– నాగేంద్రకుమార్‌ ‌వేవూరి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

హైదరాబాద్‌ ‌శివార్లలో అనేక కొత్త ఇళ్లతో అభివృద్ధి చెందుతున్న నూతన కాలనీ. సుందరనగర్‌లో అదో అంద మైన చిన్న డూప్లెక్స్ ఇల్లు. బయట కాంపౌండ్‌ ‌వాల్‌ ‌గేటు పక్కన గోడలో ఫిక్స్ ‌చేసిన నేమ్‌ ‌ప్లేట్‌ ‌మీద ‘డా. శంతను కుమార్‌, ‌సైంటిస్ట్.’ అని ఉంది.

ఆ వీధిలో ఓ అంబులెన్స్ ‌వస్తున్న శబ్దం వినిపించింది.

వెంటనే ఆ ఇంట్లో నుండి ఓ రెండేళ్ల పసివాడు తప్పటడుగులు వేస్తూ గబగబా గేటు దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చి గేటుకు తాళంవేసి ఉండటంతో ఆగిపోయాడు. అదే సమయంలో వారింటి ముందు నుండి అంబులెన్స్ ‌వేగంగా వెళ్లిపోతుంటే దానిని ఆపమని చేయి ఊపుతూ ఆతృతగా ‘డాడీ.. డాడీ’ అని అరుస్తున్నాడు.

అది చూసి ‘నానీ..’ అని అరుస్తూ ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన ఇరవై తొమ్మిదేళ్ల వయసున్న శిరీష ఆ బాబుని అమాంతం ఎత్తుకుంది.

ఆమెను బేలగా చూస్తూ.. ‘మమ్మీ…డాడీ…’ అంటూ కన్నీరుబుకుతుండగా అంబులెన్స్ ‌వెళ్లిన వైపు చేత్తో చూపించాడు నాని.

శిరీష కళ్లు కూడా చెమర్చగా ఓ చేత్తో నాని కన్నీళ్లు తుడుస్తూ ‘డాడీ కాదమ్మా..’ అంటూ నానీని ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు మూసింది..

‘మరి.. డాడీ ఎప్పుడొస్తారు..?’

అని బేలగా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా… శిరీష కన్నీళ్లతో నానీని చూస్తూ గతాన్ని తల్చుకుంది.

 * * * *

ప్రతిష్ఠాత్మకమైన ఓ జాతీయస్థాయి మైక్రోబియల్‌ ‌పరిశోధనా కేంద్రంలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న శంతను కుమార్‌ ‌తన అభిరుచికి అనుగుణంగా డిజైన్‌ ‌చేసి కట్టించుకున్న డూప్లెక్స్ ‌బంగ్లాలో ప్రవేశించి ఆనాటికి సరిగ్గా నెల అయి ఉంది.

చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగం, మంచి జీతం, అందమైన భార్య శిరీష, రెండేళ్ల కొడుకు నానీతో ఎంతో ఆనందంగా ఉన్న శంతను అంటే ఎంతో మందికి అభిమానం.

ఆరోజు రాత్రి శంతనుకి తమ సంస్థ డైరెక్టర్‌ ‌నుంచి ఈ-మెయిల్‌ ‌వచ్చింది.

శంతను రీసెర్చ్ ‌చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సూచనలు చేసేందుకు మర్నాడు ఢిల్లీలో జరగనున్న ఓ అంతర్జాతీయ సెమినార్‌కి తమ టీమ్‌ ‌లీడర్‌తో పాటు శంతనుని కూడా రమ్మని ఆ మెయిల్‌ ‌సారాంశం.

ఆ మర్నాడు ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్లిన శంతను ఆ రాత్రి వీడియో కాల్‌ ‌చేసి శిరీషతో మాట్లాడి మరో రెండు రోజులలో తాను తిరిగి వస్తానని చెప్పాడు. నానికి ఫోన్‌లోనే ముద్దులిచ్చాడు.

రెండో రోజు సాయంత్రం హైదరాబాద్‌ ఎయిర్‌ ‌పోర్ట్‌లో దిగిన వెంటనే శిరీషకి కాల్‌ ‌చేసిన శంతను మరో గంటలో ఇంటికి చేరుకుంటానని చెప్పాడు.

వెంటనే స్నానం చేసి శంతనుకి ఇష్టమైన చిలకాకు పచ్చ చీర కట్టుకుని, తల నిండా మల్లెపూలు పెట్టుకుని, నానిని ఎత్తుకుని శంతను రాకకై గేటు వైపు చూస్తూ ఉంది శిరీష.

కొన్ని నిమిషాలు గడిచేసరికి ఆఫీస్‌ ‌కారు తమ ఇంటి వైపు వస్తూ కనిపించగానే నానికి ఆ కారును చూపుతూ ఆనందంగా ‘అదిగో.. డాడీ వచ్చేస్తున్నారు..’ అనగానే కారు వారింటి ముందుకొచ్చి ఆగటం, దానిలోంచి శంతను దిగటం చూసిన నాని ఆనందంగా నవ్వుతూ చేతులూపాడు.

సరిగ్గా అదే సమయంలో రయ్‌ ‌మంటూ ఓ పోలీస్‌ ‌జీప్‌తో పాటు విజిల్‌ ‌శబ్దం వేసుకుంటూ స్పీడుగా వచ్చిన ఓ అంబులెన్స్ అక్కడ ఆగాయి. ఇంట్లోకి వెళ్లబోతు శంతను ఆశ్చర్యంగా ఆ వాహనాలను చూస్తుండగానే జీప్‌ ‌లోంచి దిగిన పోలీస్‌ ఆఫీసర్‌ ‌వేగంగా శంతను దగ్గరకు వచ్చి ‘ఎక్స్‌క్యూజ్‌ ‌మీ.. మీరు డాక్టర్‌ ‌శంతన్‌ ‌కుమార్‌ ‌కదూ?’’

అతనిని ఆశ్చర్యంగా చూస్తూ

‘ఎస్‌.. అయాం డా.శంతన్‌ ‌కుమార్‌.. ‌వాటీజ్‌ ‌ది మేటర్‌..?’’

‘‌సార్‌..‌మీరు వెంటనే ఆ అంబులెన్స్‌లోకెక్కండి..’

‘బట్‌..‌వై..?’

ఆశ్చర్యానికి, అసహనం తోడవ్వగా ప్రశ్నించాడు శంతన్‌.

‘‌సార్‌.. ‌మీకు తెలుసుగా కరోనా సృష్టిస్తున్న కల్లోలం గురించి. ఇప్పటికే కొన్ని వేలమంది చనిపోయారని.. అదొక అంటువ్యాధనీ… మిమ్మల్ని ఢిల్లీలో కలిసిన చైనా సైంటిస్ట్ ఒకాయన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కరోనా వల్ల చనిపోయాడట..

కాబట్టి అతనిని కలిసిన వారందరినీ ఇతరులతో కలవనీయకుండా వెంటనే క్వారెంటైన్‌కి తరలించ మని పైనుంచి ఆర్డర్స్ ‌వచ్చాయి. అందుకే మీరు వెంటనే అంబులెన్స్ ఎక్కండి.’ ఆదేశిస్తున్నట్లు చెప్పాడు.

‘సరే.. ఐ అండర్‌ ‌స్టాండ్‌ ఇట్‌.. ఒక్కసారి ఇంట్లోకి వెళ్లి….’

‘నో సార్‌.. ‌యూ ఆర్‌ ‌నాట్‌ ఎలౌడ్‌ ‌టు మీట్‌ ఎనీ ఒన్‌.. ఒకవేళ బై ఛాన్స్ ‌మీకు గనుక కరోనా వచ్చి ఉంటే దానిని మీ ఫ్యామిలీకి కూడా పాస్‌ ‌చేయడం మీకిష్టమా..?’’

పోలీస్‌ ‌ప్రశ్నతో విషయం అర్థం చేసుకున్న శంతను శిరీషతో దూరం నుంచే..

‘ఇట్స్ ఓన్లీ ఫర్‌ ‌మెడికల్‌ ‌టెస్ట్ ‌పర్పస్‌ ‌శిరీషా.. అయిపోగానే వచ్చేస్తాను.. డోన్ట్ ‌వర్రీ’ అని.. నానీనుద్దేశించి ‘నానీ బై బై..’’ అంటూ గాల్లో ఓ ముద్దిచ్చి అంబులెన్స్ ఎక్కాడు.

వెంటనే అంబులెన్స్ ‌బయల్దేరింది.

అది చూసిన నాని విషయం తెలి యక తన తల్లికి అంబులెన్స్‌ని చూపుతూ

 ‘డాడీ..’ అంటూ ఏడవ బోతే..

‘డాడీ వచ్చేస్తారు ఏడవ కమ్మా..’ అంటూ నానీని సముదాయిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లి పోయింది శిరీష.

ఆ మర్నాడు సాయంత్రం శంతను రాకకై ఎదురు చూస్తున్న శిరీషకి అతని బాస్‌ ‌ఫోన్‌ ‌చేసి ‘శంతనుకి కరోనా పాజిటివ్‌ అని తెలిసింది.. స్పెషల్‌ ‌వార్డ్‌లో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు.. త్వరలో తగ్గిపోతుంది.. ధైర్యంగా ఉండమ్మా..’ అని చెప్పేసరికి దుఃఖం పొంగుకొచ్చింది శిరీషకి..

గద్గద స్వరంతో ‘సరేనండి’ అని ఫోన్‌ ‌పెట్టేసి నానీని పట్టుకుని తనివి తీరా ఏడ్చింది..

అలా వారం రోజులు అత్యంత భారంగా గడి చాక ఓ రోజు తమ ఇంటి ముందు ఆఫీస్‌ ‌వెహికిల్‌ ఆగటంతో ఆతృతగా బయటికొచ్చిన శిరీషని చూసిన శంతను బాస్‌.. ‘‌సారీ అమ్మా.. భగవంతుడు నీ కింత అన్యాయం చేస్తాడనుకోలేదు. కరోనా మహమ్మారి బారినపడిన శంతను లాంటి ప్రతిభావంతుడైన యువ శాస్త్రవేత్తను ఈ దేశం కోల్పోవటం, అతని మృతదేహాన్ని కూడా మీరు చూడలేకపోవడం దురదృష్టకరం..’

ఆ తర్వాత అతనేం చెప్పాడో వినిపించలేదు శిరీషకి..

అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయిన శిరీషకి తెలివి వచ్చేసరికి ఓ హాస్పిటల్లో ఉంది..

శంతను వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే ఒకమ్మాయి నానీని ఆడిస్తూ కనిపించింది.

 శిరీష దగ్గరకు వచ్చి నానీని అందించింది ఆమె.

నానీని గుండెలకు హత్తుకుని కన్నీళ్లు ధారా పాతంగా వర్షిస్తుండగా

‘కనీసం చివరిచూపు కూడా దక్కని దురదృష్ట వంతురాలిని..’’ అని ఏడుస్తుంటే శిరీషని ఓదార్చలేక నిస్సహాయంగా నిలుచుండి పోయిందామె.

ఇహంలో కొచ్చిన శిరీషని నిస్సహాయంగా చూస్తున్నట్లున్నాయి గోడ మీద గల తమ ముచ్చటైన ఫ్యామిలీ ఫొటోలోని శంతను చూపులు.

About Author

By editor

Twitter
YOUTUBE