకు నిలయమైన పూవులను పూజించడమే బతుకమ్మ పండుగలోని విశిష్టత. గునుగు, మోదుగు, తంగేడు,
గుమ్మడి, తుంగ, బంతి, చామంతి, తమర, దోస, బీర, కాకర, పొట్ల, గన్నేరు మందారం,కట్ల తదితర పూలను సేకరించి బతుకమ్మను సృజనాత్మత•, నైపుణ్యాలతో పేరుస్తారు. బతుకమ్మ పాటలు జానపద సాహిత్యానికి అద్దం పడతాయి. ఈ పాటలలో పౌరాణిక, చారిత్రక సంఘటనలు, వాటి చుట్లూ అల్లుకున్న కథలు, కష్టసుఖాలు, విజయాలు, ఆ ప్రాంతవాసులు నిరంకుశ పాలనలో ఎదుర్కొన్న మానావమానాలపై దేవతకు మొరపెట్టుకున్న సంగ తులు తదితర అంశాలు ఉంటాయి. కాలక్రమంలో సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై పాటలు కట్టి బతుకమ్మ పాటలు పాడుకోసాగారు. నైజాం పాలనలోని పోలీసులు, జాగీర్దాలు, భూస్వా ములు, రజాకార్లు గుండ్రాంపల్లి, ఆకునూరు- మాచి రెడ్డిపల్లి, బాలెంల, బైరాన్‌పల్లి, కడివెండి, పాలకుర్తి తదితర పల్లెవాసుల పట్ల అమానుషంగా వ్యవహరిం చిన తీరును, ప్రజానీకం అందుకు వ్యతిరేకంగా సాగించిన వీరోచిత పోరును బతుకమ్మ పాటలలో నిక్షిప్తం చేశారు. ‘మన్నూ మిన్నూ ఉండేదాకా/ సూర్యుడు చంద్రుడూ ఉండేదాకా/చుక్కలు మింటిలో కులికేదాకా/కాలచక్రము తిరిగేదాకా’ బతుకమ్మ బతకాలని ప్రజాకవి కాళోజీ నారాయణరావు తమ ‘బతుకమ్మా బతుకు’ గేయంలో ఆకాంక్షించారు.
ఈ పండుగ కోసం నూతన వధువులు మెట్టినిళ్ల నుంచి పుట్టిళ్లకు చేరి, అత్తింటివారు పెట్టిన సొమ్ములు ధరించి బతుకమ్మను ఆటపాటలతో కొలవడం సంప్రదాయంగా వస్తోంది. బతుకమ్మ పండుగకు సంబంధించి ప్రచారంలో ఉన్న గాథలలో ఒకదాని ప్రకారం, మహిషాసురుడి పోరు సాగించి అలసి సుప్తాస్థితికి వెళ్లిన అమ్మవారికి మహిళలు గానయుక్తంగా సేవలు చేయడంతో ఆమెకు తొమ్మిదవనాడు అలసట తీరిందట. దుష్టసంహారంతో బతుకును ప్రసాదించిన జగన్మాతను జానపదులు ‘బ్రతుకమ్మ’ అని పిలుచుకుంటారు. మరో గాథ ప్రకారం, తండ్రి దక్షప్రజాపతి వల్ల కలిగిన అవమానంతో యజ్ఞ గుండంలో దూకి ఆహుతి అయిన సతీదేవిని పసుపు ఆకారంలో బతుకమ్మగా ఆరాధించారని జానపద కథనం.
బొమ్మలకొలువు
దేవీ నవరాత్రులలో బొమ్మల కొలువు ఒక ముచ్చట. ఐదు లేదా తొమ్మిది మెట్లుగా పీఠం ఏర్పరచి వరుసగా బొమ్మలు పేర్చుతారు. బేసి సంఖ్యలో (3,5,7,9) మెట్లున్న వేదికను ఏర్పాటు చేసి బొమ్మలను అమర్చుతారు. తొమ్మిది మెట్లు ఏర్పాటు చేయడం శుభస్కరంగా చెబుతారు. జగన్మాత ధరించిన నవరూపాలకు, నవగ్రహాలకు చిహ్నమే ఈ మెట్లు అని చెబుతారు.అమ్మవారిని ఆవాహన చేసి అర్చించడం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయని విశ్వాసం. పైమెట్టు మీద శ్రీదేవి ప్రతిమను ఉంచి అటుఇటు ఇతర దేవతా ప్రతిమలు, తరువాత మెట్లపై వరుసగా పక్షులు, మనుషులు, జంతువులు, చెట్లు- ఉద్యానవనాలు, జలచరాల బొమ్మలు అమర్చుతారు. ప్రతిరోజు దేవీగాథలు పారాయణం చేస్తారు. నైవేద్యం పెట్టి, ముత్తయిదువులకు తాంబూలాలు ఇస్తారు.
సంక్రాంతి, దసరా పండుగల సమయంలో పెట్టే బొమ్మల కొలువులలో కాస్త వ్యత్యాసం ఉంది. ఇది కన్నెలు చేసుకునే వేడుక కాగా సంక్రాంతి వేళ పెట్టే బొమ్మల కొలువులో ముత్తైదువలు ప్రధానంగా పాల్గొంటారు. అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యం సమర్పిస్తారు. నవరాత్రులు ముగిసిన తరువాత ఆ బొమ్మలను తీసి భద్రపరుస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఒక కొత్త బొమ్మనైనా ఈ ‘కొలువు’లో చేర్చాలని నియమం.
ఈ పండుగల వేళ దాదాపు ప్రతి ఇంట్లో బొమ్మల కొలువు ఉండేది. యాంత్రిక జీవితంలో తగ్గుముఖం పట్టింది. యాభయ్యో పడిలో ఉన్న వారికి ఆ అనుభూతి గురించి తెలిసి ఉండవచ్చు. దసరావేళ చుట్టుపక్కల పన్నెండేళ్లలోపు పిల్లలంతా అక్కడికి చేరి పాటలు పాడేవారు. స్నేహ సంబంధాలు ఏర్పడి, ఇచ్చిపుచ్చుకునే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడతాయనేది కూడా ఈ పండుగలోని ఆంతర్యంగా చెబుతారు.