కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌స్ఫూర్తి, సౌజన్యంతో రాసీ సాంస్కృతిక సేవా సంస్థ (పబ్లిక్‌ ‌చారిటబుల్‌ ‌ట్రస్ట్) ‘శ్రీ‌మదాంధ్ర మహాభారత అవతరణ సహస్రాబ్ది, నన్నయ సహస్రాబ్ది’ ఉత్సవాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా మహాభారతం పుట్టిన రాజమహేంద్ర వరం (జూలై 23న)లో తొలి ఉత్సవాలను, విశాఖ తీరంలో మలి వేడుకలను, హైదారాబాద్‌లో ముగింపు ఉత్సవాన్ని నిర్వహించింది.

రాసీ సాంస్కృతిక సేవా సంస్థ గత కొన్నేళ్లుగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్‌ ‌కె. సుహాసినీ ఆనంద్‌. ఈమె మహిళా పారిశ్రామికవేత్తగా, గాయనిగా, ప్రయోక్తగా, రాజకీయ నేతగా విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. రాసీ కేర్స్ ‌మనుచరిత్రం, ఆముక్తమాల్యద, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్రను ఆడియో రూపంలో ప్రపంచానికి అందించింది.

విశాఖలో..

జూలై 30, 2022న విశాఖపట్టణంలో నిర్వ హించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిజోరాం గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌కంభంపాటి హరిబాబు హాజర య్యారు. ప్రభుత్వాలు సాహితీ, సాంస్కృతిక, సంప్ర దాయ కళలకు రాజపోషకులుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కళల పోషణకు నాటి పాల కులు శ్రీకృష్ణ దేవరాయలు, రాజరాజ నరేంద్రుడు తరహాలో నేటి ప్రభుత్వాలు చేయూతనందించి తరతరాలకు విలువైన సంపదను వారసత్వంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పక్రియను మనం రెండు వందల క్రితం వాడుకలోకి తెచ్చాం. కానీ శాస్త్ర, సాంకేతికతలకు మన పురాణ గ్రంథాలే మూలం. మన ప్రాచీన గ్రంథాలు కథలు కాదు. నేటి సాంకేతిక పక్రియకు నాడే వేసిన మార్గదర్శకాలని హరిబాబు అన్నారు.

‘విమానాన్ని తయారు చేసుకునే ఆలోచన మనకు రామాయణం ఏనాడో అందించింది. ఆధునిక క్షిపణులకు మన పురాణాలలోని అస్త్రాలే స్ఫూర్తి. హిమాలయాల్లో తపస్సు చేసుకునే రుషులు ఏ ప్రాంతంలో, ఏం జరుగుతుందో తమ దివ్యజ్ఞానంతో తెలుసుకుంటారు. ఆ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన సాంకేతికత శాటిలైట్‌ ఉపగ్రహాల ద్వారా మనం పడక గదిలో నుంచే వీక్షిస్తున్నాం. వేద గణితంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్‌ ‌చిలుకూరి శాంతమ్మ చేసిన పరిశోధనలు మన పౌరాణిక గ్రంథాల శక్తిని ప్రపంచానికి చాటాయి. తక్కువ జనాభా ఉన్నప్పటికీ తమ భాష, అస్తిత్వం కోసం పాటుపడుతున్నాయనేందుకు నేను గవర్నర్‌గా ఉన్న మిజోరాం ఉదాహరణ. మిజో భాషకు లిపి లేదు. తమ భాషను రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని పట్టుపడుతున్నారు. అత్యధికులు మాట్లాడే తెలుగు పట్ల మనమే నిర్లిప్తంగా వ్యవహరించడం సరికాదు. మాతృభాషలను ప్రోత్సహించే క్రమంలో, వాటిలో విద్యను బోధించాలని కేంద్రం సంకల్పించింది. ఆ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలుగు భాషను కాపాడుకోవాలి. మన భాషను మనమే సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని హరిబాబు తెలిపారు.

ధర్మమే సాధనం

ఎలా బతకాలో నేర్పేది ధర్మమని, అది మన భారతీయ సంస్కృతి ప్రత్యేకత అని, అదే ప్రధాన సాధనంగా ముందుకు నడుపుతోందని పరిపూర్ణా నంద స్వామీజీ అన్నారు. మనిషి మనుగడకు ధర్మం, అర్థం, కామం, మోక్షాలే ముఖ్యమన్నారు. ‘ఈ దేశం మహాభారతానికి పుట్టినిల్లు. దీనికి ‘ఇండియా’ అనే పేరు రాకముందు భారత్‌ (‌భారతం పుట్టింది ఇక్కడే కాబట్టి). అంతకుముందు ఆర్యావర్త దేశం, బ్రహ్మావర్త దేశం, గోవ్రత దేశం అని పేరు. అందుకే ‘గో బ్రాహ్మణేభ్యః… లోకా సమస్తా సుఖినోభవంతు’ అంటారు. మహాభారతం ఐదు వేల సంవత్సరాల నాటిది. భూమ్మీద సనాతన ధర్మం తప్ప మరే ఇతర మతం లేదు. ఈజిప్టు కల్చర్‌ ‌వంటివి కాలగర్భంలో కలసిపోయాయి. శ్రీమద్రామాయణం, మహాభారతం తదితర ఇతిహాసాలు, ఇతర సాహిత్య పక్రియల జాబితా చాలా పెద్దది. విలువలను నేర్పిన వాటిని భావితరాలకు భద్రపరచడం మన కర్తవ్యం’ అని ఉద్బోధించారు.

తల్లిదండ్రులూ! తెలుగు నేర్పండి..

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో ఈ తరహా ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఆదికవి నన్నయ గొప్పదనాన్ని భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమని చెప్పారు. ఇటీవల తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం మర్చిపోతున్నారని, పిల్లలకు తల్లి దండ్రులు మాతృభాషను నేర్పాలని రోజా సూచిం చారు. నానా రుచిరార్థ పద్యం చదివారు. నన్నయ అక్షర రమ్యత చాలా గొప్పదని తెలియజేయడానికి తాను ఏర్చి కూర్చి తెచ్చుకున్న పద్యపంక్తులను సభికులకు చదివి వినిపించారు.

విలువలను కాపాడుకోవాలి

తెలుగు జాతి ఉన్నంతకాలం ఆదికవి నన్నయ్య నిత్య చిరస్మరణీయులని, మహాభారతం చదివి అర్థం చేసుకుంటూ, వాటిని భావితరాలకు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) పాలక మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విలువలను కాపాడుకోవాలని సూచించారు. తితిదే ఆధ్వర్యంలో ప్రచురించిన గ్రంథాలను •ంండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

అందరి ఆశీర్వచనాలతో…

ఉత్సవాల నిర్వాహకురాలు డాక్టర్‌ ‌కె. సుహాసినీ ఆనంద్‌ ‌మాట్లాడుతూ ఎందరో పండితులు సూచనలు, ఆశీర్వచనాలతో రెండు తెలుగు రాష్ట్రాలలో మహోత్సవాలు తలపెట్టామని, ఆంధ్ర మహాభారతం రాజమహేంద్రవరంలో పుట్టింది కనుక పెద్దల సూచన మేరకు తొలి ఉత్సవాన్ని జూలై 23న నిర్వహించామని, ఈ కార్యక్రమానికి బీజం పడ్డానికి మూలకారణం తన మేనమామ నడిపల్లి సీతారామయ్య అని తెలిపారు.

భాగ్యనగరంలో ముగింపు ఉత్సవాలు..

ఆగస్ట్ 13, 2022‌న భాగ్యనగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (పబ్లిక్‌ ‌గార్డెన్స్) ఆడిటోరియంలో ఆంధ్ర మహాభారత అవతరణ, నన్నయ్య సహస్రాబ్ది ముగింపు మహోత్సవాలు వైభంగా జరిగాయి. ఈ ఉత్సవానికి హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ, మహా సహస్రావధాని డాక్టర్‌ ‌గరికిపాటి నరసింహారావు, ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం, తెలంగాణ శాసన మండలి సభ్యురాలు సురభి వాణీదేవి, సత్యవాణి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

ఉడుపి పెజావర్‌ ‌మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థాచార్య స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు.

About Author

By editor

Twitter
YOUTUBE