– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్
ఈసారి షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)పై ప్రపంచ మీడియా ఎక్కువ ఆసక్తి ప్రదర్శించిందన్న మాట వాస్తవం. ఇందుకు కారణమేంటనేది ఊహించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మొదటిది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యం కాగా, భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం రెండో కారణం. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆమెరికా దాని మిత్రదేశాలు రష్యాను ఏకాకిని చేసే ప్రయత్నంలో భాగంగా భారత్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొని వస్తున్న నేపథ్యంలో, మనదేశం అనుసరిస్తున్న ‘స్వతంత్ర విదేశాంగ విధానం’ అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నది. రష్యా మనకు ‘అన్ని కాలాల మిత్రుడు’ రష్యాతో స్నేహం వదులుకోవడం అనేది భారత్ కలో కూడా ఊహించనిది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య భేటీ ఏవిధంగా ఉండబోతున్నదనేది ప్రపంచ మీడియా యావత్తు ఆసక్తితో వీక్షించింది.
మోదీ-పుతిన్‌ల మధ్య ఎంతటి గాఢమైన స్నేహానుబంధం ఉన్నదీ ప్రపంచదేశాలకు బాగా తెలుసు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపగలిగే శక్తి ఒక్క భారత్‌కు మాత్రమే ఉన్నదన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యాప్తిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇది కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇరు దేశాధినేతల మధ్య జరిగే తొలి ప్రత్యక్ష సమావేశం కావడం విశేషం. ‘ఇది యుద్ధాల కాలం కాదని, ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని’ మోదీ రష్యా అధ్యక్షుడిని కోరారు. ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న ఆహార, ఇంధన సంక్షోభాలపై దృష్టిసారించాల్సిన తరుణం ఇదని ఆయన చెప్పారు. దౌత్యమే సమస్యలకు పరిష్కారమని చెప్పి, ఈ విషయం మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పానని మోదీ నిర్మొహమాటంగా చెప్పడం వెనుక, అంతర్జాతీయ ఒత్తిడి ప్రభావం ఉన్నదని చెప్పక తప్పదు. అంతమాత్రం చేత రష్యా-భారత్‌ల స్నేహా నికి వచ్చిన ప్రమాదమేం లేదు. మోదీ మాటల్లోని అంతరార్థాన్ని గుర్తించిన పుతిన్ ‘ఉక్రెయిన్ యుద్ధంలో మీ ఆందోళన మాకు తెలుసు. సాధ్యమైనంత త్వరలో దీన్ని ముగించేందుకు చేయాల్సినవన్నీ చేస్తాం’ అని సమాధానమివ్వడం విశేషం. ఈ పరిస్థితుల్లో మరే ఇతర దేశాధినేతకైనా పుతిన్ నుంచి ఇటువంటి సమాధానం కచ్చితంగా రాదు. అంతేకాదు రష్యాలో పర్యటించేందుకు మోదీని ఆహ్వానించారు కూడా! అదే భారత్‌కున్న ప్రత్యేకత! రష్యాపై బలవంతంగా యుద్ధాన్ని రుద్ది, మళ్లీ అదే రష్యాపై ఆంక్షలు విధించి, అందుకు తామే నిండా మునిగిన అమెరికా నేతృత్వంలోని ఐరోపా దేశాలు, భారత్‌ను కూడా అదేబాటలోకి రమ్మని కోరడమంత విచిత్ర దౌత్యనీతి మరొకటి లేదు. ఈ భేటీ నేపథ్యంలో పుతిన్ అంతర్జాతీయంగా మరింత ఒంటరి అయ్యాడంటూ అమెరికా వ్యాఖ్యానించడం, భారత్ తనకు అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవడం కోసమే. ఇక పశ్చిమ దేశాల మీడియా సరేసరి. దీనిపై పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యలు, కథనాలు రాసుకొస్తున్నాయి. అమెరికా ప్రధాన మీడియా సెప్టెంబర్ 16న మోదీని ఆకాశానికెత్తేసింది. ఈ ప్రచార యుద్ధం మామూలే! ‘జరిగింది చిటికడంత, ప్రచారం కొండంత!’
ఇక రెండో ప్రధాన అంశం మోదీ-జిన్‌పింగ్‌లు ఎస్‌సీఓ వేదికను పంచుకోవడం. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు పక్కనే నిలుచున్నా, ఎడమొగం పెడమొగంగానే ఉండటం గమనార్హం. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇద్దరు నేతలు ఒకే వేదికపై ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే ప్రథమం. చైనా అధ్యక్షుడికి ప్రధాని నరేంద్రమోదీ దూరంగా ఉన్నారు. రెండేళ్ల ప్రతిష్టంభన తర్వాత హాట్‌స్ప్రింగ్స్ నుంచి రెండు దేశాల సైనికులు తిరుగుముఖం పట్టిన ప్రభావం కనిపించలేదు. ఇరువురు నేతలు కనీసం కరచాలనం కూడా చేసుకోలేదు. ఇక్కడ సరిహద్దు వివాద ప్రభావం స్పష్టంగా కనిపించింది. నిజానికి గత రెండేళ్ల నుంచి సరిహద్దు ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణకు ఎంతమాత్రం అంగీక రించని చైనా, ఒక్కసారిగా ఇందుకు నిర్ణయం తీసుకున్నదంటే రష్యా ఒత్తిడి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. భారత్‌తో విరోధం పెట్టుకుంటే ప్రపంచంలో ఏకాకి కావాల్సి వస్తుందన్న సత్యాన్ని రష్యా స్పష్టంగా చెప్పడమే చైనా తీసుకున్న నిర్ణయానికి కారణం కావచ్చు. ఇదిలా ఉండగా ఎస్‌సీఓ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ, దేశాన్ని ‘తయారీ రంగ హబ్‌గా’ మారుస్తామని, ప్రస్తుతం 70వేల స్టార్టప్‌లు, 100 యూనికాన్‌లు దేశంలో పని చేస్తున్నాయని చెప్పడం భారత్ ఎదుగుదల ఎంతమాత్రం ఇష్టంలేని జిన్‌పింగ్‌కు కొరుకుడు పడని అంశమే. ఇదే సమయంలో ఈ ఏడాది భారత్ జీడీపీ వృద్ధి 7.5% ఉండబోతున్నదని ప్రధాని చెప్పడం కూడా, ప్రపంచంలో ఏ దేశమూ అభివృద్ధిలో ప్రస్తుతం భారత్‌తో పోటీపడే స్థితిలో లేవన్న సంగతిని స్పష్టం చేసింది. వాస్తవానికి జీడీపీ పరంగా అభివృద్ధిలో ఏ దేశమూ భారత్ దరిదాపుల్లో లేవు. వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ చైనా 4.4%, అమెరికా 3.7% జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. ప్రస్తుతం చైనాలో రియల్ ఎస్టేట్ రంగం, పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ‘జీరో కొవిడ్’ విధానం కింద అమలుచేస్తున్న కఠిన నిబంధనలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. దీనికితోడు ఒక పక్క అతివృష్టి, మరోపక్క అనావృష్టి చైనాను కుదిపేస్తున్నాయి. ప్రపంచ తయారీ కేంద్రంగా ఉన్న చైనా స్థానాన్ని భర్తీ చేయడానికి భారత్ దూసుకెళ్తోంది. ఇది చైనాకు పుండుమీద కారం చల్లడం వంటిదే!!
ఎన్‌సీఓలో చేరిన ఇరాన్
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)లో సభ్యురాలిగా చేరేందుకు ఇరాన్ ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. సమర్‌ఖండ్‌లో జరుగుతున్న శిఖరాగ్ర సమావేశంలో ఇరాన్‌ను చేర్చుకునే విషయంలో ఎనిమిది దేశాలు తుదినిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ సంతకం జరిగింది. సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు రైసీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ సెప్టెంబర్ 15న భేటీ సందర్భంగా కూటమిలో ఇరాన్ భాగస్వామి కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడం, ఉక్రెయిన్‌పై సైనికచర్య విషయంలో తటస్థ వైఖరి అవలంబి స్తున్నందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలపడం, జిన్‌పింగ్, రష్యాకు మద్దతు పలకడం ఆనవాయితీగా జరిగినవే. అత్యవసర మౌలిక సదుపాయంగా పాకిస్తాన్‌కు గ్యాస్ సరఫరా చేయగలమని పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సమర్‌ఖండ్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో హామీ ఇవ్వడం ఇక్కడ కీలకాంశం. ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం యూరప్ దేశాలకు సహజవాయు సరఫరాలను నిలిపేసిన రష్యాకు కొత్త మార్కెట్లు అవసరం. పాకిస్తాన్ అందుకు అంగీకరిస్తే, అదే పైప్‌లైన్‌ను భారత్‌కు పొడిగించవచ్చు. అంతేకాదు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా భారత్ గుండా ఈ పైప్ లైన్ సహాయంతో రష్యాకు కొత్త మార్కెట్లుగా రూపొందు తాయి. పాక్ గ్యాస్ పైప్‌లైన్‌కు అంగీకరిస్తేనే రష్యా లక్ష్యం నెరవేరుతుంది. యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కు పాకిస్తాన్ ద్వారా ఆయుధ సరఫరాలు చేస్తున్న నేపథ్యంలో, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశంపై నిప్పులు చెరగకుండా పైప్‌లైన్ ప్రస్తావన తీసుకు రావడం వెనుక ఉన్న అసలు కథ ఇదీ!
ఎస్‌సీఓ ఆవిర్భావం
2001లో షాంఘైలో ఏర్పాటైన ఎస్‌సీఓలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు సభ్యులుగా కొనసాగుతున్నాయి. అఫ్ఘానిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా దేశాలు పరిశీలక హోదాలో; అర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ దేశాలు చర్చల భాగస్వాములుగా పాల్గొన్నాయి. మరోవైపు రిపబ్లిక్ ఆఫ్ బెలారస్‌ను ఎస్‌సీఓలో సభ్యురాలిగా, మాల్దీవులు, బెహ్రైన్, మయన్మార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్‌లను చర్చల భాగస్వాములుగా చేర్చుకునేందుకు విధి విధానాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో మొత్తం 15 దేశాధినేతలు పాల్గొన్నారు. కాగా ఎస్‌సీఓ-2022కు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షత వహిస్తోంది. సమర్‌ఖండ్ సదస్సు తర్వాత రొటేషన్ ప్రాతిపదికన భారత్ ఎస్‌సీఓకు అధ్యక్షత వహించనున్నది. 1996లో షాంఘై-5 ఏర్పాటుకాగా, 2021లో ఉజ్బెకిస్తాన్‌ను సభ్యురాలిగా చేర్చుకొని షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)గా రూపొందింది. 2017లో ఇండియా, పాకిస్తాన్‌లు ఇందులో సభ్యత్వాన్ని పొందగా, 2021లో ఇరాన్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. దీంతో ఎస్‌సీఓ ఒక బహుపాక్షిక సంస్థగా రూపుదిద్దుకొంది. ప్రపంచ జీడీపీలో 30%, ప్రపంచ జనాభాలో 40% వాటాను ఈ దేశాలు కలిగి ఉండటం ఎస్‌సీఓ ప్రాధాన్యం సంతరించుకోవడానికి ప్రధాన కారణం. దీని ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా వచ్చే డిసెంబర్‌లో జరిగే ఐరాస భద్రతామండలి సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. 2023లో ఇండియా ఎస్‌సీఓకు అధ్యక్షురాలిగా కొనసాగడమే కాదు, జీ20 దేశాలకు కూడా అధ్యక్షత వహించనుంది. ఈ నేపథ్యంలో ఎస్‌సీఓలో భారత్ ప్రాధాన్యం పెరిగింది. ఈసారి ఎస్‌సీఓలో మరో విశేషమేమంటే ఎస్‌సీఓ తొలి పర్యాటక, సాంస్కృతిక రాజధానిగా వారణాసిని గుర్తించడం! 2022-23 సంవత్సరానికి వారణాసి ఈ హోదాలో కొనసాగుతుంది.
చైనా ద్వంద్వనీతి
అగ్రరాజ్య హోదా కోసం పోటీ పడుతున్న చైనా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ప్రస్తుత యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బహుళ ధృవాత్మక ప్రపంచం అవసరమని వాదించే చైనా, ఆసియాలో భారత్ ఎదుగుదలను ఎంతమాత్రం సహించలేదు. ఇదీ చైనా ద్వంద్వనీతి! ఈ నేపథ్యం లోనే చైనాకు అడ్డుకట్ట వేయడానికి ఇండియా.. అమెరికా, దాని మిత్ర దేశాలతో స్నేహ సంబంధా లను నెరపుతోంది. నిజానికి 1970 ప్రాంతంలో ఒకవైపు ప్రచ్ఛన్న యుద్ధం, మరోవైపు ప్రపంచీకరణ విస్తరిస్తున్న తరుణంలో రెండు దేశాలు కలిసి వృద్ధి సాధిస్తాయని అంతా భావించారు. అందుకనుగుణం గానే ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంక్, షాంఘై సహకార సంస్థ, ఈస్ట్ ఆసియా సమ్మిట్, బ్రిక్స్ (బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా) వంటి బహుళ వేదికల్లో ఈ రెండు దేశాలు భాగస్వాములయ్యాయి. రెండు దేశాల మధ్య ‘విశ్వాస నిర్మాణ ఒప్పందాలు’ (సీబీఎం)లు కుదిరాయి. అయితే క్రమంగా ప్రపంచంలో చోటుచేసుకున్న ఆధిపత్య మార్పులతో చైనా వైఖరి మారిపోయింది. క్రమంగా ప్రాంతీయ స్థాయి నుంచి ఎదుగుతున్న చైనా, సీబీఎంలను ఖాతరుచేయడం మానేసింది. భారత సరిహద్దుల్లో దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తూ, భారత్‌ను ఇబ్బందులకు గురిచేయడం వంటి పరిణామాల నేపథ్యంలో అప్పటివరకు తటస్థవైఖరితో ఉన్న భారత్ క్వాడ్ వైపు మొగ్గుచూపడం మొదలైంది. ముఖ్యంగా 2017లో డోక్లాం ప్రతిష్టంభన భారత్ తన వైఖరిపై పునరాలోచించుకోవడానికి దారి తీసింది. ఇక 2020నాటి గల్వాన్ ఘర్షణ భారత్ పూర్తిస్థాయిలో క్వాడ్ వైపుకు మళ్లడానికి కారణమైంది.
భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ
ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’తో పాటు ఇతర ఉప ప్రాంతీయ, బహుపాక్షిక యంత్రాంగాల్లో పాలుపంచుకోవడాన్ని ఇండో- పసిఫిక్ వ్యూహంలో భాగమేనని చైనా మేధావులు పరిగణించడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ‘బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్, టెక్నలాజికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్’, ‘సెక్యూరిటీ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ విజన్ అండ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్’ వంటి యంత్రాంగాలు చైనాకు చెక్ పెట్టడానికే. మరి ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా అనుసరిస్తున్న ఈ అంశాలు భారత్‌కు ఎంతవరకు సానుకూల ఫలితాలిస్తాయో ఇప్పుడే చెప్పడం కష్టం కానీ, మనదేశం చైనాకు బాగా దూరంగా జరిగి, ఆగ్నేయాసియా దేశాల అను సంధాన ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి పెట్టిందనేది మాత్రం వాస్తవం. ఇండియా-మయన్మార్- థాయ్‌లాండ్ త్రైపాక్షిక హైవే నిర్మాణాన్ని ఇప్పుడు కంబోడియా, వియత్నాంలకు కూడా పొడిగించడం గమనార్హం. ఇది 2023 నాటికి పూర్తవుతుందని అంచనా. ఇదిలా ఉండగా చైనా తన ‘వన్ చైనా విధానాన్ని’ అంగీకరించాలని వాదిస్తుంది, కానీ కశ్మీర్ పరంగా ‘వన్ ఇండియా విధానాన్ని’ అంగీకరించక పోవడం విచిత్రం!
ఆర్థికంగా చైనాతో పోలిస్తే భారత్ ఇంకా వెనుక బడే ఉంది. ఆసియన్ దేశాలతో చైనా వ్యాపారం 878.2 బిలియన్ డాలర్లు కాగా భారత్ వాణిజ్యం 78 బిలియన్ డాలర్లు మాత్రమే. చైనాతో పోలిస్తే ఆగ్నేయాసియా దేశాలు భారత్‌తోనే దౌత్యానికి ఎక్కువ ఇష్టపడుతుండటం ఒక సానుకూల పరిణామం. అయితే తమకు భద్రత కల్పించే దేశంగా ఇంకా అవి యూఎస్‌నే విశ్వసిస్తున్నాయి. ఆ స్థానాన్ని అందుకోవడానికి భారత్ ఇంకా చాలా కృషిచేయాలి. ఇదిలా ఉండగా యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద భారత్, దక్షిణ చైనా సముద్ర తీరప్రాంత దేశాల్లో తన పలుకుబడిని వాటితో తన సంబంధాలను మెరుగు పరచుకోవడానికి కృషి చేస్తుందన్న సంగతి చైనాకు బాగా తెలుసు. దీన్ని మొదట్లోనే అడ్డుకోవడానికి హిందూ మహాసముద్రంలో తన ఉనికిని సుస్థిరం చేసుకోవడానికి చైనా యత్నిస్తోంది. ‘రుణ వ్యూహాన్ని’ అమలుచేయడం ఇందులో భాగమే.
కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే..
నిజం చెప్పాలంటే వేలాది సంవత్సరాలుగా భారత్-చైనాల మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాలు చైనా కమ్యూనిస్టు పార్టీ 1949లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత, ప్రధానంగా టిబెట్‌ను ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ కబ్జా చేసిన తర్వాత ఒడిదొడుకులకు లోనుకావడం ప్రారంభమై చివరికి పూడ్చలేని స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారానికి, సరిహద్దు వివాదం పెద్ద అడ్డంకిగా మారింది. మహాభారతంలో చైనాను ‘క్విన్’ (జౌ వంశ రాజుల పాలనా కాలంలో ఇది చైనా రాజ్యంపేరు) అని పేర్కొనగా, చాణక్యుడి అర్థ శాస్త్రంలో ‘చినమ్‌సుక’ (చీనాంబరం), ‘చిన్నపట్ట’ (పట్టు వస్త్రాల దొంతర) అని పేర్కొనడం గమనార్హం. బౌద్ధానికి ముందు భారత సాహిత్యంలో చైనా ప్రజలను ‘ఛినాస్’ అని పేర్కొనడం కనిపిస్తుంది. క్రీ.పూ. 1వ శతాబ్దలో భారత్ నుంచి బటావు (ఈయన షావ్‌లిన్ బౌద్ధారామానికి తొలి గురువు. ఇది హెనాన్ ప్రావెన్స్‌లోని, డెంగ్‌ఫెంగ్ కౌటీలో ఉంది), దక్షిణ భారతదేశానికి చెందిన బోధిధర్మ (చైనాలో ‘జెన్ స్కూల్ ఆఫ్ బుద్ధిజం’- మహాయాన బౌద్ధం స్థాపకుడు) మనదేశం నుంచి చైనాకు వెళ్లి నట్లు చరిత్ర చెబుతోంది. ఈయన పల్లవ వంశానికి చెందిన యువరాజు. అదేవిధంగా చైనాకు చెందిన జువాన్ జంగ్, ఇ ఛింగ్‌లు నలంద విశ్వవిద్యాలయ విద్యార్థులు. ప్రముఖ చైనా నవలాకారుడు ఊ ఛెంగెన్స్, మింగ్ రాజవంశంపై రాసిన ‘జర్నీ టు ది వెస్ట్’ అనే నవలకు జువాంగ్ జంగ్ భారత్‌లో తన పర్యటన విశేషాలపై రాసిన ‘గ్రేట్ టాంగ్ రికార్డస్ ఆన్ ది వెస్టర్న్ రీజియన్స్’ గ్రంథమే స్ఫూర్తి. చైనా సాహిత్యంలో గొప్ప శాస్త్రీయ నవలలుగా ప్రఖ్యాతి గాంచిన నాలుగు నవల్లో ‘జర్నీ టు ది వెస్ట్’ (మిగిలిన మూడు నవలలు వరుసగా ‘రొమాన్స్ ఆఫ్ ది త్రీ కింగ్‌డమ్స్’, ‘వాటర్ మార్జిన్’, ‘ది ప్లమ్ ఇన్ ది గోల్డెన్ వేజ్’) కూడా ఒకటి. ఇక చోళ రాజులకు చైనాకు చెందిన ‘సాంగ్ వంశ’ రాజులతో మంచి సంబంధాలుండేవి. ఒరిస్సాకు చెందిన భోహిస్ పాలకులు కూడా చైనాతో సముద్ర సంబంధాలు నెరపారు.
ఇక ఆధునిక యుగానికి వస్తే ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’ వ్యవస్థాపకుడు సన్ యెట్ సెన్ భారత్‌ను సహచర ఆసియన్ దేశంగా పేర్కొనడమే కాదు, పశ్చిమ దేశాల దోపిడీకి గురవుతున్న దేశంగా పరిగణించేవారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ‘పాన్-ఆసియన్’ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు కావాలనేది ఆయన ఆకాంక్ష. ఇప్పటికీ కోల్‌కతాలో ఓల్డ్ చైనా టౌన్, టెర్రిటీ బజార్ సమీపంలో సన్ యెట్ సెన్ పేరుతో ఒక వీధి ఉంది. 1939లో జవహర్‌లాల్ నెహ్రూ చైనాలో పర్యటించినప్పుడు ఆయన్ను ప్రభుత్వ అతిథిగా అక్కడి ప్రభుత్వం గౌరవించింది. అప్పటి చైనా ప్రముఖ అధినేత, మార్షల్ ‘చియాంగ్ కై-షెక్’ ఆయన భార్య సాంగ్ మిలింగ్‌ను నెహ్రూ ఎంతగానో మెచ్చుకున్నారు. సరిగ్గా అదే సమయంలో చాంగ్ క్వింగ్‌పై జపాన్ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో చియాంగ్, నెహ్రూలు బంకర్‌లో ఒకరాత్రి గడిపారు. చియాంగ్ కై-షెక్ దంపతులు 1942లో భారత్‌ను సందర్శించి వెళ్లిన తర్వాత కూడా నెహ్రూకు ఆయన లేఖలు రాసేవారు. భారత్ స్వాతంత్య్రం పొందాలని ఆయన ఆకాంక్షించారు. మహాత్ముని అహింసా సిద్ధాంతం పట్ల ఆయన పెద్దగా విశ్వాసం చూపలేదు. 1942లో కలకత్తాలో జిన్నా చియాంగ్ కై-షెక్‌ను కలిసి, ముస్లింలకు ప్రత్యేక రాజ్యానికి మద్దతివ్వాలని కోరగా, ‘చైనాలో పదికోట్ల మంది ముస్లింలు వివిధ సంస్కృతులతో మమేకమై జీవిస్తున్నారు. అట్లాంటిది తొమ్మిది కోట్లమంది భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరం లేదు’ అని కుండబద్దలు కొట్టారు. ఇందుకు జిన్నా, మహమ్మద్ జఫ్రుల్లాఖాన్ వంటి నాయకులకు కోపం వచ్చింది కూడా. 1949లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, కొమిటాంగ్ (రిపబ్లిక్ ఆఫ్ చైనా అధికార జాతీయ పార్టీ) ప్రభుత్వాన్ని ఓడించ డంతో చియాంగ్ కై-షెక్ తైవాన్‌కు వెళ్లి అక్కడే 1975 వరకు రిపబ్లిక్ ఆఫ్ చైనా అజ్ఞాత ప్రభుత్వాధి నేతగా కొనసాగారు. విచిత్రమేమంటే జవహర్‌లాల్ నెహ్రూ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, కొమిటాంగ్ ప్రభుత్వం మాదిరిగానే స్నేహపూరితంగా ఉంటుందని నమ్మారు. ఈ విశ్వాసాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం వమ్ము చేయడం, నెహ్రూను మానసికంగా దెబ్బతీసింది.