సంపాదకీయం
శాలివాహన 1944 శ్రీ శుభకృత్ భాద్రపద బహుళ విదియ – 12 సెప్టెంబర్ 2022, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
చుట్టుపక్కల ముస్లింలు ఉంటే అక్కడ హిందూ ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణ- రెండూ నిషిద్ధమే. పండుగలు, పర్వదినాలలో సాధుసంతులు వచ్చి ప్రసంగించడమూ చట్ట విరుద్ధమే. గ్రంథాలయాలు స్థాపించు కోవాలన్నా, పుస్తకాలు చదువుకోవాలన్నా సర్కారు అనుమతి తప్పనిసరి. ఇదీ నిజాం ఏలుబడి తీరు. ఈ సంస్థానంలో 87 శాతం హిందువులు. పది శాతమున్న ముస్లింలు మాట్లాడే పర్షియా అధికార భాష. కేఎం మున్షి రచన ‘ది స్ప్రాలింగ్ డికడెన్స్ ఆఫ్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్’ లోని కొన్ని వాక్యాలివి. ఆ సంస్థానంలో హిందువుల అణచివేత గురించి వందల రచనలు వచ్చాయి. ఆ చరిత్రను ఈ తరం దృష్టికి తేవడానికి ఉద్దేశించినవే నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలు.
క్రీస్తుశకం 1206 మొదలు క్రీస్తుశకం 1857 వరకు సాగిన ముస్లిం పాలన, పర్యవసానాల గురించి నేటి తరాలు తెలుసుకోవాలి. భారతీయులు ద్వితీయ శ్రేణి పౌరులు కావడం దాని ఫలితమే. ఇస్లాం తరహా పాలనకు చిరునామాల వంటి అనేక ప్రాంతాలు దేశంలో వెలిశాయి. దాని దుష్ప్రభావాలను చవిచూసిన ప్రదేశాలు ఇంకా ఎక్కువ. దీనికి ప్రతిఘటన ఎదురైనా అది తాత్కాలికమే అయింది. కారణం- హిందువుల అనైక్యత, చరిత్ర పట్ల స్పృహ లోపించడం. ఉదయ్‌పూర్, విజయనగరం, ఓరుగల్లు వంటి ప్రాంతాలు ముస్లిం మత రాజ్య విస్తరణను నిరోధించగలిగాయి. ఖిల్జీలూ, తుగ్లక్‌లూ, మొగలులూ నాడు పాల్పడిన అకృత్యాలను ఇప్పుడు గుర్తు చేయాలా? వాళ్లు కూల్చేసిన దేవాలయాల గురించి ఇప్పటి తరాలకు చెప్పాలా? అందువల్ల భారతదేశంలో సామరస్య వాతావరణానికి భంగం కాదా? అని ప్రశ్నించే కుహనా మేధావులు, దొంగ సెక్యులరిస్టులు దేశంలో అంతకంతకు ఎక్కువవుతున్నారు. అలా చెప్పే క్రమంలో వీళ్లు మరుగు పరిచే అంశాలు, మసి పూసి మారేడుకాయ చేసే విషయాలు హిందూత్వ అస్తిత్వానికి సవాళ్లే. తాము ప్రత్యేక జాతి అని ప్రకటించుకుని, తమ మతాధిపత్యం కోసం ఈ దేశాన్ని విభజించిన ముస్లింల ధోరణి నాటికీ నేటికీ ఎలా ఉంది? కొన్ని పార్టీలు, కొందరి బుజ్జగింపులు ఆ ఆధిపత్య ధోరణిని వారిలో ఇంకాస్త పెంచలేదా? ఆ మత్తు నుంచి ఆ వర్గం బయటపడలేక పోతోంది. అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఇందుకు సహకరిస్తున్నాయి. ఈ ధోరణే దారుణ పరిణామాలకు కేంద్రబిందువైంది. ఆ ఆధిపత్య మనస్తత్వ్తమే ఈ క్షణపు సత్యం కూడా. ఇందుకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు గొప్ప రుజువు.
ఇప్పటిదాకా రకరకాల కారణాలతో హిందువుల పండగల మీద చిత్రవిచిత్ర రీతిలో న్యాయస్థానాలు నిషేధాలు విధించడం చూశాం. ప్రతి దీపావళికి నిషేధాజ్ఞ ఒకటి సిద్ధంగా ఉంటుంది. హిందువులు సామాజికోత్సవాలను జరుపుకోవడానికి జమాత్ అనుమతి తీసుకోమని తాజాగా సాక్షాత్తు న్యాయస్థానమే ఆదేశించింది.
కోయంబత్తూర్‌లోని ఉక్కాడం ప్రాంతంలో పుల్లకాడు హౌసింగ్ యూనిట్ దగ్గర గణేశ్ మంటపం ఏర్పాటుకు అనుమతించవలసిందిగా మహాలక్ష్మి అనే మహిళ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. మొదట అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినప్పటికీ, ఆ ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్నారు కాబట్టి అనుమతించడం లేదని వారు చెప్పారు. అందుకే ఆమె హైకోర్టుకు వెళ్లారు. ఈ ఉత్సవం, అందులో భాగంగా చేసే అన్నదానంతో ఎవరికీ ఇబ్బంది ఉండదు కాబట్టి అనుమతి ఇవ్వవలసిందిగా పోలీసులను ఆదేశించాలని మహాలక్ష్మి కోరారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి గణేశ్ ప్రతిష్టకు అనుమతి ఇస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అసలు అక్కడ మంటపం పెట్టడానికి ముస్లింలే సానుకూలంగా ఉన్నారని, తాము కూడా ఉత్సవంలో పాల్గొంటామని కూడా చెప్పారని పిటిషనర్ తరఫు న్యాయవాది సమాధానం ఇచ్చారు. ఈ వాదనలు విన్న జస్టిస్ ఎన్. సతీశ్‌కుమార్ చిత్రమైన తీర్పు ఇచ్చారు. ఆగస్ట్ 31 నాటి గణేశ్ చతుర్ధికి తాము మంటపం ఏర్పాటు చేసుకుంటున్నట్టు పోలీసులకు ఒక అఫిడవిట్, జమాత్‌కు (ముస్లిం సమాజం) ఒక అఫిడవిట్ ఇవ్వాలని 26న ఆదేశాలు ఇచ్చారు. పోలీసుల అనుమతి సరే, జమాత్ అనుమతి ఎందుకు? ఇది హిందువులను అవమానించేది కాదా? ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కూడా హిందువులును ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూడదలుచుకున్నాయా? అది ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి విగ్రహం పెట్టడం వరకే పిటిషనర్ పరిమితం కావాలి, విగ్రహంతో ఊరేగింపునకు అనుమతి లేదని కూడా కరాఖండీగా చెప్పింది కోర్టు.
ఇది సెక్యులర్ దేశం, ఇక్కడ అన్ని మతాలకు సమ గౌరవం ఉంటుంది అన్న రాజ్యాంగ సూత్రమే ఇక్కడ దారుణంగా భంగపడలేదా? వందేళ్ల నాడు లేదా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా హిందువులకు మతస్వేచ్ఛ మిథ్య అని తేలిపోయింది. నిజాం రాజ్యంలో ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణలను నిషేధించారు. పండుగలను బహిరంగంగా జరుపుకునే హక్కును హిందువుల నుంచి లాగేశారు.
ఇప్పుడు కోయంబత్తూరులో జరిగింది దాదాపు అదే. దేశంలో సెక్యులరిజం ఉన్నదా, లేదా? అది హిందువులను ఏ విధంగా పరిగణిస్తున్నది వంటి ప్రశ్నలకు సరైన సమాధానం గతం ఆధారంగా, వర్తమాన పరిస్థితుల అవగాహన చేసుకుంటేనే సాధ్యం. తరచి చూస్తే చాలాచోట్ల హిందువుల పరిస్థితి నిజాం రాజ్యంలోను, స్వతంత్ర భారతదేశంలోను ఒకే తీరుగా ఉందని అనిపిస్తుంది. ఈ దుస్థితి నుంచి హిందువులు తమను తామే విముక్తం చేసుకోవాలి. అందుకు ఈ అమృతోత్సవాల కొత్త స్ఫూర్తిని ప్రసాదిస్తాయని ఆశిద్దాం.