– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌హైదరాబాద్‌ ‌రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, పరిపాలనలో భాగస్వామ్యం లేకపోవడం, రజాకార్ల దాష్టీకం, మాతృభాష పట్ల నిరాదరణ లాంటివి సాయుధ పోరాటానికి దారితీశాయి. తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన ఉద్యమంలో కవులు, రచయితలు కళాకారులు, పాత్రికేయుల పాత్ర విస్మరించరానిది. రచయితలు, కవులు తమ రచనలతో, కళాకారులు కళారూపాల ప్రదర్శనతో ప్రజలను జాగృత పరిచారు. 1921 నుంచి మూడు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లేదా రజాకార్‌ ‌వ్యతిరేకోద్యమాన్ని ప్రతిబింబిస్తూ నవలలు, నాటకాలు, పాటలు, గేయాలు వంటివి వెలువడ్డాయి. వట్టికోట ఆళ్వారు స్వామి ‘ప్రజల మనిషి’, దాశరథి కృష్ణమాచార్యుల ‘అగ్నివీణ’, కుందుర్తి ఆంజనేయులు ‘తెలంగాణ’, ఆరుద్ర ‘త్వమేవాహమ్‌’, ‌సుంకర- వాసిరెడ్డి ‘మా భూమి, పోతుగడ్డ’ వంటివి రూపొందాయి. ఈ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారు. ఆర్థికంగా, హార్దికంగా చితికిపోయారు. అయినా కలాలనే ఆయుధాలుగా చేసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మాదిరిగానే ఈ ఉద్యమంలోనూ పత్రికలు తమ వంతు పాత్ర పోషించాయి. గోల్కొండ, రయ్యత్‌, ఇ‌మ్రోజ్‌, ‌హితబోధ, తెనుగు.. వంటి పత్రికలు నిజాం దురాగతాలను ప్రచురించి కడగండ్ల పాలయ్యాయి. హైదరాబాద్‌ ‌రాజ్య ఏడవ, చివరి నిజాంగా మహబూబ్‌ అలీ పెద్ద కుమారుడు ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌తన పాలనలో (1911-1948) కొన్ని సంస్కరణలు తెచ్చినా, ఆయన నియంత పోకడలు ప్రజా జీవితాన్ని కష్టాల్లోకి నెట్టాయి. ‘నేనే దేవుణ్ణి. నేనెవరికీ తలవంచను’ అని ప్రచారం చేసుకున్న ఆయన తీరుపై వివిధ వర్గాలు అవిశ్రాంతంగా పోరాడాయి. అంతిమంగా ఉక్కుమనిషి సర్దార్‌ ‌వల్లభభాయ్‌ ‌పటేల్‌కు విమానాశ్రయంలో తలవంచి నమస్కరించి స్వాగతం పలికే స్థాయికి తీసుకొచ్చాయి.

‘తెలంగాణ విమోచనంలో, సాంస్కృతిక వికాసంలో గ్రంథాలయ ఉద్యమంతో పాటు పత్రికా రంగం దోహదం చేసింది. ఈ ప్రాంతంలో ‘నీలగిరి’ని తొలి (1922) రాజకీయ పత్రికగా పరిగణిస్తారు. షబ్నవీసు వెంకట రామనరసింహారావు, ఆంధ్ర జనసంఘం ప్రోత్సాహంతో ఈ పత్రిక ప్రారంభ మైంది. బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు లాంటి ఉద్దండులు దీనికి వ్యాసాలు అందించారు.

వరంగల్‌ ‌జిల్లా ఇనగుర్తికి చెందిన ఒద్దిరాజు సోదరులు రాఘవరావు, సీతారామచంద్రరావు సంపాదకత్వంలో ‘తెనుగు’ (1926)పత్రిక ప్రారంభమైంది. తెలుగు మాటను పలికేందుకే భయ పడిన కాలంలో ఆ పేరుతో పత్రిక రావడమంటేనే సాహసమే. చాలా పత్రికలలానే ఇదీ ఆర్థిక ఇబ్బందుల పాలై, మూతపడింది. వనపర్తి, గద్వాలలో ప్రచురణ సంస్థలు అవతరించాయి. సంఖ్యాపరంగానూ, ఆర్థికంగా అంతంత మాత్రమే బలం ఉన్నా నిజాం అరాచక పాలనపైనా, రజకార్లకు వ్యతిరేకంగా వార్తలు రాయడంలో వెనుకంజ వేయలేదు. రజాకార్ల దాష్టీకాలను ప్రచురించినందుకు గోలుకొండ, రయ్యత్‌, ఇ‌మ్రోజ్‌, ‌తెనుగు లాంటి పత్రికలు వేధింపులపాలయ్యాయి.

సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి కృష్ణమా చార్యులు, వట్టికోట ఆళ్వారు స్వామి, బూర్గుల రామ కృష్ణారావు, ఒద్దిరాజు సోదరులు, మాడపాటి హనుమతరావు, గడియారం రామకృష్ణశర్మ, వానమామలై వరదాచార్యులు, జగన్నాథాచార్యులు, దేవులపల్లి రామానుజరావు, ముడుంబై గోవిందా చార్యులు, కాళోజీ, బిరుదురాజు రామరాజు, భండారు సదాశివరావు, రావి నారాయణరెడ్డి, బీఎన్‌ ‌శాస్త్రి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, పాశం నారాయణ రెడ్డి, మరింగంటి కవులు, గార్లపాటి రాఘవరెడ్డి, చెర్విరాల చాగయ్య, చందాల కేశవదాసు, ఆదిపూడి ప్రభాకర కవి, పొట్లూరి రామారావు, కుందుర్తి ఆంజనేయులు, పేర్వారం జగన్నాథం… ఇలా కవిపండితులు, పాత్రికేయులు కలాలు, గళాలతో తెలంగాణ విమోచన పోరును ఉరకలెత్తించారు. నాటి కల్లోల తెలంగాణపై పదిహేను వరకు నవలలు వచ్చాయి. ఒక ఉద్యమంపై ఇన్ని నవలలు రావడం తెలుగు సాహిత్యంలో అదే మొదటిసారని విశ్లేషకులు చెబుతారు. ఇక పాటలు, గేయాల సంగతి సరేసరి. ఆయా అక్షరయోధుల గురించి విహంగవీక్షణంగా మననం చేసుకుంటే….

‘రయ్యత్‌’ ‌మందముల

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవేళ్లకు చెందిన మందముల నర్సింగరావు తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొనేందుకు న్యాయవాద వృత్తిని వదులుకున్నారు. స్వీయ సంపాదకత్వంలో ‘రయ్యత్‌’ అనే ఉర్దూ పత్రికను (1927) ప్రారంభించారు. ‘రయ్యత్‌’ అం‌టే రైతాంగం. తెలంగాణ ఉద్యమానికి మూలకందం రైతు. సంస్థానాధీశులు, జాగీర్దార్లు అత్యంత అధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌-‌సికింద్రాబాద్‌ ‌జంటనగరాలలో విలాస జీవితాలు గడుపుతుండగా, కనీసం నీటి వసతి లేని మారుమూల, కుగ్రామాలలో చెమటోడ్చి సేద్యం చేసి, సిరులు నింపుతూ తాను మాత్రం నిరుపేదగానే మిగిలినవాడు రైతు. వారితో పాటు ప్రజా సమస్యలను, ప్రజానీకం అభిప్రాయాలను చాటడమే తన పత్రిక ధ్యేయమని మందముల ప్రకటించారు. లక్ష్యం మంచిదే అయినా, పత్రికను తెలుగులో బదులు ఉర్దూలో నడపమేమిటనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ‘నాకు తెలుగు భాష అంతగా రాదు. ఉర్దూ రాజభాష. కనుక ఆ భాష ద్వారానే దేశ సేవ చేయాలనుకున్నాను’ అని సమాధానమిచ్చారు. కానీ తెలుగు తెలిసిన వారి సహాయంతో పత్రికను నిర్వహించవచ్చు. అయితే ‘పత్రికలో వచ్చే సమాచారాన్ని, సందేశాలను పాలకులు, పాలితులు తెలుసుకోవాలి. వారందరికి అర్థమయ్యే భాషలో (ఉర్దూ) పత్రికను తెస్తేనే సమస్యలు పాలకుల దాకా వెళతాయి’ అన్నది అసలైన మరో కారణం. నిజాం నిరంకుశ పాలనను, రజాకార్ల హింసాకాండ చర్యలను తిప్పికొడుతూ అనేక సంపాదకీయాలు రాశారు. అత్యంత ప్రతికూల పరిస్థితులలోనూ కలం పక్కన పెట్టలేదు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా స్వతంత్ర భావాలను వ్యక్తం చేసేదిగా ఆ పత్రికకు పేరుండేది. దాంతో నిజాం ప్రభుత్వం ఆయనపై నిఘాపెట్టి అరెస్టు చేయించింది. ముషీరాబాద్‌ ‌జైలులో నిర్బంధించిన తరువాత, నిజాం నవాబే దిగివచ్చి ఆయనను విడుదల చేయడంతో పాటు మంత్రి పదవి ఇవ్వజూపారు. అప్పటికే (1938-42) నిజాం లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న మందుముల ఆ ప్రతిపాదనను తిరస్కరించి, నిజాంపై వ్యతిరేక పోరాటాన్ని ముమ్మరం చేశారు. ఫలితంగా పత్రిక నిజాం ఆగ్రహానికి బలై, మూతపడింది.

‘గోలకొండ’ సురవరం

నిజాం పాలనలో తెలుగుజాతిని తట్టిలేపిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణలో నిద్రాణమై ఉన్న భావ, భాషా సాహిత్య చైతన్యాలకు బావుటాను ఎత్తిన వారిలో ముందు వరుసలో ఉండే ఆయన, నాటి నిరంకుశ పాలనపై కలం ఝళి పించారు. ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆధ్వర్యంలోని కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక ప్రజలలో రాజకీయ సాంస్కృతిక చైతన్యం కలిగించినట్లే, సురవరం నేతృత్వంలోని ‘గోలుకొండ’ పత్రిక నిజాం రాష్ట్ర ఆంధ్రులను వివిధ రంగాలలో జాగృత పరచిందని విశ్లేషకులు చెబుతారు. ‘గోలుకొండ’ పత్రికలో సురవరం వెలువరించిన సంపాదకీయాలు నిజాం ప్రభుత్వ గుండెలలో కుంపట్లు రాజేసేవని చెప్పుకుంటారు. దాంతో ఆయన సంపాదకీయాలపై ప్రభుత్వం ‘ప్రీ సెన్సార్‌షిప్‌’ ‌విధించడంతో అది పత్రిక ఆత్మ గౌరవానికి భంగకరంగా భావించి సంపాదకీయం నిలిపివేశారు. అయితే వివిధ రంగాలలో నిష్ణాతులతో సందర్భోచితంగా స్ఫూర్తిదాయక వ్యాసాలు రాయించి సంపాదకీయం చోటులో ప్రచురించారు. అవి ఆయన సంపాదకీయాల కంటే పదునుగా ఉండి ఏలికలను మరింత చికాకు పరిచేవట. 1926 మే 10న ప్రారంభమైన పత్రికకు చాలా ఏళ్ల వరకు సంపాదకుడిగా ఆయన పేరు లేకపోయినా పరోక్షంగా అన్ని బాధ్యతలూ ఆయనే చూశారు. పదమూడేళ్ల తరువాత (1939) సంపాదకత్వ బాధ్యతలు చేపట్టి 1947 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1922లో ప్రారంభమైన నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం మరో ఎనిమిదేళ్లకు (1930) ఆంధ్రసభగా రూపాంతరం చెందిన వెంటనే జోగిపేటలో జరిగిన దాని ప్రథమ సమావేశానికి సురవరం అధ్యక్షత వహించారు. నిజాం పాలనలో నిరాదరణలో ఉన్న తెలుగుతో కూడిన విద్యాబోధన, రైతుల స్థితిగతులు మెరుగు పరచడం ఈ సభ ప్రధాన ఉద్దేశం. ఈ సభ స్ఫూర్తితో భూస్వామ్య వ్యతిరేక, నిజాం ప్రభుత్వ వ్యతిరేక సాయుధ పోరాటం ఊపందుకున్నాయి. ‘చదువు, అక్షర జ్ఞానంతోనే ప్రజాచైతన్యం సాధ్యమంటూ గ్రంథాలయోద్యమాన్ని నడిపిన సారథులలో ఆయన ముఖ్యులు.

‘ఇమ్రోజ్‌’ ‌షోయాబుల్లాఖాన్‌…

‌రచయిత, మంచి కలం యోధుడు. కాని రావలసినంత పేరు రాలేదని అంటారు. ‘తేజ్‌’ ‌పత్రికతో పాత్రికేయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన మందుముల నర్సింగరావు నిర్వహించిన ‘రయ్యత్‌’ ‌పత్రికలో ఉప సంపాదకుడిగా పని చేశారు. ప్రభుత్వ దమననీతిని, పాక్షిక వైఖరిని విమర్శించి నందుకు నిజాం దానిని మూసి వేయించిన తరువాత షోయాబ్‌ ‌సొంతంగా ‘ఇమ్రోజ్‌’ (ఈరోజు) పత్రిక స్థాపించారు. నిజాం అరాచకాలను నిరసిస్తూ, నిజాం రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేయాలని ఏడుగురు ముస్లిం పెద్దలు రూపొందించిన ప్రతిపాదనను షోయాబ్‌ ‌ప్రచురించారు. హైదరాబాద్‌ ‌సంస్థానం లోని ప్రజాభీష్టం మేరకు వెంటనే భారత యూనియన్‌లో విలీనం కావాలంటూ సహేతుకంగా వాదిస్తూ స•ంపాదకీయాలు రాశారు. అలా కాకపోతే అది ఆత్మహత్యా సదృశమేనని నిజాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రజాకార్ల దౌర్జన్యాలను బట్టబయలు చేస్తూ, సయ్యద్‌ ‌కాసీం రజ్వీ విధానాలను, ఉపన్యాసాలను, యుక్తియుక్తంగానే ఖండించే వారు. అది సహజంగానే పాలకులకు కంటకప్రాయమైంది. దరిమిలా బెదిరింపు లేఖ వచ్చింది. ఈ తరహా వార్తలు వేస్తే చేతులు నరికేస్తామని 1948 ఆగస్ట్ 19‌న హెచ్చరించిన రజాకార్లు మూడవ నాడు (21న) కాచిగూడ చౌరస్తాలో అన్నంత పని చేశారు. ఆ మరునాడు ఆయన కన్నుమూశారు. అంతకు ముందు తనను చూడవచ్చిన బూర్గుల రామకృష్ణా రావుతో ‘నేను గాంధీజీ అడుగుజాడల్లో నడిచే అహింసావాదిని. ఒకవేళ దేశం కోసం, సత్యం కోసం ప్రాణాలు ఇవ్వవలసి వస్తే అందుకు ఎంతో గర్విస్తాను’ అని చెప్పారట. అన్నట్లుగానే నియంత పాలనపై ‘అక్షరాన్ని ఆయధాలుగా చేసుకున్న ఆయన కత్తి’కి బలయ్యారు.

‘మిజాన్‌’ ‌బాపిరాజు

నిజాం నవాబు ప్రోత్సాహంతో నిర్వహించిన ‘మిజాన్‌’ ‌తెలుగు పత్రికకు ప్రముఖ రచయిత, చిత్రకారుడు అడవి బాపిరాజు సంపాదకత్వం వహించారు. తన ఆశయసిద్ధికి స్వతంత్రంగా పత్రిక అవసరమని భావించిన నిజాం నవాబు ఆంగ్లం, హిందీ, తెలుగు భాషలలో పత్రిక ప్రారంభించాలను కున్నారు. గులాం అల్లాద్దీన్‌ అనే వాణిజ్యవేత్త సహకారంతో బొంబాయికి నుంచి కలకత్తా వాలా అనే వ్యక్తిని రప్పించి పత్రికను (1943)పెట్టించారు. తెలుగు పత్రికకు కాకినాడకు చెందిన మహ్మద్‌ ‌ఖాసిం సంపాదకుడిగా ఉండేందుకు ముందుకు వచ్చినా, తెలుగు పాఠకులను లక్ష్యంగా చేసుకున్న నవాబు, వారిని ఆకట్టుకునేందుకు ఆయనను కాదని బాపిరాజును ఎంపిక చేశారు. ఆయన ఆంధప్రాంతం వ్యక్తి కనుక, తెలంగాణలో పరిణామాల పట్ల సరైన అవగాహన ఉండదని, పైగా ఆయన ద్వారా ప్రజలతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవచ్చని నిజాం సలహాదారులు భావించారట. కానీ సంపాదక మండలి విషయంలో నిజాం ఇచ్చిన స్వేచ్ఛతో బాపిరాజు తనకు నచ్చిన, ఇష్టమైన వారిని నియ మించుకున్నారు. నిజాం ఆదేశాలకు అనుగుణంగా వార్తలతో పాటు వ్యతిరేకంగానూ వచ్చేవి. ‘నిజాం నవాబు తన రాజ్యంలో కమ్యూనిస్ట్ ‌దినపత్రికను నిషేధించినా, ఆంధ్రమహాసభ వార్తలు మిజాన్‌లో వస్తూనే ఉండేవి.

‘ప్రజల మనిషి’ వట్టికోట

స్వయంకృషితో వంటబట్టించుకున్న విజ్ఞానం తప్ప పెద్దగా చదువుకోని వట్టికోట ఆళ్వారు స్వామి అటు స్వాతంత్య్ర ఉద్యమంతో (క్విట్‌ ఇం‌డియా) పాటు అనంతరం తెలంగాణ విమోచన ఉద్యమంలో పాలు పంచుకున్న తెలంగాణ ప్రాంత తొలి నవలా రచయిత. సాహిత్యంలో తొలిసారిగా ప్రజా భాషతో వెలువడిన ఆయన ‘ప్రజల మనిషి’ నవల తెలంగాణ విమోచన ఉద్యమాన్ని రగిల్చింది. తెలంగాణ రైతాంగ పోరాటం సాయుధ పోరాటంగా మారడానికి ఆయన రచనలే కారణమని చెబుతారు. మరో నవల ‘గంగు’ తెలంగాణ మహత్తర రాజకీయ ప్రజా ఉద్యమ చరిత్రకు అక్షర రూపంగా చెబుతారు. అగ్నికి గాలి తోడైనట్లుగా నిజామాబాద్‌ ‌జైలులో దాశరథి పరిచయంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. అక్కడి జైలు గోడలపై దాశరథి బొగ్గుతో రాసిన ‘ఓ నిజాము పిశాచమా….’ పద్యం అంటే ఎంతో ఇష్టం. అది తనకు మరింత స్ఫూర్తినిచ్చిందని చెప్పేవారట. జైలు అధికారులు గోడపై పద్యాన్ని చెరుపుతున్న కొద్దీ తిరిగి రాసేవారు. ఆ ‘జంట’ తిరుగుబాటు అధికారులకు కంటగింపైంది. ఫలితంగా వట్టికోటను గుల్బర్గా, దాశరథిని హైదరాబాద్‌ ‌జైళ్లకు తరలించారు. ‘ఆశ్రయింపు లెరుగనివాడు/ విశ్రాంతి తెలియనివాడు/స్వసుఖం కోరనివాడు/ వారం వారం మారనివాడు/రంగులద్దు కోలేనివాడు/మిత్రుడి కోసం కంఠం ఇవ్వగలడు/మంచికి పర్యాయపదం ఆళ్వార్‌/అదినిదే సార్థకమైన జీవితం/అతనికే అగ్నిధార అంకితం’ అంటూ తన తొలిరచన, తెలంగాణ పోరాటకావ్యం ‘అగ్నిధార’ను దాశరథి ప్రియమిత్రుడికి అంకితమిచ్చారు. వట్టికోట పత్రికా రచయిత కూడా. కడవెండిలో జరిగిన దొడ్డి కొమరయ్య హత్యోదంతాన్ని ‘మీజాన్‌’ ‌పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చారు. నిజాం ఏలుబడిలోని జైళ్లలోని దుర్భర పరిస్థితులు, ఖైదీల మనోభావాలను విశ్లేషిస్తూ ‘జైలు లోపల’ గ్రంథం రాశారు. ‘నిద్రాణమై ఉన్న తెలంగాణ మేలుకుంది. వట్టికోట, దాశరథి, కాళోజీ గొంతెత్తి ఆ నూతన జాగృతిని ప్రతిధ్వనింప చేశారు. తెలంగాణకు చెందిన వారు యావదాంధ్ర కవులు’ అని శ్రీశ్రీ అభివర్ణించారు.

‘రతనాలవీణ’ దాశరథి

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ పద్య పాదంతో మాతృభూమికి ఎనలేని ప్రాధాన్యం, గుర్తింపును తెచ్చిన కవిపండితుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ విమోచన పోరు సందర్భంగా ఆయన అన్న ఈ మాటలు అనంతరం ప్రత్యేక రాష్ట్ర తొలి, మలి ఉద్యమానికి తారక మంత్రంగా నిలిచాయి. ఆ మాటలను ఏదో ఒక సందర్భంలో ఉటంకించని తెలంగాణ బిడ్డడు ఉండడనడం అతిశయోక్తి కాదు. ఆయన దృష్టిలో సంసారం కంటే సమాజమే మిన్న. నిజాం విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ విలువైన జీవితాన్ని, జీవనాన్ని త్యాగం చేశారు. పదిహేనవ ఏటనే (1940) నల్లగొండకు చెందిన రామాను జమ్మను వివాహ మాడిన ఆయన తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిజాం పాలనపై ఉద్యమించి జైలుకు వెళ్లారు. ఒకవైపు ఉద్యమం, జైలు జీవితం, మరోవంక అనారోగ్యం. జైలులో కల్తీ, కలుషిత ఆహారం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింది. శిక్ష ముగిసి ఇంటికి చేరే సరికి అనారోగ్యంతో భార్య కన్ను మూశారు. అటు తరువాత లక్ష్మీదేవమ్మను వివాహమాడారు.

‘ఓ పరాధీన మానవా, ఓపరాని/దాస్యము విదల్చలేని శాంతమ్ము మాని/తలుపులను ముష్టి బంధాన కలచివైచి/చొచ్చుకొని పొమ్ము, స్వాతంత్య్రం సురపురమ్ము’ అని చెప్పిన పద్యానికి ‘సింహగర్జన చేశావు నాయనా’! అని తెలంగాణ వైతాళిక ప్రముఖుడు సురవరం ప్రతాపరెడ్డి అభినందించారు. ‘చీకటిలో దివ్వె అతడు/ఆకసమున అరునుడతడు/మూగబడిన తెలంగాణా మూల్గిన తొలినాటి ధ్వని’ అనీ అభివర్ణించారు.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ నిజాం తనను తాను స్వతంత్రుడిగానే ప్రకటించుకున్నారు. తన రాష్ట్రంలో జాతీయ పతాకం ఎగరడానికి వీలులేదని ‘ఫర్మానా’ జారీ చేయడంతో, గుండె రగిలిన దాశరథి అజ్ఞాతం వీడి ‘ముసలి నక్కకు రాచరికంబు దక్కునే? అని నిజాంను నేరుగా నిలదీశారు. కుగ్రామాలు, తండాలు తిరుగాడి నిజాం దమననీతికి వ్యతిరేకంగా కులమత లింగ వర్గ వర్ణ భేదాలకు అతీతంగా ప్రజలను ఏకం చేశారు. నిరంకుశ పాలనపై ఆగ్రహం కట్టలు తెంచుకుని కవితా ‘అగ్నిధార’ కురిపించిన ఆయనను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌కు ఈడ్చుకు వెళ్లారు. అయినా మొండి ధైర్యంతో తప్పించుకు వెళ్లారు. తర్వాత మరోసారి పట్టుబడగా 1947 సెప్టెంబర్‌లో 16 నెలల జైలుశిక్ష విధించి నిజామాబాద్‌ ‌చెరసాలకు తరలించింది నాటి ప్రభుత్వం. అక్కడ అగ్రజ సమానులు, కవి వట్టికోట ఆళ్వార్‌స్వామితో కలసి ఉద్యమ కవితా వ్యాసంగం సాగించారు. కవిత్వాన్ని కాల•క్షేపం కోసం కాకుండా ఉద్యమానికి, సామాజిక వికాసానికి సాధనంగా ఉపయోగించుకోవాలన్న ఆయన….

‘ఓ నిజాము పిశాచమా! కానరాడు…

నిను బోలిన రాజు మాకెన్నడేని

తీగెలను తెంపి అగ్నిలో దింపినావు

నా తెలంగాణ కోటి రతనాల వీణ’ …. అని జైలు గోడమీద బొగ్గుతో రాసి నిర్భయంగా గానం చేశారు. ‘మధ్యయుగాల రాచరిక జులుమే నా కవితకు ప్రేరణ. నిజాం తాబేదార్ల హింసాకాండ పెచ్చు పెరిగింది. ఎటు చూచినా దోపిడీలు, గృహ దహనాలు, మానభంగాలు. నా హృదయం స్పందిం చింది. చైతన్యం పెల్లుబికింది’ అని ఒక ముఖా ముఖీలో చెప్పారు దాశరథి. నిజాంకు వ్యతిరేకంగా రాసిన గేయాలు దాశరథిని మానసికంగా, శారీరకంగా ‘గాయ’ పరిచాయి. రక్తం ఓడేలా హింసించాయి. అయినా వెరవలేదు, బెదరలేదు. తన లక్ష్యాల్లో ప్రధానమైన తెలంగాణ విముక్తి సిద్ధించడంతో తన ‘రుద్రవీణ’ కవితా సంపుటిని తెలంగాణకు అంకితమిచ్చి ‘మాతృభూమి’ రుణం తీర్చుకున్నట్లు భావించారు.

మడమతిప్పని ‘సర్దార్‌’

‌పక్షపాత, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అత్యంత ధైర్యసాహసాలతో ప్రజాఉద్యమాన్ని నడిపిన మేటి నేత జమలాపురం కేశవరావు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడడం, విమర్శించడ మంటే మృత్యుముఖంలో తలపెట్టడమే అనే పరిస్థితు లలోనూ, సామాన్యులపై జరుగుతున్న అత్యాచారా లను బహిరంగంగానే విమర్శించారు. జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. అవినీతి అధికారులకు ఆయన సింహస్వప్నం. నిస్వార్థబుద్ధి, శాంతి సహనాలు, అతి అతినిరాడంబరతలే ఆయనకు ఆభరణాలని చెబుతారు. అందుకే నిరంకుశ, అవినీతి అధికారులు ఆయనను మాటలతో కూడా ప్రతిఘటించలేక పోయేవారట. ‘నిరంకుశ పాలన అంతం- ప్రజారాజ్యం ఆవిర్భావం’ నినాదంతో జనాన్ని జాగృత పరిచేందుకు బుర్రకథ, హరికథ, నాటకాల దళాలు ఏర్పాటు చేశారు. వయోజన పాఠశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కసారి ప్రయాణించేందుకు బస్సు కిరాయికి డబ్బులేని ఆయన, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారంటే, ఆయనకున్న ప్రజాదరణే కారణంగా చెబుతారు. నిజాం నిరంకుశ పాలనను అంతమొందించి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని స్థాపించగలమని పిడికిలెత్తి నినదించినందుకే తెలంగాణ గొంతులు ప్రేమాభిమానాలతో ‘సర్దార్‌’ అని అభివర్ణించాయి. అదే ఏలికలకు కన్నెర్రయింది. మధిరలో సత్యాగ్రహం చేస్తున్న ఆయనను నిర్బంధించి రెండేళ్లు కఠిన జైలు శిక్ష వేశారు. ఆయన ప్రజాభిమానం పటిమ వల్లే కావచ్చు ఆరు నెలలలోనే ఆయన విడుదలయ్యారు. అయితే ఆ ఆరునెలలూ జైలు అధికారులు అనేక రకాలుగా బాధించినా లొంగలేదు. ‘నిజాం ప్రభుత్వా నికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడాన్ని నేను నేరంగా భావించడంలేదు. తిరుగుబాటు చేయనివాడు పిరికిపంద’ అని నిండు న్యాయస్థానంలో ధైర్యంగా వ్యాఖ్యానించారని ఆయన అభిమానులు శ్లాఘిస్తుంటారు.

‘గళ’ యోధుడు సుద్దాల

రెండవ తరగతితోనే చదువు ఆపేసిన సుద్దాల హనుమంతు హైదరాబాద్‌ ‌సంస్థాన విమోచన ఉద్యమంలో గొంతెత్తారు. నైజాం సంస్థ పాలనపట్ల విముఖతతో పోరాడుతున్న ఆర్యసమాజం వైపు ఆకర్షితులై బలవంతపు మత మార్పిళ్లను వ్యతిరేకించే సామాజిక గీతాలు రాశారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా ఉంటూ ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొనడం, ఆర్య సమాజంతో సంబంధాల పట్ల నిఘా విభాగం అందించిన నివేదిక ఆధారంగా అధికారులు మందలించడంతో, ఉద్యోగ యూనిఫాంను వదలి వచ్చేశారు. నిజాం ప్రతినిధులు (ఏజెంట్లు)గా భూస్వాములు, దొరల దోపిడీ దౌర్జన్యాలతో తల్లడిల్లుతోన్న పల్లెలలో తిరుగుతూ ప్రజలలో పోరాటపటిమను నింపి తిరుగుబాటు ఉద్యమాన్ని రగిల్చాలని అక్కడ స్థిరపడ్డారు. బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టలదొర, ఫకీరు వేషాల పక్రియల ద్వారా పోరాటాలను సమాయత్తపరచే సాహిత్యాన్ని సృష్టించారు. ‘తెలంగాణ సాయుధ పోరాటం, అమరవీరులకు జోహార్లు’ అనే గొల్లసుద్దులను ఎన్నో రాశారు.

About Author

By editor

Twitter
YOUTUBE